Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 21

                                         
    వీణకు వెళ్ళాలని లేదు. ఇక పొద్దున్నే రాజీవ్ కనపడడు. కాని, అభిమానం అడ్డు వచ్చింది. రాజీవ్ ఉండిపొమ్మని బ్రతిమిలాడితే బాగుండును. కాని, ఎవ్వరికీ తను అక్కరలేదు.
    ఆ రోజు రాజీవ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పటికి వీణ లేదు. సుపరిచితమైన వీణ వస్తువులు లేవు. కిటికీ దగ్గర ఉన్న మంచంమీద కూర్చున్నాడు. హృదయం బరువెక్కింది. ఇక ఈ ఇంట్లో, ఈ ఊర్లో ఉండలేననుకొన్నాడు. వెంటనే మినిస్టరు మామయ్యకు ట్రంక్ కాల్ చేశాడు, "పాస్ పోర్టు రెండు మూడు రోజుల్లో ఇప్పించగలరా" అని.
    "ఓ కే!" అన్నారు ఆయన.
    మద్రాసుకి అప్పటికప్పుడే బయలుదేరాడు రాజీవ్.
    రాజీవ్ వస్తాడేమోనని మూడు రోజులుగా చూస్తూ ఉండింది వీణ.
    జుబేదా నవ్వుతూ, "పగ సాధిస్తానని నీవే ప్రేమలో పడ్డావు" అంది.    
    వీణ కోసం ఎవ్వరో వచ్చారని వాచ్ మన్ వచ్చాడు. ఎంతో ఆశగా వెళ్ళింది రాజీవ్ అని. సుందర్ ఉన్నాడు. చేతికి కట్టు ఉంది. అతని ముఖం ఎప్పటిలా నవ్వుతూనే ఉంది.
    "క్షమించు, వీణా!" అన్నాడు. ఆ గొంతులో ఏ మార్పూ లేదు. ఏదో కాజువల్ గా అడిగినట్లుంది. వీణ మాట్లాడటానికి ఏమీ లేదన్నట్లు నిలుచుండి పోయింది.
    "ఇంత అందంగా ఉండటం నీదే తప్పు. విశ్వామిత్రుడే తట్టుకోలేకపోయాడు. ఆఫ్టరాల్ నే నెంత?" కళ్ళలో కళ్ళు కలపటానికి ప్రయత్నించాడు.
    "ఇక వెళతా! గుడ్ బై!" అంది.
    "గుడ్ బై నాకు కాదు. నీ హజ్బెండ్ కి. మీ రాజీవ్ స్టేట్స్ కి వెళ్ళిపోతున్నాడు. తెలుసా?"
    "నిజమా!' అన్నట్లు చూచింది.
    "రేపు మళ్ళీ కలుసుకొందాము. బై!" అని వెళ్ళిపోయాడు.
    ఇక రాజీవ్ ను చూడలేదేమో?
    మరుసటి రోజు వీణకు ఫోను వచ్చింది. పరుగున వెళ్ళింది.    
    "హల్లో బ్యూటీ!" సుందర్ గొంతు.
    టకీమని పెట్టేసింది.
    ఫోను వచ్చినా, ఎవ్వరు వచ్చినా తనను పిలవవద్దని వాచ్ మన్ కి చెప్పి వెళ్ళిపోయింది.
     ఆ రోజు "క్లాసుకు రాను. గదికి తాళం పెట్టుకొని ఫో!" అని చెప్పింది జుబేదాకు.
    లోపల వీణను ఉంచి తాళం వేసుకొని వెళ్ళిపోయింది జుబేదా.
    దారిలో జగదీష్ కలిశాడు. అలాగే అతనితో బయటికి వెళ్ళిపోయింది.
    రాత్రి పదిగంటలకు తిరిగి వచ్చింది. లోపల వీణ ఉందని అప్పటికి గుర్తు వచ్చింది.
    "వీణా!" అంటూ లోపలికి వచ్చింది.    
    ఆ రోజంతా భోజనం లేదు. నీరసంగా పడుకొనే ఉంది.
    "వీణా! అయామ్ సారీ! జగదీశ్ తో వెళ్లాను. గదికి తాళం వేసినట్టే మరిచిపోయాను" అంటూ ఒకటేగా అపాలజీ చెప్పుకోసాగింది.
    మరుసటి రోజు గదిలోనే ఉంటే పిచ్చి ఎక్కుతుందని క్లాసుకు వెళ్ళింది వీణ.
    కాలేజీలో దొర కనిపించి లెటర్ ఇచ్చాడు. "బాబుగారు వెళ్ళిపోయారు" అని చెప్పాడు.
    "చివరి సారిగా నీ దగ్గర సెలవు తీసుకొందామని వచ్చాను. ఎక్కడా కనిపించలేదు. ఎవ్వరిని అడిగినా నీ వెక్కడున్నావో చెప్పలేకపోయారు. రేపే నా ప్రయాణం. నేను బ్రతికి ఉండగా నన్ను క్షమించే రోజు రాకూడదు. వీణా! నేను ఓడిపోయాను. నీ కేమి కావాలన్నా లక్ష్మి గారిని అడిగి తీసుకో. అది నీ ఇల్లు అని మరిచిపోకు. ఇక ఉంటాను- రాజీవ్!"
    "ఎప్పుడు వెళ్లారు?" అంది.
    "రాత్రి వెళ్ళారు. మినిస్టరుగారింట్లో పార్టీకి వెళ్ళారు రాత్రికి. అక్కడినుంచే వెళ్ళిపోతారు. వస్తానమ్మా!" అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.
    గదికి తిరిగి వస్తూ ఉంటే పోస్టుమాన్ ఎదురై రిజిస్టర్ లెటర్ ఇచ్చాడు. సంతకం పెట్టి తీసుకొంది.
    అటు ఇటు తిప్పి చూచింది.
    పరిచయమైన ముత్యాల్లాంటి అక్షరాలు. సంజయ్ లేఖ.
    చదవకుండానే చింపివేద్దామనుకొంది. చింపబోతూ క్షణం ఆగి లేఖలోకి చూచింది.
    గుండె ఆగిపోతుందేమో ననిపించింది. గుండెల మీద చెయ్యి ఉంచుకొంటూ, 'భగవాన్! ఇప్పుడే నా గుండె ఆగిపోకూడదు' అనుకొంటూ శక్తిని తెచ్చుకొని పిచ్చిగా పరుగెత్తింది రోడ్డు మీదకు. టాక్సీని పిలిచింది.
    "ఎంతయినా ఇస్తాను. మద్రాసు ఎయిర్ పోర్టుకు చేర్చు" అని మర మాట మాట్లాడకుండా టాక్సీలో కూర్చున్నది. మైకం కమ్ముతున్నది. సీటు మీదకు ఒరిగిపోయింది. దారిలో తెలివి వచ్చింది. టాక్సీ ఇంకా పోతూనే ఉంది.
    "డ్రైవర్! పన్నెండు గంటలకల్లా చేరుకోవాలి. ప్లీజ్!" అంటూ తొందర పెట్టింది.
    'రాజీవ్ ను కలుసుకోవాలి. తనకు నిష్కృతి లేదు' అనుకొంటూ భయంగా ఆ లేఖను మరోసారి చదివింది.
    "ప్రియాతి ప్రియమైన 'వీని'!
    అలా సంబోధించటానికి నాకు హక్కుంది. ధైర్యం చేసి ఇన్నాళ్ళకి లెటరు వ్రాస్తున్నాను. నీవు నా దానివి! నా భార్యవు! ఆ రోజు సోఫియా తడిబట్టలతో డాక్టరు కోసం వచ్చింది. విధివశాత్తు పక్క గదిలోనే ఉన్నాను. సోఫియా ఉన్న చోట నీవూ ఉంటావను కొన్నాను. డాక్టరుకు, సోఫియాకి కనిపించకుండా దూరంగా వారిని అనుసరించాను. నీ గదిలోనుండి డాక్టరు, సోఫియా వెళ్ళిపోయారు. నేను గదిలో ప్రవేశించాను!....మన్మథుడు పూర్తిగా నన్నావహిం చాడు. సభ్యతా సంస్కారాలను మరిచాను. క్షణికో ద్రేకానికి లొంగిపోయాను. నీ వెవ్వరినీ ప్రేమించటం లేదని నాకు తెలుసు. కాని, నీవు 'రాజీవ్! రాజీవ్!' అంటూ ఉండగా నాకు బాహ్యస్మృతి కలిగింది. కాని, సమయం మించిపోయింది. ఏదో పిరికితనం ఆవరించింది స్త్రీని కన్నెత్తి చూడటానికి భయపడే నేను అలా చేయ గలుగుతానని అనుకోలేదు..." లేఖ పూర్తి చేయలేక పోయింది. ఒళ్లంతా నీరు కారిపోయింది... భగవాన్! నే నేమి చేశాను? రాజీవ్ ని ఎలా శిక్షించాను? తను చేయని తప్పుకి తల వంచాడు. ప్రాణ, మానాలను కాపాడిన దైవం!
    అతని పాదాల ముందు తల బద్దలు కొట్టుకొని చావవలసిందే తను.    
    కారు ఆగిన చోటల్లా, "డ్రైవర్, త్వరగా! త్వరగా!" అంటూ ఉంది వీణ.
    ట్రాఫిక్ రూల్సు అధిగమించి ఎయిరో డ్రోమ్ కి తెచ్చాడు టాక్సీని డ్రైవర్.
    ప్లేన్ పోవటానికి రెడీగా ఉంది.    
    పరుగున లౌంజ్ లోకి వచ్చింది. చివరిసారిగా అనౌన్స్ మెంటు చేశారు. ప్లేన్ కదిలింది. నేరుగా రన్ వే లోకి పరుగు పెట్టింది.
    పోలీసులు ఆమె వెంట పరుగు పెట్టారు అడ్డగిస్తూ.
    "రాజ్! రాజ్!" పిచ్చిగా అరుస్తూ పైకి లేస్తున్న ప్లేన్ వెంటపడింది. క్షణక్షణానికి దూరం అయి పోతున్నది ప్లేన్. రెండు చేతులు పైకి చాచి, "రాజ్!" అంటూ నేల మీదకు ఒరిగిపోయింది.
    తల నేలకు ఆనించి అక్కడే పెద్దగా ఏడుస్తూ ఉంది.
    జనం ఆమెను చుట్టి వేశారు. జనాన్ని తోసుకొంటూ ఓ వ్యక్తి వచ్చి "వీణా!" అంటూ భుజాలు గుచ్చి పట్టి పైకి ఎత్తాడు.
    "మీరా!!" ఆ కళ్ళలో ఆశ్చర్యం. తామరకాడలా ఒరిగిపోయింది.    
    సునాయాసంగా ఎత్తుకొని గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు రాజీవ్.
    వీణ పిలుస్తున్నట్లే భ్రమించి చుట్టూ చూసే వాడు రాజీవ్! ఏదో శక్తి తనను వెనక్కు లాగుతున్నదని అనుకొన్నాడు. అతని అణువణువు వీణా! వీణా! అని పలుకుతూనే ఉంది.
    చివరి క్షణంలో ప్లేన్ లో ఎక్కక వెయిటింగ్ రూములోనే ఉండిపోయాడు.
    వీణను హోటల్ గదిలో పడుకోబెట్టాడు. డాక్టర్ వచ్చి పరీక్షించాడు. పల్స్ వీక్ గా ఉంది. ఇంజక్షన్స్ వేశాడు. డ్రైవర్ ఇచ్చిన పుస్తకాలలో సంజయ్ లెటర్ చూశాడు రాజీవ్.
    వీణ కనుకొలకుల్లోనుంచి కన్నీరు కారుతూనే ఉంది.
    కళ్ళు విప్పింది.
    ఎదురుగా సోఫియా, సహదేవ్ ఉన్నారు.
    "సోఫీ!" అంది వీణ.
    చెరిగిన ముంగురులను సరిచేసింది సోఫీ.
    "అన్నయ్యా! ఎలా వచ్చావు ఇక్కడికి?"
    "టెలిగ్రామ్ ఇచ్చారు బావగారు. హడలిపోయి పరుగుపెట్టాం..." అంటూ సోఫియా వైపు చూశాడు సహదేవ్.
    "నాన్నమ్మకు తోడుగా కొన్ని రోజులు ఉందామని వెళ్ళాను, వీణా! నీకు తెలియనివ్వలేదు ఇంటికి రానివ్వద్దు అని మీ అన్నయ్యకి వ్రాస్తావేమోనని" అంది సోఫియా.
    "చెల్లెమ్మా! అలా బయటి ప్రపంచాన్ని చూసి వస్తాను" అంటూ లేచి వెళ్ళాడు.
    "పాపం! మూడు రోజులుగా గది బయటికి పోలేదు-"
    "మూడు రోజులా!!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS