Previous Page Next Page 
రంగులవల పేజి 2


    "ఎవరూ?" అంటున్నాడు ఆఫీసరు.
    "సరే, ఫోను పెట్టెయ్యనా?" అంది తులసి.
    "ఊఁ" అంటూ అటువైపు ఫోను పెట్టేశాడు. తులసి ఆఫీసరువైపు తిరిగి "మా ఆయనగారు అంది.
    "ఏమిటి కథ? సాయంత్రం సినిమా ప్రోగ్రామా?" అన్నాడు ఆఫీసరు.
    "కాదండీ. ఏవో ఇంటి విషయాలు" అంటూ గది ఆవలి కొచ్చేసింది తులసి.
    వెళ్ళి లంచి తినేసింది. కాని మనసులో కొంచెం బెంగగా ఉంది. ఎలా అర్లీ పర్మిషన్ తీసుకోవటం? అదీ ఆ సూపరింటెండెంట్ వద్ద? కాని, తప్పదు మరి. నాలుగు ప్రాంతంలో సూపరింటెండెంట్ దగ్గరకెళ్ళి. పర్మిషన్ అడిగింది, చాలా వినయంగా, కొంచెం నవ్వుతూ.
    "ఊఁ. ప్రొద్దున్న గంట లేటు. ఇప్పుడు గంట వుండు."
    "పనుందండీ."
    "ఆ నన్నడగండి" అన్నాడు, తులసికి ఆఫీసర్నడిగే ధైర్యం లేదని తెలిసిన సూపరింటెండెంట్.
    సూపరింటెండెంట్ జిడ్డు మొహాన్ని చూస్తూ నిలబడటం కన్నా ఆఫీసర్నడగటమే నయం.
    తక్షణం ఆఫీసరు గదిలోకెళ్ళి అడిగేసింది.
    ఆఫీసరు మరెవరితోనో ఫోనులో మాట్లాడుతున్నాడు. అయినా అవకాశం విడవకుండా కళ్ళతో చూస్తూ, "సరే"అన్నాడు.
    "ఇక్కడి కిదే గొప్ప అనుకుని ఆఫీసర్ని దాటేసింది తులసి.
    
                             *    *    *

    తులసి ఇంట్లో అడుగెట్టేటప్పటికి అత్తగారు మీద నీళ్ళు పెట్టి కాఫీ పొడుంకోసం వెదుకుతూంది. తులసిని చూడగానే సంతోషంతో "ఏమమ్మా, వచ్చావా? నీ సంసారం నీకే వింటానంటున్నది. రా" అంటూ, "ఏమండోయ్, కోడలొచ్చింది" అని అరిసింది పక్క గదిలో ఉన్న భర్తకు వినిపించేటట్లుగా. "వస్తున్నానత్తయ్యా" అంటూ తులసి టిఫిన్ డబ్బా, పత్రికా టేబులు మీద పడేసి కాళ్ళు కడుక్కుని వచ్చింది.
    "ఇంత ఆలస్యంగా వచ్చేరేం, అత్తయ్యా? ఆయన ఉత్తరం రాసి నెలరోజులైంది" అంది.
    "మా వాడు రాశాడేగాని, నువ్వు రాయలేదుగా? అందుకని మీ మామగారికి కోపం వచ్చి రాలేదు." తులసి నవ్వేసి కాఫీ దించింది.
    "అదేమిటత్తయ్యా ఆయన రాస్తే ఒకటీ, నేను రాస్తే ఒకటీనా! అది సరిగాని మీ కళ్ళు ఎలా ఉన్నాయి?" అంది.
    "ఆఁ. నా కళ్ళూ, నేనూ ఇలాగే ఏడుస్తున్నాం. చెడ్డ దాన్నీకాను, మంచిదాన్నీ కాను" అంది అత్తగారు. "అలా అనకండీ. ఆపరేషన్ చేయిస్తే బాగవుతాయి. నిన్ననే మా స్నేహితురాలి తల్లి ఆపరేషన్ చేయించుకుంది. తరువాత వాళ్ళు కళ్ళజోడిచ్చారు. ఇప్పుడావిడ స్పష్టంగా చూడగలుగుతోంది. ఓ వారం రోజులు హాస్పిటల్లో ఉండాలంతే" అంది తులసి.
    కాఫీ గ్లాసులో పోసి అత్తగారి కిచ్చింది.
    మరోగ్లాసు కాఫీ మామగారికి తీసుకువెళ్ళింది.
    అతను పడకకుర్చీలో నిద్రపోతున్నాడు.
    కాఫీ మళ్ళీ తెచ్చింది.
    "మామగారు పడుకున్నారు" అంది.
    "బాగుంది. అసుర సంధ్యవేళ ఏం నిద్రా!" అంటూ తన కాఫీ ముగించి మొగుణ్ణి లేపటానికి గదిలోకి వెళ్ళింది అత్తగారు.
    వంటకోసం బియ్యం గిన్నెలో పోస్తున్న తులసి ఒక క్షణం అలా నడుస్తున్న అత్తగారిని చూసింది. అత్త పట్ల ఆమెకున్న అయిష్టమంతా పైకి వచ్చింది. తను నవ్వగలదు. కాని ఆమెతో తనెప్పుడూ ఆత్మీయతతో మెలగలేదు.
    "తులసిగారూ, వచ్చేశారా? కొంచెం జల్లెడ ఇవ్వండీ" అంటూ వచ్చింది కమల.
    తులసి జల్లెడ తీసిచ్చింది. కాని కమల పోలేదు.
    "మీవాళ్ళు వచ్చారుగా? ఈ మధ్యాహ్నం మీ అత్తగారేదీ?" అంది.
    "ఎవరూ, కమలమ్మా? వస్తున్నానమ్మా" అని అత్తగారి కంఠం వినిపించింది.
    ఆ క్షణంలో భర్తే రాకపోతే వాళ్ళ సంభాషణ ఎంత దాకా పోయేదో అనిపించింది తులసికి.
    "ఏమమ్మా, ఎలా ఉంది మా యిల్లు?" నవ్వాడు సీతాపతి.
    కాఫీ గ్లాసులు భర్తకిస్తూ, "ఇంద, ఇది మీరు తీసుకోండి. ఇది మామగారికివ్వండి" అంది తులసి.
    సీతాపతి తండ్రిగారి గదిలోకి వెడుతూ, మెట్లు దిగి పోతున్న కమలను పరికించిన సంగతి తులసి గమనించక పోలేదు.
    అత్తగారు కమల వెనకే వాళ్ళింట్లో కాలక్షేపానికి వెళ్ళింది.
    "ఏం బాబూ, నీకేదో ప్రమోషన్ వస్తుందన్నావు? ఏమైంది?" అన్నారు మామగారు.
    "వచ్చేదే, కాని మరో కాండిడేట్ వచ్చాడు. అతడు మా డైరెక్టర్ దూరబ్బంధువు కొడుకట. అందువల్ల ఈ సారికి రాలేదు." భర్త కంఠం.
    "మీకిప్పుడెలా ఉంది, నాన్నా? ఒంట్లో కులాసాగా ఉంటోందా?"
    పక్కవాటాలో మొదట పెద్దగా వినిపించిన అత్తగారి కంఠం, కమల కంఠం అకస్మాత్తుగా తగ్గాయి. తను జాగ్రత్తగా వింటే ఏవో గుసగుసల్లాంటివి వినిపిస్తున్నాయి. ఛీ! ఈ వెధవ గొడవ ఒక్కనాటితో పోయేది కాదు. తను కాపరానికొచ్చినప్పటినించీ ఇంతే! తమకంతగా అనుమానాలుంటే మొహం మీదే అడిగి తేల్చేసుకోగూడదూ? కాని అలా చెయ్యరు. ఎందుకు చేస్తారు? ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పుకోవటం, పైగా ఎవ్వరికీ ఒరిగేదేమీ లేదు, మనఃస్పర్ధలు, మొహమాటాలు తప్ప? కమలకు ఇలాంటివి ఇష్టమని తను మొదటి రోజునే గ్రహించింది. కాని సరైన తోడు లేక పాపం, ఒంటిగా నీటిలోంచి తీసివేసిన చేపలాగా బ్రతుకు తూంది. ఇంక బోలెడు సావాసం. తనూ, ఆయనా ఆఫీసు కెళతారు. మామగారు మంచంలో పవ్వళిస్తారు. ఈవిడా, కమలా మహిళా సభలు ప్రారంభిస్తారు.
    "ఏమిటి, అంత జాగ్రత్తగా వింటున్నావు?" అన్నాడు సీతాపతి. తులసి ఉలిక్కిపడింది.
    "భయపడ్డావా?" అన్నాడు సీతాపతి.    
    "మామూలే మొదలైంది" అంది తులసి.
    సీతాపతి సీరియస్ అయిపోయాడు.
    "నీగురించేనని ఎందుకనుకోవాలి?"
    "ష్ష్!" అంటూ తులసి నోటిమీద వేలుపెట్టింది.
    పీటవేసుకుని కూర్చుంటూ, "నీకు బాగా అలవాటై పోయిందసలు, మా అమ్మను చూడగానే ఏవగించుకోవటం. ఆవిడ వచ్చి ఒక్క రాత్రన్నా గడవలేదు. అప్పుడే ఆరోపణలు. నీకంత ఇష్టం లేనప్పుడు ముందే చెప్పకూడదూ?" అన్నాడు సీతాపతి.
    భర్త విసుక్కోడు. కోపగించడు. తిట్టడు. కాని సీరియస్ గా ఉంటాడు. అలాగే మాట్లాడతాడు. తులసికి అదే అన్నింటికన్నా భయంకరం. తిడితే, కోపగిస్తే ఓదారుస్తారు. కాని ఈ తూచితూచి మాట్లాడటం తను భరించలేదు. తను ఏడిస్తే భర్తకు సానుభూతి లేదు. ఎలా? మళ్ళీ ప్రారంభమైంది.
    "ఇప్పుడు నే నేమన్నానని?"
    తనకు పిలిస్తే వస్తాయి కన్నీళ్లు.
    "వంటైందా?"
    తల ఊపింది.
    "నాకూ, నాన్నకూ వడ్డించు."
    
                               *    *    *

    "అర్జెంట్" అంది నందిని ఓ లెటర్ తీసుకొచ్చి.
    "ఇదిగో, నాలుగు 'ఇమ్మీడియేట్స్' పడి ఉన్నాయి. మొదట 'అర్జెంట్' టైప్ చెయ్యాలా లేక ఇమ్మీడియేటా?" అంది తులసి.
    "అలాగా! అయితే మనం యమర్జంటుగా చెయ్యవలసింది లంచి" అంది నందిని.
    "నువ్వు చేసిరా. ఈలోగా నేను నీ 'అర్జంటు' టైపు చేసి పెడతాను."
    "అదేం, లంచి ఎందుకు చెయ్యవు?"
    "ఆకలిగా లేదు."
    "ఆకలిగా ఎందుకు లేదు? నువ్వు తెచ్చుకోలేదు గనక. అంతేనా?"
    "అదికాదు. నాకు ఆకలిగా లేదు కనకే టిఫిన్ తెచ్చుకోలేదు."
    "పద, పద. నేను తెచ్చాను. ఇద్దరం కొంచెం కొంచెం తిందాం" అంటూ టైప్ రైటర్ లోంచి కాగితాలు లాగేసింది నందిని.
    "ఏయ్, గొడవ చెయ్యక!" అంటూ పక్కనున్న మగ టైపిస్టులను చూపించింది తులసి.
    నందిని కదల్లేదు.
    ఆడవాళ్ళకి వేరే లంచిరూం లేదు. ఆఫీసులోని రికార్డు రూంలోనే ఆ ఆఫీసులోని ముగ్గురాడవాళ్ళూ లంచి చేస్తుంటారు. వీళ్ళ కొలీగ్ పద్మరంజిత మెటర్నిటీ లీవ్ మీద ఉంది. అందువల్ల ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. కుర్చీలు దగ్గిరగా జరిపి ముందరో స్టూలు వేసుకుని దానిమీద టిఫిన్ డబ్బా పెట్టారు. నందిని టిఫిన్ మూత తీసి అందులో కొంచెం ఉప్మా పెట్టి తులసివైపు జరిపింది. ఫ్యూను కూజా, మంచినీళ్ళ గ్లాసులూ పెట్టి పోయాడు.
    "ఇది మూడో రోజు. ఇలా రోజూ నీ టిఫిన్ తినటం ఏం బావుండదు. నన్నింక రేపటినించీ పిలవకూడదు" అంది తులసి.
    "నాకూ అదే అర్ధంకావటం లేదు. ఎందుకు? మీ ఆయనకు టిఫిన్ చేసివ్వటం లేదూ?" అంది నందిని.
    "పోనిద్దూ, ఇప్పుడెందు కవన్నీ!" అంది తులసి, విషయం మార్చడానికి ప్రయత్నిస్తూ.
    "నీ ఇష్టముంటేనే చెప్పు. పైగా, మా వాళ్ళు నా పెళ్ళి చేసేస్తా మంటున్నారు. అందువల్ల తెలుసుకుంటున్నాను, కాపరం గురించిన సమాచారం" అంది నందిని.
    తులసి మాట్లాడలేదు.
    "నువ్వూ మీ ఆయనా పోట్లాడుకున్నారా?" అంది నందిని మళ్ళీ.
    "మా అయన పోట్లాడరు" అంది తులసి. నందిని ప్రదర్శించిన ఆ కొంచెం సానుభూతికీ తట్టుకోలేక పోయిందామె మనసు. ఆమెవేపైనా చూడకుండా తన బాధంతా వెళ్ళకక్కుకుంది.
    "ఆయన పోట్లాడితే నేను సుఖపడేదాన్నే. మా అత్తామామ లొచ్చారుగా? ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు. అందులో మామగారి సంగతెందుకు లే, ఆయన ధర్మాత్ముడు, అత్తగారికి పనిమనిషి చేస్తే కుదరదట. తీసేయించింది. ఇంకెలా చచ్చేది! అంట్లు తోమే పని కూడా నా మెడకే పడింది. మొన్న ఓ నాడు పని తెమలక అత్తగారికి వేరేకూడా, మామగారికి పథ్యం భోజనమూ సిద్ధం చేసేటప్పటికి ఆఫీసు టైమైంది. టిఫిను కాలేదు. ఆ ఒక్కనాటికీ ఎలాగో సర్దుకొమ్మన్నాను ఆయనగార్ని. కాని ఆయన సర్దుకునే మనిషి కాదు. నన్ను అసలు టిఫినే చెయ్యద్దన్నాడు. చేసినా తన కోసం వద్దన్నాడు. నా ఒక్కదానికే ఎలా చేసుకోను?" తులసి కళ్ళలో నీళ్ళు నిండాయి.
    ఫ్యూను టిఫిన్ కడుక్కొచ్చాడు. కాంటీన్ నించి టీ తెచ్చిచ్చాడు.
    "నీ కథ వింటే నాకు భయమేస్తోంది. తులసీ" అంది నందిని.
    "అందరి జీవితాలూ ఒక్కలాగుండవు. ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పగలరు!" అంది తులసి.
    టైప్ చెయ్యవలసిన కాగితాలన్నీ అయిపోయాయి. ఓ పెద్ద స్టేట్ మెంట్ మాత్రం మిగిలింది. అన్ని అంకెలు, వరసలు చూస్తే అప్పుడు టైప్ చెయ్యలేననిపించింది. కాని ఊరికే కూర్చుంటే బావుండదు పైగా, మనసు కూడా మరింత పాడుచేసుకోవటమే కాని కాగితాలు టైప్ రైటర్ లొ సెట్ చేసింది.
    అంత జాగ్రత్తగా అప్రమత్తంగా 'ఫిగర్ వర్కు చేస్తూంటే తన యింటి సంగతులు మరింత బలంగా, స్వేచ్చగా వచ్చేయి మనసులోకి. టైప్ ఆపలేదు. కాని ఆలోచనలూ ఆగలేదు.
    అందరూ వెచ్చగా ముసుగులు తన్ని పడుకుంటే తనొక్కత్తీ ఎందుకు లేవాలి? తను ఉద్యోగం చెయ్యటం లేదూ, సంపాదించటం లేదూ? తనెందుకు వాళ్ళందరికీ ఇలా రెట్టింపు చాకిరీ చెయ్యాలి? కృతజ్ఞత అక్కర్లేదు. కనీసం భర్త తననెప్పుడైనా లక్ష్యం చేశాడా? తన సంపాదన లేకుంటే సంసారం ఎన్ని ఇక్కట్లతో గడిచేదో ఆలోచించాడా? పైగా, తనేం బావుకుంది ఈ నాలుగేళ్ళుగా ఉద్యోగం చేసినా! తన కెంతో ఇష్టమయిన ఆ నెక్లేసు చేయించుకో లేకపోయింది. పెళ్ళి కాకముందు సంపాదించినదానితో పెళ్ళిఖర్చులూ, కొంత కట్నమూ సర్ధగలిగింది. తరవాత డబ్బు భర్తచేతి కివ్వటమేగా? ఇంట్లో తన పెత్తనమయినా ఏముంది? పెత్తన మక్కర్లేదు. కొంచెం తీరిక కావాలి. తన చిన్న చిన్న కోరికలైనా తీరాలి. కాసేపు సోమరిగా పడుకుని కలలు కనగలిగేటంత తీరికైనా కావాలి. మరీ ఇంత యాంత్రికంగా బ్రతకటం దుర్భరం. అత్త ఎందుకలా తనను ఊరికే దెప్పాలి? తన మీద చిలవలూ పలవలూ కల్పించి పక్కింటి కమలతో ఎందుకు చెప్పాలి? అలాంటి వాటా దార్లను భర్త ఎందుకు ఇంట్లో తెచ్చి పెట్టాలి? ఎందుకు ఇంట్లో తన మాట సాగకుండాపోవాలి? భర్త తన తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. తను మాత్రం తన తల్లిదండ్రుల కెందుకు సహాయం చెయ్యకూడదు? తన కున్న ఒక్క చెల్లాయిని - తన పాపను -తెచ్చి ఉంచుకుని పరీక్షకు ఎందుకు కట్టించకూడదు? ఇంట్లో ఇంతమంది తనకు గిట్టనివాళ్ళు తయారైనారు. తన పక్షం ఎవరూ లేరు. పాప వస్తే కనీసం అదైనా తన వైపు ఉంటుంది. ఏడిస్తే తనతోపాటు ఏడుస్తుంది. తను మరీ ఒంటరిదైపోయింది.
    ఆలోచనల ఉద్రేకానికి వేళ్ళు మరింత వేగంగా నాట్యం చేశాయి. సాయంత్రందాకా ముందేసుకుందామనుకున్న స్టేట్ మెంట్ నాలుగింటికే అయిపోయింది. ఇంకా గంటసేపు ఎలా గడపటం? ఈ తీరికను కూడా భరించలేకపోతుందా తను? రాత్రి పడుకునేటప్పుడు భర్తకు చెప్పాలి, పాపను రప్పిస్తున్నానని. ఆయన క్కోపం రావచ్చు. అయినాసరే. ఆపరేషన్ నెపంతో వీళ్ళిక్కడెన్నాళ్ళు తిష్ఠవేస్తారో .... తనకు తోడు కావాలి. పాప కావాలి. పాప రావాలి.

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS