Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 2

 

    "అదా సంగతి! దీని జన్మకి ఒకర్ని మెచ్చుకోవటం కూడానూ? నాతొ తగువు లాడాలని కాబోలు నిన్ను అమాంతం ఆకాశానికి ఎత్తి పారేసింది. కూర పారేసిన సంగతి తెలిస్తే నాలుగు అంటించే దాన్ని. నేను చూస్తె ఇలా మాటలు మెలిక పెట్టానికి వీలుండదని కాబోలు రహస్యంగా పారేసోచ్చింది!"
    "ఇంకా కాఫీ కాలేదటే? పాపం! అవతలా అబ్బాయి ఆకలితో అవురారు మంటున్నా" డంటూ రామయ్యా  గారు లోపలి కొచ్చి హెచ్చరించి వెళ్ళారు.
    అయినటు వెళ్ళగానే కళ మూతి ముప్పయి వంకర్లు తిప్పింది.
    'అంత ఆకలితో ఆవురావురు మనక పొతే నీ హోటలు కో వెళ్ళక పోయాడా? ఇక్కడ తెరగా చేసే వాళ్ళు ఉన్నరను కున్నాడు కాబోలు హోటలు కు వెళ్తే ఖర్చవుతుందని పీనారితనం!"
    "ఆ మాటలన్నీ తర్వాత -- ముందు కాఫీ సంగతేమిటో చూసుకోండి. నాన్నగారికీ, కోప మోస్తే పట్ట పగ్గాలుండవు." అంతలో శారద చేతులు కడుక్కుని వంటింట్లో నుంచి ఇవతల కొచ్చింది.
    కళ, గీత కాస్సేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు.
    కూర్చుంటే పనులు జరుగుతాయా , తరుగుతాయా?"
    "మరెలా?' అంది కళ దిక్కులు చూస్తూ.
    "ఎలా ఏమిటి? ఇద్దరం కలిసి ఎలాగో కుస్తీ పట్టేద్దాం.
    "టూ మెనీ కుక్స్...."
    "స్పాయిల్ ది బ్రాత్. అందుకే నువ్వు చేసి తీసికెళ్ళు. నేను కాస్సీపు డాబా ఎక్కి వస్తాను..."
    కళ కంగారు పడింది.
    "అమ్మో! నేను చేస్తే ఎలా ఉంటుందో?.... అది అతనికి నచ్చుతుందో లేదో!"
    "అమ్మయ్య! ఇప్పటికైనా వప్పుకున్నావ్!"
    "ఏమిటి?" అని గ్రుడ్లురిమింది కళ.
    "అది! మనం చేస్తే అతనికి నచ్చుతుందో లేదో అనే నా బెంగ!' అని సర్దుకుంది గీత.
    కళ మెత్తబడింది.
    "నచ్చకేమిటి కాని నాన్నగారు ఒకటే తొందర పెడుతున్నారు. తొందర పెడితే మాత్రం నాకు కంగారు!"
    "శారద కాళ్ళు పట్టుకుందాం పద!"
    "దాని కాళ్ళు పట్టుకుంటే అది మరి కాస్త కోయ్యేక్కి కూర్చుంటుంది! దాని కళ్ళెందుకు పట్టుకోవడం? సిగ్గు లేకపోతె సరి! పైగా అది మనకంటే చిన్నది!"
    గీత నిస్సహాయంగా చూస్తూ "తప్పదు!  వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు-- " అన్నది.
    "పట్టుకుంటే ఈడ్చి పెట్టి తన్ని ఉంటుంది." అంది కళ.
    "ఎందుకు తన్తుంది? తంతే వసుదేవుడు నాలుగు వడ్డించలేడేమిటి?"
    "అయితే ఇంతకీ నీ దృష్టి లో శారద గాడిదన్న మాట! ఆ మాట కొస్తే నీకే గాడిద పోలికలున్నాయ్!"
    కోపం రావటం ఈసారి గీత వంతు.
    'చీటికీ మాటికీ నన్ను వెక్కిరిస్తే ఊరుకునేది లేదు ! నా గొంతుకే గాడిద గొంతుకలా లేదు. మొన్న సంగీతం పోటీలో నాకు ప్రయిజు వచ్చింది తెలుసా?"
    "గీతక్కా! అవతల నాన్నగారు చిందులేస్తున్నారు.... ఇంకా కయ్యాలాడుతూ కూర్చున్నారా' అంటూ వచ్చింది శారద.
    శారద కుడిచెయ్యి గీత, ఎడం చెయ్యి కళ పట్టుకున్నారు.
    "శారదా! మంచిదానివి! కాస్త పరువు దక్కించవే!"
    "నేను చేస్తే రుచీ, పచీ, ఉండదుగా మీరే చేసుకోండి!"
    గీత శారద గడ్డం పుచ్చుకు బ్రతిమిలాడింది.
    "శారదా! లెంప లేసుకుంటామే! నేను పొయ్యి దగ్గర కెళ్తే అనక సేవ చెయ్యాల్సింది నువ్వే కదా? ఆరోజు పులుసు గిన్నె దింప బోయి కాళ్ళ మీద వంపెసుకున్నాను. జ్ఞాపకం లేదూ? నీకు హిందీ పరీక్షలు దగ్గర కొచ్చినా, పాపం, నాకోసం డాక్టరు చుట్టూ తిరిగి మందు, మాకూ తీసుకు రాలేదూ? నేను తేరుకునే సరికి నువ్వు చిక్కి సగమై పోయావ్!"
    శారద నవ్వింది.
    "కళక్క వంట గురించి చదువు కున్నది కూడా! చదువు, సంధ్య లేని దాన్ని నాకేం వస్తుంది?"
    "లెంప లేసుకుంటానే శారదా!" అంది కళ బలిమాలుకుంటూ.
    "పైగా అది చేసిన టిఫిన్ కాస్తా తిన్నాడంటే ఆయనకి వాంతులు, పట్టు కుంటాయి. ఆ తర్వాత మనింట్లో పడకేసి ఎనేలో రెండు నెలలకో తాపీగా తేరుకున్నాక ఇంటి కెళ్తాడు. అంత వరకు మనం అయన గారికి వెయ్యోత్తులు వత్తాలి!" అంది గీత.
    శారద నవ్వుతూ స్టౌ వెలిగించి నిమిషం లో చకచక కాఫీ , ఉప్మా తయారు చేసింది. ఉప్మా రెండు స్టీలు ప్లేట్ల లో సర్దింది. కాఫీని కప్పుల్లో పోసింది. అన్నీ ఒక ట్రేలో సర్దింది.
    "నువ్వు తీసుకెళ్ళు " అంటే "నువ్వు తీసుకెళ్ళు" అని గీత, కళ కాస్సేపు వాదులాడు కున్నారు. తర్వాత ఒకరు ట్రే , మరొకరు మంచి నీళ్ళు గ్లాసులు చేత పుచ్చుకుని వెళ్ళారు.
    డ్రాయింగు రూం లో రామయ్య గారు, ఆ అబ్బాయి సోఫాలో పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. ఉష, చిత్ర కూడా అక్కడే ఉన్నారు. రూం మధ్యలో అందమైన చిన్న ముక్కాలి పీట . దాని మీద ఉష ఎంబ్రాయిడరీ చేసిన నీలి రంగు శాటిన్ గుడ్డ పరచి ఉన్నది. సెంటర్ లో గాజు పూల కుండీ ,  కుండీలో రంగు రంగుల కాయితం పులు. ముక్కాలి పీటకు చెరొక వైపున ఖాళీగా ఉన్న మరో రెండు చిన్న బల్లలు ఎదురుగా సోఫా, రెండు వేపులా అటొక కుర్చీ, ఇటొక కుర్చీ -- ఆ రెండిటిలోనే ఉష, చిత్ర కూర్చున్నారు-- సోఫాకు , కుర్చీలకు అందమైన నీలి రంగు బొమ్మల గలేబీలు తొడిగారు. క్రింద కుంకుమ వర్ణం పూల తివాచీ ఉన్నది.
    డ్రాయింగు రూంలోకి అడుగు బెట్టటం తేలికైన పనిలా కన్పించలేదు రామయ్య గారి మొదటి ఇద్దరమ్మాయిలకు. అ అబ్బాయికి ఎదురు గుండా వెళ్ళటానికి చెప్పలేనంత సిగ్గేసింది. పెద్ద సభాస్థలి ముందు నిలబడి నంత వణుకొచ్చింది, అయినా ఏవీ పడేయకుండా జాగ్రత్తగా ఖాళీగా ఉన్న బల్లని మీద పెట్టారు. రెండింటినీ సోఫాకు దగ్గరగా  ఈడ్చారు.
    "మా పెద్దమ్మాయి కళ! బి.ఎస్.సి పరీక్ష కెళ్ళింది! ఇది రెండో అమ్మాయి గీత ! బి.ఏ కు వెళ్ళింది. ఇద్దరూ కవల పిల్లలు.'
    "ఐసీ! చాలా సంతోషం!"
    దబ్బపండు రంగు తో మెరిసిపోతున్న అబ్బాయి దబ్బున లేచి నమస్కారం పెట్టాడు.
    "ఈయన సుధాకర్. ఎం.ఏ. గుంటూరు కాలేజీ లో అసిస్టెంటు లెక్చరర్. " అన్నారు రామయ్య గారు అతన్ని అమ్మాయిలకు పరిచయం చేస్తూ.
    కళ, గీత ఇద్దరూ గాభరాగా నమస్కారం పెట్టి ఆ తర్వాత ఏం చేయటానికి తోచక అబ్బాయి వంక తప్ప మరో వంకకు చూస్తూ నిలబడ్డారు.
    సుధాకరే చొరవ చేసి "కూర్చోండి!" అన్నాడు .
    చిత్ర నవ్వింది.
    "ఎక్కడ కూర్చోమంటారు?"
    నిజమే మరి! నలుగురు కూర్చోగల సోఫాను తను రామయ్య గారు ఆక్రమించేసారయ్యే! కుర్చీలో ఒకరు తప్పించి కూర్చోలేరు--
    సుధాకర్ కంగారు పడుతూ అటూ ఇటూ కలయ జూసాడు కనుచూపు మేరలో కుర్చీ లేవైనా ఉంటె మోసుకు రావచ్చును కదా అని.
    ఉష అతని కంగారు చూసి కరిగి పోయింది. కుర్చీ చేతుల మీద కూర్చోమని అక్కలకు సైగ చేసింది.
    కళ కాస్త ధైర్యం చేసుకుని "ఫర్వాలేదు !  ఇక్కడ కూర్చుంటాం లెండి! మీరు కూర్చోండి?' అంది సుధాకర్ కేసి చూస్తూ.
    కళ, గీత అంగరక్షకుల్లా ఉష కు రెండు వైపులా కుర్చీ చేతుల మీద కూర్చోగానే సుధాకర్ కు స్థిమితం చిక్కింది. మరి మాట్లాడకుండా కూర్చున్నాడు.
    "కాఫీ చల్లారి పోతున్నది. తీసుకోండి!" అని జ్ఞాపకం చేసింది ఉష.
    'అవును! ఆ సంగతి మర్చేపోయాం. తీసుకోండి!" అంది గీత మాట కలుపుతూ.
    రామయ్య గారు "తీసుకోవయ్యా!" అంటూ తన ప్లేటు తీసుకుని తొందర తొందరగా ఖాళీ చేయటం ప్రారంభించారు.
    అమ్మాయిలూ చూస్తూ కూర్చుంటే తను మేస్తూ కూర్చోటం సబబా అని ప్రశ్నించుకుంటే 'కాదు' అని జవాబొచ్చింది సుధాకర్ కు. అందుకని "మరి మీరు కూడా తీసుకోండి!" అన్నాడు.
    కళ గుండెలు దడదడ లాడాయి. గీత కంగారు పడింది. ఆ ఫలహారం వెనక ఎన్ని పాట్లున్నాయో ఆ అబ్బాయి కేం తెలుసు!
    "అబ్బే! మేం ఇంతకూ ముందే తిన్నాం లెండి. మీరొస్తారని మాకేం తెలుసు?' అంది గీత.
    సుధాకర్ నమ్మకం లేనట్టు చూశాడు.
    "నిజమేనండి! సరిగ్గా మీరోచ్చే ముందరే మా టిఫిన్లు అయ్యాయి." అంది కళ గీతను బలపరుస్తూ.
    "మీరో?' అని సుధాకర్ ఉష చిత్రలను అడుగుతున్నట్టు రెండు కుర్చీల వైపుకి చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS