నెగడు మంటల్లో కాలుతున్న "చీడీలు" యినుపవూచకు గుచ్చిన మాంసము ముక్కలు బాగా బలిసిన ఏదుబండి కొవ్వు కాలితే వచ్చే వాసన వేస్తున్నాయి నెగడు గణ గణ మండుతోంది.
నెగడుచుట్టూ వలయాకారంలో ఆడా మగా తేడా లేకుండా కూర్చున్నారు. నల్లని ఆకారాలు నెగడు చిమ్మే వెలుగు చుట్టూ వలయంగా యేర్పడి వున్నాయి తురేనియన్ పదాలు కలిసిన సవరభాషలో యేదో హుషారుగా మాటలు చెప్పుకుంటున్నారు. కీచుగొంతులతో గుక్కలు గుక్కలు పట్టి నవ్వుకుంటున్నారు.
అతి చిన్న పరిధిలో వాళ్ళది ఆనందమయ ప్రపంచం. యిప్పసారాతో కైపు యెక్కిన యువకులు తమ జంటల్ని రెక్కపట్టుకుని చీకట్లోకి లాక్కుపోతున్నారు. యిదంతా లింగప్పదొర చూచే దృశ్యం.
గోమంగో-లింగప్పదొరకు ఆహారం పంపాడు. ఒక అడ్డాకు డొప్పలో చింతనిప్పులమీద యెర్రగా కాల్చిన కుందేలుమాంసం వుంది. సొరకాయడొల్లలో తేనె పంపాడు ఆ తేనెకూడా మాంసాహారంతో సమానమయిందే! యెందుకంటే తేనెపట్టుమీది యీగలకు పొగ పెట్టి అవి లేచి పోయాక బాగా పాకానికి వచ్చిన గ్రుడ్లతోసహా మొత్తం పట్టుని పిండి ఆ తేనె తీసారు. తేనెతోపాటు తేనెటీగల గ్రుడ్లలో వుండే తెల్లని జిగురువంటి పదార్ధం కూడా కలుస్తుంది. వాసన వెగటుకాని మామూలు తేనెకన్నా యెక్కువ రుచినిస్తుంది.
మరొక యిప్పసారాడొల్ల వచ్చింది. మరొక అడ్డాకు డొప్పలో జీలుగుపిండితో కాల్చిన రొట్టెలు వచ్చినాయి. లింగప్పదొర తిన్నది యేదో తిన్నాడు. లేనిదీ లేదు ఆ తిండి నాగరికులు తినగలిగింది కాదు. కాని పుష్టికరమైన తిండి.
నెగడు చుట్టుప్రక్కలనుండి చాల జంటలు లేచిపోయినాయి చీకట్లోకి.
ఖాళీ సొరకాయడొల్లలు నేలమీద పడివున్నాయి. అవే వాళ్ళ గిన్నెలు. అవే వాళ్ళ బిందెలు. అవే వాళ్ళ చెంబులు. అవే వాళ్ళ చషకాలు.
రంగవాకమీద విరుచుకుపడిన గాడాంధకారాన్ని నెగడు మంటలు జయించలేక సిగ్గుతో వాటి ముఖం యెర్రగా కందిపోయింది.
ఆ వేళప్పుడు వచ్చింది కూచిపోతి. యెలా వచ్చింది?
మొలమీద గజం గుడ్డపేలిక. కొప్పుముడి జారి జుట్టు వీపంతా పరుచుకుపోయింది. ఒక చేతిలో చెవులపిల్లి చెవులున్నాయి. కుందేలు క్రిందికి వ్రేలాడుతోంది. ఒక చేతిలో యీటె వుంది. నల్లని యెత్తయిన ఆకారం ఆచ్చాధనలేని వక్షం. చన్మొనలు సూదుల్లా పొడుచుకు వచ్చాయి. శరీరంలోని దృఢత్వానికి అది కన్పించే గుర్తు.
రెట్టలు మగవాడికిలాగ కండలు తిరిగి వున్నాయి. పద్మినీజాతి స్త్రీకి వున్నట్లు తామరతూడుల్లా లేవు. వస్తాదు రెట్టల్లా వున్నాయి. తొడలు కండలు తిరిగి యినుపముద్దల్లా వున్నాయి కాని అరటి స్తంభాల్లా లేవు. పిక్కలు ముద్దకట్టి వున్నాయి. పిట పిట లాడుతోంది.
నడిచి వస్తోంది కూచిపోతి యధాలాపంగా అడుగులు వేస్తూ సరాసరి నెగడు దగ్గరకు వచ్చింది. కుందేలు మెడను మెలితిప్పి దానిని నెగడు మీద వేసింది. కాస్సేపు కాలాక యీటె మొన గ్రుచ్చి బైటకు తీసి కొరుక్కుని తింటోంది. యెవరో సారాయిడొల్ల అందిస్తే గటగట తాగుతోంది.
"ఓసోసి కూన, దొర లింగప్ప వచ్చిండు. పసికూనను పట్టియ్యి" అన్నాడు గోమంగో. కూచిపోతి ఒప్పుకోలేదు. దొలబెహర చెప్పాడు. తిప్పికొట్టింది. కుడంగ్ చెప్పేదంతా విని థూ అంది.
"ఇయ్యేల అడివి వదిలేస్తే సేరుకాను రేపే దండెత్తి వస్తాడు. అప్పుడు కుక్కల్లా చావాలి. తెలిసిందా?" అని వాదించింది.
"అమ్మ తల్లిని ముగ్గేసి పిలిసాను. ఆ తల్లి దయతో నువ్వు పిల్ల గుంటడిని తీసుకురాగలిగావు. తల్లి ఆన అయింది. అడివి అప్పగించు యెక్కడున్నాడో సెప్పు?" అని అడిగాడు కుడంగ్.
"నేను సెప్పను" అంది కూచిపోతి.
"కులపెద్దగా సెబుతుండ యినుకో" అన్నాడు గోమంగో ఆమె తండ్రి. ఆమె తండ్రి మాటలనుకూడా లెక్కచెయ్యలేదు.
"అడివి యిడుదలసేస్తే సవరజాతికి యిలయం (విలయం) వచ్చి నట్టే జాతిని నా పాణం వుండగా అట్టా కానియ్యను" అని యెదురు తిరిగింది.
గోమంగో హెచ్చరించాడు. "నేను కుల పెద్దను. కట్టడి దాటితే కత్తికి బలైపోతావు" అని అయినా కూచిపోతి వినలేదు.
"నా పాణం వుండగా సవరజాతి నసింపు చూళ్ళేను" అని యెదురు తిరిగింది.
గోమంగో కత్తిమొన ఆమె గుండెలమీద ఆన్చాడు.
"కూనా! నాకు కడుపుకొత్త సేయకే గుంటగాడి జాడ సెప్పు" అన్నాడు.
కూచిపోతి నోరు విప్పలేదు. సొరకాయడొల్లలో వున్న సారా మొత్తం రాక్షసిలా గడ గడా త్రాగేసి నోరుమూసుకుంది.
అలా ఆచార ప్రకారం మూడుసార్లు అడిగాడు గోమంగో కూచి పోతి తండ్రిమాట వినలేదు. నోరు విప్పలేదు.
తండ్రి చేతిలోని కత్తి అలాగే ఆమె గుండెల్లోకి దిగిపోయింది. ఆ సల్లని శరీరంలోంచి యెర్రని రక్తం ఆకాశమెత్తుకి చిమ్మింది.
కూచిపోతి ప్రాణాలు బలియిచ్చి ఊరుకుంది నోరు విప్పలేదు.
ఈ దృశ్యం చూచిన ఆమె అనుచరులు బెంబేలు పడిపోయి అసలు విషయం చెప్పారు. తమకి అలాంటి గతే పడుతుందని.
పిల్లాడిని తీసుకొచ్చి లింగప్పదొరకు అప్పగించారు.
7
లింగప్పదొర షేర్ ఖాన్ కొడుకుని వెంటపెట్టుకుని శ్రీకాకుళం చేరాడు. దర్భారులో వున్నాడు గవర్నరు. కొంతమంది సవరలు అతని యెదురుగా నిలబడి వున్నారు. వాళ్ళకి మొలమీద గుడ్డపీలికలు తప్ప మిగిలిన శరీరం యావత్తూ దిగంబరంగా వుంది. వీపులు కొరడా దెబ్బల వాతలు పడి అట్టలు తేలి వున్నాయి. కీళ్ళు వాచి వున్నాయి. కళ్ళు వుబ్బి పోయి యెర్రగా మండుతున్నాయి. ముఖాలు దీనంగా కన్పిస్తున్నాయి.