తన మాటకు అతను అంత గౌరవం ఇవ్వడంతమాషాగానే వుంది.
"అసలు నేను ఏ విషయంలోనూ ఎవరి సలహా తీసుకోను చంద్రికగారూ! ఆడవాళ్ళమాటంటే అసలులెక్కచేయను. మొదట్నుంచీ అంతే! ఆడవాళ్ళంటే చాలా చులకనభావం నాకు. కాని మిమ్మల్ని మాత్రం మొదటినుంచి గౌరవ భావంతోనే చూసేవాడిని. ఎందుకో తెలుసా? మీలో వున్న నటనా శక్తికి. మీరు మామూలు కళాకారులు కాదు చంద్రికగారూ! మేమెవరం చేరుకోలేనంతటి ఎత్తున నిలబడ్డారు మీరు."
"చాల్చాలు! ఇంక పొగడకండి! మళ్ళీ నాకు గర్వమెక్కిపోతుంది" అతని వాగ్దాటిని అడ్డుకోడానికి ప్రయత్నించిందామె.
"ఫరవాలేదు. మీరు ఎంతో గర్వపడాల్సిన స్థితిలోనే వున్నారు. మీలాంటివాళ్ళకు గర్వం వుండాలి."
"మీరిలా మాట్లాడుతూ కూర్చుంటే రేపు షూటింగ్ మొదలయినట్లేఇక!" నవ్వాపుకుంటూ అందామె.
"ఓ! అవును బాగా పొద్దెక్కిపోయింది. ఓ.కే! గుడ్ నైట్! వస్తాను" అనేసి లేచి గదిలోనుంచి బయటకువెళ్ళిపోయాడతను.
అతను వెళ్ళాకచాలాసేపు అతని గురించేఆలోచిస్తూ పడుకుంది చంద్రిక.
మర్నాడు మళ్ళీ యధాప్రకారం షూటింగు ప్రారంభమైంది. ఆ రోజునుంచీ కౌశల్ ప్రవర్తనలో ఎంతోమార్పువచ్చింది. అన్ని విషయాలూ చంద్రికతోనే చర్చించడం ప్రారంభించాడు. ఏ సమస్య వచ్చినా హడావుడిగా చంద్రిక దగ్గరకుపరుగుతో వచ్చేవాడు.
సంగతంతా చెప్పి "ఇప్పుడేం చేద్దామంటారు?" అనడిగేవాడు.
మొదట్లో చంద్రికకు అతను సరదాకి అలా అడుగుతున్నాడేమో అని అనుకుందిగాని రాన్రాను మాటల్లో మరోభావమేమీ కనిపించలేదు. అతనికి తనంటే ఎందుకంత గౌరవం ఏర్పడిందో ఎంత ఆలోచించినా అర్ధం కావడంలేదు.
అనుకున్నట్లే అవుట్ డోర్ వర్క్ పూర్తయిపోయింది.
యూనిట్ అంతా మళ్ళీ మద్రాసు చేరుకున్నారు. మద్రాసులో కూడా కౌశల్ రోజూ ఆమెను కలుసుకోవడానికి వస్తూండేవాడు. రాన్రాను అతనితో సన్నిహితత్వం ఎక్కువయింది ఆమెకి. ఏ ఒక్కరోజన్నా అతను రాకపోతే ఏమీ తోచనట్లూ అనిపించేది.
అతని చిత్రం విడుదలకు సిద్దమైంది.
ఆ హడావుడిలో వారం రోజులపాటు ఆమెకు కనిపించడం సాధ్యంకాలేదతనికి. చివరకు వుండబట్టలేక తనే ఫోన్ చేసింది చంద్రిక. ఆ సమయానికి అతను ఇంటి దగ్గరలేడు.
రాత్రి పదిగంటల తర్వాత షూటింగ్ నుంచి యింటికొస్తూనే తిరిగి అతనింటికి ఫోన్ చేసిందామె.
"హలో! కౌశల్ గారా?" అడిగింది చంద్రిక.
"నమస్తే!" చిరునవ్వుతో పలుకరించాడతను.
"ఎక్కడా అంతులేరేమిటి?"
"అదే రిలీజ్ గురించి గొడవలు!"
"డేట్ ఫిక్సయిందా?"
"ఆ! ఇంతకుముందే ఫైనలైజ్ అయింది. వచ్చే శుక్రవారం రిలీజ్ చేద్దామన్నారు మనవాళ్ళు!"
"అదిసరే గానీ మీరే గొడవలో పడి మిగతా కాల్ షీట్స్ ఎగ్గొట్టారట కదా?" అడిగిందామె.
అతను నవ్వాడు.
"నిజం చెప్పమంటారా?"
"ఏమిటది?"
"నిజానికి కాల్ షీట్స్ ఎగ్గొట్టింది మన సినిమా వల్లకాదు. రెండు రోజులు మందుపార్టీల్లో కూర్చోవడం వల్ల అలా జరిగిపోయింది. కానీ ఆ విషయం చెపితే గొడవ చేస్తారని ఇలా చెప్పాను."
"నాకేం నచ్చలేదిది!" అందామె తన వ్యతిరేకతను తెలియజేస్తూ.
"అఫ్ కోర్స్! ఎవరికీ నచ్చదనుకోండి! కానీ జరిగింది అది!"
"దీనివల్ల మీకెంతచెడు జరుగుతుందో తెలుసుకోవడం లేదు మీరు!"
అతను మాట్లాడలేదు.
"ఏమిటలా మౌనంగా వుండిపోయారు?" అడిగింది నవ్వుతూ.
"ట్యూషన్ చెపుతున్నారుగా! ఇంకా మాట్లాడడమెందుకని?"
"అవును చాలా బుద్దిమంతులుకదా!"
"అదిసరే గానీ శుక్రవారం రోజంతా మీరు నాతో వుండాలి!" అన్నాడతను.
"ఎందుకు?"
"ఎందుకేమిటి? మనపిక్చర్ ఎలా వుందో రిపోర్ట్స్ తెలుసుకునేప్పుడు పక్కన మీలాంటివాళ్ళు లేక పోతే గుండె ఆగి చచ్చిపోతాను!"
చంద్రికకు నవ్వొచ్చింది.
"సరే, ప్రయత్నిస్తాను!"
"అమ్మమ్మ! అంతమాట అనకండి! ప్రయత్నించడంకాదు! తప్పక రావాల్సిందే! హోటల్లో రూమ్స్ బుక్ చేశాను. రాత్రి రెండుగంటలవరకూ వుండి వెళ్ళిపోదురుగాని!"
"సరే!"
"ఇంక వుంటాను మరి!"
"గుడ్ నైట్!"
"గుడ్ నైట్!" ఫోన్ పెట్టేసింది చంద్రిక.
అతని గురించే ఆలోచిస్తే అంతా ఆగమ్యగోచరంగా వుంటుంది. బట్టలు మార్చుకుని పడుకోవడానికి సిద్దమవుతూండగా కాలింగ్ బెల్ మోగింది.
వెళ్ళి తలుపు తెరిచింది చంద్రిక.
లాల్చీ పంచెతో ఓ వ్యక్తి కారు దిగి నిలబడుతున్నాడు. వాచ్ మాన్ కూడా అక్కడే వున్నాడు.
"ఎవరు?" అడిగింది చంద్రిక.
"నమస్కారమండీ! నా పేరు రాజేశ్వర్రావ్! మీతో కొంచెం మాట్లాడాలనివచ్చాను."
"ఎక్కడినుంచి వచ్చారు?"
"మాది కృష్ణాజిల్లా లెండి! ఉదయం వచ్చి శ్రీనివాసరావుగారిని కలుసుకున్నాను. ఆయన ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకుంటేబావుంటుందని సలహా ఇచ్చారు."
"ఏ పనిమీద వచ్చారు?" తిరిగి అడిగింది చంద్రిక.
"పనా.....అదే......శ్రీనివాసరావు చెప్పాడు.....అన్నిటికీ వప్పుకున్నాను -" తడబడుతూ అన్నాడతను.
చంద్రికకేమీ అర్ధంకాలేదు.
"అంటే?"
"అదే.....మీకు చెప్పాల్సిందేముందీ? ఎంత డబ్బయినా ఖర్చుచేయడానికి సిద్దమే! మీకోసం అంత దూరం నుంచివచ్చాను."
చంద్రికకు కొంచెంకొంచెంగా అర్ధమవసాగింది.
అర్ధమవుతున్న కొద్దీ ఆమె శరీరం దగ్ధమయిపోతున్నట్టనిపిస్తోంది.
"శ్రీనివాసరావ్ కి ఎంతిచ్చారు?"
"అయిదువేలు! మరో అయిదువేలు తరువాత ఇమ్మన్నాడు!"
చంద్రిక కోపం పట్టలేకపోయింది.
"బయటకు నడువ్!" గద్దించిందామె.
అతను కంగారుపడి లేచి నిలుచున్నాడు.
"మీరు - "అంటూ ఏదో చెప్పబోయాడుగానీ చంద్రిక వినిపించుకోలేదు.
"మర్యాదగా బయటకువెళతావా, పోలీస్ లని పిలువ మన్నావా?"
అతను భయపడిపోయాడు మరొక్క మాటకూడా మాట్లాడకుండా వడివడిగా బయటకు నడిచాడు. మరుక్షణంలో కారు స్టార్టయిన చప్పుడు వినిపించింది.
