పారిజాతం
--కమలా మణి

స్టాఫ్ రూమంతా అల్లరిగా ఉంది. హెడ్ మిస్ట్రెస్ సెలవుమీద తిరుపతి వెళ్ళారు. అందరికీ ఆట విడుపు! టీచర్లంతా స్టాఫ్ రూమ్ లో చేరితే, పిల్లలంతా కేరింతాలు కొడుతూ ఆడుకొంటున్నారు.
ఇంతలోనే పారిజాతం హడావిడిగా ప్రవేశించింది. పారిజాతం సైన్స్ టీచర్, ఫస్ట్ అసిస్టెంట్. వస్తూనే పెద్దగా నిట్టూర్చి, కుర్చీలో చతికిలపడి, అందర్నీ ఒకమారు కలయచూసింది. తరవాత ఇలా అంది: "వచ్చాడర్రా! ప్రాణేశ్వరుడు!"
పారిజాతం మాటలు అంతా నవ్వారు. అసలు పారిజాతం పెదవి విప్పితే అంతా నవ్వుతారు.
టీచర్లలోకి కాస్త పెద్దదైన జగదీశ్వరిగారు- "ఎవరి ప్రాణేశ్వరుడటా, పారిజాతం?" అంటూ ప్రశ్నించింది.
"మనందరికీ!"
"ఛీ! ఏమిటా కొంటె కోణంగి మాటలు! నోటికి మరీ శుద్దీ బద్దీ లేదు!" పారిజాతం స్నేహితురాలు సత్యవతి కోపపడింది.
ఇంతట్లోనే అక్కడికి ఒక ముసలాయన వచ్చారు. గుబురు మీసాలు. కళ్ళద్దాల వెనక ఉన్న కళ్ళతో దర్పం కనపడుతున్నది. ఆయన రాగానే పారిజాతం లేచి, సగౌరవంగా ఆయన్ని ఆహ్వానించి, అందరికీ పరిచయం చేసింది.
"వీరు ప్రాణేశ్వరురావుగారు. లెక్కల టీచర్ గా పని చేసి మే నెలలో రిటైరయ్యారట. ప్రస్తుతం మన స్కూలుకి లెక్కల టీచర్ గా వచ్చారు."
అందరికీ నవ్వు దాచుకోవటం కష్టమైంది! 'ప్రాణేశ్వరుడొచ్చాడు' అన్న కొంటెమాట అందరికీ ఇప్పటి కర్ధమయింది! అందుకే, పారిజాతం అంటే చాలా మందికి ఇష్టం. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది.
టీచర్లు ప్రాణేశ్వరరావుగారిని, ఆయన ఎక్కడ పని చేసినదీ, కుటుంబం ఎక్కడ ఉన్నదీ, పిల్లలెంత మందీ వగైరా ప్రశ్నలన్నీ వేశారు. అర గంటలో అంతా కొత్తా, పాతా అన్న భేదం మరిచారు.
కాని, సెకండరీ గ్రేడ్ టీచరయిన అనంతలక్ష్మి మాత్రం దూరంగా, ఇంగ్లీషు కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుకొంటూ, ఏమీ పట్టనట్లుగా కూర్చొని ఉంది. ప్రాణేశ్వరరావుగారు ఆవిడవైపు అప్పుడప్పుడూ కుతూహలంగా చూస్తున్నారు.
ఒంటి గంటయింది. గంట చప్పుడు ఇంకా ప్రారంభదశలో ఉండగానే, బిలబిల్లాడుతూ పిల్లలంతా ఇండ్లకు బయలుదేరాడు. మరో అయిదు నిమిషాలకు స్కూలంతా నిశ్శబ్దం అయింది.
అంతా ఇండ్లకు వెళ్ళినా అనంతలక్ష్మి, ప్రాణేశ్వరరావుగారు మాత్రం స్టాఫ్ రూమ్ వదల్లేదు.
కుతూహలంగా ఆమె వైపు చూశారాయన. తదేకంగా పని చేస్తున్నది. మొదట కాస్త సందేహించినా, చివరకు ఆమె దగ్గరకు పోయి పలకరించారు - "ఏమమ్మా! మీరు వెళ్ళలేదేం, ఇంటికి?" అంటూ.
ఉలికిపడి తల ఎత్తి చూచింది అనంతలక్ష్మి. ఆవిడకి కొద్దిగా మెల్లకన్నుందని ప్రాణేశ్వరరావుగారికి తెలిసి పోయింది. శరీరచ్చాయ కాస్త తెల్లగానే ఉన్నా, ముఖంలో ఏదో వికారం కనపడుతూంది. మొత్తానికి చూడగానే పెద్ద సద్భావం కలగదు.
"ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి, మాస్టారు గారూ? కాళ్ళనొప్పులు తప్ప! ఇక్కడే కూర్చుంటే కాస్త పనన్నా అవుతుంది!"
"మరి ఈ పూట భోజనం చెయ్యరా, అమ్మా, మీరు?"
నీరసంగా నవ్వింది అనంతలక్ష్మి. గొగ్గిరి పండ్లు ముఖంలోని వికారాన్ని ఎక్కువ చేశాయి. పుస్తకంలోకి చూస్తూ, "ఒక పూటకే సరిగా తిండి లేకపోతే, ముప్పూటలూ ఎట్లా వస్తుంది, మా లాంటి బీద వాళ్ళకి?" అంది.
ప్రాణేశ్వరరావుగారు మంచి మాటకారి. రెండు గంటలకు పిల్లలూ, పెద్దలూ మళ్ళీ బడికి చేరేలోగా అనంతలక్ష్మి సంగతులన్నీ రాబట్టారు. ఆమె అరమరిక లేకుండా కుటుంబ సంగతులన్నీ వివరంగా చెబుతుంటే, శ్రద్దగా విన్నారు. ఆయన విన్న ఆమె కథ ఇది:
అనంతలక్ష్మి నాన్నగారు రెవెన్యూ డిపార్టు మెంట్ లో పని చేసేవారు. ఇంట్లో పెళ్ళానికి కూడా చెప్పకుండా, గవర్నమెంట్ డబ్బు నాలుగువేల రూపాయలు కాజేశాడు. పై అధికారులకీ సంగతి తెలిసి, అరెస్ట్ వారంట్ పుట్టే సరికి, ఆయన ఎవ్వరికీ చెప్పకుండా పరారీ అయ్యాడు. అప్పటికి అనంతలక్ష్మి స్కూల్ ఫైనల్ చదువుతున్నది. తల్లి నగా నట్రా అమ్ముకొని, ఎట్లాగో అనంతలక్ష్మి సెకండరీ గ్రేడ్ ట్రెయినింగ్ పాసయింది. జిల్లా పరిషత్తు వారి ధర్మమా అని వెంటనే ఉద్యోగం చిక్కింది. ఈ ఉద్యోగం మీద ఆధారపడి తానూ, తల్లీ, చెల్లెలూ, తమ్ముడూ బ్రతకాలి. చెల్లెలు స్వరాజ్య లక్ష్మి పదవ తరగతి (ఫిఫ్త్ ఫారమ్) చదువుతున్నది. తమ్ముడు సుబ్బారావు తన తరవాతి వాడు. వాడు స్కూల్ ఫైనల్ తప్పి, బేకార్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం వెలిగిస్తున్నాడు. ఆస్తి ఏమీ లేదు. బంధు బలగం ఉన్నా ఎవ్వరూ సాయపడలేదు.
'అయ్యో, పాపం!' అనిపించింది ప్రాణేశ్వరరావుగారికి. అనంతలక్ష్మి మీద జాలిలాంటి భావ మేదో కలిగిందాయనకు.
మధ్యాహ్నం పారిజాతం మాష్టారుగారికి టైమ్ టేబుల్ ఇచ్చి, క్లాసులు చూపించింది. మధ్యాహ్నం మొదటి పీరియడ్ లో ఫిప్త్ ఫారానికి లెక్కలు ఉన్నాయి. ఆ పిల్లలంతా గుమ్మం దగ్గర నిలబడి గుసగుసగా మాట్లాడుకొంటున్నారు. కొత్త మాస్టారు గారిని కుతూహలంగా చూస్తున్నారు.
ప్రాణేశ్వరరావుగారు క్లాసులోకి వచ్చి అటెండెన్స్ తీశారు. 'స్వరాజ్యలక్ష్మి' అన్న పేరు రాగానే అప్రయత్నంగా తల ఎత్తి చూశారు. బక్కపలచగా, పెద్ద కళ్ళతో ఉన్న అమ్మాయి కనపడింది. అనంతలక్ష్మి పోలికలు కొట్టవచ్చినట్లు కనుపిస్తున్నాయి.
అటెండెన్స్ వేయడం పూర్తికాగానే ఒక సులభమైన లెక్క ఇచ్చి, త్వరగా వెయ్యమని క్లాసుకు చెప్పారు.
ముద్దుగా, కళగా ఉండే ముఖంతో ఉన్న ఒక చిన్నపిల్ల నిమిషంలో లెక్క చేసి చూపించింది. ఆ పిల్లను చూస్తే ఆయనకు ముద్దయింది. తన కూతురు వత్సల జ్ఞాపకానికి వచ్చింది.
అందరూ చేసి చూపించుతున్నారు కాని, స్వరాజ్య లక్ష్మి మాత్రం కదల్లేదు. ఆయనే ఆ పిల్ల దగ్గరకు వెళ్ళి, పుస్తకంలోకి చూశారు. అంతా తలా తోకాలేకుండా ఉంది.
'రామరామ! ఎంత మొద్దు!' అని మనసులో అనుకొని, బోర్డుమీద ఆ లెక్క చేసి చూపించారు.
తరవాత మరో రెండు లెక్క లిచ్చారు. చిన్నపిల్ల అందరి కంటే ముందు చేసింది. ఆ పిల్ల పేరు 'సంగీత' అని రాబట్టారు. స్వరాజ్యలక్ష్మిలో మాత్రం చలనం లేదు. ఆయనకు విసుగనిపించింది.
సాయంకాలం బడి విడవగానే ప్రాణేశ్వరరావుగారు ఇండ్ల వేటకని బయలుదేరారు. ఏదో సందులో ఇల్లు ఖాళీగా ఉందంటే చూడటానికి వెళ్ళారు. ఇల్లు సుమారుగా ఉంది. దొడ్డిలోనే బావి. నీళ్ళకు ఇబ్బంది ఉండదు. ఇల్లు కాస్త పాతదన్న మాటే కాని, సౌకర్యంగా ఉంది.
హఠాత్తుగా పక్క ఇంట్లోనుండి తిట్లూ, పెడ బొబ్బలూ, ఆడా, మగా గొంతులూ కలగా పులగంగా వినిపించాయి.
ప్రాణేశ్వరరావుగారు ఉలికిపడటం చూసి, ఇల్లు చూపించటానికి వచ్చినావిడ నెత్తిమీద ముసుగు సవరించుకొంటూ, "మాకు అలవాటే లెండి అవన్నీను! దినం ఉన్న ఏడుపే అది!" అని చెప్పింది.
"ఎవరున్నా రవ్వగారూ, ఆ ఇంట్లో?" ప్రాణేశ్వర రావుగారు కుతూహలంగా ప్రశ్నించారు.
"మీ ఇస్కూల్లోనే పని చేస్తున్నదిగా అనంత లక్ష్మమ్మని! ఆవిడే ఉంటున్నది."
ఆవిడ గొంతులో 'అనంతలక్ష్మమ్మ' అన్నప్పుడు ధ్వనించిన నిర్లక్ష్యానికి మాస్టారుగారు కాస్త బాధ పడ్డారు. అవును! బీదవాళ్ళంటే అందరికీ నిర్లక్ష్యమే!
ఆ ఇంట్లోనే చేరా రాయన.
* * *
సత్యవతి, పారిజాతం మాట్లాడుకొంటూ ఇంటి దారి పట్టారు. దారిలో సత్యవతి, "తాటకి" ఎప్పుడొస్తుంది?" అని అడిగింది. 'తాటకి' అంటే హెడ్ మిస్ట్రెస్ మిసెస్ క్రిస్టినా వందనం!
"చేను రేపటిదాకా ఇన్ ఛార్జ్ కాబట్టి ఎల్లుండికి దిగవచ్చు." పారిజాతం అంది.
"అయితే, రే పొక్కరోజే నన్న మాట మనకు ఆట విడుపు!" సత్యవతి దిగులుగా అంది.
విసుగ్గా అంది పారిజాతం: "ఏం ఆటవిడుపో! ఏం పాడో! తలవెంట్రుకలన్ని తప్పుల పట్టిక, ఇటు అనంత లక్ష్మీ, అటు ఏమిలీ తయారు చేస్తారు, చూడు! ఇక ఆవిడ టపాకాయ లాగా పేలుతుంది! ఏమిటో మన బ్రతుకులు! అచ్చంగా బానిస బ్రతుకులు! నీటి బుడగ బతుకులు! ఎప్పుడు టప్పు మంటాయో తెలియదు!"
సత్యవతి మాట్లాడలేదు. పారిజాతం స్నేహితురాలుగా తనకూ ఆ తిట్లలో భాగ ముంటుంది. హెడ్ మిస్ట్రెస్ కూతురు ఎమిలీ సరేసరి! టీచర్ల మీద పితూరీలు మొయ్యటమే ఆ పిల్ల ఉద్యోగం! దానిమీదున్న శ్రద్దలో వెయ్యోవంతు చదువుమీద చూపిస్తే, పంతులమ్మ లకు ఆ పిల్లను శ్రమపడి పైకి నెట్టవలసిన బాధ ఉండేది కాదు!
రాఘవరెడ్డిపత్రం రాగానే పారిజాతం పక్కగా ఉండే సందుదారి పట్టింది. సత్యవతి ఇల్లు ఇంకా కాస్త దూరం. పారిజాతం పోగానే సత్యవతి అడుగుల వేగం హెచ్చించింది.
