ఒక్క నిముషం నిశ్శబ్దం. ఏ గొంతుక మళ్ళీ వినదల్చుకోలేదు. వీరన్న. వాడి కొడుకు గొంతు వినగానే నిశ్చేష్టుడయ్యాడు.
"ఒరే నీ పేరు.... పొట్టయ్య ... నీ పొట్ట బాగుంది గానీ....నీక్కావలసింది చెప్పరా?"
"ఇదిగో ఖరారు కాగితం, నా డబ్బు నాక్కావాల".
"అంతేనా?"
"డబ్బెంత?"
"ఏడు వదులు"
జేబులోంచి తీశాడు కాగితాలు.
"ఇంద! తీసుకో - ఆ కాగితం అందులో షరతుల తోటి నా పేరరాసే-నేను వసూలు చేసుకుంటాను.."
పోట్టయ్య తీసుకోలేదు. వీరన్న వైపు చూశాడు. వీరన్న కళ్ళు ఆ లాంతర వెలుగులో మండుక పోతున్నాయ్. ఆ బుంగ మీసం క్రిందగా పళ్ళు పట పట లాడుతున్నాయ్. కోరి యిచ్చినా పుచ్చుకునే ధైర్యం వాడికి లేక పోయింది.
"పంచాయతీ తీర్పు చెప్పేసాను. ఇది దాటిన వాడు యీ గుంపులో వుండలేడు...... మళ్ళీ చెప్తున్నాను. ఉండ లేడు....." వీరన్న అంటూ చర్రున లేచి వెళ్ళిపోయాడు. అతనితోపాటు అంతా కదలిపోయారు. పోట్టయ్య, చిట్టిరాజు ఒకరి ముఖం యింకొకరు చూసుకున్నారు. మెల్లగా కదలి పోతున్న పొట్టయ్య పొట్ట తడుముతూ...
"ఈ పొట్ట కరగనివ్వక డబ్బుంటే దేవకన్యని తెచ్చి అనుభవించొచ్చు...." అన్నాడు చిట్టిరాజు. చాలసేపటివరకూ యిద్దరూ యేవో వూసులాడు కుంటున్నారు. గుంపులో కల్లోలం అంతా మంచులా కరిగి ప్రశాంతంగా వుంది.
2
పులిలా పళ్ళతో భయపెట్టిన వీరన్న యింటికి వెళ్ళేటప్పటికి పిల్లి అయిపోయాడు. బోడమ్మయెదురుగా బుంగమూతి పెట్టాడు. అప్పటికే మాంచి నిషాలో వుందేమో కొడుకు వచ్చాడన్న వూసే ఆమె మరచినట్లుంది. మనిషి పిట్టలా వున్నా - కూత మాత్రం ఘనంగానే వుంది. మెడనిండా పూసల దండలు చేతి నిండుగా వెండి మురుగులు. కోపం వస్తే చేతులెత్తి ఆ మురుగులనే ఆ యుధాలుగా వుపయోగిస్తుంది. ముక్కు చిలకముక్కు. ముఖం ముద్దుగా గుడ్లగూబ ముఖంలా వెడల్పుగా వుంటుంది. చెవిలో బరువు కాడలు పెద్ద కన్నాలను చేశాయి. ముక్కులో బంగారంవత్తు, కాళ్ళకు వెండి కడియాలు, పొట్టి మనిషైనా, మాటాడుతున్నప్పుడు అంత పైకి ఎగురుతుంది. నలుగురూ లోలోపల అనుకుంటారు ఆమె గురించి.
"బోడమ్మ మొగాడికి మొగుడని!"
"వచ్చినావా? తిండికిరావా...?" అంటూనే దీపంబుడ్డి యెదురుగా అన్నం, కోడిమాంసం, ఒక సీసా సారా పెట్టింది. ఇంకా కొడుక్కోసం చూస్తున్న వీరన్నతో-
"ఆ డొస్తాడులే ఆడికి వుందినాను... నివ్వు తిను..."
వీరన్న తినడానికి కూర్చున్నాడు.
"ఉండు. ఈ యేళ నీ ఆర్జనెంత?"
"ఏమీలేదు."
చప్పునవెళ్ళి వాడి యెదురుగావున్న కోడి మాంసం. సారాబుడ్డి లాక్కుని-
"నన్ను తిననీ - నన్ను తాగనీ.. ఈ రోజు ఒక పెనిమిటి భార్యాలకి యిష్టంలేకపోతే యిష్టం కలిపాను. సోది సెప్పాను. సేతులు చూసినాను ... గడించినాను.. నన్ను తిననీ.. నన్ను తాగనీ...నా ఆర్జన తినడానికి నివ్వెవడివి?" అంటూ గడగడా త్రాగేసింది. కోడిమాంసం చప్పరిస్తూ తినేసింది. వీరన్న మెల్లగా లేచి బయటకు వచ్చేశాడు. వాకిట మంచంమీద కూర్చున్నాడు. కూర్చోగానే కాళ్ళ దగ్గర కుక్కకూర్చుంది. దాని తల నిమిరాడు. ఉండి వుండి గాడిదలు అరుస్తున్నాయ్. పందుల కోలాహాలం వినిపిస్తోంది. కుక్కలు యీ గుడారాల చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నాయ్.
ఎడారిలా వుంది ఆకాశం. ఎడారి మధ్య ఒయాసిస్సుల్లా వున్న నీలి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు తెల్ల కలువల్లా వున్నాయ్.
లోపలే తాగిన తరవాత కమ్మగా సోది చెప్పుకుంటోంది బోడమ్మ, అలాంటి సమయంలో చిట్టిరాజు దిగబడ్డాడు. వస్తూనే "అమ్మా" అని పిలిచాడు. ఆమె పరుగెత్తుకుని బయటకొచ్చింది. "ఇప్పుడు దయకలిగిందిరా ... అమ్మని గేపకం చేసావురా."
ఈ నిష్టూరం వేస్తూనే కొడుకును గట్టిగా కౌగలించుకుని ముద్దులాడి, "నా నాయనా-నా తండ్రి... ఇన్ని వంటలూ నీకోసమే కాసుకుని సూసాను... అదిగో ఆడున్నాడు.... ఇంటి పెద్దేకాదు -కుల పెద్ద. ఆడిమీద నీతో సెప్పకుండా యింకెవుడితో సెప్పుకుంటాను? ఇన్నాళ్ళు నీతికి కట్టుబడ్డాను. కన్నోరిముకమే సూడనేదు. ఈ సెణంకోసం యెన్నాళ్ళు కాసానురా..." అంటూ కొడుకును పడిలేసి వలవల యేడ్చేస్తుంటే...
"ఊరుకో అమ్మా...వూరుకో....వచ్చానుగా."
"నివ్వు లేనప్పుడు గొప్ప గోరం జరిగిపోనాది నాయనా....ఇంతా అంతా కట్టంకాదు - నాను బరించరాని బాధ."
"అంత బాధేంటమ్మా...?"
ఆమె ఆ క్షణంలో వుగ్ర స్వరూపం దాల్చి యెగిరిపోతూ "ఇదిగో - యీ పద్ధుకు మాల్నోడు గాడిద కొడుకు....నీ అయ్య....కులపెద్దని యిర్రీగుతాడు....నా మీద ఒక ఆడదాన్ని తెచ్చినాడురా....అది ఆడకూతురు వయసుది. అదెంత వలిసిందో యీ ముసిలి పీనుక్కి.....పుస్తె కట్టాడురా.....పుస్తె సిగ్గులేదూ.....సిగ్గులేదూ... సిగ్గు..." అంటూనే వీరన్న మీద వురికి తలపాగ విసరి ఆ జుత్తూ గెడ్డాం పట్టుకుని పీకేస్తుంటే కాళ్ళదగ్గరున్న కుక్క అరుస్తూ బోడమ్మను కరవడాని కెళ్ళింది. క్రిందకు జారిన బోడమ్మ "సిగ్గులేదు" అంటూ అరుస్తూనే వుంది. వీరన్న అలా కూర్చొనే వున్నాడు.
చిట్టిరాజు లోపలికి వెళ్ళాడు. ఉన్నదంతా వేసుక తిన్నాడు. తండ్రిని తిన్నావనైనా అడగలేదు అడుగుతాడేమోనని యెదురు చూసిన వీరన్న అలా చుట్ట కాలుస్తూనే మంచం మీద జారబడ్డాడు. గాలి వీస్తోంది. బోడమ్మ వాగుతూ వాగుతూ అలా క్రిందే నిద్దరపోయింది. చిట్టిరాజు లోనున్న మంచం బయటకు తెచ్చి వేసుకున్నాడు. పరువు లేదనీ, తలగడ లేదనీ కాస్సేపు విసుక్కున్నాడు. ఉన్న చీరలన్నీ పరుచుకున్నాడు. మంచం మీద వాలినా నిద్దరరాలేదు. ఆకాశంలో మేఘాలు విడే బదులు మరింత పేరుకుంటున్నాయ్. తెల్లని మేఘాలు నలుపెక్కుతున్నాయ్. చందమామ కృంగిపోయాడు. చీకటిగా వుంది. పడుకున్నట్లు నటించాడు. వీరన్న ఆ రాత్రి మీద లేచాడు. తండ్రి లేవటం క్రీగంటితో చూశాడు. మెల్లగా లేచి యింకో పాకవేపు వెళ్తున్నాడు. ఏ పాక దగ్గరకు వెళ్ళినదీ గుర్తుపట్టాడు. అల్లంత దూరంలో ఆ పాక వుంది. తలుపు తీసి వీరన్న లోపలికి వెళ్ళగానే మూతపడింది.
చిట్టిరాజు మెల్లగా లేచాడు. ఇటూ అటూ చూశాడు. అంతా నిశ్శబ్దం. తల్లి నిద్రపోతోంది. పిల్లిలా మెత్తని అడుగులు వేసుకుంటూ ఆ పాకవైపు వెళ్ళాడు. దగ్గరకు వేసిన వెదురు చాప తలుపు సందు నుంచి చూసాడు. లోపల బుడ్డి దీపం వెలుగుతోంది. ఇంకా వీరన్న నోట్లో చుట్టవుంది. మంచంప్రక్కలో మంచం వేపు తిరిగి వీరన్న కూర్చున్నాడు. మంచం మీద చుక్కమ్మ అర్ధనగ్నంగా పడుకుంది. చామన ఛాయ సొగసు, ఆ ముఖం తేజస్సుతో మెరుస్తోంది. ఆ కళ్ళు వజ్రాల్లా వెలుగుతున్నాయ్. యవ్వనంతో చిందులు త్రొక్కి, వుల్లాసంతో వుబ్బిన, వక్షం అందానికి ఆఖరి మైలురాయిలా మెరిసిపోతూంది. చిట్టిరాజు నోరు చప్పరించాడు. ఒళ్లంతా విద్యుత్ మయమైంది. ఈ దివ్య సుందరిని తనదాన్ని చేసుకుందామన్న భావన శాశ్వత కోర్కెగా మనసులో నాటుకుని పోయి మొక్కగా మొలిచింది. అది ఆ క్షణంలో చెట్టయి పోయింది. ఆ చెట్టును యెవ్వరూ వూడబీకలేరు.
* * *
ఎంత ప్రయత్నించినా వెనుకకు రాలేక పోయాడు. ఆ అపూర్వానందంనుంచి బయట పడాలని ఆలోచించలేదు. తొలిసారి జీవితంలో అందం ఎలాంటిదో చూసిన వాడిలా అయిపోతున్నాడు. అందంలో అమృతం పాలులా పొంగుతుంటుంది. ఆ అమృతాన్ని ఆ క్షణంలోనే తాగెయ్యాలని ఆతృత పడ్డాడు. ఎందుకో ఆవేశం నిట్టూర్పులై పోతోంది. కాళ్ళు గడగడ వణుకుతున్నాయ్. పెదిమలు కదలిపోతున్నాయ్. చేతులు నలుపు కుంటున్నాడు.
అలా చూస్తూండగానే వీరన్న చుట్టపారేసి ఆ కంపునోటిని ఆమె పెదాల దగ్గరకు తీసుక వెళ్తుంటే చిట్టిరాజు శరీరం అసహ్యంతో అట్టు డికి పోయింది. మరోక్షణంలో వీరన్న మంచం మీదకు వెళ్తుంటే చూడలేక చప్పున వెనుకకు కాలు వేసాడు. ఆ కాలు, వెనుకనే వున్న కుక్క మీదపడగానే ఆ కుక్క కయ్ మంది. ఆ అరుపుకు యెదురుగా వున్న పాకనించి వుప్పాల రాముడు వచ్చి చిట్టిరాజు చెయ్యి పట్టుకుని అరిచాడు. చుట్టుపట్ల నున్న పాకలనుంచి అంతా బయటకు వచ్చేశారు. పారిపోబోతున్న చిట్టిరాజును పట్టుకు న్నారు. వీరన్న ముఖాన చిక్కితే రక్తం లేదు. వచ్చి ఒకపూట కాలేదు గానీ, అప్పుడే కొడుకు రెండు తప్పులు చేసాడు. వుప్పాలరాముడు అరిచాడు.
"ఎప్పుడైతేనేం? మననీతి పెకారం పొద్దుపోనాక ఒకడింటిదగ్గిరి కింకొకడు యెల్లకూడదు. పంచాయతీ పెట్టించండి.....తప్పెయ్యండి!"
దీనికి యెవరూ కాదనలేదు.
3
ఎప్పుడు, యెలా మొలిచిందో ఆ మర్రిచెట్టు, వీళ్ళ గుడిసెలకు కాసింత దూరంలో పళ్ళతో. జుత్తు విరబోసుకున్న ఆడదిలా నిల్చుంది. ఆ చెట్టు క్రింద పంచాయితీ- వుదయమే ప్రారంభమైంది. వీరన్నకు యీ తగువుతో సంబంధం వుండటం వలన, యింకో వయసు మళ్ళినవాడు పెద్దగా వ్యవహరించాడు. చిట్టిరాజు యీ విషయం అసలు పట్టించుకోలేదు. తల్లి చెప్పిందని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. కాకీ ఫుల్ పాంటు మీద రంగు రంగు బుష్ షర్టు వేసుకున్నారు. సెంటు వాసన వేస్తోంది, తలకు వాసన నూనె రాసుకున్నాడు. కాళ్ళకు కాబూలీ చెప్పులున్నాయ్.
బోడమ్మ వకాల్తా తీసుకుని వాదిస్తోంది.
"నా బాబు రాగానే అయ్యరాగటా చెప్పు కున్నాను. ఆడు ఆ చుక్కమ్మ ఒంటిగా వున్నప్పుడు యెల్లలేదు. ఎల్లినా తప్పేమిటి? అది వరసవుతుందా? వా యవుతుందా? అయ్యో నా అయ్య యింత పాపం చేసినాడా అని సూడెళ్ళాడు."
"నేనేం పాపం సెయ్యలేదు. దాన్ని పెళ్ళాడాను".
వీరన్న శాంతంగా అన్నాడు.
బోడమ్మ గొంతుక గట్టిగా పెగిలి అరిచింది. చేతులు త్రిప్పుతూ, యెగురుతూ "అది పాపం, పాపమే. ఆ వయసిందాన్ని పెళ్ళాడి దాని వుసురేసుకున్నావు!"
"లేదు, నా తృప్తికోసం కట్టుకున్నాను."
"హే"మని వెక్కిరిస్తూ "ఆ తృప్తి నా దగ్గిర దొరకనేదా? దొంగభంచేత్, ఒక కొడుకు, ఒక కూతురూ యెలా గొచ్చారు? నా కొడుకు ఆ అబ్బా, అమ్మా లేని చుక్కమ్మ అసలు యీడ్ని వల్సిందో లేదోనని తెలుసుకుందామని యెల్లాడు. తలుపుముట్టుకోనేదు, తడిక ముట్టుకోనేదు, తొంగి సూడనేదు. తైతక్క లాడనేడు. నిజం కోసం ఎల్లాడు, నిందపడ్డాడు. ఆ పద్దుకు మాలినోడెవడో అన్నా డని పంచాయితీ పెట్టిస్తారా? మా సిట్టిరాజు మీకు రాజౌతాడని మర్సిపోకండి. ఆడు అడవిలో మనలాగ పెరగలేదు. పట్నాలంట గౌరం నేర్పొచ్చి నాడు. ఈ గుంపుకి గౌరం తెస్తాడు. నాయం ఉంచుతాడు. ముందు యిల్లు సక్కబెడ్తున్నాడు. తర్వాత గుంపుమీద పడ్తాడు. తిండీ, బట్టా, తాగుడికి లోటులేనట్లు గుంపుని పైకి తెస్తాడు. అల్లాంటి రాజు మీదా పంచాయితీ! ఎయ్యెండి తప్పు. యెంతే స్తారో నానూ సూస్తాను. ఆడు పిన్నమ్మ యింటి దగ్గర కెళ్ళాడు గానీ పై ఆడదాని యింటి గుమ్మం తొక్కనేదు."

కాస్సేపు గుసగుసలు బయలు దేరాయ్. ఇటూ అటూ చెప్పలేని పరిస్థితి చూసి మళ్ళీ బోడమ్మ విజ్రుంభించింది. "నానూ సూస్తాను. తల్లీ కొడుకు లకీ యే పెద్డోలు రంకుగట్టి తప్పేస్తారో నానూ సూస్తాను. ఇదేదో ఆఖరు కొచ్చినాది."
కాస్సేపటికి పెద్దలు 'చిట్టిరాజు కొత్తగా వచ్చాడు కాబట్టి, యిక్కడి ఆచారాలు తెలీవు కాబట్టి, సిన తల్లి యింటిదగ్గిరికి యెల్లాడు కాబట్టి యీసారికి తప్పులేదన్నారు. ఇకముందు అలాసేస్తే తప్పించుకోవాల" అన్నారు.
