Previous Page Next Page 
పగటికలలు పేజి 2


    ఆ శుభ ముహూర్తాన్నే గిరి తన బెడ్డింగు, పెట్టి - యిలా నాలుగైదు సామాన్లూ తెచ్చి యింట్లో పడేశాడు.
    ఎంత పెద్ద బండితోనో, లారీతోనో సామాను వస్తుందని ఎదురుచూస్తున్న మీసాలాయన రిక్షాలో వచ్చిన గిరి ఒక్కడ్ని చూసి, ఆ ఇంత సామాన్నూ చూసి వింతగా చూస్తూ వుండి పోయాడు...
    అతని చూపు అర్ధమయింది గిరికి, అందుకనే సామాను పడేశాక అతని దగ్గరికి వెళ్ళి-
    "ఇల్లు దొరక్క మా ఆవిడని తీసుకురాలే నండీ. ఈవాళే వుత్తరం రాస్తాను రమ్మనమని!" అని సర్దుకున్నాడు. ఈ సమాధానం విన్న తర్వాత మీసాలు కొంచం సాగాయి- అంటే చిరునవ్వు అన్నమాట!
    "సరే నాయనా" అని అన్నాడు.
    అప్పటికి తప్పించుకున్నాను కదా అని నిబ్బరపడ్డాడు గిరి. వారంరోజులు గడిచాయి...గిరి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి... కాని ఒక్క రైల్లోను తన భార్య రాందే?
    ఒకనాడు మీసాలు "వుత్తరం వచ్చిందా? వస్తున్నట్టు?" అని అడిగేయి లౌక్యంగా......వాటిలో అంతరార్ధం గిరికి తెలుసుకొని" యింకా లేదండి, నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఎంచేత చెప్మా అని!" నిజంగా విచారిస్తున్నట్టు ముఖం తేలవేసి చెప్పేడు.
    "ఊఁ హూఁ!" అని తటపటాయించేయి మీసాలు.
    "ఇదేదో విషమించేట్టుందిరా భగవాన్!" అనుకున్నాడు గిరి-
    అప్పటికి ఆబోరు దక్కి ఆయన వెళ్ళిపోయాడు మరేం ప్రశ్నించకుండా, ఈ వారం రోజుల్లోనూ...ఆ పిల్లతో పరిచయం చేసుకో లేనా అని అనుకున్నాడు గిరి....పరచయం మాట అటుంచి, ఆమె దర్శనమన్నా అవలేదు! అయినా నిరుత్సాహపడలేదు, ట్రై అండ్ ట్రై ఎగైన్ అనుకున్నాడు .... మొదట నమ్మకం కలిగించుకుంటేగాని లాభంలేదు అనుకున్నాడు!
    పరిస్థితులు చూస్తే అడ్డం తిరిగేట్టున్నాయి. మొదట అలా కండీషను పెట్టినా తర్వాత ఏమీ అవడనుకున్నాడుగాని యింకా వారం రోజులు కాందే రెండుసార్లు అడగడం చూస్తే అతని దృష్టి అంతా తన కుటుంబంమీదే ఉన్నట్టు ఆయన కనిపెట్టి వూరుకుంటున్నట్టు గ్రహించాడు...
    అతనికి నమ్మకం కలిగించాలి అంటే నాతి లేని సంసారి కావాలి, అది ఎలాగా అని బాధపడుతున్నాడు గిరి-
    ఒకనాడు "మణి" అంటే గిరికి స్నేహితుడు సుమండీ, "రాలు" కాదు- యిద్దరూ రెండో ఆట సినిమా చూసుకుని పండుక్కుందికి గిరి యింటికి వచ్చేడు, వచ్చాక తిన్నగా పడుక్కోక ఏవేవో కబుర్లు తెల్లవార్లూ చెప్పుకున్నారు. ఉదయాన్నే లేచి తన మానాన తను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గిరి ఎందుకో యివతలకు వచ్చేసరికి ఆ మీసాలాయన....హు! ఎందుకులెండి అలా పిలవడం, ఆయన పేరు "దాసు" గారు. ఆయన మందహాసంతో ఎదురొచ్చి-
    "రాత్రి బండిలో వచ్చిందా ఏమిటోయ్ అమ్మాయ్" అని అడిగాడు- ఏమి చెప్పడానికి తోచక నిర్ఘాంతపోయాడు గిరి!- ఏదో చెప్పబోయి-
    "రా.....త్రా.....రాత్రండి..." అంటూంటే
    "చాలా రాత్రివరకూ మాటలు వినపడుతూంటే అనుకున్నాం. ఈ రాత్రి బండిలో వచ్చి వుంటారని" అని మళ్ళీ అన్నాడు!
    ఆయన వెటకారానికి అని తనను వుడికిస్తున్నాడో ఏమో అనుకున్నాడు. ఇన్నాళ్ళయినా యింకా తీసుకురాలేదని- కాని ఆయన అనే తీరుచూస్తే నిజంగా నమ్మకంతోనే అడుగుతున్నట్టుంది- పోనీ ఎలాగో ఒకలాగా భార్యని తీసుకొచ్చేను అని అనిపించుకోవడమేకదా కావాలి! అతని కా నమ్మకం కుదిరితే చాలు!
    నలుగురి కంటా పడకుండా ఎలాగూ వచ్చిందని చెప్పలేడు- అందరి ఎదుటా యింట్లోకి ఏ ఆడదాన్ని భార్య అని తీసుకువచ్చి నమ్మించ గలడు. ఏదో ఒక ఉపాయం చేసి యింట్లో భార్య వున్నట్టు నటిద్దామనుకున్న గిరికి. ఈ అవకాశం బాగా వచ్చింది.    
    అతనంతట అతనే తీసుకువచ్చారా అని అడగడం యింకా శ్రమ తీర్చినట్టయింది! అర్ధరాత్రి కాబట్టి ఎవరు చూడానికీ అవకాశం కలగలేదు... ఈ విషయం కూడా బాగానే వుంది! అంచేత తడుపుకోకండా
    "అవునండి" రాత్రిబండికి వచ్చేసింది." అని మరే మంటానికి భయంవేసి వూరుకున్నాడు. అతను సమాధానపడి వెళ్ళిపోయాడు ఆ ప్రక్కనుండే ఆ పిల్ల కూడా వింది! అన్నట్టు ఈ వారం పదిరోజులు నానా అవస్థాపడి ఆఖరికి ఆమె పేరు మాత్రం "గిరిజ" అని తెలుసుకో గలిగేడు.
    ఇంతకీ తర్వాత ఆలోచిస్తే గిరికి. ఆ దాసు గారు ఎందుకలా నమ్మేరో కొంచెంబోధపడింది. ఎందుకంటే ఆ రాత్రి మ రావడం గిరి పాలిటికి మహోపకారం అయింది!
    పేరుకు తగ్గట్టు వాడు ఆడదానిలాగే వుంటాడు. రూపురేఖలయితేనేం, గొంతు కయితేనేం ముమ్మూర్తులా ఆడదానిలాగే వుంటాడు కొంచెం ఏమరుపాటుగా వాడితో మాట్లాడుతూవుంటే ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్టే వుంటుంది. అసలు ఆడవాళ్ళకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఫోనులో అతను మాటాడుతూవుంటే అవతల వాళ్ళు డంగయిపోడం, ఆడపిల్లతో మాటాడుతున్నామనుకొని మురిసిపోవడం.... సరసాలు, సల్లాపాలు జరిగి పోతూండడం.... పరిపాటి అయిపోయింది. ఎందుకంటే వాడి వుద్యోగం కూడా టెలిఫోన్ ఎక్చేంజిలో ఆపరేటరే! మరి! అందుకీ లేడీ టెలిఫోను ఆపరేటరు మాటాడు తూంది అని అందరూ భ్రమపడుతూంటారు మరి బోర్డుమీద వుంటే,
    వీడు యింటికి వచ్చి మాటాడుతూ పడుక్కోవడం, వీడి ఆడగొంతుక విని వాళ్ళు గిరి భార్యా వచ్చిందని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు?
    ఎలాగో భార్య వచ్చింది అనుకున్నాడు కాబట్టి ఒక సమస్య తీరిపోయింది. అయితే యింక ఇంట్లో ఆమె వున్నట్టు నటించాలి! అనుకున్నాడు గిరి. సమయంవస్తే ఆ మణినే బ్రతిమాలుకుని నాలుగు మాటాడించి పొమ్మంటూండవచ్చు అని నిబ్బరపడ్డాడు- అన్నట్టు మణి చాలా నాటకాల్లో ఆడవేషాలు వేసేడుకూడాను. కాస్త దూరం నించి చూస్తే అచ్చ అమ్మాయిలాగే వుంటాడు....కాబట్టి అపస్సమయంలో మణిని ఉపయోగించుకొనవచ్చు అని ధైర్యం వహించాడు గిరి.
    ఆరోజుకోడా రోజులాగే కారియరు హోటల్ నుండి వచ్చేసింది. గిరి భోంచేసి యివతలకు వస్తూంటే దాసుగారు ఎదురయి-
    "ఏం నాయనా! అమ్మాయి వచ్చినా కారియరు రావడం మానలేదు! ఇలాగయితే వచ్చే డబ్బు హోటలుకే సరిపోతుందా? మీ..." అని బాంబు లాగ అడిగాడు!
    అవును అడగడూ మరి! గిరిగాడికి ఆ ఆలోచనే తట్టలేదు! భార్య యింట్లో వుందని కారియరు హోటలు నుండి ఎవడయినా తెప్పించుకుంటాడా? అప్పుడు గిరి నాలిక్కర్చుకుని -
    "ఆ.....బ్బే.....లేదండీ. యివాళే కదా వచ్చింది ఇంకా కొత్త. సామాను సర్దుకోవడం .... అదీ.... అదీకాక .... వంటసామాగ్రి అదీ.... కొనలేదు.... లెండి! అందుకని యిద్దరికీ తెప్పించేశాను.... అంతేగాని - హోటలు భోజనం ఏమండీ!.....ఖర్మ.... తిని తిని.....యిప్పటికే....విసిగెత్తిపోతున్నాను!.... ఇదిగో యివాళ వెళ్ళి పాత్రలూ, దినుసులూ.... తెచ్చి పారేయనూ?...అని అన్నాడు సవినయంగా.
    అయిందా దాసుగారూ ఆమాటలు నమ్మే సేడు నమ్మకేం చేస్తాడు? గిరి పొరపాట్లు చేస్తున్నా వాటికి అతికినట్టు సరిగ్గా అబద్ధాలు చెబుతూంటేను!
    "ఓయ్! వెర్రినాయనా! అందికే అన్నారు "ఇల్లు చూచుకుని- పెళ్ళి చేసుకో" అని....ఈ కాలంవాళ్ళకి తొందరేగాని ముందాలోచన వుండదు - మొదట అవన్నీ చూచుకోక పీకల మీదికి వచ్చేవరకూ ఏం జేస్తున్నావు? బోడి పెద్దమ్మా! వెళ్ళి వెంటనే కొనుక్కురా పో!" అని సలహా చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు:
    ఆయన ధోరణికి విస్తుపోయినా "అమ్మ నాయనా!" అనుకున్నాడు.
    ఇహసరి గిరి సరాసరి. హోటలుకు వెళ్ళి నయాపైసలతో సహా ఆ రోజుకయిన మొత్తం తీర్చి పద్దు రద్దుచేయించుకున్నాడు- లోలోపల ఏడ్చుకుంటూ విధిలేక బజారు కెళ్ళి జ్ఞాపకం చేసుకుంటూ వంటకికావలసిన గిన్నే, ముంతా, పొయ్యి పెనమూ పప్పూ వుప్పూ, కర్రా కిరసనాయలు ఆవాలూ మెంతులూ, అన్ని ఒక కుటుంబ స్నేహితుడు వ్రాసి యిచ్చిన లిస్టు ప్రకారం కొని యింట్లో పడేసేడు. తప్పుతుందామరి? మళ్ళీ కారియర్ గాని వస్తే బ్రతకనిస్తారా? అసలు గుట్లు బయలుపడిపోయి ఆదిలోనే హంసపాదు పడి పోతుంది.
    అసలింతకీ గిరి ఏ వుద్దేశంతో ప్రవేశించాడో అది జరగకపోగా అనవసరమయినవేవో జరుగుతున్నాయి. అక్కర్లేని బెడదలన్ని పట్టుగుంటున్నాయి లేకపోతే ఆ పిల్ల గిరిజతో అసలు కళ్ళు కలిపి చూడంకూడా యిప్పటి వరకూ జరగలేదు. లేకపోగా ఈ వంటా పెంటా? ఏమి కర్మరా? భగవంతుడా! అనుకున్నాడు గిరి.
    కాని అనుభవించక తప్పదు! ఒక అబద్ధం ఆడాక దానిని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాలి. అవుసరంవస్తే చేయరాని పనులు చేయవలసివస్తుంది. ఏ పని అయినా నిధనం మీద తాపీగా పునాది దిట్టం మీద జరిగి తేనే శాశ్వతంగా నిలుస్తుంది. అంతేగాని ఇంగ్లీష్ మందులూ తశ్శాంతి కాదు అని అనుకున్నాడు.
    అప్పటినుండి గిరి పాట్లు గిరి పడుతున్నాడు. ఏనాడు వంట వండిన పాపాన్ని పోయాడు గనుక కనీసం కాఫీ అయినా కాచడం రాని అనాగరికుడు. యింక వంట ఎలా సాధ్యమవుతుంది. ఏ పత్రికా దగ్గర పెట్టుకొని ప్రారంభించేవాడు. ఎవరియినా స్నేహితులని అడిగిమొదలెట్టేవాడు....అసలు ఆ పంపడం తను తినటానికి కాదు. ముఖ్యంగా పక్కింట్లో దాసుగారిని నమ్మించ డానికి! ఏదో నోట్లో పెట్టుకో గలిగిననాడు యింత తింటాడు- లేదా అలా అదంతా గా భూతదానం చేసి, ఎవరికి తెలియకుండా ఏ హోటలు కోపోయి భోజనం చేయడం మామ్మూలయింది.        
    వండినా, వండకపోయినా - గట్టిగా గిన్నెలూ గరిటెలూ చప్పుడు చేస్తూందడమం పోపు వాసన ఘాటుగా పక్కింటి వాళ్ళకి ముక్కుపుటాల్లోకి వెళ్లేట్టు ఒక మిరపకాయ యింత నూని- నిప్పులో పడేయడం, వుత్తి గుత్తినీ రుబ్బురోలుని తిరగలీ, అరగతీస్తూండడం - వుత్తి గాజులు ఒక డజను సంపాదించి పనులు చేస్తూంటే చప్పుడయినట్టు ఆడిస్తూండడం. చేస్తున్నాడు పాపం. గిరి, అంతటితో వూరుకోకుండా ఓ రెండు చీరలూ, జాకెట్లూ- సంపాదించి తడుపుతూ రోజూ డాబామీద తను కనబడకుండా ఆ బట్టలుమాత్రం నలుగురి కంటికీ కనబడేట్టు ఆరవేస్తున్నాడు కూడా! యిలా ఒక ఆడది యింట్లో వుంది అని నలుగురూ అనుకుందికి. ఎన్ని పాట్లు పడాలో అన్ని పడుతున్నాడు! ఎంత అవస్థపడాలో అంతా పడుతున్నాడు.
    ఇతను పడ్డ ప్రయాశ వృధాపోలేదు. అందరూ నిజంగా గిరికి భార్య వుందనే నమ్మేరు. కాని ఒక చిక్కువచ్చి పడేట్టుంది. అర్ధరాత్రి వచ్చింది కాబట్టి ఎవరికీ కనబడలేదు అని సముదాయించుకున్నా ఆ తర్వాతయినా కనబడవద్దా? అలా యింట్లోనే వుండిపోయిందీ అంటే ఎవరయినా నమ్ముతారా? కొత్తకదా అని నాలుగయిదు రోజు లూరుకుంటారు- ఆ తర్వాత?
    ఈ సమస్యను ఎలా ఎదుర్కొనడమా అని గిరి ఆలోచించకపోలేదు. తానొకందుకు వస్తే దైవ మొకటి చేస్తున్నాడని అదై వానిదే భారమని అనుకుని దినదినగండంగా గడుపుతున్నాడు. అలాగే నాలుగు రోజులు ఏ గొడవా లేకుండా జరిగింది.
    దాసుగారు రోజూ తారసపడుతున్నా అదోలా చూడ్డమే తప్పించి ఏఁవీ అడగలేదు. గిరి గుండెలు చేత్తో పట్టుకుని- అతను దాటిపోయాక గండం గడిచిందని సంతోషిస్తున్నాడు? ఆ రోజో- ఆ మర్నాడో అతడు తప్పకంతా అడిగేస్తాడని తెలుసు-
    "ఏఁవోయ్! అబ్బాయీ! అమ్మాయికి అంత సిగ్గేమిటి? ఇవతలక్కూడా రాదేం? అట్లా అయితే ఎలా? ఎవరూ దిష్టిపెట్టరులే?" అని అడిగితే ఏం జవాబు చెప్పడం?
    ఆ సాయంత్రం గిరి యింటికి వచ్చి- గుమ్మం ఎక్కబోతున్నాడు. ఎదురుగుండా వాలుకుర్చీలో వసారాలో కూర్చుని వున్న దాసుగారు మీసాలు కీటుతూ- "అబ్బాయ్?" అని గంభీరంగా పిలిచారు?
    ప్రక్క తలుపు సందులోంచి నీడలు కదులు తున్నాయి. గిరిజ అయి వుంటుంది బహుశా!
    గిరి ఆ పిలుపుకి హడలిపోయినాడు. అలా పిలుస్తున్నాడంటే ఏదో కొంప మునిగిందన్న మాటే! ఇంక ఆ మాటే అడిగేస్తాడు కామోను: గుండె పీచుపీచు మంటూంటే-బిక్కుబిక్కు మనుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకు మెల్లిగా వెళ్ళి మెట్లదగ్గర నిలబడ్డాడు.

                               *    *    * 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS