3
ఆ హాయి ఎంత తాత్కాలికమైనదో అప్పటికి ఆలోచించలేదు. కమలాకరం. హాయిగానే ఇల్లు చేరిన మనసు క్రమక్రమేణా బరువేక్కుతుంటే అదంతా "అమ్మను ఒప్పించడ" మన్న బెంగ అని తట్టింది. కాని ఆనాటికి మౌనంగానే వుండి పోయాడు.
ఏ క్షణాన అటువంటి శుభ ప్రసంగం ఎత్త వలసి వస్తుందో ?-- ఏ సుముహూర్తం లో సాహసం ముంచు కొస్తుందో నని వేచి చూశాడు. ఆ చూడడంలో కాలేజీ కి మూడు రోజులు ఎగనామం కూడా అయింది.
సఫల విఫలాల మాట తర్వాత విషయం. ఆ తరుణం మాత్రం రానే వచ్చింది.
కొడుకు నసుగుడు మాన్పించి సంగతి స్పష్టంగా రాబట్టుకుంది శారదమ్మ. రాబట్టుకున్న తర్వాత ఆవిడకు పుట్టెడు దుఃఖం వచ్చింది.
ముందర తాను కమలాన్ని ఇంత వయసప్పటి నుంచి ఎలా పెంచుకుని వచ్చిందో ఏకరువు పెట్టింది.
ఆ పసివాడి కోసం ఎంత త్యాగమన్నా చేయడానికి తాను వినోద విలాసాల్ని ఎలా దగ్గరకు చేరనివ్వ లేదో వినిపించింది.
తన కంటి దీపం లా పెంచుకున్న కొడుకు, ఇంకా తన కళ్ళకు చిన్నారి కమలుడు. మెట్రిక్యులేషను క్లాసు తెచ్చుకుని మరీ పాసయ్యాడని తెలిసి నప్పుడు, ఆ గొప్ప మాట చెవుల పడీ పడగానే తానెంత ఉబ్బి తబ్బిబ్బయిందో . ఆ పంజరంలో ఎన్ని కలల మెట్లు లిప్టుల ప్రమేయం లేకుండా ఎక్కేసిందో తలుచుకుని కన్నీరు తుడుచుకుంది.
చివరికి "అవునురా నాయనా! అడ్డాలలో బిడ్డలన్నారు గాని, ఆఫీసర్లయినాక బిడ్డలన్నారా?-- "అంటూ శారదమ్మ సాగదీస్తుండగానే , తన నిర్ణయాన్ని అప్పటికి వాయిదా వేసుకున్నట్టు కుర్చీలో సగానికి లేచాడు కమలాకరం.
ఏడుపును దిగుమింగుకుంటున్న అలాటి క్లిష్ట సమయంలో కూడా కొడుకు ఆపసోపాలు గమనించిందావిడ. "కాస్త అగరా బాబూ! ఇవాళ నా కొడుకువి, నా తండ్రివి , రేపు పరాయి వాడివేనెమో-- తల్లి ప్రాణం సంగతి ఈ ప్రపంచంలో ఎవరు తెలుసుకున్నారు గనుకను?-- వెయ్యేళ్ళు వయస్సున్న కొడుకైనా తల్లి కళ్ళకి పసివాడే. చిట్టి తండ్రి!
"అబ్బ-- అవన్నీ ఇపుడెందుకమ్మా ?-- నన్ను వెళ్ళనీ -- మరోసారి ఆలోచించు కుందాం --"
లేచి నిలబడ్డ కొడుకును తడిసిన కళ్ళతో చూస్తూ "నా బాధ అది కాదురా ? మన కులం, మన సంప్రదాయం కాని ఏ పిల్లను నువ్వు కట్టుకున్నా నాకు నొప్పి తప్పదు దిక్కూ మొక్కూ లేనట్టు పెరిగిన కుర్రాడు ఇంతకంటే ఘనకార్యం ఏం చేస్తాడు అని నలుగురూ ఆడి పోసుకుంటే వింటూ నేను తలెత్తు కోగలనా? తలెత్తుకోడానికి బ్రతికుంటానా?--" అంది. ఇక అగలేనట్టు రెండు బొట్లు కళ్ళ వెంట జారి పోయాయి.
కమలాకరం యువక రక్తం అంతసేపటికి గ్గాని వేదేక్కలేదు. "ఇలాంటి విషయాల్లో కూడా పట్లు బడుతూ కూర్చుంటావమ్మా నువ్వు? మన కులంలో మచ్చుకొక అందమైన అమ్మాయి వుందీ -- అందమంటే ఆరుదుగా నన్నా వుందేమో . చదువుకున్న ' పిల్ల ఒక్కర్తి ఉందీ ?--" అనేశాడు ఉద్రేకమంతా వెళ్ళ గక్కుతూ.
"పిచ్చి బాబూ ! నేనంత తెలివి తక్కువ దాన్నటరా ? పెద్ద చదువులు చదువుతున్న నా నాయనకి పల్లెటూరి దాన్ని తెచ్చి ముడి వేస్తానా? ఎంత సత్తే కాలపు మాట!-- ఎటో వెళ్తున్నావేమో -- ఈ ఒక్క మాట చెవిని వేసుకు పోరా? ఈ కంఠం లో ప్రానముండాలి గాని వెదికి వెదికి గాలించి గాలించి అందమైన దాన్ని, చదువుకున్న దాన్ని తీసుకొస్తాను."
"తెస్తావులే-- ఈ మనస్సుకి అశాంతి నే తేఎసుకొస్తావు అనుకుని-- "సరే తర్వాత మాట్లాడదాం -- " అని వెళ్ళిపోయాడు.
4
బీచిలో గడిబిడిగా వుంది. మనస్సుగందరగోళ పడుతున్నది.
తల్లికి నచ్చ జెప్పలేకపోయిన నాలుగో రోజు.
కమలాకరం మెదడులో వసంత. లా క్లాసులు, లాయరు ఎదురుగా వసంతలో తన వాదనలు. పరస్పర పరిచయాలు. అంతరంగికంగా అనురాగాలు అన్నీ సినిమారీల్సు లా కాక రైలు చక్రాలలా బరువుగా రాపిడి గా పరిగెత్తు తున్నాయి.
ఆ అలలెందుకలా మిడిసి పడుతున్నాయో అర్ధం కాలేదు నిన్న మొన్నటి వరకు అది ఆనంద కోలాహలమని అర్ధం చెప్పుకున్న కమలాకరానికి.
తల్లి తండ్రులు పిల్లలకు సగం సుఖాలను మాత్రమె అందజేస్తారు. పరిపూర్ణ సుఖాలు కలిగించినట్టు భ్రమ పడటమే కాక తమ సంతానం చేత భ్రమింప జేస్తారు.
సముద్రం మీద విసుగెత్తి పోయింది. అప్రయత్నంగా అనాలోచితంగా కాళ్ళు దియేటరీ వైపు దారి తీసాయి. బుకింగ్ వద్దకి నడుస్తున్న కమలాకరానికి వసంత కనిపించి మెరుపు మెరిసినట్ట యింది. మెరుపు వెంటనే పిడుగు పడినట్టు కూడా అయింది.
యాంత్రికంగా అనేశాడు "వసంతా" అని.
వసంత కళ్ళతోనే సైగ చేసింది పక్కకు ఆగిపోయాడు.
వసంత పక్కనే ఒక అమ్మాయి వుంది. సన్నగా ఉన్న ఆ అమ్మాయి అప్పుడప్పుడే జీవన వసంతాన్ని తెలుసుకుంటున్న పసిపాపలా స్వచ్చంగా వుంది. కమలాకరానికి ఆ అమ్మాయిని చూడగానే ఇంద్రధనుస్సు ఏడు రంగుల్లో ఒక రంగు, బహుశా ఊదా రంగు ఏమో గుర్తు వచ్చింది.
అతడి సందేహాస్పదమైన ముఖ కవళీక చూచి "మా అత్తయ్య కూతురు? మన కాలేజీ లోనే బి.ఏ ఫైనల్ చదువుతున్నది" అని పరిచయం చేసింది వసంత.
"అవును, ఆ రాక్షస కాలేజీ లో ఎక్కడో చూసినట్టే వున్నాను " అన్నాడు.
ఆ పిల్ల నవ్వింది.
"తమరి సెలవుకు కారణం చెప్పారు కారు -- " అంది వసంత కొంటెగా.
కమలాకరం తెల్ల మొహం పడకుండా జాగ్రత్త పడ్డాడు. "నా సంగతి సరే. నువ్వు ఎంతమటుకు సాధించావు?" అతని ఎదురు ప్రశ్న తో వసంత సంకోచంగా అత్త కూతురు వంక చూచింది.
ప్రతిమ ఓరగా కమలకరాన్ని చూస్తున్నది అప్పుడప్పుడు.
ఇద్దరూ ఒకేసారి తనవంక చూచేసరికి సిగ్గు పడినట్టు తల వంచేసుకుంది.
"అరెరే? న్యూస్ రీలు-" హడావిడిగా ముగ్గురూ హాల్లోకి పోయి సీట్లు తడుముకున్నారు.
జనంతో క్రిక్కిరిసి వున్నది. మూడు నాలుగు సీట్లు ఖాళీగా వున్నవి. అందులోనూ ఒక కుర్చీ సరిగ్గా లేదు. తన వైపుకు వసంత వస్తుందేమో నని ఆశించిన కమలాకరం ప్రతిమ తన ప్రక్కనే కూచోవడం తో కిక్కురుమనలేదు. మరి కొంతసేపటికి ఎక్కడ లేని విసుగు పుట్టింది. వసంత చెప్పబోయే విషయాల కోసం వుర్రుత లూగుతున్న మనసు ప్రతిమ ను క్షమించలేక రకరకాలుగా పోతోంది. అయినా బొత్తిగా అపరిచితుడైన తన ప్రక్కన ఎలా కూచో గలిగిండీవిడ అనుకున్నాడు.
సినిమా మధ్యలోనే దేన్నో వ్యాఖ్యానించింది ప్రతిమ. వసంత "అవునవును" అన్నది. కమలాకరం మాట్లాడక ఊరుకున్నాడు.
ప్రతిమ ఇటు తిరిగి "నాతొ మీరు ఏకీభవించ లేరన్న మాట" అన్నది.
కమలాకరం పొడిగా నవ్వి "ఏకీబవించలేకేం?" అన్నాడు సంగతి అసలు తెలీక పోయినా.
ప్రతిమ సినిమా ఇంటర్వెల్ వరకూ ఎగ్జిట్ వైపు చూచే మిషతో అతన్ని అడపాదడపా చూస్తూనే వుంది.
ఇంటికి వెళ్తూనే అద్దంలో చూచుకోవాలి అనుకున్నాడు కమలాకరం.
లైట్లు వెలగడం తో "ఇప్పుడే వస్తాను' అంటూ ప్రతిమ అవతలికి వెళ్ళింది. కమలాకరం ప్రతిమ కుర్చీ లోకి మారి, "ఏమిటీ వసంత తెచ్చావు నాకోసం ?" అన్నాడు వసంత వైపు తిరిగి రహస్యంగా.
"నువ్వు కలుస్తావని కలగన్నాననుకున్నావా?' అంది వసంత.
కమలాకరం ఇంకా ఏమో అనబోయాడు.
"హుష్ వస్తోంది" అని వారించింది వసంత "మళ్ళీ రేపు సాయంత్రం బీచిలో " అనేసింది త్వరగా -- ఏమీ ఎరగనట్టు సర్దుకుంటూ.
రెండవ భాగం సినిమా అంతా మరింత చిరాకుగా గడిచింది కమలాకరం కి. ప్రతిమ ఈసారి అతని అవతలి వైపున్న వసంతతో మాట్లాడే నెపం మీద మాటిమాటికి ప్రక్కకు తిరగసాగింది.
జైలులో బంధింప బడ్డ ఖైదీల కు వచ్చే కోపం వచ్చింది కమలాకరానికి. కోపం వచ్చినా ఖైదీలు ఏం చేస్తారు.
బయటపడుతూనే హాయిగా ఊపిరి తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే అద్దం చూసుకున్నాడు. ఫక్కున నవ్వో చ్చిందతనికి.
"బాబూ! అన్నం చల్లారేనాయె! ఇకనైనా వస్తావా?"
కమలకరానికి తల్లిని చూసినా భయం వేస్తోంది. రేపు వసంత ను కలుసుకోడం తలుచుకున్నా హడలుగా వుంది.
* * * *
దిగివచ్చిన అప్సరస లా వచ్చిన వసంతను కన్నార్పకుండా చూస్తూ "ఆ మీ అత్తకూతుర్ని వెంటేసు కోస్తావే మోనని ఇంతవరకు మంచం పట్టి వున్నాను" అన్నాడు.
వసంత గులాబీ పెదవులు విచ్చుకున్నాయి . "ఆ-- డానికి మగవాళ్ళతో మాట్లాడట మన్నా, కలిసి తిరగడ మన్నా యిష్టం ...ఒక విలక్షణ మైన హాబీ అనచ్చు."
అలాగా -- ఎలాటి హబీలున్నా మనలాగ ప్రేమించే హాబీ లేదు కదా! అదోక రక్ష !" అన్నాడు....
"నేనొక నిశ్చయానికి వచ్చేశాను కమల్! " అంది గంబీరంగా వసంత.
కమలాకరం ఉలిక్కిపడ్డాడు రెండు విధాలుగా. ఆమె ఒప్పెసుకుంటుందా అని! వసంత తనకు కాకుండా పోతుందా అని!
"మరొక మార్గమేదీ నాకు కనిపించడం లేదు. పరీక్షలు వచ్చే నెలలో అయిపోవడం తోటే , తిరుపతి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం. తర్వాత ఈ ఊరు వచ్చి, మీ వాళ్ళు నిరసించినా, మా వాళ్ళు తిరస్కరించినా ఇక్కడ వుండవద్దు. ఎక్కడ వున్నా మనం మంచి ఆర్జన పరులం కాగలం."
"వసంతా" అన్నాడు కమలాకరం నివ్వెర పోతూ.
"అవును కమల్" నిన్న మావాళ్ళు చూపిన వరుడి ఫోటో నన్ను గాభరా పెట్టేసింది నీ ఉద్దేశ మేమిటో త్వరగా చెప్పు ప్లీజ్."
కమలకరానికి తల్లి దైన్య వదనమూ, ఆవిడ ఆవేదనా పూరితమైన మాటలూ గుర్తురాక పోయినా సరిపోను. కాని అతని అణువణువునా తల్లి ముఖ బింబం ముద్ర పడిపోయింది.
"మా అమ్మకి నేను ఒక్కడ్నే కొడుకునీ. దిక్కునీ అని నీకు తెలుసు వసంతా!" అన్నాడు.
"అదేమిటి?-- అంది వసంత వెర్రిగా చూస్తూ.
"మనం వాళ్ళకీ తెలీకుండా పెళ్లి చేసుకుందాం. అటు పైన వాళ్ళేమన్నా పడడానికి మనం సిద్దంగా వుంటే మంచిది వసంతా! కాలాన్ని బట్టి వాళ్ళూ సర్దుకు పోతారు."
వసంత మొహం ఎర్రబారింది. 'అయితే -- ఇంత చదువూ చదువు కొని అత్తగారి చివాట్లు తింటూ బ్రతక మంటావా కమల్ నీకు ఈ పిరికి మందు ఎవరు పోశారు ?"
"అమ్మే--" అందామనుకుని గొంతుక పట్టుకుపోగా నిలిచిపోయాడు.
"నీకేనా అమ్మ వున్నది. నాకు లేదా ?-- నాకైతే నాన్న , తోడ బుట్టిన వాళ్ళు అందరూ వున్నారు. మమకారాలు ఒడులుకోలేని వాళ్ళు ప్రేమించనే కూడదు" అంది వసంతే తిరిగి.
"నీకు నాకు వున్న తేడా నువ్వు గుర్తించలేదు. నా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మ కళ్ళలో ఒత్తులు వేసుకుని పెంచింది. నా నీడలో కృష్ణా రామా అనుకుంటూ నిశ్చింతగా జీవించడం కోసం కలలు కన్నది చూస్తూ చూస్తూ ఆవిడను ఒంటరి చేసి పోవడం నాకు సాధ్యం కాదేమో వసంతా?"
కొంచెం సేపు సముద్రపు లోతునూ, ఆకాశపు అంతాన్నీ అంచనా వేస్తున్నట్లు ఎటో చూచి అతని వైపు తిరిగింది వసంత "అయితే మీరు ప్రేమించిలను కున్న అమ్మాయిని భరించే శక్తి మీ అమ్మగారికి ఉందా?"
కమలాకరం గొంతుక బొంగురు పోయింది . "చెప్పలేను....." అన్నాడు బరువుగా.
వసంత చిరచిర లాడిపోతూ, "చెప్పలేని వాడివి -- ఒకరోజు నన్ను పిరికి పందగా ఎలా జమకట్టావు? అమ్మ మాట జవదాటలేని వాడివి -- నన్ను ప్రేమించినట్టు చెప్పి -- నేను లేకపోతె బ్రతకలేనట్టు మాట్లాడా వెందుకు?-- నిజానికి మనదేశంలో చదువుకున్న మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే మెరుగు సమయానికి పిరికి మాటలు మాట్లాడడం మనకు సంప్రదాయ సిద్దమే.-- అంది.
అంతటితో ఊరుకోలేదు వసంత. వాగ్దోరణి వ్యర్ధం కాని విధంగా చివాట్ల ఎత్తి పొడుపుల శరపరంపరలతో సత్కరించి "ఇటుపైన మనకేం సంబంధంలేదు" అనేయ గలిగింది.
కమలాకరం ఇంకా అవకాశం ఉందనీ ఆలోచించమనీ పదేపదే ప్రాధేయ పడ్డాడు. వసంత బొత్తిగా వినిపించుకోలేదు.
