"అవును నీకు స్పృహ వచ్చింది మూడు రోజులకు..."
"సోఫీ!?.." గది అంతా చూచింది. రాజీవ్ లేడు.
"అతను ఇప్పుడే బయటికి వెళ్ళాడు..."
వీణ వణుకుతున్న చేతులతో సోఫీని గట్టిగా పట్టుకొంది. "సోఫీ!.... సోఫీ! ఉత్తరం వచ్చింది..."
"చదివాను."
"నిన్ను క్షమించలేకపోతున్నాను, సోఫీ! నన్ను వదిలి నీవు వెళ్ళకపోతే....అలా జరిగి ఉండేది కాదు.....భగవాన్! నన్నెందుకు పుట్టించావ్!" కళ్ళు గట్టిగా మూసుకొంది.
"వీణా! నా వీణా! నీవు మనస్సును గట్టి చేసుకోవాలి. మళ్ళీ ఫిట్ వస్తుంది."
"సోఫీ! చచ్చిపోతాను. ఎలా బ్రతకను?" వెక్కి వెక్కి ఏడుస్తూంది వీణ.
"ఊరుకో! అంతా విధి! ఆ రోజు వచ్చిన డాక్టర్ ఎవరనుకొన్నావు? మా అక్కను ప్రేమించి నతను. డేవిడ్ తండ్రి.....అతడు నా ఊరు, పేరు అడిగాడు. చెప్పాను. తనను తెలియ చెప్పుకొన్నాడు. చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతున్నా నన్నాడు. నన్ను అప్పటి కప్పుడే పెళ్ళి చేసుకొంటానన్నాడు. ఏమి చెయ్యమన్నా చేస్తాడట. అక్క స్థానాన్ని నే నెలా తీసుకోను? డేవిడ్ ఉన్నాడని చెప్పాను. ఆ బాధ్యాత అతను తీసుకొంటా నన్నాడు....తీసుకొన్నాడు....ఇప్పుడు డేవిడ్ తండ్రి దగ్గరే ఉన్నాడు.... ఆ మాటల్లో కాలం ఎంతయిందో చెప్పలెను. వచ్చేసరికి గదిలో అప్పుడే వచ్చిన అప్రతిభుడైన రాజ్ ను చూశాను. పిచ్చి పట్టినట్లు వెళ్ళిపోయాడు రాజ్! మనస్సు స్తిమితం చేసుకొని అన్వేషణ సాగించాడు ఆ అజ్ఞాత వ్యక్తి కోసం. సంజయ్ అవతల రెస్ట్ హౌస్ లో ఉన్నట్లు తెలిసింది. అతని కోసం వెళ్ళాడు వాళ్ళ ఊరు. కాని, రాజ్ వెళ్ళేటప్పటికి అతను జపాన్ వెళ్ళాడు....తిరిగి వస్తాడు రాజ్...తరవాత విషయాలు నీకు తెలుసు. సంజయ్ కూడా రాజీవ్ వాడే హేరాయిల్ వాడతాడు. ఆ వాసనా, రాజీవ్ మరిచిప[ఆయిన కర్చీఫ్, మఫ్లర్ లను చూసిన నీవు అతనినే అనుమానించావు" అని చెప్పింది సోఫియా.
"నా కెందుకు చెప్పలేదు?"
"తెలియని వ్యక్తి ఎవ్వరో నీ శీలాన్ని అపహరించారని తెలిస్తే నీవు బ్రతుకుతావా! అప్పటికి అలా అనుకోవటమే మంచిది అనుకొన్నాను..."
"మరి రాజీవ్ ఎందుకు ఒప్పుకొన్నాడు?"
"సంజయ్ ఎప్పుడు వస్తాడో జపాన్ నుంచి! అసలు వస్తాడో, రాడో? వచ్చినా ఒప్పుకుంటాడో, లేదో? నీ మర్యాద కాపాడటానికి, నీ ప్రాణం రక్షించటానికి నీవు మోపిన నిందను మౌనంగా భరించాడు."
"నా కోసం రాజీవ్ ని బలి తీసుకొన్నారా? సోఫీ నిన్ను ఎంతగానో అసహ్యించుకొన్నాను....కాని, నా మంచికే నీవు నిలబడ్డావు. సోఫీ!... నీలాంటి స్నేహమయిని దూరం చేసుకున్న పాపిష్టి దానను. నాకు క్షమ లేదు. నా ముఖం ఎలా చూపను?..."
"వీణా! చేసిన వాడికి, మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు...."
"ఓ! భగవాన్!"
"వీణా! నీవు పవిత్రురాలవే ఎప్పటికీ! నీ తప్పేమీ లేదని రాజీవ్ కు తెలుసు..."
లైట్ గా భోజనం పెట్టి డ్రెస్ చేసింది వీణకు.
సోఫియా స్నానాదులు చేయటానికి వెళ్ళింది.
క్రింద వచ్చే పోయె బస్సులను చూస్తూ కూర్చుంది కిటికీ దగ్గర వీణ.
రాజీవ్ వచ్చాడు లోనికి! వీణ వెనక భాగం చూస్తూ ఉన్నాడు.
"సోఫీ! రాజీవ్ స్టేట్స్ కి వెళ్ళిపోతారు కదూ?... ఈ బంధంనుండి విముక్తి చేస్తే మంచిదేమో! అయ్యో! రాజ్! పవిత్రున్ని అపరాధిగా నిలబెట్టాను అపవిత్రురాలి ముందు. విరగబడి నవ్వి ఉంటుంది అతని మనస్సు. సోఫీ!..." తిరిగి చూసింది వీణ.
రాజీవ్ తన వైపే చూస్తున్నాడు. కళ్ళ నిండుగా అతన్ని చూసింది. మెల్లిగా లేచింది. రెండు చేతులు జోడించింది. వీణ హృదయం అతని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. దగ్గరగా వెళ్ళి కాళ్ళమీద పడి పోయింది. మౌనంగా పైకి ఎత్తాడు. నీళ్ళతో ముఖం తడిసిపోయింది. అతని హృదయానికి హత్తుకొని పోవాలని తలచింది. కాని, తన కా హక్కు లేదు!
"వీణా! నీవు ఇక కన్నీళ్లు కార్చకూడదు." మంచం మీద కూర్చో పెట్టాడు. వీణ పల్స్ చూశాడు.
సోఫియా వచ్చింది బాత్ రూములో నుండి.
"సోఫియా! ఇలా కూర్చో!" అని వీణ పక్కలో కూర్చోపెట్టాడు.
"అతను వచ్చాడు.....సంజయ్!
గుండెలమీదకు చేతులు పోయాయి వీణకు. వీణ వైపు చూడకుండా, "వీణ కంగీకారమైతే పెళ్ళి చేసుకొంటాడు...వీణ....వీణగానే ఉందని అతను నమ్మాడు..." అంటూ రాజీవ్ బొమ్మల్లా ఉండి పోయిన వారిని వదిలి బయటికి వెళ్ళాడు.
"వీణా! విన్నావు కదూ?"
"ఊఁ!"
"సంజయ్ ని చేసుకొంటావా?"
వీణ ఈ సారి ఫెయింట్ కాలేదు. పెద్దగా నవ్వింది.
"వీణా!" భయంగా అరిచింది సోఫియా.
"సోఫీ! నాకు పిచ్చి పట్టలేదు ఇంకా! ఆశ్చర్యంగా ఉంది అందుకే! సోఫీ! నాకు పెళ్ళి అయింది కదూ? దైవమందిరంలో పెద్దల సాక్షిగా జరిగింది కదూ? దైవం ప్రసాదించిన భర్త ఉన్నారు. సోఫీ! నా భర్తను నేను ప్రేమిస్తున్నాను. నా భర్త నాకు కావాలని కనుపించని దేవతలకు మొక్కుకొంటున్నాను. కోటి సంజయ్ లు వచ్చినా నన్ను తీసుకోలేరు...."
బయటినుండి వీరి సంభాషణ విన్న సంజయ్ మౌనంగా రాజీవ్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
"సోఫీ..." వీణకు అనుమానం వచ్చింది. "రాజీవ్ నన్ను పరిగ్రహిస్తాడా?....ఏం చేస్తే నా రాజ్ ని తిరిగి పొందగలుగుతాను! నాకు పరిష్కారమే లేదా? నాకు క్షమ లేదా! భగవాన్!..." అంది.
సోఫియా బయటికి వెళ్ళిపోయింది రాజీవ్ ని లోపలికి పంపి.
లోనికి వచ్చిన రాజీవ్ ని చూసింది. "మన ఇంటికి నన్ను తీసుకొనిపోతారా?" నిశ్చలంగా అడిగింది.
"అలాగే!" అన్నాడు రాజీవ్.
అంతవరకు పడిన దుఃఖాన్ని మరిచిపోయింది. చక్కగా ముస్తాబు చేసుకొంది.
సహదేవ్ వచ్చాడు.
అందరూ కలిసి భోజనానికి హోటల్ కి వెళ్ళారు. హోటల్లోకి వెళ్ళుతుండగా వీణ బయటికి వచ్చి పక్కన ఉన్న మందులషాపులో స్లీపింగ్ పిల్స్ బాటిల్ కొనుక్కుంది.
సహదేవ్ సోఫియాతో మాట్లాడటమే లేదు.
అది గమనించి వీణ, "అన్నయ్యా! సోఫియాతో మాట్లాడవేం?" అంది.
బ్లాక్ డెవిల్ తో మాట్లాడవద్దు అన్నావుగా!"
"ఓ!" అంది వీణ సిగ్గు పడుతూ.
తిరిగి హోటల్ కి వచ్చారు. వాళ్ళ వాళ్ళ సింగిల్ రూమ్సులోకి వెళ్ళిపోయారు సోఫియా, సహదేవ్ లు, ఏదో తలపుకి రాగా వెళ్ళిపోతున్న అన్నయ్యని పిలిచింది వీణ.
రహస్యంగా, "అన్నయ్యా! నీవు సోఫియాని చేసుకో. నా కోరిక! దానికి చాలా ఋణపడి ఉన్నాను!..." అంది.
"ఇంకా ఎంతమందికి ఋణపడి ఉన్నావు, తల్లీ!" భయం నటిస్తూ పలికాడు.
"పాపం! ఆశ!" అని వెక్కిరించింది వీణ.
"అన్నయ్యా!" అంటూ కాళ్ళకు నమస్కరించింది. దీవించి వెళ్ళాడు.
రాజీవ్ నైట్ డ్రెస్ వేసుకొని ఈజీ చెయిర్ లో పడుకొన్నాడు ఆలోచిస్తూ.
మంచంమీద పడుకొంది వీణ రాజీవ్ ని చూస్తూ. మననా వాచా ఒక్కసారి అతని కౌగిలిలో కరిగిపోవాలన్న బలవత్తరమైన కోరిక కలిగింది వీణకు.
"రాజీవ్!" అని పిలిచింది.
ఇద్దరి కళ్ళు కలుసుకొన్నాయి.
రెండు చేతులూ చాపి ఆహ్వానించింది భర్త ను! ఘోర సంగ్రామంలో పోరాడి గెలిచిన వీరుడిలా ఉత్సాహం, అలసట ముప్పిరిగొన్నట్టు అడుగులో అడుగు వేస్తూ ఆజానుబాహువైన రాజీవ్ వీణ చిన్న చేతుల్లో ఇమిడిపోయాడు.
ఆకాశం ఎత్తు సముద్రం లోతుకు ఎంత దూరమో అలా వారి కౌగిలికి అంతం లేదనిపించింది.
చెంపకు చెంప రాస్తున్న రాజీవ్ దిండుకింద ఉన్న స్లీపింగ్ ఫిల్స్ బాటిల్ అందుకొని, "వీణా! వీటితో పనిలేదు మనకి" అంటూ కిటికీలో నుండి బయటికి విసిరివేశాడు.
'నా రాజీవ్!' అనుకొంటూ తృప్తిగా కళ్ళు మూసుకొంది వీణ!
-----:సమాప్తం:------
