Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 23


    సాయంత్రం యింటికిచేరుకునే నలుగురు జర్నలిస్టులు తన కోసం ఎదురు చూస్తూకూర్చుని కనిపించారు.
    "తార పత్రికలో మీరిచ్చిన ప్రకటన గురించి మాకు ఇంటర్యూ కావాలి" అడిగారు వాళ్ళు.
    వారికేం చెప్పాలో తెలీలేదు చంద్రికకు.
    ఆనంద్ అంటే సినిమా పరిశ్రమ అంతటికీ గౌరవం వుంది. తను చిన్న వేషాలేస్తున్నప్పటినుంచే ఆయనతో పరిచయం వుంది. పెద్దాచిన్నా అందరు ఆర్టిస్టులనూ గౌరవంతో చూడడం ఆయన ప్రత్యేకత. ఆ కారణంగానే తనకూ అతనంటే గౌరవం.
    అంచేతే అతను ఉదయం అలా అడిగినప్పుడు ఏమీ మాట్లాడలేకపోయింది.
    "వారం రోజుల వరకూ నాకు తీరికలేదు. ఆ తరువాత కనిపించండి"చెప్పేసి లోపలకు నడిచిందామె.
    భోజనం చేస్తుండగా ఫోను వచ్చిందామెకి.
    "ఎవరో అడుగు!" శాంతమ్మ తో చెప్పిందామె.
    "సురేష్ గారంటమ్మా! విజయవాడనుంచి మాట్లాడుతున్నారు."
    భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిమాట్లాడిందామె.
    "హలో!"
    "నమస్కారమండీ!"
    "నమస్తే!"
    "ఏమిటీ గొడవంతా? ఇప్పుడే తార పత్రికచదివాను!"
    "ఏం చెప్పమంటారు?"
    "అది నిజంగా మీరిచ్చినమేటరేనా?"
    "అవును!"
    "చంపేశారు!"
    "ఎందుకు?"
    "అంత ఎత్తున వున్న మీరు ఇంత కిందకు దిగటంబావుండలేదు."
    చంద్రిక ఏమీ మాట్లాడలేదు.
    "సరే! అయిందేదో అయిపోయింది. దయచేసి ఈ విషయం మీరిక్కడితో ఫుల్ స్టాఫ్ పెట్టేయండి. ఈ పత్రికలవాళ్ళెవరినీ రానీయకండి కొన్ని రోజులపాటు!"
    "అలాగే!"
    "ఇంకో విషయం! అక్కడ ఈ గొడవలవల్ల మీకేమైనా ఇబ్బందులెదురయితే నాకు ఫోన్ చేయండి".
    "థాంక్యూ!"
    "మీకు తెలుసుగా! నేను మీ ఫాన్ ని! మీరెలాంటి అండదండలూ లేనివారని ఎవరూ అనుకోడానికి వీల్లేదు! అవసరమయితే ఆ విషయం రుజువు చేస్తాను. ఇంక వుంటాను మరి! అవసరమయితే నాకు తప్పక ఫోను చేస్తారుకదూ!"
    "అలాగే!"
    "ఉంటాను మరి!"
    "థాంక్యూ వెరీమచ్ సురేష్ గారూ! నా మీద ఇంత అభిమానం వున్నందుకు చాలా సంతోషంగా వుందినాకు."
    అతను ఫోను పెట్టేశాడు.
    ఏదేమైనా ఇంకా ఈ గొడవ ఇక్కడితో అణిచేస్తేనే మంచిదని పిస్తోంది తనకు.
    భోజనం ముగిసేసరికి ఆనంద్ వచ్చాడు కారులో.
    "రండి!" లోపలికి ఆహ్వానించింది చంద్రిక.
    ఇద్దరూ హాల్లో కూర్చున్నారు.
    "చూడమ్మా.....! నేను ప్రేమ్ కుమార్ తో అన్నీ మాట్లాడాను. అతనిని మందలించాను కూడా. ఇప్పుడు ఈ గాలివాసనసద్దుమణగాలంటే నువు ఓ పని చేయాలి?"
    "ఏమిటండీ అది?"
    "రేపే ఈ జర్నలిస్టులకు 'తార' పత్రికలో ప్రచురించబడిన కథనం అంతా అబద్దాలపుట్ట అనీ, ఆ విషయం అసలునువు చెప్పనేలేదనీ మరో స్టేట్ మెంట్ యివు. దాంతో ఆ న్యూస్ సందేహాస్పదంగా మారుతుంది. ఆ తరువాత నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది. ఏమంటావ్"
    "సరేనండీ! అలాగే!"
    "చాలా థాంక్సమ్మా! నా నెత్తి మీద నుంచి పెద్ద భారం తొలగించావు నువు!"
    చంద్రికేం మాట్లాడలేదు.
    "ఇంక వస్తానమ్మా!" అతను వెళ్ళిపోయాడు.
    మర్నాడు తనెలాంటి ప్రయత్నం చేయకుండానే జర్నలిస్టులురావడం, ఆనంద్ చెప్పినట్లే తను వారికి చెప్పడం జరిగిపోయింది.
    అప్పటికి నేనూ, ప్రేమ్ కుమార్ కలసి నటించడానికి ఒప్పందమయిన నాలుగు చిత్రాల నుంచి తనే విరమించుకొంది చంద్రిక. దాంతో అతనికీ తనకూ శాశ్వతంగా సంబంధాలు తెగిపోయినట్టే. కొద్దిరోజులు గడచిపోయినయ్. చంద్రిక ప్రేమ్ కుమార్ ల విషయము పాతబడిపోయింది.
    ఓ రోజు చంద్రిక స్టూడియోలో వుండగా ఫోను వచ్చింది. ఆఫీస్ రూంకి వెళ్ళి ఫోను అందుకుంది.
    "నేను శాంతమ్మను మాట్లాడుతున్నానమ్మా.....నాన్నగారిని హాస్పిటల్లో చేర్చారట! ఆయన పరిస్థితి ప్రమాదకరంగావుందని యిప్పుడే ఆయన స్నేహితులెవరోవచ్చి చెప్పారు".
    చంద్రిక ఖంగారుపడింది.
    వెంటనే ప్రొడ్యూసర్ కి చెప్పి స్టూడియోనుంచి ఇంటికి బయల్దేరింది. ఇంటికెళ్ళి శాంతమ్మను కూడా తీసుకుని హాస్పిటల్ చేరుకుంది.
    హాస్పిటల్ వార్డులోకి నడుస్తుంటే ఆమె అడుగులు తడబడసాగినయ్. మనసులో బాధ!
    దిగులు!
    ఇన్ని రోజులూ తనతండ్రి విలువగుర్తించనేలేదు తను.
    జగన్నాధాన్ని బెడ్ మీద చూస్తూనే దుఃఖంముంచుకొచ్చిందామెకు. అతను యింకా అపస్మారక స్థితిలోనే వున్నాడు.
    సాయంత్రం వరకూ అతనిమంచంపక్కనే కూర్చుండిపోయింది. డాక్టరుతో మాట్లాడాక ఆమెకు భయం కలిగింది. ఆ రాత్రి గడవటం కష్టమని చెప్పాడతను.
    ఆ తరువాత మరికొద్దిసేపటికే తన తండ్రి విగతజీవుడయ్యాడు. అతని మృతదేహం దగ్గరే విలపిస్తూ కూర్చున్న తనను నెమ్మదిగా భుజం మీద చేయివేసినడిపిస్తూ ఇంటికి తీసుకొచ్చేసింది సరోజిని.
    తననా దుఃఖం నుంచి రక్షించడానికి ఒక యింజక్షన్ ఇచ్చిందామె.
     తనను నెమ్మదిగా మత్తు ఆవహించింది. మంచం మీద వాలిపోయింది దుఃఖిస్తూనే.
    ఇంట్లో పాత జ్ఞాపకాలే ఆమెను బాధించసాగినయ్. తండ్రి గదిలోకెళ్ళాలంటే మనసంతా పిండేస్తున్నట్లనిపిస్తుంది. అతనింకా ఆ గదిలోనే కూర్చున్నట్లు, తూలుతూ గదిలోనుంచి బయటికొస్తున్నట్లూ భ్రాంతి.
    ఆ యింట్లో గడపడం అసాధ్యంగాకనిపించిందామెకి. ఒకవేళ మర్చిపోవడానికి ప్రయత్నించినా తనకు సానుభూతి తెలుపుతూ వేలమంది అభిమానులనుంచి వచ్చే ఉత్తరాలూ, ప్రతిరోజూ వచ్చి జాలితోపలకరించి వెళ్ళే సినిమా ప్రముఖులూ మళ్ళీ మనసుని పాడుచేస్తున్నయ్.
    "అమ్మా! ఇలా ఎప్పుడూ ఆయనని తల్చుకుంటూ మనసు పాడు చేసుకోకండి! అసలు ఈ యిల్లే మారిపోతేగానీ మీరు ఆ జ్ఞాపకాలనుంచి తప్పించుకోలేరు "శాంతమ్మ తన పరిస్థితి చూసి బాధపడుతూ అంది.
    చంద్రిక ఆలోచనలో పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS