Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 23


    "రాజా....ఉత్త రెండో పెళ్ళి అయితే ఫరవాలేదు....గాని పిల్ల ఉందంటున్నావు."
    "తరువాత నీవు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వుంటుందో ఆలోచించినట్లులేదు." రంగనాథంగారు గంభీరంగా అన్నారు.
    "ఆలోచించాను నాన్నగారూ. అదో పెద్ద ప్రాబ్లమ్ అని నాకు అనిపించడంలేదు."
    "ఇప్పుడనిపించదు. రేపు నీకు పిల్లలు పుడితే, ఆ పిల్లపరాయి వాడి కూతురన్నది తడ్తుంది. అప్పుడు ఆ పిల్లకి ఎంత అన్యాయజరుగుతుందో....నీకున్న అనుభవం ఏమిటి నా మాటవిను రాజీ నీ మంచికోరి చెప్తున్నాం." అరుంధతి కొడుకు దగ్గిరికివచ్చి తల నిమురుతూ అంది-"నీకేం తక్కువయిందని సర్దుకుని ఈమెను చేసుకోడం ఎన్నెన్ని మంచి సంబంధాలు వస్తున్నాయి. అన్నీ కాలదన్ని పిల్లతల్లిని చేసుకుంటాననడం ఏం ఖర్మరా ఇది." ఆమె గొంతు రుద్దమయింది, రాజేష్ విరక్తిగాకళ్ళు మూసుకున్నాడు. ఎలా చెప్పి, ఏం చెప్పి అందరినీ ఒప్పించగలడో అర్ధం కాలేదు అతనికి. కొడుకు మొహంలోని భావాలు గుర్తించి రంగనాథంగారు భార్యకి ఇంకా ఊరుకోమన్నట్టు సైగ చేశారు. "రాజా-మేం చెప్పపలసింది చెప్పాం. కష్టనష్టాలు ఎదుర్కోవలసింది నీవు. మరోసారి బాగా ఆలోచించు." అంటూ ఆయన కుర్చీలోంచి లేచారు. "అమ్మా నన్ను క్షమించండి.... నేనామెకి అనవసరంగా ఆశలు కల్పించి ఇప్పుడు వెనక్కి అడుగువేయలేను.....మీకు కష్టం కలిగితే క్షమించండి." అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అరుంధతి బాధగా ఆవేదనగా కళ్ళుమూసుకుంది.
    
                                            5
    
    "హార్టీ కంగ్రాచులేషన్స్ రాజేష్...." భుజం చుట్టూ చేయివేసి అభినందించాడు మెహతా - "థాంక్స్" రాజేష్ షేక్ హేండ్ యిస్తూ అన్నాడు.
    "అర్చనాజీ, పక్క పక్క నున్న మీతో ఇదివరకు పరిచయం కలగలేదు. ఇప్పుడు మీరిలా మిసెస్ రాజేష్ అవడం మాకు చాలా ఆనందంగా వుంది" అంది సునీత. "రాజేష్ మాకు బ్రదర్. మిమ్మల్ని భాభీజీ అనచ్చా" సునీత చనువుగా అర్చనని దగ్గరికి తీసుకుని కౌగలించుకుంటూ అంది.
    "అఫ్ కోర్స్...మీ గురించి రాజేష్ చాలా చెప్పారు. మీరు పక్క నుండడం నాకు చాలా సంతోషం" అర్చన నవ్వుతూ అంది.
    రాజేష్, అర్చన రిజిష్ట్రారు ఆఫీసులో సంతకాలు పెట్టి దండలు మార్చుకున్నారు. రాజేష్ తరపున మిష్టర్ మెహతా, సునీతా మెహతా సాక్షి సంతకాలు చేశారు. అర్చన తరఫున ఆమె అన్న వదిన మాత్రం వచ్చారు. రాజేష్ తల్లిదండ్రులు, రిజిష్టరు పెళ్ళికి అయితే అంతదూరం మేం ఎందుకు, పెళ్లి చేసుకున్నాక వీలుచూసుకుని ఇద్దరూ రండి" అన్నారు. వారి ముభావతకి కారణం అర్ధం అయిన రాజేష్ ఇంక తర్కాలకి దిగకుండా ఢిల్లీలోనే రిజిష్ట్రారు ఆఫీసులో అర్చనని పెళ్ళిచేసుకున్నాడు. అర్చన అన్న వదిన మాత్రం కాదనకుండా వచ్చారు. ఒక విధంగా అర్చన అన్న శ్రీరామ్ కి చెల్లెలి బాధ్యత తనమీద వుండకుండా మళ్ళీ పెళ్ళి చేసుకోడం ఆనందంగానే వుంది. తన మంచి చెడ్డలు ఆమెకి తెలుసు అనివూరు కున్నారు. అర్చన తల్లి "అయ్యో ఏమిటీ విడ్డూరం. కట్టుకున్న మొగుడు బతికుండగానే మరో పెళ్ళా...అవ్వ....ఏం రోజులొచ్చాయి" అని ఆశ్చర్యపడి బాధో, సంతోషమో తెలియని స్థితిలో వుండిపోయింది. కూతురిని చేసుకోదానికి ముందుకు వచ్చిన రాజేష్ ని ఆశ్చర్యంగా చూసింది. ఆమెకి తెలియకుండానే మనసులో అభినందించింది. కూతురు మళ్ళీ పెళ్లి చేసుకోడం సంప్రదాయం ప్రకారం హర్షించలేకపోయినా, కన్న తల్లిగా 'పోనిలే దాని బతుక్కి అర్ధం ఏర్పడింది. బతుకంతా ఏడవకుండా ఓతోడు దొరికింది' అని సంతోషపడింది.
    ఆ సాయంత్రం ఓ హోటలులో ఆఫీసు వారికి, ఫ్రెండ్సుకి ఓ వందమందికి పార్టీ యిచ్చాడు రాజేష్.....అర్చన సంగతి అందరికి తెలిసింది. అందరూ ప్రత్యేక కుతూహలంతో అర్చనని గమనించారు. ఆమె అందానికి అందరూ అబ్బురపడి రాజేష్ రెండో పెళ్ళయినా ఆమెని ఎందుకు చేసుకున్నాడో అర్ధం అయినట్లనిపించింది. ఎంత అందగత్తె ఐనా పెళ్ళయిన ఆమెని, పిల్లతల్లిని చేసుకున్న రాజేష్ ని అందరూ అభినందించకుండా ఉండలేకపోయారు. రాజేష్ బాస్ అయితే ప్రత్యేకం పక్కకి పిలిచి "నీలాంటి యంగ్ మాన్ మన సమాజానికి చాలా అవసరం. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్" అంటూ అభినందించాడు-ప్రతివాళ్ళు రాజేష్ పెళ్ళీ చేసుకున్నందుకు కాక అర్చనని చేసుకున్నందుకు అభినందించారు. "రాజేష్ అందరికీ ఒక కంగ్రాట్స్ అయితే నీకు డబుల్ కంగ్రాట్స్"- అన్నారు క్లోజ్ ఫ్రెండ్సు.
    "అరె భాయి, మీ అందరూ కలిసి అర్చనకి రెండో పెళ్ళన్న సంగతి నాకు మరీ మరీ గుర్తుచేయడం మానరా, వుయ్ వాంట్ టూ ఫర్ గట్ ది పాస్ట్......ప్లీజ్ మమ్మల్ని కొత్త లైఫ్ స్టార్ట్ చేయనీయండి అందరు భార్యాభర్తల్లాగా" అన్నాడు రాజేష్ అందరి మాటలు విని విని నవ్వుతూ.
    అర్చన కయితే అందరూ తనని ప్రత్యేక కుతూహలంతో గమనించడం చూస్తే చాలా ఎంబ్రాసింగ్ గా అన్పించింది. ఎదుట ఏమనకపోయినా అందరూ తన విషయమే మాట్లాడు కుంటున్నట్లు ఆమె గుర్తించింది......ఎంత తొందరగా పార్టీ అయిపోతుందా అన్నట్టు యిబ్బంది పడింది ఎంత చదివిన వారయినా, ఎంత ఉన్నతులు, సంస్కారవంతులైనా ఆడదానికి రెండో పెళ్ళిఅనగానే అది మామూలుగా తీసుకోలేకపోతున్నారు ఇప్పటికీ.......ఇంకా రోజులు మారలేదు అనడానికి యింతకంటే ఏం ఉదాహరణ కావాలి అనుకుంది అర్చన.
    రాజేష్ దగ్గర అతని ఫ్లాట్ తాళాలు తీసుకుని పనుంది అంటూ సునీత పార్టీనించి అందరికంటే ముందు వెళ్ళిపోయింది-హడావిడిగా మధ్య ఎందుకో కూడా అడగకుండా తాళం ఇచ్చాడు రాజేష్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS