రంగులవల
--ఎమ్. పార్థసారథి

దాచుకోవలసినవేవో, పారెయ్యవలసినవేవో పరీక్షిస్తూ కూర్చున్నాడు. తులసి టిఫిన్ వండి పిలిచినా సీతాపతి లేవలేదు. పాతకాగితాల్లో కొత్త ఉత్సాహం కలిగించే విషయాలేవో కనిపించాయతడికి. తులసి భర్తను మరోసారి పిలవలేదు. తను లేచి వంటసామాను జాగ్రత్తగా ఓ పెద్ద గోనెసంచీలోకి సర్దింది. తమ గుడ్డలనూ, పుస్తకాలనూ మరో రెండు మూడు సంచుల్లో కుదించి కట్టింది. తను చెయ్యవలసిందంతా చేశాననుకుని, "లేవండీ, అలా కూర్చుంటే ఎలా! మీదే ఆలస్యం. లేచి ఉప్మా తిని పని కుపక్రమించండీ" అంది. సీతాపతి మాట్లాడకుండా లేచాడు. భర్త అలా ముభావంగా ఉండటం ఆమెకు కొత్త కాకపోయినా అది ప్రతిసారీ ఆమెను బాధిస్తూనే ఉంది.
* * *

సీతాపతి రిక్షాలకోసం వెళ్ళాడు. పక్కవాటాల్లోని ఆడవాళ్ళు వచ్చి తొంగిచూశారు. తులసి నవ్వింది చాల అసహాయంగా.
"ఏమమ్మా, వెళ్ళిపోతున్నారా?" అంది ముసలవ్వ.
"ఆఁ. వాళ్ళకేం!"
అత్తగారి వెనక నుంచుని అవే మాటల్ని కళ్ళతో పలికింది కోడలు.
ఇంటి యజమాని వాళ్ళు లేరు. వీళ్ళు వెళ్ళిపోవటం-అందులోనూ ఇంత అకస్మాత్తుగా వెళ్ళిపోవటం వాళ్ళ కిష్టం లేదు.
"మీరు ముందే చెప్పాలె. ఇట్లా చెప్పక, చెయ్యక ఖాళీ చేస్తే మాకు కిరాయి పోతుంది. ఒక పదిహేను రోజులు ముందుగా చెప్పవలసింది" అంది ఇంటి యజమానురాలు క్రితం రోజు సాయంత్రం.
"మాకేం తెలుసమ్మా? పోనీ, యిప్పటికి మాత్రం మించిపోయిందేముంది? మరో పదిహేను రోజుల అద్దె తీసుకో. ఇస్తాను" అంది తులసి.
ఆ మాటలు ఇంటావిడకి కోపం తెప్పించాయి. మాట్లాడక ఇంట్లోకి పోయి వీళ్ళమీది కోపంతో పసిపిల్లను బాదింది. పెద్దగోల. అప్పటినించే తులసికి వీళ్ళమీది జుగుప్స రెట్టింపైంది. ఇన్నాళ్ళూ, ఈ సంవత్సరంగా తను వీళ్ళమధ్య ఎలా గడపగలిగానా అనుకుంది. భర్తకు చెప్పాలనుకుంది. కాని అనకాసరంగా మళ్ళీ పోట్లాట. ఇప్పటికే వాళ్ళు తిట్టుకుంటుంటారు. వాళ్ళతో పోట్లాటంటేనే తనకు కాళ్ళు వణుకుతాయి. గోడకు పాకుతున్న మల్లెతీగ ఒక్కటే తులసి ఈ ఇంట్లో ప్రేమించింది. గయ్యాళి అత్తను, అత్త ముందు నక్కినక్కి మసులుతూనే, అత్త వెనక నానా వేషాలు వేసే కోడల్నీ, డబ్బుకోసం ఏ పని చెయ్యటానికైనా వెనుకాడని ఇంటియజమానినీ. అతడి పెళ్ళాన్నీ, కాశీకి వెళ్ళిన మొగుడు వస్తాడనే నెపంతో ఇంకా సింగారించుకు వీథులు తిరిగే వయసు మళ్ళుతున్న పార్వతీకల్యాణమ్మనూ క్షణక్షణం అసహ్యించుకున్నది. ఒక్కో ఇంటి లక్షణమంటారు, ఈ ఇంటి లక్షణమేమో భర్త ఎప్పుడూ తొందరగా ఇంటికి వచ్చేవాడు గాదు. తనేమో ఆఫీసవగానే వచ్చేసి కాఫీ చేసుకుని తాగి అతడి కోసం ఇంత ఫ్లాస్కులో పోసిపెట్టి వంట ప్రారంభించేవి. వంటయ్యేది. ఎనిమిదయ్యేది. చలి మొదలయ్యేది. ఇంట్లో జనాభా నిద్రలు మొదలయ్యేవి. కాని భర్త జాడ ఉండేది కాదు. రేడియో ఎంతసేపని వినటం! అదోపిచ్చి గోల. ఆ కాఫీకూడా తనే తాగేసేది. కళ్ళీడ్చుకుంటూ, మొహం తుడుచుకుంటూ సీతాపతి విసుగ్గా కనిపించేవాడు.
అడిగితే జవాబు చెప్పడు, ఎలా? నిజానికి భార్యా భర్తల మధ్య ఉండవలసిన ఆ "మానసిక సాన్నిహిత్యం" తమకు ఇంకా లభ్యం కాలేదు. పెళ్ళయి అప్పుడే రెండేళ్ళు కావస్తున్నది. లక్ష్మీ ప్రభ ఎప్పుడూ చెబుతూంటుంది తన మొగుడి గొప్పతనం. వారానికి రెండుసార్లు సినిమాకు వెళతారట. ఇంట్లో విసుగొచ్చినప్పుడల్లా హోటల్లో భోజనం చేస్తారట. భర్త తనకు తరుచూ బహుమతులు తెస్తుంటాడట. తులసికీ అబద్ధాలు చెప్పక తప్పలేదు. ఆ లెక్కను సీతాపతి చెడ్డవాడని కాదు. తనను జాగ్రత్తగానే చూసుకుంటాడు. కాని ప్రతిదానికీ పొదుపు అంటాడు. అందుకే కాబోలు అంత పొదుపుగా మాట్లాడతాడు-పెద్ద-ఛీ!!
"పద, రిక్షాలొచ్చాయి" అంటూ కేకవేశాడు సీతాపతి.
* * *
సామాను మళ్ళీ సర్దుకునే వరకు నాలుగైంది. అప్పటిదాకా కష్టపడిన సీతాపతి ఓ సారి కోఠీ కంటూ వెళ్ళాడు. తులసి వరండాలో నిలబడి చుట్టూ పరికించింది. అన్నీ క్వార్టర్సు. అయినా కావలసినంత ఖాళీస్థలం. జనసమ్మర్ధం ఎక్కువగా లేదు. పక్కవాళ్ళింట్లో పెద్ద వేపచెట్టు-వేసవికాలం వస్తేగాని తెలియదు వేపచెట్టు చల్లదనం. ఏయే గదులు అద్దెకివ్వాలో అప్పుడే నిర్ణయించేసింది. వెనక పక్కపక్కగా ఉన్న రెండు గదులూ ఓ వాటా వరండా చివర్ని తడిక కట్టించి మరో చిన్న గదిని వంటగదిగా చేసి మరో వాటా ఆ రెండు గదుల పోర్షన్ కు డెబ్బై రూపాయ లైనా తీసుకోవాలి. ఏం ఆ రెండు చిన్నగదులకూ తాము యాభై ఇవ్వలేదూ! ఆ రెండు పోర్షన్లు పోగా తమకు ఇంకా మూడు చక్కని గదులూ, వరండా మిగులుతాయి. తులసి హృదయం తృప్తితో నిండిపోయింది. ముందర వాకిలీ, అందులో వేయబోయే పూల మొక్కలూ ఊహించుకుంది. కాకపోతే ఆఫీసుకు ఇంకొంచెం పెందరాళే బయల్దేరవలసి ఉంటుంది. అయినా బస్సు లిక్కన్నించే స్టార్టవుతాయి కద!
గేట్ తీసిన చప్పుడైంది. తులసి ఈవలికి వచ్చింది. సీతాపతి ప్రవేశించాడు, సంచీలో కొన్ని అరటిపళ్ళు, యాపిల్సుతో.
"తులసీ, నేనో మంచిపని చేశానోయ్" అన్నాడు.
"ఔను. అరటిపళ్ళు, యాపిల్సు తెచ్చారు. మంచి పనే" అంది తులసి.
"అదికాదు. మన వెనక పోర్షనుంది చూశావూ, ఆదిమా కొలీగ్ ఒకతను తీసుకుంటానన్నాడు."
తులసి మొహం చిట్లించి, కోపంతో, "బావుంది. ఏదో పాతసామాను అమ్ముతున్నట్టుగా చెప్పారా ఏం? మా ఇంట్లో ఓ వాటా ఖాళీ ఉంది బాబూ వచ్చి మమ్మల్ని కృతార్ధుల్ని చెయ్యండి అంటూ. అయినా తెలిసిన వాళ్ళ కిచ్చుకోవద్దండీ, తరవాత మొహమాటా లొస్తాయి" అంది.
"అదేం లేదులే అంతగా కావలిస్తే తరవాత చూసుకోవచ్చు" అన్నాడు సీతాపతి ఆ విషయం గురించి సంభాషణ ముగిస్తూ.
అంతే! తులసి మొగుడి మీద కోపగించుకుంటుంది. అనన్ని కేకలెయ్యగలదు. కాని అంతా అతని ఇష్ట ప్రకారమే. అతడికి అదో సరదా. అతడు సీరియస్ గా ఉన్నాడంటే తన కిష్టమైనా, కష్టమనా నోరు మూసుకుని ఉండాల్సిందే.
"అయితే ఇంక నాన్నకు రాసెయ్యమంటావా, రమ్మని" అన్నాడు సీతాపతి తులసి ముఖంలోకి చూస్తూ.
"మీ యిష్టం" అంది తులసి.
"వండి పెట్టేదానివి నువ్వు. పైగా అర్ధాంగివి. నీ యిష్టం లేకుండా ఎట్లా?" అన్నాడు సీతాపతి.
"పైగా ఇదొకటా! నా యిష్టం మరోలా ఎందుకుంటుంది? అత్త మామలు వచ్చి వుంటున్నా రంటే నాకూ సంతోషమే" అంది తులసి.
"ఆహా! ఈ కలియుగంలో, ఉద్యోగం చేస్తున్న నవనాగరికురాలైన యువతికూడా అత్త మామలకు సేవ చెయ్యాలని వుబలాట పడుతున్నదంటే..." అంటున్న సీతాపతిని మధ్యలోనే ఆపి, "సేవా గీవా ఏం లేదు. వాళ్ళూ వస్తే బావుంటుంది. అందరం కలిసి ఉండచ్చు" అంది తులసి.
టిఫిను, కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. మంచినీళ్ళగ్లాసులు తేవటానికి లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి సీతాపతి ఓ ఇన్లాండుకవరు ముందర పెట్టుకుని కూర్చున్నాడు.
"ఏమని రాయను, మీ కోడలు తులసీదేవి మిమ్మల్ని రమ్మంటున్నదని రాయనా?" అన్నాడు.
"ఏం, అలాగే రాయండి. తప్పేముంది?" అంది తులసి.
"నిజంగా అలాగే రాస్తున్నాను" అన్నాడు సీతాపతి.
"భయపెట్టకండి" అంది తులసి.
సీతాపతి ఉత్తరం ముగించాడు.
"ఇది చేరిన రెండు మూడు రోజుల్లోగా వచ్చేస్తారు" అన్నాడు.
"వాళ్ళకో గది. మన కో గది" అంది తులసి, నోటికి కొంగు అడ్డం పెట్టుకుని.
"మరో మంచం లేదే?" అన్నాడు సీతాపతి.
"పోనీలెండి మన మంచం వాళ్ళ కిచ్చేద్దాం. మన మెలాగో సర్దుకోవచ్చు" అంది తులసి.
2
"కమలగారూ, కొంచెం ఇవి తీసుకోండి. ఆయన అత్తామామల్ని తీసుకురావటానికి స్టేషన్ కెళ్ళారు. నాకేమో ఆఫీసుకు లేటైపోతున్నది" అంది తులసి.
"పోనీ, మీరుకూడా ఉండరాదుటండీ! అత్తగారు మీ కాపురం చూడటానికొస్తుంటే మీరు ఆఫీసుకు వెళతారా!" అంది కమల.
"నాకూ ఉండాలనే ఉందండీ. కాని ఏం చేసేది? సెలవు లై పోయినాయి. లేటుగా వెళ్తే బావుండదు. ఆయనకంటే ఇంకా మూడు సెలవులున్నాయి" అంటూ తాళంచెవులు కమల కిచ్చి తులసి గేటు దాటింది హడావిడిగా.
క్యూను చూడగానే తులసికి గుండె నీరైపోయింది. రెండు బస్సులు నిండినా ఇంకా తనదాకా రాదు. అప్పుడే పదింబావు అయింది. ఆఫీసు చేరేసరికి అరగంటైనా లేటవుతుంది. ఆ సూపరింటెండెంట్ పళ్ళికిలించి "మామూలేగా!" అంటాడు. పక్కవాళ్ళు వెకిలిగా నవ్వుతారు. అంతకన్నా తనకో మెమో ఇస్తే బావుండును. కండక్టరు వచ్చాడు. పర్సు తీసి పాస్ చూపించింది. పర్సులో జాగ్రత్తగా దాచుకున్న ఐదు రూపాయల కాగితం తొంగిచూసింది. అదొక్కటే తనదగ్గిరుంది. నెల గడవటానికి కింకా పది రోజులు కావాలి. అదనంగా చాకిరీ కూడా నెత్తిన పడుతుందేమో ఇంక! అత్తగారి కళ్ళ జబ్బు నయమవుతుందో లేక.... తన వెనకకూడా క్యూ పెరగటం గమనించింది. అప్పుడే రెండు బస్సులు వచ్చి నింపుకుని వెళ్ళిపోయాయి. మరో బస్సు వస్తే ఇంక తనవంతు. కాలనీ చూస్తే చిన్నగా కనిపిస్తుంది. కాని ఇక్కడింతమందిఆఫీసుజనం ఉన్నారు! వచ్చి నెలరోజులైనా తన కెప్పుడూ ఈ కాలనీ అంతా తిరిగి చూసే తీరికైనా కలగలేదు. తీరికలేని బతుకు. పాడు బతుకు. ఎదురుగా స్కూటర్ మీద ఓ అబ్బాయి, వెనక తెల్లకోటున్న అమ్మాయి రఁయ్యిమంటూ మాయమైనారు.
ఇదివరలో అయితే తను బోలెడు ఊహించుకునేది. కాని ఇప్పుడు తన కలలను అణుచుకో గలుగుతున్నది. కనీసం అందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కలలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసివచ్చింది. బస్సు వచ్చింది.
మధ్యాహ్నం తులసి లంచికి పోబోతున్నప్పుడు ఫ్యూను వచ్చి చెప్పాడు, ఆమెకు ఫోను వచ్చిందని తనకు భర్తా, మనోహరీ తప్ప మరెవ్వరూ ఫోను చెయ్యరు. భర్త సెలవుమీద ఉన్నాడు. మనోహరి ఊళ్ళో లేదు. మరెవరు ఫోను చేశారు? ఆఫీసరు పక్కనే ఫోను ఉంటుంది. అక్కడ మాట్లాడుతున్నంతసేపూ తనకు ముళ్ళ మీదున్నట్లుంటుంది. ఆఫీసరు పైకి మంచివాడిలాగే కనిపిస్తాడు. కాని తను నిలబడి మాట్లాడుతున్నప్పుడు నెమ్మదిగా ఓరకంటితో తనను, తన శరీరాన్ని పరిశీలిస్తుంటాడు. తను ఫోను పెట్టెయ్యగానే ఏవో కబుర్లు మొదలు పెడతాడు. కావాలని ఏదో ఫైలు పట్టుకురమ్మని పిలిచి కూర్చోపెట్టి తనచేత వాగిస్తాడు ఆఫీసరు - మంచివాడిలా కనిపించే దుష్టుడు.
తులసి ఆఫీసరు గదిలో కెళ్ళింది.
"తులసీ, నీకు ఫోను వచ్చిందమ్మా" అన్నాడు ఆఫీసరు
తెచ్చిపెట్టుకున్న నవ్వుతో "ఎవరు?" అంది అప్రయత్నంగా.
"నువ్వే కనుక్కో!" అన్నాడు ఆఫీసరు.
ఛ! వాణ్ణి అలా అడగటమే తప్పు.
"ఎవరూ మాట్లాడేది?" అంది తులసి కొంచెం పరుషంగా.
"తులసీ!" అంది అవతలి కంఠం.
"ఔను. ఎవరు మీరు?"
"కొంచెం నెమ్మదిగా మాట్లాడు. అవతలివాడు హడిలిపోగలడు" అంటున్నాడు ఆఫీసరు.
"తులసీ, నేను ఆఫీసు కొచ్చేశాను. పనుంది. మా ఆఫీసరు కబురుపెట్టాడు. నువ్వు సాయంత్రం కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళు. ఇంట్లో అమ్మకి ఏ దెక్కడుందో తెలియదుగా? ఇద్దరు ముసలివాళ్ళూ ఇబ్బంది పడుతుంటారు" అన్నాడు సీతాపతి.
