Next Page 
పగటికలలు పేజి 1


                              పగటికలలు
                                                              ----ద్వివేదుల సోమనాధశాస్త్రి

                                    

    గిరి ఆ  వూరు వెళ్ళిన కొత్తలో లాడ్జికి గది దొరకక చాలా బాధపడ్డాడు. ఒకే ఒక్క గదిలో వుండటం అలవాటు లేదుకాని. ఒక్క గదే దొరకటం దుర్లభం అయే ఈ రోజులో ఒక యిల్లు దొరకటం గగనకుమయం కదా? ఎక్కడెక్కడో ఏమూలో వుండేవి అనుకోండి - కాని అలాటి ఒంటెత్తు కొంపల్లో వుండగలడా? నిజానికి కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఆ వూళ్ళో యిళ్ళు దొరక్క బాధపడనవసరం లేదు. కాని గిరికి యిల్లు దొరక లేదంటే - కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ యిల్లు దొరికితే అక్కడ వుండడం గొప్పకాదంటాడు?
    అంటే అతనికి కావలసిన యిల్లు అలాటిదన్న మాట. అన్వేషణలు ఎన్నో రకాలు, ఉద్యోగ అన్వేషణ, పరాన్వేషణ చోరావ్యేషణ - యిలాటి వాటితోపాటు గృహాన్వేషణ కూడా ఒకటి - ఇంటి పరిసరాలు మంచినయి వుండాలి: చూడ్డానికి ఓ మోడల్ హౌస్ లా వుండాలి. ఇరుగూ పొరుగూ బాధ వుండకూడదు. ఆ యిల్లు వున్న వీరిలో-పోష్టాఫీసూ, బజారు, కనీసం ఒకసినిమా హాలూ అయినా వుండాలి. ఇంటికి పది గజాల దూరంలోనయినా ఒక కిళ్ళీకొట్టు. కొంచెం దగ్గర్లో కాఫీక్లబ్బూ విధిగా వుండాలి! అప్ స్టెయిర్ కూడా వుండాలి. ఇంట్లో కరంటూ. పైపూ వుండాలి. ఇంటి గలవాళ్ళు అతని మీద విమర్శలు జరప కూడదు.
    ఇంకా యింకా బోలెడు కోరికలు వున్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైంది. ఒకటుంది- ఇంటి గలవాళ్ళింట్లోనో. పొరుగునో ఎదురుగుండానో. ఒక అమ్మాయి వుండాలి!.....అది! ఎందుకంటే - ఆతృతతో నిరీక్షించడం. ఆలోచనల్లో ఆనందించడం .... ఇంట్లో వున్నంతసేపూ ఉల్లాసంగా, ఉత్సాహంగా వుండడానికి యిలాటి - అనుభవం ఎంతమంచి కాలక్షేపం ! అని అతడి ఊహా.
    అయితే ఆడపిల్లలు కాలక్షేపం కోసమా? అంటాడేమో కాదు కాదు! అతనికి యిష్టమయిన పిల్లయితే పెళ్ళిచేసుకోడం కోసమే! యింకా కొత్తగా కాలేజీ విడిచిన వాడేమో ఎన్ని సుదుర్గుణాలుండాలో అన్నీ వున్నాయి.
    అందుకే ఎక్కడికి వెళ్ళినా కొంప దొరక్క పోడం! అతన్ని అడిగితే మీదకోర్కెలన్నీ చెబుతాడుగాని ఆఖరిది మాత్రం చెప్పడు! కాని ముఖ్య మయింది అదే!
    ఆ వూళ్ళో "నా అన్న" వారెవరూ గిరికి లేరనే చెప్పాలి: ఖచ్చితంగా ఎందుకు "లేరు" అని ఆనలేదంటే. ఆ వూళ్ళోనే అతని కొక మేనమామ వున్నాడని. వాళ్ళవాళ్ళు అంటూండేవారు! ఈ రోజుల్లో బంధుత్వం. ప్రేమ, అభిమానం, దగ్గిర వాళ్ళలో ఎలా వుంటుందో అలాగే గిరికీ. వాళ్ళకీ వుంది. అందుకనే పై వాళ్ళతో ప్రేమలూ. స్నేహాలూలాపయి, రామ రామ బంధుత్వం క్రింద మారి పోతూంది.
    అప్పటికి గిరికి నాలుగేళ్ళుంటాయేమో. వాళ్ళ వాళ్ళకూ మేనమామ గారికి ఒక పెద్ద కురుక్షేత్రం జరిగి సంబంధాలు తెంచేసుకున్నారు. అప్పటి నుంచి యిప్పటి వరకూ చూపులు కూడా లేవు- వాళ్ళింట్లో జనాభా వీళ్ళకుగాని వీళ్ళింట్లో జనాభా లెక్కలు వాళ్ళకికాని తెలీదు. కనీసం ఆడపిల్ల పుట్టినపుడయినా, ఆ మేనమామ ఉత్తరం వ్రాసేవాడు కాదు! మేనల్లుడు గిరి ఉన్నాడు కదా ఉత్తరోత్రా ఎందుకయినా మంచిదని కూడా ఆలోచించలేదు.
    ఇదంతా గిరి ఆలోచన. ఎందుకంటే కనీసం తన కోసమయినా మేనమామకి ఒక్క ఆడపిల్ల పుట్టదా అని! కానయితే యిప్పుడా మేనమామ అకస్మాత్తుగా కనిపించినా ఎవరికెవరో పోల్చుకోలేరు? అంచేత మేనకోడలు వుండగా - ఎలాగో అలా కనుక్కుని ఆశ్రయిద్దామన్నా-సంబంధాలు యిలా ఏడుస్తున్నాయి. కాబట్టి గుమ్మం ఎక్కనివ్వడు!'    
    గిరి వూహాపధంలో, మనస్సులో మాత్రం- మేనమామకి ఓ కత్తిలాంటి అమ్మాయి వుంటుందని. తనకోసమే కలలు కంటూ వుండలా అని! దను కుంటుంటాడు!
    పొరపాటునో, అలవాటునో, మాటల్లో వూసులువచ్చి, నీకో మేనత్తకొడుకు వున్నాడు అని చెప్పకపోరా "....ఆ మాట మాత్రం విని... ఆ పిల్ల ఆకాశవీధుల్లో- తన గురించి ఆలోచిస్తూ తేలిపోదా? "ఎలా వుంటాడో .... పెళ్ళాడితే ఎంత బాగుండును? ఇంచక్కా..." అని అనుకుంటూ చూడాలని అనిపించే తీయని కోర్కెలతో వేగిపోతూ వుండదా? .... అని అనుకుని సంతోష పడుతూంటాడు!
    ఆమె మాట మాత్రం అంటుంచి గిరికి మాత్రం ఆ మేనమామ కూతురు వున్నదో లేదో గాని, రూపకల్పన చేసుకుని ఆనందించేవాడు. చామన ఛాయగా, సన్నగా, కొంచెం పొడుగ్గా....సన్నటి నడుం ప్రక్కనించి చిక్కని సిల్కు చీర అంచుతో ....పొట్టి చేతుల బ్లౌజుతో రెండు జడలతో ....కెరటాల్లోంచి కనిపించే సముద్రపు నీలి రంగు అందంలా .... ఆమె కుచ్చెళ్ళలోంచి దొంగ తనంగా కనిపించే శరీర సౌష్టవం-ఈ విధంగా ఒక పలాకు లాంటి నవనాగరీకురాలు - ప్రత్యక్షం అయేద... అతని కళ్ళకు. అయితే అందులో చిన్న సవరణ -ఎత్తుజోళ్ళూ, లిప్ స్టిక్, యిలాటి వికారపు చేష్టలు (తన ఊహలో) మాత్రం వూహించడు! అంటే సంసార పక్షంలో - నాజూకు పొదిగిన ఒక అందమయిన అమ్మాయి అన్నమాట-యిదంతా అతని ఊహా సుందరి. అందుకే రామ రామ ఏ అమ్మాయిని చూసినా మేనమామకూతురు గానే భావించి తృప్తిపడబోతున్నాడు.

                           *    *    *

    ఒక అందమయిన డాబా యిల్లు కనిపించింది. అంతకన్నా ఆనందమేమిటంటే ఆ గుమ్మంలో గిరిగారి ఊహాసుందరిని మించినలాంటి ఒక అమ్మాయి కిలకిలా నవ్వుతూ కనిపించింది.
    మరోసారి చూద్దామనా అదృష్టం లేక పోయింది. ఏదీ ఇలా కనిపించి మాయమయింది. ఇహను చూడండి-గిరి గాడు గిరగిర తిరిగి అక్కడే పడిపోతాడా అనిపించింది! ఇంతలో ఒక స్నేహితుడు ఆపద్బాంధవుడిలా వచ్చి పడిపోకుండా పట్టుకుని. ఆ వీధంట ఆ సమయానికే సోడా అమ్ముకుంటున్న కుర్రవాన్ని ఆపి షోడా కొట్టించి. యింత గిరి మొహాన్న కొట్టి ఇంతనోట్లో పోసి. ఇంకా కొంచెం మిగిలితే తను నోట్లో పోసుకున్నాడు.    
    గిరితేరుకుని స్నేహితుణ్ణి చూచి బావురుమని ఏడ్వబోయి - ఎందుకో వూరుకుని ఏడవలేక నవ్వేశాడు.....అప్పటి నుంచి ఆమె రూపే అతని కంటి ముందు అనన్యే అతడి చెవుల విందు! .... అంచేత ఆ నవ్వు వెర్రివాడి నవ్వు లాగా - ఆ చూపులు వెర్రి చూపుల్లాగా, ఆ మాటలు మరపు మాటల్లాగా అనిపించేయి ఆ ఆపద్భాంధవరావుకి.
    గబగబా గిరి వుంటున్న టెంపరరీ పుటప్ కి వచ్చి - రెండు టీలు త్రాగి విషయం కదిల్చాడు! గిరి పాపం దాచకుండా వున్నదున్నట్టు చెప్పేసి ఇక నీదే భారం అన్నట్టు బిక్కమొహం వేశాడు!
    "అయితే ఏమంటావు యింతకీ?" అని అడిగేడు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది? అన్నట్టు ఆపద్భాంధవరావు.
    "ఎలాగయినా ఆ యింట్లో అద్దెకు దిగాలి!" అన్నాడు గిరి.
    "ఓస్.....నీ....ఇంతా చేస్తే ఇందుకా....ఆ పిల్లకోసం కాదూ నీ మొహం తిరిగింది?" అని నిస్సారమయిపోయి నిట్టూర్చేశాడు. ఒకవేళ తను ఈ విషయంలో హెల్ప్ చేసినా రొమేంటిక్ గా వుండదని కాబోలు.
    "అబ్బ అందుకేగదరా! మొదట కోటలో పాగా వేయడం!" అన్నాడు గిరి. అది విని కొంచం వుత్సాహం వచ్చింది ఆపద్భాంధవరావుకి.
    "అలా చెప్పు!..... అయితే ఏదీ యిలాతే... అన్నాడు చెయ్యి చాపుతూ.
    "ఏమిటీ?" అన్నాడు ఏడుస్తూ గిరి.
    "కొత్త సినిమా వచ్చిందిరా యివాళ'
    "అయితే నన్నూ తీసుకెళ్ళరా?"
    "నీ డబ్బుతోనా? అట్లా అయితే పద మరి!"
    ఇద్దరూ సినీమాకు పోయారు...
    ఆ మర్నాడు....చల్లని వానజల్లులాటి వార్త తెచ్చినా, ఆ వెనకే పిడుగులాటి వార్త కూడా మోసుకొచ్చాడు ఆపద్భాంధవరావు.    
    ఆ యింట్లో ఒక వాటా.....కాదు....ఆ యింటి ప్రక్కనే మరో చక్కని ఇల్లు..... అంటే వాళ్ళదే..... కాళీగా వుందిట!.... కాని.....కా .....పెళ్ళి అయిన విధవలకేగాని పెళ్ళి కాని వెధవలకి యివ్వరట ??
    ఈ ముక్క వింటూనే....గిరిగాడు గిరగి తిరిగి మరొకమారు కాంప్ కాట్ మీద సరిగ్గా చూసుకుని పడ్డాడు. ఈసారి ఆపద్భాంధవరావు షోడావాడు కనబడకపోగా అక్కడెక్కడా నీటి చుక్క లేకపోగా - ఒక లెంపకాయ సాగదీ కొట్టేసరికి గిరి "బాబోయ్" అంటూ లేచి కూర్చున్నాడు!
    "ఈమాత్రం దానికి ఎందుకలా ఛస్తావ్! అన్నాడు.
    "నువ్వు చావనిస్తే కదా?" అన్నాడు గిరి.
    "చచ్చి ఏం సాధిస్తావ్?"
    "కామినీ భూతాన్నయి దాన్ని పట్టుకొని...."
    "నీ మొహం చేస్తావు...వెధవ్వేషాలు మాని లక్షణంగా...ఆ యింట్లో అద్దెకు దిగిపో!"
    "మరి....పె....పె...."
    పెళ్ళీ, పెడాకులూ, యింకా అన్నీ అయ్యాయనే చెప్పవోయ్!"
    "ఎలా...."
    "తర్వాత నే చెప్తాగదూ...ఊఁ త్వరగా గో ఆన్.....డ్రెసప్ చేసుకొని వెళ్ళు..."
    "నువ్వూ...."
    "ఆ యింటివరకూ వస్తాను....అంతే...ఏం చేయాలో చెబుతాను పది..." అన్నాడు.
    ఒక అరగంట తయారయాడు గిరి....ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు వేసుకున్నట్టు సూటు టై. బూట్సు?...యిలా వచ్చి నుంచున్నాడు ఆపద్భాంధవుడి ముందు
    "కటి" అన్నాడు డైరెక్టరులా....."ఒరే పూలూ, నీకు మతి యిల్లేరా, ఇలా వెడితే ఆ ముసిలాడు యిల్లిస్తాడా! "నువ్వు పెళ్ళిచూపుల కొచ్చావా? ఇల్లు చూపుల కొచ్చావా?" అని అడుగుతాడు- పద నే మేకప్ చేస్తాను! అని... పెద్దమనిషి తరహాగా ఒక పంచె కల్లీలాల్చీ.... కట్టబెట్టి బయలుదేరించాడు.
    గేటు దగ్గరకి వచ్చేసరికి శోభనం గదిలోకి వెళ్ళే కొత్త పెళ్ళికూతురిలా గిరి గిజగిజలాడే సరికి తలుపు తీసి ఒక్క తోపు తోసి మారు మాటన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ఆపద్భాంధవరావు.
    బితుకు బితుగ్గా దిక్కులు చూస్తున్నట్టే ఇల్లంతా కలియజూస్తూ తలుపు తట్టాడు గిరి తట్టేసరికి - ఆ పిల్లే మెరుపులా వచ్చి తలుపు తీస్తూ "ఏమండీ? అని అడిగింది.
    ఆమెని చూడగానే అదోలా అయిపోయి నోట మాట వెంటనే రాక తేరుకునే లోపునే ఆమె మరోసారి క్రిందనుంచి మీదకి విచిత్రంగా చూసి- "ఎవరికోసం?" అని మళ్ళీ అడిగింది.
    "మీకోసం....కాదు.... కాదు ... మీ నాన్న గారికోసం....వున్నారా?" అని తబ్బిబ్బవుతూ అన్నాడు.
    అది విని ఆమె హంగుగా చిన్న చిరునవ్వు పారేసి- "ఇలా కూర్చోండి వస్తారు! అని కుర్చీ చూపెట్టి లోపలికి వెళ్ళిపోయింది.
    చమట తుడుచుకుంటూ కూర్చున్నాడు గిరి. మరో నిమిషంలో - తువ్వాలు మీద వేసుకుని ఒక ఆసామీ వచ్చాడు. ఆమె తండ్రి కాబోలు.    
    చిన్న బట్టతల. పెద్ద మీసాలు. తగుమాత్రం బొజ్జ. వెడల్పాటి ప్రేముగల కళ్ళద్దాలు. కల్లీ లాలీ. గ్లాస్కో పంచ వేసుకొని వున్నాడు. కాస్త ఒడ్డూ పొడుగూ తగ్గ లావూ మంచి గంభీరంగా వున్నాడు మనిషి అప్పుడే టిఫిన్ చేశాడులా వుంది మూతి తుడుచుకుంటూ కూచున్నాడు.
    గిరి విష్ చేయగానే అతని మీసాలు సాగేయి అంటే నవ్వేడన్న మాట! "ఏమిలా వచ్చేరు? అని అడిగేడు.
    తనని చూపులతో శల్యపరీక్ష చేస్తూనే అడిగిన ప్రశ్నకి-
    "మరేం లేదండి, మీ ఇంట్లో వాటా అద్దెవుందని తెలిసి యిలా వచ్చేనండి,"
    "వాటాకాదు. వేరే యిల్లేలేండి? అదుగో ఆ ప్రక్కది కాని....దానికి ఒక కండీషనుంది అది ముందే చెప్పేస్తాను,"
    "ఏమి టది చెప్పండి?"
    "ఫామిలీ వున్నవాళ్ళకేగాని బాచ్ లార్స్ కి యివ్వలేనండి?" అని ఖచ్చితంగా చెప్పేశారు.
    గిరి అంతా ఆలోచించుకొనే వచ్చాడుగాబట్టి-
    "ముందే విన్నానండీ! నా భార్యా నేనూ వున్నాల... ఇంక మీ కభ్యంతరం వుండదనుకుంటా!" అని తడుపుకోకుండా వచ్చికోత కోసేశాడు.
    "అట్లా అయితే నాకేం అభ్యంతరం లేదు...అద్దె ముఫ్ఫయి రూపాయలు మొదట ఎడ్వాన్స్ గా యివ్వాలి! అలాగయితే పదండి ఇల్లు చూద్దురు గాని.... అని లేచాడు.
    అతని నిర్మొహమాటం చూసి గిరి ఆశ్చర్యపోయాడు. కాని - అతని కూతురు ముందు వెధవ ముఫ్ఫయి రూపాయలు ఒక ఖాతరా?
    ఇద్దరూ కలసి ఇల్లు చూశారు చూసీ చూడ్డం తోనే ఆ యిల్లు నచ్చడం ఏమిటి గిరికి ఏవేవో ఆలోచనలు...కలిగి కరిగిపోయాయి ఆ యింటి కోసమయినా కనీసం ఒక భార్యవుండాలని పించింది..... కొత్తగా కాపురం ఆ యింట్లో...ఎంత రమ్యంగా వుంటుందో అనుకున్నాడు. అందులోనూ ఈ యింట్లో ఆ అమ్మాయిలాంటి పెళ్ళాం అయితే డబుల్ రమ్యంగా వుంటుందనుకొని - ముఫ్ఫయి రూపాయలూ తీసి రడీగా చేత్తో పట్టుకున్నాడు.
    ఇవతలకి వచ్చాక ఆ డబ్బు అతని చేతిలో పెట్టి - కంట్రోల్ రేట్ లో దొరకని వస్తువుకు బ్లాక్ లో ఎక్కువ ఖరీదు ఇచ్చినా, ఆ వస్తువు యింకా చేతికొస్తుందో రాదో అన్న భయంతో వర్తకుడివేపు వినయంగా భవతీ భిక్షాందేహీ అన్నట్లు చూసే ఫోజు పెట్టి నుంచున్నాడు.
    "మంచిది చూసి దిగండి. నమస్కారం!" అని మీసాలాయన అన్నాడు ఇంక వెళ్ళు అనే అర్ధం వచ్చేట్టు-
    మరేం చేసేది లేక గిరి వెళ్ళిపోతుంటే -
    "చూడండి ఎల్లుండి దశమీ సోమవారం - చాలా మంచిది - ఆటంకాలు లేకపోతే దిగి పొండి!" అని పిలిచి మరీ అన్నాడాయన -
    "అలాగేనండి?" అని పరధ్యానంగా అంటూ ఆ అమ్మాయి ఎక్కడన్నా దర్శనం యిస్తుందా అన్నట్టు ఒకసారి కలియజూసి నిరుత్సాహంతో గేటు యివతల పడ్డాడు.
    
                                     2

    ఇంతవరకూ బాగానే వుంది. కానీ, ఆడిన అబద్ధాన్ని ఎలా సర్దుకురావడమా అని; లేక పోతే యిప్పటికీ ముఫ్ఫై రూపాయలకూ ఒక నమస్కారం పెట్టి మర్యాదగా తప్పుకోవడమా? అని ఆలోచిస్తూ రూముకి చేరుకున్నాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS