అయిదు రెళ్ళు
మందరపు లలిత
.jpg)
సాయంత్రం ఆరుగంటల వేళ పగలంతా తన ప్రతాపం చూపించిన ఎండ విశ్రాంతి తీసుకున్నది. మెల్లిగా చల్లగాలి తిరిగింది ఏప్రిల్ మొదటి వారం. విద్యార్ధి లోకం ఖుషీగా గడిపే వేసవి సెలవులు. ఏడాది అలసటను నిమిషం లో పోగొట్టి వినూత్న ఉత్సాహాన్ని అందజేసే మధురమైన రోజులు. పరీక్షలు పూర్తీ కావటంతో కళ తీరికగా వీధి వరండాలో కూర్చుని నవల చదువుకుంటున్నది. జానకమ్మ లోపలి నుంచి కేకేసింది.
"ఏమే కళా! కాస్త శారదకు సాయం చెయ్యరాదూ? సెలవులేగా?"
వారండాకు కుడి వేపున ఉన్న గదిలో జానకమ్మ నడుం నిప్పితో కదల్లేక మంచం మీద పడుకున్నది. కాస్త దూరంలో గోడకు మరో మంచం చేరబెట్టి ఉన్నది.
మద్రాసు లో ఇళ్ళు దొరకటమంటే సామాన్య మైన విషయం కాదు. అది చైనా -- భారత్ సమస్య అంతటి జాతిల సమస్య. అయినా రామయ్య గారు అసాధ్యులు. రామయ్య గారంటే జానకమ్మ కు భర్త. కళకు నాన్నగారు. ఆయనకు కళగాక మరో నలుగురు కుమారీ మణులున్నారు. వాళ్ళు గీత ఉష్ణ , చిత్ర, శారద , కళ, గీత కవల పిల్లలు . చెరొక ఇరవై రెండేళ్ళు ఉంటాయి.
ఉష వాళ్ళ కంటే రెండేళ్ళు చిన్నది. ఆ రెండేళ్ళ తేడాను నిలుపుకుంటూ ఉష తర్వాత చిత్ర, చిత్ర తర్వాత శారద పుట్టారు. కళ హూం సైన్సు బి.యస్. స్సీ. పరీక్ష. గీత బి.ఏ. మ్యూజిక్ పరీక్ష వ్రాశారు. ఉష పాలిటెక్నిక్ లో డ్రెస్ మేకింగ్ దిప్లామో కోర్సు చదువు తున్నది. మూడేళ్ళ కోర్సు లో రెండేళ్ళు ముగిశాయి. చిత్ర ఆర్ట్స్ స్కూల్లో మొదటి ఏడాది పూర్తీ చేసింది. పొతే శారదకు ఇంగ్లీషు చదువులు అబ్బలేదు. కనీసం ఎస్.ఎస్. ఎల్.సి. వరకైనా రాలేకపోయింది. మూడో ఫారం తోటే చదువుకో నమస్కారం పెట్టి ఇంట్లో కూర్చుంది. అయితే వూరికే కూర్చో లేదు. హిందీ క్లాసులకు హాజరవుతూ వచ్చింది. ఫిబ్రవరి లో విశారద రెండో పార్టు వ్రాసింది.
రామయ్య గారు అసాధ్యులంటే అయిదుగురు అడ పిల్లల తండ్రి కావటం తో కాదు. అయన ట్రిప్లికేను లో, ఒక మంచి లోకలిటీలో , వంద రూపాయలకు ఒక చక్కని ఇంటిని సంపాదించగల్గారు-- అద్దేకే అయినా అనుకోవలసిన మాట. రామయ్య గారికి బ్రాడ్వే లో ఒక వాచీల షాపుంది. ఆ షాపు మీద లక్షలకు లక్షలు సంపాదించ లేకపోయినా, సంసారం మాత్రం సుఖం గానే దోర్లిపోతున్నది. ఉదయం పది గంటల నుండి రాత్రి ఏడున్నర వరకూ ఆయనా కొట్లోనే ఉంటారు!
రాత్రి పూట తప్పించి పగటి పూట అయన ఇంట్లో ఉన్నట్లే ఉండదు, ఒక్క ఆదివారం మినహా.
రామయ్య గారు అద్దె కుంటున్న డాబా ఇల్లు మరీ పెద్దది కాదు. ఇంటి ముందు గేటు, గేటుకు కాస్త దూరంలో వీధి వరండా మెట్లు , వరండా కు కుడి వేపున వరసాగా మూడు గదులు ఎడం వైపున రెండు గదులు, మధ్యలో హాలు. వెనకాతల వోషేస్ వరండా -- మధ్య హాలు డ్రాయింగు రూముగా వాడు కుంటున్నారు. కుడి వేపు గదుల్లో మొదటి గది జానకమ్మ పడక గది. రెండో గదిలో గీత సంగీత సాధన చేసుకుంటుంది. మూడోది వంటిల్లు. ఇటు పక్క రెండు గదుల్లో ఒకటి అమ్మాయిల పడక గదిగా ఉపయోగ పడుతున్నది. రెండోది బాత్ రూం.
.jpg)

ఇంట్లో సామాన్లు అట్టే లేకపోయినా ఉన్నవి ఖరీదైనవి, అందమైనవి. గీత పాడుకునే గదిలో అయిదడుగుల ఎత్తు గాడ్రిజ్ బీరువాను అందంగా అమర్చారు, కాస్త దూరంలో రెండు, మూడు తోలు పెట్టెలు మరో రెండు మూడు ట్రంకు పెట్టెలు, ఇతర చిల్లర మల్లర సామాన్లు ఉన్నాయి. జానకమ్మ పడుకున్న గదిలో కూడా ఏవో కాసిని సామాన్లు ఉన్నాయి. జానకమ్మ , రామయ్య గారు తప్ప పిల్ల లెవరూ మంచాల మీద పడుకోరు. అందుకే మంచాల సంఖ్య రెండుకు మించి పెరగలేదు.
ఇంత లావు, అంత పొడుగు ఉన్నా జానకమ్మ ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధ పడుతూనే ఉంటుంది. వోపిక ఉన్ననాడు ఇంట్లో పని చూసుకుంటుంది. లేనినాడు మంచాన్ని అంటి పెట్టుకుంటుంది. ఆ సమయంలో శారద తప్ప మరెవ్వరూ వంటింటి చాయల కైనా పోరు. ఈరోజు కూడా శారద వంటింట్లో కూర్చుని వంకాయలు తరుగుతున్నది. ఒక మూల రెండు ఇత్తడి బిందెల నిండా మంచి నీళ్ళున్నాయి. వంట చేసుకోవడానికి ఎత్తుగా, అరుగు లాంటిది కట్టారు. దాని మీద ఒక వేపున స్టీలు గిన్నెలు, రెండు , మూడు ఇత్తడి గిన్నెలు తళతళ మెరిసిపోతూ ఉన్నాయి. ఇంకో వేపున పోపుల డబ్బాలను పేర్చారు. స్టౌ మీద వంట కాబట్టి వంటిల్లు మసి చూరి శిధిలమై పోలేదు. మిగతా అన్ని గదులు మాదిరి గానే వంటిల్లు కూడా తెల్లని గోడలతో నీటుగా ఉన్నది.
జానకమ్మ గదిలో నుంచి సూటిగా వంటిల్లు కనబడుతుంది. శారద ఒక్కతే పని చేసుకోవటం చేసి జానకమ్మ జాలి పడింది. అందుకే కళను కేకేసింది.
కళ నవల మీది నుంచి చూపులు మళ్ళించి దురుసుగా అన్నది.
"అబ్బ! నేను చెయ్యలేను బాబు! కాలేజీ పరీక్షలు వదిలాయనుకుంటే మళ్ళా తీరిక లేకుండా ఇంటెడు చాకిరీ చేస్తేనే కాని నీకు తృప్తిగా ఉండదు కాబోలు! కాలేజీ లో చేసి చేసి అలసి పోయాను. ఇంకా ఇక్కడెవరు చేస్తారు?"
తల్లికి నడుం పడుతున్న గీత "అవునే అమ్మా! అది కాలేజీ లో అయితే మసి గిన్నెల దగ్గర్నించి తోమగలదు కానీ ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు వెయ్యలేదు. వంట చేత కాదు కాని చూడబోతే "హూం సైన్సు" వెలగ బెట్టింది!" అంది హేళనగా నవ్వుతూ.
కళకు కోపం వచ్చింది.
"గీతా! మాటలు తిన్నగా రానియ్! వంట చేతగాని దేవరికి? చెయ్యనన్నాను కాని చేత కాదన్నానా?"
"ఎందుకు చేత కాదు? అమ్మా, శారద వూరి కెళ్ళినప్పుడు నీ వంట రుచి చూపించావుగాఅమ్మా! నువ్వూరి కెళ్లటం కాదు కాని ఆ నాలుగు రోజులు మాకు ఉపవాసమే!"
"అప్పుడా? అప్పుడు నాకు కొత్త.... కాలేజిలో అప్పుడే నేర్పారు. ఏ మాత్రం ప్రాక్టీసు లేకుండా నువ్వు మాత్రం చేయగలవా ఏమిటి? ఇప్పుడు చూసుకో! ఎప్పుడూ నాదే ఫస్టు మార్కు, 60% కు తక్కువన్న మాట లేదు. మా మిస్ కు నేనేంటే చాలా ఇష్టం. అంతా నాకు ఫస్టు క్లాసు వస్తుందనుకుంటున్నారు. కూడా!' అంది కళ గర్వంగా చూస్తూ.
"భేష్! నీకే అరవై మార్కులొస్తే శారద కు నూటికి నూరూ ఇవ్వచ్చు అది కాలేజీ లో నేర్చుకున్నదా ఏమన్నానా? శాస్త్రోక్తంగా నేర్చుకుని ఇది చేస్తున్నదిగా చూడాలి? అంతోటి వంటకు బ్రహ్మాండంగా మార్కులోకటి!"
కళ ఉక్రోషం పట్టలేక పుస్తకం మూసేసి, జానకమ్మ దగ్గర కెళ్ళింది. సన్నగా పొడుగ్గా, అందంగా కనబడే కళ ముఖంలో కోపం చిందులు త్రోక్కింది.
గీతను చుర చురా చూస్తూ "దాని కంటే చదువూసంధ్యా లేదు. ఇరవై నాలుగ్గంటలూ వంతుంటి నే వెళ్ళాడుతుంది. అది చేయటం ఏం గొప్ప?' అంది.
గీత వెక్కిరింతగా మూతి తిప్పింది.
"అవునే అదేం గొప్పే? వంట గురించి బోలెడు పుస్తకాలు చడువి వంటింట్లో ఎలా తంటాలు పడాలో తెలియక దిక్కులు చూడ్డం గొప్ప కాని!"
గీత నవ్వుతూ ఉంటె రెండు బుగ్గలు సొట్టలు పడ్డాయి. కవల పిల్లలు కావటం చేత కాబోలు కళ, గీత ఒకే పోలికన ఉంటారు.
"చాల్లేవే గీతా! అక్కడికి నీ గ్రూపేదో గోప్పదైనట్టు ఎందుకొచ్చిన మిడిసి పాటు! అసలు నీ చదువు ఎందుకు పని కొచ్చినట్టు?.... దీని డాబులన్నీ నా దగ్గరే! సంగీతం వాళ్ళని మిగతా స్టూడెంట్స్ ఎంత చులకనగా చూస్తారో నాకు తెలియదనుకున్నది పాపం!"
కోపంతో వూగి పోయేసరికి కళ నెత్తి మీది కుండ కాస్తా పగిలింది. కాస్తా? బ్రహండంగా పగిలింది. ఆడవాళ్ళే ప్పుడూ నెత్తిన ఒక నీళ్ళ కుండ పెట్టుకుని తిరుగు తుంటారు. ఎందుకో మరి!
రామయ్య గారు ఎవరో అబ్బాయిని వెంటేసుకుని ఇంటికి కొచ్చారు. కాస్సేప్పయాక "కళా!" అంటూ కేకేశారు. కళ పమిట చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుని కోపంగా మాట్లాడకుండా కూర్చున్నది. పగిలిన కుండ గమ్మత్తుగా అతుక్కు వొలికిన నీళ్ళ నన్నిటినీ నింపుకుని మళ్ళా నెత్తి నెక్కి కూర్చున్నది. ఆడవాళ్ళ కంతే ! నెత్తి మీది కుండ ఇంతలోనే పగులుతుంది. అంతలోనే మళ్ళా నెత్తి నెక్కుతుంది.
చూసి చూసి రామయ్య గారే లోపలి కొచ్చారు.
"పిలిస్తే ఒక్కరూ ఉలకరు పలకరు, ఎమొచ్చిందర్రా?" అన్నారు విసుక్కుంటూ.
"కళనేగా పిలిచారు? ఒకర్ని పిలిస్తే మరొకరు పరుగెత్తుకుంటూ రావాలా?' అంది గీత.
ఈలోగా ఆయన కళ ముఖం చూసి సంగతంతా ఆకళింపు చేసుకొన్నారు.
"మళ్ళా తగువు లాడుకున్నారా? ఇంకా చిన్నపిల్లల్లా ఎమిటర్రా ఏడుపులూ మీరూను?" అంటూ జానకమ్మ వైపు తిరిగి "నా స్నేహితుడు రాఘవయ్య లేడూ -- అతని కొడుకు సుధాకర్ మద్రాసు చూద్దామని వచ్చాడు. రెండు రోజుల పాటు మనింట్లోనే ఉంటాడు . వాడి ఆలనా పాలనా జాగ్రత్తగా చూసుకోండి." అన్నారు.
తర్వాత అమ్మాయిల కేసి చూసి, "ఎప్పుడనేగా తిన్నాడో తిండి! వాడికి కాస్త కాఫీ, టిఫిన్ తయారు చేసి తీసుకు రండి!' అని వెళ్ళబోతూ మళ్ళా ఆగి 'వాడి కొక్కడికే అనుకునేరు? ఆ చేత్తోనే నాక్కూడా తీసుకురండి!" అని నిష్క్రమించారు.
జానకమ్మ అమ్మాయి లిద్దర్నీ చెరొక రెండు, మొత్తం నాలుగు చీవాట్లు వేసింది.
"వెధవ కుక్క జట్టీలూ మీరూను! ఇంక లేచి వంటింట్లో కి నడవండి. గీతా! నీకెన్ని సార్లు చెప్పినా బుద్ది లేదు! దాని జోలి, దాని చదువు జోలి నీ కెందుకె?....నీకంటే చిన్నది కదా, అదొక మాటంటే పట్టుకుని రాద్దాంతం చేయ్యలటే కళా? చంటి పిల్లలా ఏడ్వాలా?"
"చీటికి మాటికీ పెద్ద దాన్నంటావ్! ఎంత పెద్దదాన్నేమిటి? దాని కంటే ఒక గంట ముందు పుట్టానో , లేదో ఎంతో తేడా ఉన్నట్టు మాట్టాడతావు? అన్నిటికీ దాన్ని వెనకేసుకుని వస్తావు--' అంటూ కళ అక్కడి నుంచి కదిలింది. గీత కూడా కదిలింది.
ఇద్దరూ వంటింట్లో కి వెళ్ళి ఎడ ముఖం, పెడ ముఖంగా కూర్చున్నారు. ఏదో తగువు లాడుకుంటున్నట్టు వినిపించింది కాని దేని కోసమో శారదకు బోధపడలేదు.
"ఏం? అలా ఉన్నారేం?" అనడిగింది.
"నీ గురించే లే తగువు వచ్చింది. నీకు వంట బాగా చేతోచ్చు అని నేనంటే తనకే బాగా వచ్చని కళ కోతలు! పైగా నీకు చదువు సంధ్యా లేదట...."
శారద వంకాయలు తరగటం పూర్తీ చేసి కత్తి పీటను వాల్చి ఓ పక్కగా పెట్టింది. వంకాయలు తరిగిన స్టీలు గిన్నెకు పళ్ళెం తెచ్చి మూత పెడుతూ, "నిన్ననేగా నేను వండిన అరిటి కాయ కూర "రుచీ పచీ" లేదని అంతా అలా పట్టుకెళ్ళి వీదిలో పారేసోచ్చావ్?' అంది.
కళ ఆశ్చర్యంగా చూసింది.
