Previous Page Next Page 
స్రీ పేజి 2

 

    అదిరిపడింది సుజాత. 'ఎవరూ? ఎవరి సంగతి ? అక్కయ్యా? ఏం చేసింది? ఏం చేసింది?' అలాగే నించుని వింటే అంతా అర్ధమై పోయింది. గాలికి ఎగిరి నేలమీద పడి వున్న పేపరు తీసి చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. 'అక్కయ్యా! ఎంతపని చేస్సింది!' పద్మజ సాహసం తోడబుట్టిన సుజాతను అంతులేని విస్మయంతో, దిగ్బ్రమతో ముంచి వేసింది. ఆపైన ఆలోచనలు కూడా సాగనీయనంత జడురాలిని చేసింది.
    'సుజా!"
    తలుపు వార నిలబడి ఎప్పటి నుంచో పిలుస్తున్న జానకి పిలుపు వింటూ ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తింది. "చూశావా, వదినా? అక్కయ్య మనకేవ్వారికీ చెప్పకుండా , మద్రాసు లోనే పెళ్ళి చేసేసుకుంది." అడక్కుండానే చెప్పేసి బావురుమంది.
    అకస్మాత్తుగా ఆవహించిన భర్త గారి ఆగ్రహానికి, అత్తమామల దుఃఖానికి కారణం తెలియక కంగారు పడుతున్న జానకి. తీరా కారణం విని మాన్పడిపోయింది.

                             *    *    *    *
    ఏ సాహసం చెయ్యకుండా పద్మజ కూడా పది మంది లాగా సర్వ సామాన్యంగా ఉండిపోతే విస్తుపోవాలి గానీ, ఎంత చిత్రమైన పని చేస్తే మాత్రం పద్మజ విషయంలో విడ్డూరం ఏముందీ?' పద్మజ పెళ్ళి ఫోటో పేపర్ లో చూసినప్పుడు అందరిలా రఘుపతి కేమంత ఆశ్చర్యం కలగలేదు. సహజంగా పద్మజ చేసి తీరవలసిన పనేదో మాత్రం చేసిందని అనుకున్నాడు. 'అదృష్టవన్తురాలు! ఆడపిల్లే -- పుట్టినా అది నుంచీ కోరుకున్నవన్నీ సాధించుకోగలిగిన సమర్ధురాలు! జీవితమంతా కలిసి బతకవలసిన భాగస్వామి కోసం తల్లితండ్రులనూ, సంఘాన్నీ ధిక్కరించడం పద్మజ లాంటి వాళ్ళకో విశేషం కానేకాదు." చిన్ననాటి స్నేహితురాలి సాహసం తలుచుకొంటున్న కొద్ది రఘుపతి మనస్సు ఆవేశ పూరితమైంది. 'తనవంటి అప్రయోజకులు ఎందరైతే మాత్రం పద్మజ కు సాటి కాగలరు? జీవితాన్ని శాసించుకోగలిగిన స్వశక్తి తనకో ఎండమావి. జీవితం విలువే గ్రహించ లేకపోయిన తనకు జీవితాన్ననుభావించే అర్హత ఎక్కడిది?' నిరాశగా నిట్టూర్చాడు రఘుపతి.
    మరోసారి పద్మజ కేసీ, ఆమె ప్రేమించి, సాహసించి పెళ్ళాడిన ఆ అదృష్టవంతుడి కేసీ మార్చి మార్చీ చూస్తూ కూర్చున్నాడు. ఆ నూతన వధూవరుల ముఖాల్లో ఎంత ఆనందం! లోకాన్నే ధిక్కరించగలిగిన ఆ ప్రేమికుల్లో ఎంత స్వాతంత్యం! ప్రత్యేకించి పద్మజ కన్నుల్లో ఆ గంబీర్యం , ఆ నైర్మల్యం! 'అందుకే పద్మజ కన్నుల్లోకి ఎన్నడూ తను లోతుగా చూడటానికి సాహసించలేకపోయేవాడు -- ఆ చూపులు అకారణంగా తనను చిత్రవధ చేస్తాయేమో నన్న భయంతోనే బతికాడు. చిన్ననాడే నా నేస్తం స్నేహంతో, ఆ సాహస పూరిత మైన చూపుల ద్వారా తనేదో సందేశం తెలుసుకోగలిగితే ఈనాడిలా ..... ఇలా.....కుమిలి పోయే దౌర్భాగ్యం పట్టేది కాదేమో? జీవితాన్నింత నిర్లక్ష్యం చేసుకోగలిగేవాడూ కాదేమో? మించిపోయింది అంతా."
    "రఘూ! ఇక్కడే ఉన్నావూ? పిలిస్తే పలకవెంరా?' అంటూ వచ్చింది అన్న పూర్ణమ్మ. "మీ అత్తగారి ఊరి నుంచి ఉత్తరం వచ్చిందిరా! సుశీలకి మళ్ళీ సుస్తీ చేసిందట. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు?"
    కొంతసేపూ మౌనంగా ఊరుకున్నాడు రఘుపతి. "సుశీలకా? మళ్ళీ ఏమైంది?"
    "ఏమో? సుస్తీ తిరగబెట్టిందని వ్రాశారంతే . అదేం తెగులో, ఖర్మ! రాక్షసి లా దాన్ని పట్టి పీడిస్తోంది. అధక్కడా , నువ్విక్కడా లక్షణంగా మీరిద్దరూ కాపరం చేసుకుంటుంటే చూసే రాతే లేనట్టుంది మా మొహాన."
    ఉదాసీనంగా చూస్తూ కూర్చున్నాడు రఘుపతి. 'పద్మజ పెళ్ళి మాట అమ్మాకు చేబితెనో?' అనిపించిందో క్షణం. 'ఉహూ! వద్దు. గతమంతా తవ్వుకొంటూ పోయి పార్వతి పెళ్ళి మాట కూడా అడుగుతుంది అమ్మ. పరోక్షంలో నైనా పార్వతిని తేలిక బరచటం తను సహించలేడు!'
    "ఒక్కసారి చూసిరా , నాయనా! నువ్వే కాదనుకుంటే....."
    "వెళ్తాలే , అమ్మా!' కుర్చీలో నుంచి లేచి బయటకి వెళ్ళిపోతున్న కొడుకును చూస్తూ. అపరాధిలా నిల్చుంది అన్నపూర్ణమ్మ.
    
                            *    *    *    *
    మధ్యాహ్నం వేళ ఆఫీసు వెయిటింగ్ రూము లో కాలక్షేపంగా పాత పేపర్లు తిరగవేస్తూ కూర్చున్న పార్వతి తుళ్ళిపడింది. విస్మయంతో ఒకటికి నాలుగు సార్లు చూసిందా పెళ్ళి ఫోటోను. తన కళ్ళు తనను మభ్యపెడుతున్నాయేమో నన్నంత అనుమానంతో చుట్టూ పరికించింది. ఎక్కడి వస్తువు అక్కడ, ఎక్కడి మనుష్యులక్కడ -- ఏమీ మార్పులేదు.
    "ఏమిటండీ, అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు?" ఫ్లాస్కు ఖాళీ చేసి మూత బిగిస్తూ పలాకరించాడు తోటి గుమస్తా నారాయణరావు.
    "అబ్బే! ఏం లేదండి! ఇక్కడ ..... ఈ పేపర్లో ....ఓ పెళ్ళి ఫోటో...." చెప్పాలన్న ప్రయత్నం లేకుండానే చెప్పేసింది.
    "ఏదీ? ఒక్కసారిలా ఇవ్వండి."
    అయిష్టంగానే అందించింది పేపరు.
    "ఓ! ఇది వారం రోజుల కిందటిదండీ! ఇప్పుడు చూసి విస్తుబోతున్నారేమిటి? ఆరోజు ఈ ఫోటో చూసినప్పుడు నేనూ మీలా కొంచెం ఆశ్చర్య పడక పోలేదు లెండి. మన వెర్రి గానీ, ఇది రాకెట్ల యుగమండి. ఒక గోళం మీది నుంఛి ఇంకో గోళం మీదికి ఎగరాలని ప్రయాణాలు కడుతుంటే వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఇంకా ఏం విడ్డూరం చెప్పండి? డాక్టర్ చదువు చదివిన ఓ ఆడపిల్ల ఆమాత్రం సహసమైనా చెయ్యలేకపోతే ఇక మనమేం పురోగమిస్తున్నట్లు?"
    అయోమయంగా చూసింది పార్వతి. నారాయణరావు నిజంగానే మెచ్చుకుంటున్నాడో, వెటకారం చేస్తున్నాడో అర్ధం కాలేదు. 'ఈవిడ.....ఎవరో కాదండీ! నా స్నేహితురాలు! చిన్ననాడు కలిసిమెలిసి చదువుకున్నాం. నా ప్రాణ స్నేహితురాలు ! పద్మజ.... పద్మ.....' అనేయ్యాలన్నంత ఉత్కంట కలిగింది. తమాయించుకోంది బలవంతంగా. పేపరు అందుకొని మళ్ళీ చూస్తూ కూర్చుంది. పద్మజ అందంగా, నిర్లక్ష్యంగా నవ్వుతున్నది. అతను--- జార్జి విమియమ్స్ -- పద్మజ ప్రియుడు, ప్రియుడేమిటి? పద్మజ భర్త సంతోషంగా చురుగ్గా, చూస్తున్నాడు. ఇద్దరికీ అందచందాలలో , అంగ సౌష్టవంలో మంచి పొందిక కుదిరింది. ఒకరికోసమే ఒకరు పుట్టినట్టు, ఒకరు లేనిదే మరొకరు లేనట్టు ఆ చూపుల్లో వారి సాన్నిధ్యంలో అనురాగసవంతులు ప్రవహిస్తున్నట్టున్నాయి.
    చూసిన కొద్దీ చూడబుద్ది కలుగుతున్న ఆ తన్మయత్వం లో వాస్తవం గుర్తు వచ్చింది కొంత సేపటికి. 'పద్మజ ఎంత పని చేసిందీ!' కొత్తగా విస్తుపోయింది పార్వతి. ఈ విషయం మాతమాత్రమైన ఎన్నడూ అనలేదే? "నువ్వు నా ప్రాణదికమైన నేస్తానివి, పారూ!" అనే పద్మ తన ప్రేమ జీవితాన్ని ఇంతగా మరుగు పరుచుకుందా? ఆఖరికి మాట మాత్రమైన తెలియనివ్వకుండా పెళ్ళి చేసుకుందా? ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసి వుండదు బహుశా. బహుశా ఏమిటి? ఎంత మాత్రం తెలిసి వుండదు. ముందు తెలిస్తే సుజాత తనకు తప్పకుండా ఉత్తరం వ్రాసేది."
    అనుకోకుండా పద్మజ ఇలా చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంది. కత్తిలా సర్రున నరికే పద్మజ మనస్తత్వం- బాణం లా దూసుకుపోయే పద్మజ సాహసం -- పార్వతి కేమీ కొత్త కాకపోయినా ఈ సంఘటన కొత్తగానే బాధిస్తున్నది. "ఇష్టాలని చంపుకుని, మనస్సులని మభ్య పెట్టుకుని చేజేతులా జీవితాలనేలా నాశనం చేసుకుంటారో నాకు అర్ధం కాదు, పారూ!' అంది పద్మజ నుదురు చిట్లిస్తూ -- రఘు పెళ్ళి కొడుకై తరలి వెళ్ళుతున్న రోజు. రఘు మీది కోపంతో అలా ఆవేశంగా మాట్లాడిందేమో అనుకుందే గాని, నిజంగా చేతలకు వస్తే ఇంత సాహసం ప్రదర్శించగలదని లీలగా నైనా ఊహించలేక పోయింది.
    పద్మజ ఇలా చెయ్యకుండా ఉంటేనే బాగుండేదేమో? సంఘం ఎంత సంస్కరణ పొందుతున్నా, కాలం ఎంత రాకెట్ల మయమైనా , పద్మజ పుట్టి పెరిగిన బ్రాహ్మణ కుటుంబం లో ఏ ఆచారం మాసిపోయినది? పద్మజ తల్లిదండ్రులు పాటించే నియమ నిష్టలలో ఏది కొరవడింది? పార్వతికి తెలిసినంతవరకూ పద్మజ పుట్టింటిని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిప్పును నీళ్ళతో కడిగి శుద్ధి చేసేటంత ఆచారం ఆ ఇంట తరతరాలుగా వస్తున్నది. ఈశ్వర సోమయాజి తాత యజ్ఞాయాగాలు చేసి సోమయాజి అయ్యాడు. తండ్రి శుద్ధ బ్రాహ్మణ పండితులనూ, శ్రోత్రియ కుటుంబికులనూ విశేషంగా ఆదరించాడు జీవితమంతా. ఇక సోమయాజి ఎంత ఇంగ్లీషి విద్య అభ్యసించి తాసిల్దారు ఉద్యోగం సంపాదించినా , నెత్తి ,మీద పంచశిఖల్లో ఓ శిఖను పవిత్ర బ్రహ్మణ్యనికి గుర్తుగా పెంచుకుంటూనే ఉన్నాడు. తాను ముప్పూటలా సంధ్య వార్చటం తో పాటు ఏకైక పుత్రుడు విజయ శాస్త్రికి కూడా ఆ ఆచారాన్ని విధిగా సంక్రమింపజేశాడు. తాతల నాటి రక్తం నరనరాన ప్రవహిస్తున్న శాస్త్రికి బ్రహ్మణ్యం మీద మహా గౌరవం. తొమ్మిదేళ్ళ నాడే ఒడుగు చేసుకుని, తల్లి తండ్రులతో పాటు బంధు కోటినంతా భిక్ష అడుక్కుని శ్రోత్రియ బ్రాహ్మణుడుగా అర్హత సంపాదించుకున్నాడు. క్రిమినల్ లాయరు గా ఊరూ వాడా మంచి పేరు సంపాదించిన శాస్త్రి గాయత్రి జపించి సంధ్య వార్చనిదే పీట మీద కూర్చోడు. పాతికేళ్ళ క్రితం ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టినా కామేశ్వరమ్మ చిమ్మ చీకటి లో శిరస్సు మీద చన్నీళ్ళు దిమ్మరించుకుని, పట్టు పంచె చుట్ట బెట్టుకుని మడిగా , శుద్దిగా వండి వార్చని రోజు లేదు. కంచెంబూ. తుంగచాపా దగ్గరసా జరుపుకుని వాకిట చేరినప్పుడూ , ముచ్చటగా మూడు సార్లూ బాలింతరాలై పురిటి గది విడిచి రానప్పుడూ తప్ప ఆవిడ ఆచార వ్యవహారాలకు ఏనాడూ ఆటంకం రాలేదు. సూర్యుడు నడినెత్తి కెక్కి కడుపు కరకరా కాలుతున్నా భర్త సుష్టుగా తిని లేచిన ఎంగలి కంచంలో తప్ప మరో చోట ముద్ద ఎత్తలేదు. ఇక ముందు మరికొన్ని తరాల వరకూ కూడా తమ ఇంట ఆ నియమనిష్టలు  అలా నిర్విఘ్నంగా కొనసాగిపోవాలనే అ ఇల్లాలి కాంక్ష కూడాను.
    అదేం చిత్రమో, ఈశ్వర విలాసమో-- అన్నిటికీ అతీతంగా పుట్టిందా ఇంటి ఆడపడుచు పద్మజ. పది పన్నెండేళ్ళ వరకూ కూతురి తత్వాన్ని పసితనంగా నిర్లక్ష్యం చేసిన తల్లితండ్రులు అప్పటికిక ఆ పిల్ల మీదో ప్రత్యేకాభిప్రాయం ఎర్పరచుకోక తప్పలేదు. 'పెంకిఘటం! ఇంటా వంటా లేని రాలిగాయి' అనుకుని చూసీ చూడనట్టే ఊరుకుంటూ వచ్చింది తల్లి. 'గడుసు తల్లి! తాతగారి పట్టుదలా, నాన్నగారి తెలివి తేటలూ అక్షరాల అబ్బాయి . మనం ఎలాగూ విసర్జించలేని  ఈ పాత ఆచారాలు దాని నెత్తిని కూడా రుద్దకుండా ఉంటె మహాబాగు" అనుకున్నాడు తండ్రి గారాబంగా.
    భోజనం ముందు కూర్చుని మంత్రాలేవో ఉచ్చరిస్తూ పుడిసెడు నీళ్ళు గుటక వేసి కంచం చుట్టూ నీళ్ళు చిమ్ముతున్న శాస్త్రిని చిన్నతనంలో ఓసారి నవ్వుతూ అడిగింది పద్మజ--
    "ఎందుకన్నాయ్, నువ్వు ఎప్పుడూ ఇలా చేస్తావ్?"
    "ఇది మన బ్రాహ్మణ నియమం. చేసి తీరాలి."
    "దీని వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది?"
    "ఏదో ఉంటుంది లేకుండా మన పూర్వులేప్పుడూ పెట్టి వుండరు."
    "నిజంగా అదేమిటో నీకు తెలియదూ? అయితే నే చెప్పనా?' కుతూహలంగా చూస్తూ అంది పద్మజ. "కంచం చుట్టూ నీళ్ళు చిప్పి, చోటు తడిగా చేస్తే చుట్టూ పట్ల పాకే సూక్ష్మ క్రిములేవీ ఆహారం లోకి రాలేవట. భోజనం ప్రారంబించే ముందు కాసిని నీళ్ళు తాగితే కంఠనాళం నిరాటకంగా ఉండి తర్వాత తినేదాన్ని సులువుగా వెళ్ళనిస్తుందిట -- మా సైన్సు మాస్టారు చెప్పారులే."
    "మరి ఏదో ప్రయోజనం కోసమేగా పెద్దలీ ఆచారం ఏర్పరచారు!" గర్వంగా చూశాడు శాస్త్రి.
    "అయితే, అన్నాయ్, ఈ ప్రయోజనం అన్ని జాతుల వాళ్ళకీ అవసరం లేదూ? ఒక్క బ్రాహ్మణజాతికే ఇలా నియమించటం లో అర్ధం ఏమిటి?"
    తికమక పడ్డాడు విజయ శాస్త్రి. "మరి.... మరి.... అందరూ అంత శ్రద్దగా పాటిస్తారా ఏమిటి?"
    "పూర్వం నుంచీ వస్తోందని మనం పాటించటం లేదూ? అలా అందరినీ శాసిస్తే ఎందుకు పాటించరూ?"
    'అబ్బ! ఏమిటే, నీ తర్కమూ నువ్వూనూ -- తిండి తినక." విసుక్కుంది కామేశ్వరమ్మ. దోరణి మార్చి గబగబా అన్నం కలుపుకోవటం లో నిమగ్నమయ్యాడు శాస్త్రి.
    తర్వాత గూడా పద్మజ ఆ విషయం మీద చాలాసేపు ఆలోచించింది. చివరికి తన సందేహం తండ్రి దగ్గర వెల్లడించింది కూడాను.
    రాత్రి భోజనాలయ్యాక వీధి వాకిట్లో వాలు కుర్చీలో తమల పాకులు నములుతూ ఆకాశంలోకి చూస్తూ కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అన్నగారికీ, తనకూ జరిగిన సంభాషణ అంతా చెప్పింది.
    "అయితే నాన్నా, మత్స్య మాంసాలు తిన కూడదని శాస్త్ర గ్రంధాలన్నీ పఠించాలని , నియమనిష్టలు పాటించాలని , యజ్ఞాయాగాలు చేయాలని-- ఇలా బోలెడు నియమాలు ఒక్క మన కులానికే విధించారు గదా? మరి మిగిలిన మనుష్యులకు మాత్రం అవన్నీ ఎందుకు కవసరం కాదూ?అన్నయ్య నడిగితే చెప్పలేదు. నువ్వు చెప్పు, నాన్నా!"
    కూతురు వేసిన ప్రశ్నకు ఈశ్వర సోమయాజి ముందు విస్తుపోయాడు. కుతూహలంగా చూస్తున్న చిన్నారి పద్మజ ఆలోచనా శక్తిని అంచనా వేయటానికి ప్రయత్నించాడు. "మనుష్యులందరినీ నాలుగు జాతులుగా విభజించరమ్మా! అందులో బ్రాహ్మణ జాతినే పవిత్రమైన జాతిగా ఎంచి, కఠినమైన ఆచార వ్యవహారాలన్నీ వారికే ఏర్పరిచారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS