Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 2

 

    అసలు నారాయణ శాస్త్రి కి పెళ్ళయిన సంగతే తెలియదు.
    శేఖర్ ను గుర్తించనట్లే ఊరుకున్నాడు నారాయణ శాస్త్రి.
    రెండు మూడు మారులు, "బావా!" అంటూ మాటలు కలపబోయిన శేఖర్ ను కసిరి , "బావా! అంటూ పూసుకు తిరగాల్సిన పని లేదు. నువ్వెవరో, నే నెవరో! సిగ్గుంటే నా జోలికి రాకు!" అని కఠినంగా అన్నాడు నారాయణ శాస్త్రి.
    బావ అంతర్యం ఏమిటో కనుక్కొంటానని చెప్పిన శేఖర్ కు అసలు ఆ అవకాశమే రాలేదు.
    "నీకే ఇంత టెక్కు ఉంటె, ఇరవై అయిదు వేలు నీ మోహన తగలేసిన మా కెంత టెక్కు ఉండాలి!' అన్నట్లుగా శేఖర్ కూడా నారాయణశాస్త్రి ఎవడో తెలియనట్లుగానే గుంభనంగా ఊరుకున్నాడు.
    కాలేజీ కంతా అయిదారు మంది స్టూడెంట్స్ అంటే లెక్చరర్లకు చాలా ఇష్టం. వాళ్ళలో నారాయణశాస్త్రి శేఖర్ ఉన్నారు.

                       *    *    *    *
    ఒకనాడు కాలేజీ లో సారస్వత సంఘ చర్చలలో 'వరకట్నం' అన్న విషయమై చర్చ జరిగింది.
    చాలామంది అబ్బాయిలూ, ఇద్దరు అమ్మాయిలు పాల్గొన్నారు.
    అమ్మాయిలూ తల వంచుకొని, పాఠం బట్టీ పెట్టిన బుద్ది మంతురాళ్ళ లాగా గడగడ ఉపన్యాసం చెప్పారు. ఆ ఉపన్యాసానికి కాస్త కూడా ప్రాణం పొయ్యడానికి ప్రయత్నించలేదు.
    అంతా లాంచనంగా చప్పట్లు కొట్టారు.
    అబ్బాయిలలో శాస్త్రి (నారాయణశాస్తి కి కాలేజీ లో ఉన్న పొట్టి పేరు) ఒక విధంగా , శేఖర్ మరో విధంగా ఉపన్యాసాన్ని దంచారు.
    శాస్త్రి ఇట్లా చెప్పాడు. "కట్నమనే మాట ఈ వేళ ఏర్పడింది కాదు. పూర్వకాలం నుండీ ఉన్నది. రాజులు కూతుళ్ళ కు పెండ్లి చేసి ఏనుగులూ, గుర్రాలూ, మణులూ, మాణిక్యాలూ గట్రా కట్నమిచ్చి అత్తవారింటికి పంపేవారు. కట్నం అంతస్తులకో గీటు రాయి. జీవితాంతం మరో ఇంట్లో జీవితం గడపబోతున్న ఆడపిల్ల కోసం, తల్లిదండ్రులు తమ తమ శక్తి ని అనుసరించి, తమ తమ అంతస్తుకు తగినట్లుగా కట్నమిస్తారు. అందుచేత అత్తగారింట్లో ఆ పిల్ల విలువ హెచ్చుతుంది. 'ఈ పిల్లను మనం ఊరికే పోషించటం లేదు. ఈవిడ ఇంటి నుండి కట్నం తెచ్చింది.' అన్న భావన అత్తగారింట్లో కలుగుతుంది. తను ఊరికే అత్తగారింట్లో పడి తినటం లేదన్న భావం అమ్మాయిలలో కూడా కలుగుతుంది.
    అసలు కట్నమంటే పెండ్లి కూతురి వైపు వారు పెండ్లి కొడుక్కి ఇచ్చే డబ్బు అన్న దూరూహ మనలో చాలా మందికి ఉంది. ఆడపిల్లలను మాత్రం డబ్బిచ్చి కొనుక్కున్నవాళ్ళు లేరూ? 'ఒలి' అన్న మాట తక్కువ కులాల వాళ్ళలో ఎంత తరుచుగా వినిపిస్తుందో మనకు తెలియదుగా! ఎవళ్ళ స్వార్ధాన్ని బట్టి, అంతస్తు ను బట్టి శక్తి ని బట్టి కట్నమిస్తూ ఉంటారు. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు కట్న మడుగుతూ ఉంటారు. ఇందులో  గర్హించదగిన విషయమూ, చర్చించ దగిన విషయమూ ఏమిటో నాకు తెలియాటం లేదు!"
    హాలంతా చప్పట్లతో మారుమోగింది.
    శేఖర్ వంతు వచ్చింది.
    "కొందరి ఉపన్యాసం వింటే నవ్వు వస్తున్నది. మనమంతా భావి పౌరులం . ఈ దేశ గౌరవం మన మీద ఆధారపడి ఉన్నది. మనమీద అంటే మన మేధ మీద అన్నమాట. అట్లాంటి మనం ఇంకా పూర్వకాలం నుండి వచ్చిన ఆచారం అని కట్నాన్ని పట్టుకొని వెళ్ళాడటం మన వ్యక్తిత్వానికే అవమానం! మన పూర్వులు కాలేజీలలో చదవలేదు. ఇంతగా పూర్వచారాన్ని గౌరవించే వాళ్ళం మనమంతా కాలేజీ లో ఎందుకు చదవటం? వాళ్ళలాగే జీవితం గడిపితే సరిపోయేదిగా!
    అంతస్తును  బట్టి కట్నమట! ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవటానికి? మట్టి పాత్ర తీసుకొని అడిగినా, మాణిక్యం లో తొలిచిన పాత్ర తీసుకొని అడిగినా , అడిగేది బిక్షమేగా? ఒక అమ్మాయిని పోషించలేనివాడికి పెళ్ళే మానుకొంటే సరిపోతుందిగా! ఆ అమ్మాయి డబ్బుతోనే ఆ అమ్మాయిని పోషించేటప్పుడు "భర్త" అన్న పదాన్ని నిఘంటువులో నుండి తుడిసి వేస్తె సరిపోతుంది. లేదా మనం 'భార్యలం' వాళ్ళు 'భర్తలు' అని వ్యవహరించుకొంటె సరిపోతుంది.
    మనకేవో కోరికలుంటాయి . అవి తీర్చుకోవటానికి మన చేత గాక, మామగారిని పీడించి డబ్బు గుంజి మన కోరికలు తీర్చు కొంటాము. అల్లుళ్ళుగా మారిన యువకుల ప్రవర్తన మరీ విపరీతంగా ఉండబట్టే, అల్లుళ్ళ ను 'దశమ గ్రహాలు' అంటున్నారు. ఇది కట్నాలు తీసుకునే వాళ్ళకు మంచి గౌరవనీయమైన బిరుదే!
    యువకులలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా లోపించుతున్నవి. మనకు స్వంత అభిప్రాయాలంటూలేవు. తల్లిదండ్రుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నాము. చెల్లెలి పెండ్లి కనో, తమ్ముడి చదువు కనో మొత్తానికి ఏదో ఒక విధాన కట్నాన్ని ముష్తెత్తుతూనే ఉన్నాము. ఇది మనకు అవమాన మన్న మాట మన దృష్టి లోనే లేదు. సిగ్గుచేటు! ఈ వేళ మీ అందరి ముందు ప్రతిజ్ఞా చేస్తున్నాను-- నేను, నాకు నచ్చిన పిల్లను కానీ కట్నం లేకుండా చేసుకుంటాను. దీనికి తప్పినట్లయితే తలిదండ్రులను హత్య చేసిన పాపం నా కంటాలి!" అని ఉద్రేకంగా చెప్పాడు.
    చప్పట్లు మిన్ను ముట్టాయి.
    ఆ ఉద్రేకంలో మరో ముగ్గురు విద్యార్ధులు కూడా తాము కట్నం తీసుకోకుండానే పెళ్ళి చేసుకొంటామని ప్రతిజ్ఞా చేశారు.
    దెబ్బతో శేఖర్ కాలేజీ హీరో అయ్యాడు.
    శేఖర్ ఉపన్యాసం చెబుతూ ఉంటె శాస్త్రి ముఖం వెల వెల బోవటం ఎవరూ గమనించలేదు. కోపం, కసి మొదలయిన భావాలు రంగులు మారినట్లు మారాయి.
    అందరి దృష్టీ మహా ఉద్రేకంగా ఉపన్యాసాన్ని దంచిన శేఖర్ మీదే ఉంది. ఆ సందడి లో శాస్త్రి తప్పించుకొని పోవడం ఎవరూ గమనించలేదు.
    సాయంత్రం అయిదు గంట లయింది.
    అంతవరకూ నిర్జీవంగా ఉన్న హాస్టల్ అప్పుడే కాలేజీ నుండి వచ్చిన పిల్లలతో చైతన్యం పోసుకుంది.
    శేఖర్ ముఖం కడుక్కుని షొప్ కేస్ ఒక చేతిలో టవల్ ఇంకో చేతిలో పట్టుకొని పోతూ ఉండగా రూమ్ మేట్ కేశవ రెడ్డి -- "శేఖర్! నీకో విజిటర్ వచ్చాడోయ్!" అని చెప్పాడు.
    ఆశ్చర్యపడ్డాడు శేఖర్. "ఎవరై ఉంటారబ్బా?' అని ఆలోచించాడు. తండ్రి అయి ఉండడు. వస్తే, ముందే జాబు వ్రాసేవాడు.
    కుతూహలాన్ని ఆపుకోలేక -- "ఎవరోయ్ ? ఆడా? మొగా?' అని అడిగాడు.
    "అబ్బో! ఆడపిల్లలను విజిటర్స్ గా ఊహించేటంత మొగాడి వయ్యవన్న మాట! పాపం! నిరుత్సాహానికి తట్టుకోగలవో, లేదో! నీకోసం వచ్చింది మొగాడే. పైగా ముసలి కంపు కొడుతున్నాడు!" అన్నాడు స్నేహితుడు నవ్వుతూ.
    "ముసిలాయన' అనే టప్పటికి తండ్రే వచ్చాడేమో అని హడావుడి గా విజిటర్స్ రూముకు పరుగెత్తాడు శేఖర్.
    అక్కడో ముసిలాయన చుట్ట కాల్చుకుంటూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుని ఉన్నాడు.
    తండ్రి కాదు. అయితే ఎక్కడో చూసిన ముఖమే.
    ముసిలాయన ఆలోచనలో నుండి తేరుకొని శేఖర్ ను చూశాడు.    
    వెంటనే ఆయనను గుర్తు పట్టి, తన మరుపుకి తనే సిగ్గుపడ్డాడు శేఖర్. అయన తన చెల్లెలు మామగారు, వెంకటరామ శాస్త్రి గారు.
    ముసిలాయన చూశాడో లేదో గాని, శేఖర్ కళ్ళలో తిరస్కారం తొంగి చూసింది.
    "ఏం నాయనా , గుర్తు పట్టావా నన్ను?" వెంకట రామ శాస్త్గ్రి గారు చాలా ప్రేమగా అడిగారు.
    శేఖర్ -- 'అప్పుడేనా మరిచిపోవడం? ఇంకా కొంతకాలం పడుతుంది లెండి!" అని పుల్ల విరుపుగా అన్నాడు.
    బుద్దంటూ ఉన్న ఎవడికైనా ఆ మాటల్లో వ్యంగ్యం అర్ధమవుతుంది. అయితే వెంటక రామ శాస్త్రి గారికి అంత కుశాగ్ర బుద్ది ఉన్నట్టు లేదు.
    "మా శాస్త్రి ఇక్కడే ఉన్నాడు . తెలుసుగా?' అన్నారు.
    "తెలియదు. తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు!" అన్నాడు శేఖర్.
    అప్పటికి చలించలేదు ముసిలాయన.
    "అయ్యో! తెలియదూ? వాడు రూము ప్రత్యేకంగా తీసుకొని ఉన్నాడులే. నువ్వేమో హాస్టల్ లో ఉంటివాయే. అయినా, బావా మరుదులు ఒక ఊళ్ళో  ఉండడమేమిటి? ఒకే కాలేజీ లో చదవట మేమిటి? ఒకరి కొకరు తెలియక పోవడమేమిటి? విడ్డూరంగా ఉందే!" అన్నారు తాపీగా, చుట్ట విసిరేస్తూ.
    "ఆ విడ్డూర మేమిటో మీ వాడినే అడిగి తెలుసుకోలేక పోయారా?" అన్నాడు శేఖర్. కోపం బాగా పొంగు కొని వస్తున్నది.
    "పసిగుడ్డు! వాడికేం తెలుస్తుంది, నాయనా! ఆడపిల్ల విచ్చుకున్న వాళ్ళు, మీరే సర్దుకుని పోవాలి గాని!" అన్నారు శాస్త్రి గారు.
    పొంగుకొని వచ్చే కోపానికి ఇంతవరకూ వేస్తున్న ఆనకట్ట తెగింది.
    పైగా, వారించడానికి పెద్ద వాళ్ళెవ్వరూ దగ్గర లేరు.
    "దున్నపోతులా గున్న మే అబ్బాయే పసిగుడ్డయితే నేనింకా కళ్ళే తెరవలేదన్న మాట! ఆడపిల్ల నిచ్చు కొన్న సంగతీ, కట్నం పుచ్చుకొన్న సంగతీ మా పెద్ద వాళ్ళ దగ్గర మాట్లాడండి. నా దగ్గర కాదు. ముఖం తిప్పుకొని పోయే అడ్డమైన వాళ్ళ వెంట పడటానికి కాదు నే నిక్కడికి వచ్చింది! అసలు మీరు నా దగ్గరికి రావలసిన పనేముంది? మీరు వెళ్ళవచ్చు!" అన్నాడు కసిగా.
    ముసిలాయనకు చీమూ, నెత్తురూ ఉన్నట్టు లేదు.
    "తప్పు నాయనా! నీ కంత ఆవేశం పనికి రాదు. మీ పెద్ద వాళ్ళకి తెలిస్తే బాగుండదు. ఒక ఊళ్ళో ఉన్నారు. వాడి కేమన్నా డబ్బూ దస్కమూ కావాలంటే కాస్త సర్దుతూ ఉండు నాయనా!" ప్రాధేయ పడుతున్నట్లుగా అడిగారు.
    "ఛీ! ఛీ! కట్నం ముష్టెత్తింది చాలక, ఇక్కడ కూడా ముష్టేత్తుతా డన్న మాట మీ అబ్బాయి! ఇంకా కావాలంటే మా నాన్నకు వ్రాసుకోండి. పెద్ద ఆప్యాయతలు ఒలక బోస్తున్నాడని పొంగిపోయి సంచులు పంపుతాడు. ఇన్ని మాటలు నా కనవసరం. మీరు వెళ్ళచ్చు. నా కవతల పని ఉంది." చరచరా వెళ్ళిపోయాడు శేఖర్.
    ముసిలాయన వెళ్ళిపోవటం ఎవరూ గమనించలేదు.
    
                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS