"అర్చనా, రెండు రోజులు శలవులు వస్తున్నాయి యింకోవారం రోజులు శలవు పెడతాను. యిద్దరం వెళ్ళి తీసుకువద్దాం పూజని. అలాగే మా యింటికివెళ్ళి రెండు రోజులుండి వద్దాం.....మీ అమ్మగారిని కూడా చూసి వద్దాం."
"అలాగే వెడదాం, కానీ సంవత్సరం మధ్యలో పూజని ఎలా తీసుకువస్తాం రాజేష్. ఈ ఆరునెలలు అవనీ పరీక్షలయ్యాక తీసుకువద్దాం.... ఈలోగా యిక్కడ సీటు అదీ చూడాలికదా. ఇప్పుడు తీసుకువస్తే అనవసరంగా ఒక యియర్ వేస్టు అవుతుంది గదా" అంది అర్చన.
"ఫరవాలేదు లెద్దూ.....ఫస్ట్ స్టేండర్డే కదా! నీకు వదిలి వుండాలంటే బాధగా లేదా. యింక పరీక్షలవి అవాలంటే ఆరేడు నెలలు పడుతుంది కదా.ఒక ఏడాది వేస్టు అవుతే అవనీ-యిక్కడ ట్రైచేద్దాం."
"ఇంకానయం...ఒక ఏడాది వేస్టు అవడమా! అసలు మధ్యలో సీటు ఎవరిస్తారు...మైడియర్ యివి యిదివరకటి రోజులుకావు. లోయర్ కె.జి. క్లాసులో సీటు దొరకాలంటే ఎంత గగనం అవుతుందో నీకు తెలియదు. ఒక్క ఆరు నెలలేగా, గత మూడేళ్ళు వుండలేదూ. ఇంకో ఆరునెలలు ఎంతలో గడుస్తాయి. ఒకసారి వెళ్ళి చూసి వద్దాం, శలవులు యివ్వగానే తీసుకు వద్దాం" అంది అర్చన.
"సరే.....ముందు మా యింటికి వెళ్ళి రెండు రోజులుండి వెడదాం. అమ్మ నాన్నల దగ్గిర నించి ఉత్తరాలేలేవు, కోపం వచ్చినట్టుంది వాళ్ళకి. ఏమిటీ యీ పెద్దవాళ్ళు వాళ్ళ చాదస్తాలు" కాస్త బాధగా అన్నాడు.
"వాళ్ళని బ్లేమ్ చెయ్యకు రాజేష్. వాళ్ళ స్థితిలో రేపు మనమూ అలాగే ఆలోచిస్తాం. ఎవరన్నా కానీ, తన కొడుకు ఓ రెండో పెళ్ళిచేసుకోడానికి యిష్టపడతారా. వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటుంది."
"ఈ అందాల బొమ్మని చూస్తే వాళ్ళు కరిగిపోతారులే...దానికి తోడు రెండు రోజులు వాళ్ళని కాకాపట్టావంటే, నేను నీ దాసుడిని అయినట్టు వాళ్ళూ లొంగిపోతారులే" నవ్వుతూ అన్నాడు.
"అంటే నిన్ను కాకాపట్టి నా వాడిని చేసుకున్నానంటావన్నమాట" అర్చన తర్జన చూపి బెదిరిస్తున్నట్లుంది.
"మరంతే...నీవింద్రుడివి, చంద్రుడివి, నా పాలిట దేవుడిని, నీ నత మంచివాడు లేడు, నాకంటే అదృష్టవంతురాలు లేదు" ఈనెలలో ఈ మాటలు ఎన్నిసార్లు అని నన్ను బుట్టలో వేశావు మరి" చిలిపిగా అన్నాడు.
"భాభీజీ....ఏమిటా జోకు.....మాకు కూడా కాస్త చెప్పండి" సునీత చిన్న కటోరిలో ఏదో పట్టుకుని వచ్చింది లోపలికి.
"అబ్బబ్బ...ఎంత కొత్త దంపతులయితే మాత్రం ఏమిటయ్యాబాబూ ఇరవై నాలుగ్గంటలూ యింట్లోంచి బయటికి రాకపోవడం" మెహతా కూడా అమెవెంట లోపలికి వచ్చాడు.
"రండి, రండి.....సరిగా వేళకి వచ్చారు. ఈరోజు దోసెలు చేస్తున్నాను.....మిమ్మల్ని బ్రేక్ ఫాస్టుకి పిలవాలనుకుంటూండగానే వచ్చారు సరిగా..." అర్చన మనఃపూర్వకంగా ఆహ్వానించింది.
"డోంట్ బ్లఫ్ మైడియర్ సిస్టర్....ఏదో వచ్చాంగదా పొమ్మనలేక ఏదో అంటున్నారు. పొమ్మన్నా పోయేవాళ్ళం కాదులెండి యింక.....నెల రోజులయిపోయింది యింకా హనీమూన్ ఏమిటి. నెలరోజులయినా ఇంకా తలుపులు బిడాయించుకుంటే ఎలాగయ్యా బాబూ..."
"అంతా మీలాగే వుంటారనుకుంటారు పాపం...పెళ్ళాంతో మాట్లాడితేనే అమ్మ ఏం అనుకుంటుందో, నాన్న ఏం అంటారో చెల్లెలు ఎక్కడ చూస్తుందో, వదిన ఎక్కడ హాస్యం చేస్తుందో అని పెళ్ళాన్ని తప్పుకు తిరుగుతారా మీలాగ..." సునీత దెప్పి పొడిసింది నవ్వుతూ.
"అవునవును.....పెళ్ళాంతో మాట్లాడకుండానే....తొమ్మిది నెలల్లోనే తండ్రిని అయిపోయాను గాబోలు..." కొంటెగా అన్నాడు మెహతా.
"చాల్లెండి ప్రతాపం.....పిల్లలు పుట్టడానికి పెళ్ళాంతో మాట్లాడక్కరలేదు" సునీత చిరుకోపంతో అంది.
"బాగుంది యిన్నాళ్ళ తర్వాత యిప్పుడు మీ దెబ్బలాట, పోనీ సునీతా యిప్పుడు వెళ్ళగూడదూ హనీమూన్ కి...." రాజేష్ కొంటెగా అన్నాడు.
"పిల్లల్ని మా దగ్గిర వదిలివెళ్లి తిరిగి రండి కావలిస్తే ఓ పది రోజులు" అర్చన అంది.
"బావుంది. వాళ్ళ హనీమూన్ దెబ్బ నాకా మధ్యన...." రాజేష్ చిలిపిగా అన్నాడు.
"సరేలే.....యిప్పుడా మజా ఏముంటుంది వెళ్ళినా....ఏమిటో పెళ్ళి..వెంట వెంటనే ఏడాది తిరక్కుండా పిల్ల, తరువాత బాబు, ఆ తర్వాత ఉద్యోగం. రోజూ యీ పరుగులు హడావిడి అసలు పెళ్ళంటే యింతేనా అన్పిస్తుంది నాకు" సునీత కాస్త నిరాశగా అంది.
"మా నార్తులో కొత్త కోడలు సరదాలు. అత్తింట కోడలు వదిగి వదిగి వుండడం యివన్నీ ఎక్కువ మీ సౌత్ లో కంటే. నన్నంటుంది కాని పగలంతా వంటింట్లోనే వుండేది యీవిడ మా అమ్మవెనకాతల. మాలో కోడలు వచ్చిందంటే వంటిల్లు అప్పగించేస్తారు అత్తగార్లు. అప్పుడు మేం అక్కడ వుండేవాళ్ళం. ఏమీ ప్రైవసీయే వుండేది కాదు జాయింట్ ఫేమిలీస్."
