సత్యవతి తండ్రి బ్రహ్మయ్యగారు. తాలూకా ఆఫీసులో గుమాస్తా పనిచేసి రిటైరైనారు. కొడుకు రామనాధం పధ్నాలుగేళ్ళ వాడుగా ఉన్నప్పుడు మొదటి భార్య చనిపోయింది. తరవాత సత్యవతి తల్లిని చేసుకొన్నాడు. సత్యవతి బి.ఎ. చదువుతుండగా, ఆవిడా చనిపోయింది. దానితో బ్రహ్మయ్యగారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. వయసుకు మించిన వార్ధక్యం ఆయనలో కనపడుతుంది.
ఎప్పుడు సత్యవతి వస్తుందా, గుక్కెడు కాఫీ కాచి ఇస్తుందా అని ఆయన ఘడియలు లెక్కపెడుతూ పడుకొని ఉన్నారు.
ఇంతలోనే వచ్చింది సత్యవతి. ఈవేళ ఆమె కెందుకో ఒళ్లంతా నొప్పులుగా ఉంది. బడిలో మొండిగా అట్లాగే తిరిగింది. ఎందుకో కాని మనసంతా కూడా చిరాగ్గా ఉంది. నీరసంగా, తన కోసం ఎదురు చూస్తూ పడుకొన్న తండ్రిని చూసేసరికి ఆమెకు కాఫీ సంగతి గుర్తు వచ్చింది. ఇంటికి వస్తే గుక్కెడు కాఫీ పోసే దిక్కు లేదు! వెంటనే స్టౌ వెలిగించి, కాఫీ చేసి తండ్రికి ఇచ్చింది.
"ఏమమ్మా! చక్కెర వెయ్యలేదేం?"
తండ్రి స్వరం విని ఉలికిపడి, తన గ్లాసులోని కాఫీని రుచి చూచింది. నిజమే! చక్కెర వెయ్యడం మరిచిపోయింది. స్పూనుతో చక్కెర తెచ్చి, తండ్రి గ్లాసులో వేసి, తన గ్లాసులోకూడా వేసుకొంది.
"ఏమమ్మా! ఈవేళ అట్లా ఉన్నావు? మొహ మంతా పీక్కుపోయిందే!" తండ్రి వాత్సల్యంగా అడిగాడు.
"ఏమో, నాన్నా! ఈవేళ ఒళ్లంతా నొప్పులుగా ఉంది. జ్వరం వచ్చేటట్లు ఉంది. ఫ్లూ ఏమన్నా వస్తుందేమో?"
ముసలాయన మనసు వికలమైంది. పిల్లకు జ్వరం వస్తే, తనను చూసేవారెవరు? పెళ్ళాం పోయిన వాడి గతి ఇంతే! అది ఉంటే, అన్నీ తనే చూసుకొనేది!
హఠాత్తుగా బ్రహ్మయ్య గారి మనసులో ఇంకో ఊహ మెదిలింది. ఆ ఊహ కలిగేసరికి ఆయన సిగ్గు పడ్డాడు. ఎంతసేపూ ఆలోచనలు తన చుట్టూ తిరుగుతున్నాయి గాని, ఇతరుల చుట్టూ కాదు! జ్వరాన పడితే సత్యను చూసేదెవరు? తను ఉన్నా లేనట్లే! ముక్కు తూనే, మూలుగుతూనే పిల్ల ఉడకవేయవలసిందే కాని, తాను ఉండీ దండగే! పిల్ల మెడ కో గుదిబండ!
నెమ్మదిగా బ్రహ్మయ్యగారు లేచి, బియ్యంకుండ దగ్గరకు పోయి, చిన్న గ్లాసుతో బియ్యాన్ని గిన్నెలో వేశారు.
"ఎందుకు, నాన్నా? ఒక అరగంట రెస్ట్ తీసుకొని నేను చేస్తాలే." సత్యవతి నీరసంగా అంది.
ఆయన జవాబివ్వలేదు. నెమ్మదిగా బియ్యాన్ని కడిగి స్టౌ మీద పెట్టాడు. తరవాత సత్య చేయి పట్టుకొని నాడి చూచాడు. ఒళ్ళుకూడా వేడిగానే ఉంది.
వాకిట్లో చెప్పుల చప్పుడయింది. బ్రహ్మయ్యగారు తొంగి చూచారు. పారిజాతం గిన్నెలో ఏదో పెట్టుకొని, లోపలికి వస్తున్నది.
"సత్యా! ఇదిగో, జున్ను. ఏం, అట్లా నీరసంగా ఉన్నావు?"
పారిజాతం మాట వింటూనే, సత్య లేచి కూర్చున్నది. జ్వరం వచ్చినట్లు ముఖంలో స్పష్టంగా కనుపిస్తున్నది.
"బడి నుంచి వచ్చేటప్పుడుకూడా బాగానే ఉన్నట్లుంటివే! ఏమయిందబ్బా! జ్వరం బాగా వచ్చినట్లుందే!" మాట్లాడుతూ సత్యను తాకి చూసింది పారిజాతం.
బ్రహ్మయ్య గారు ఆదుర్దాగా- "ఏమమ్మా! ఇప్పుడెట్లా?" అని అడిగారు.
పారిజాతానికి నవ్వు వచ్చింది. ఉద్యోగ విషయాలు తానూ, సత్యా మాట్లాడుతూ ఉంటే, "మీ కేమీ అనుభవం లేదమ్మా!" అంటూ మాట్లాడుతారు! బిడ్డకు జ్వరం వస్తే, మందిప్పించాలని తెలియదు! తెలియక కాదు, కంగారు.
"కంగారు పడకండి, నాన్నగారూ! సత్యను డాక్టర్ వాణీ శారద దగ్గరకు తీసుకుపోతాను. పొద్దుటి కంతా తగ్గిపోతుంది." బ్రహ్మయ్యగారిని పారిజాతం 'నాన్న గారూ' అనే పిలుస్తుంది.
కండువా మీద వేసుకొని, జట్కా కోసం బ్రహ్మయ్యగారు బయటికి నడిచారు. నీరసంగా నడుస్తున్న ఆయన మనసులో కొడుకు రామనాధరావు మెదిలాడు. తల ఊపుతున్న కళ్ళజోడు వ్యక్తి దగ్గరికి వచ్చి టక్కున ఆగిపోయింది ఆమె దృష్టి.
* * *
రామనాథరావు బ్రహ్మయ్యగారి మొదటి భార్య కొడుకు. రామనాథం మామగారు విశ్వేశ్వరరావుగారు తాసీల్దారుగా పనిచేసి, తాతల నాటి ఆస్తిని బాగా ఎక్కువ చేశారు. అత్తగారు అన్నపూర్ణమ్మ ఆ పేరునే చెడగొట్టింది. పిల్లికి బిచ్చం పెట్టదు! అల్లుడి స్నేహితులు వస్తే, ఒట్టి నీళ్ళ కాఫీ ఇస్తుంది. వాళ్ళా కాఫీని తాగలేక వదిలివేస్తే, "నిక్షేపంలాంటి కాఫీ పారబోస్తున్నారు. డబ్బు విలువ తెలిస్తేగా!" అని గొణుగుతుంది.
విశ్వేశ్వరరావుగారు బ్రహ్మయ్యగారి మొదటి భార్యకు దూరపుచుట్టం. రామనాథం పధ్నాలుగేళ్ళ పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి పోయింది. ఏదో పనిమీద ఆ ఊరు వచ్చిన విశ్వేశ్వరరావుగారు, పరమార్శించటానికి బ్రహ్మయ్యగారి ఇంటికి వచ్చాడు. ముద్దుగా, బొద్దుగా ఉండి, బుద్దిగా చదువుకొంటున్న రామనాథాన్ని చూసిన తరవాత, ఆయన కా కుర్రాడిని తన అల్లుడుగా చేసుకోవాలనిపించింది. ఆయన ఏకైన పుత్రిక వెంకమ్మ అయిదో తరగతి తప్పి, ఇంట్లో ఉంది. రామనాథాని కాపిల్ల నిచ్చి, ఇల్లరికం ఉంచుకొంటే, పిల్ల కళ్ళఎదటే ఉంటుంది. తమ ముద్దూ, ముచ్చటా తీరుతాయి. అల్లుడిని చదివినంతవరకూ చదివించుకోవచ్చును.
ఈ ఆలోచన బ్రహ్మయ్యగారికి బ్రహ్మాండంగా నచ్చింది. నాన్న తనను బి.ఎ. చదివిస్తాడా, చదివించడా అని మథనపడుతున్న రామనాథాని కీ కబురు అమృతం జల్లులాగా పనిచేసింది. ఇల్లరికం అంటే తెలియదు. జీవితం అంటే తెలియదు. పెండ్లి అంటే అసలే తెలియదు. తెలియదు అని అనడంకన్నా ఊహించటానికి ఇష్టపడలేదంటే బాగుంటుంది! లోతుగా ఆలోచిస్తే, అటు బ్రహ్మయ్యగారికీ, ఇటు రామనాథానికీ కూడా సాధక బాధకాలు తెలిసేవేకాని, స్వార్ధం పనిచేసి, ఆలోచనశక్తి నడ్డగించింది. అందుకని ఎగిరి గంతేసి, ఇద్దరూ పెండ్లికి ఒప్పుకొన్నారు.
మామగారి సాయంతో రామనాథం ఎమ్.ఎ.చదివాడు. క్లాస్ వచ్చింది. అంతా పెండ్లి జరిగిన వేళావిశేషమని సంతోషపడ్డారు.

కొంతకాలందాకా అత్తవారిల్లు పూలపానుపులాగే తోచింది రామనాథానికి. కాని, క్రమంగా ముళ్ళు గుచ్చుకోసాగాయి. మారుటితల్లి చనిపోయినప్పుడు, తండ్రి దగ్గరకు పోవడానికి ఇంట్లోవాళ్ళకి ఆలోచించవలసి వచ్చింది! డబ్బు సరిగ్గా లెక్కచూసి, రానూపోనూ ఖర్చులకు ఇచ్చారు.
రాత్రి గదిలోకి మంచినీళ్ళ చెంబుతో వచ్చిన భార్యతో కోపంగా అన్నాడు: "మా చెల్లెలు ఉందికదా! రానుపోను ఖర్చుల కిస్తే, దాని చేతిలో ఏం పెట్టను?"
వెంకమ్మ తాపీగా నవ్వింది. అనాకారి కాదు కాని, పెద్దరూపసి కాదు. కాని, మనిషి బాగాలావు. సిమెంట్ దిమ్మలాగా ఉన్నది. మంచం పక్కనే ఉన్న స్టూలుమీద చెంబుపెట్టి. భర్తతో, "చేతుల్లో పెట్టేదేదో మా వాళ్ళు పెళ్లినాడే పెట్టారు. ఇంకా ఏం పెట్టాలి?" అని అంది.
చిరాకుతో అన్నాడు రామనాథం: "ఏం పెట్టారబ్బా, మీ వాళ్ళు?"
నవ్వుతూ వచ్చింది జవాబు. "దొరగారికి జ్ఞాపకం లేదా? లేక తెలియదా? పెళ్ళినాడు అయిదు వేలు మీ వాళ్ళకిచ్చారు. ఆ తరవాత మీ బాధ్యతంతా మాదేగా!" దర్పం కనబడింది మాటలలో.
మొట్టమొదటిసారిగా తన పొరపాటు తెలియ వచ్చింది రామనాథానికి.
మారుటి తల్లి కర్మలకు వెళ్ళినప్పుడు, సత్యవతిని చూడగానే, చిత్రమైన అనుభూతి కలిగింది. చక్కని చెల్లెలు, "అన్నా" అంటూ కూడా తిరుగుతూ ఉంటే, కబుర్లు చెబుతూంటే, తల్లి పోయినందుకు దుఃఖంతో ఏడుస్తూ ఓదార్పు కోసం తన దగ్గరికి వస్తూ ఉంటే, రామనాథానికి, స్వార్ధంతో తాను పోగొట్టుకున్న స్వర్గము, తండ్రి పోగొట్టిన స్వర్గము ఏమిటో తెలిసింది!
స్వార్ధం ఉన్నవాళ్ళెప్పుడూ తెలివితక్కువ వాళ్ళు కారు. అందుకనే, తిరిగి రాగానే రామనాథం కాలేజీలో లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాడు. విశ్వేశ్వరరావుగారి అల్లుడు కాబట్టి, వెంటనే ఉద్యోగం వచ్చింది.
"ఏం, నాయనా, మాటమాత్రం చెప్పకుండా ఉద్యోగంలో చేరావా? ఇక్కడ నీ కేం లోటు? పోనీ, మామగారితో చెప్పకపోయినావా? ఏ ఉద్యోగం కావాలంటే, ఆ ఉద్యోగం ఇప్పించేవారుగా!" అని అత్తగారు అన్నం వడ్డిస్తూ దీర్ఘాలు తీసింది.
సరసనే కూర్చుని భోజనం చేస్తున్న వెంకమ్మ, "ఇప్పుడీ ఉద్యోగం మాత్రం నాన్న పేరు వినే ఇచ్చారులేవే! కౌసల్య చెప్పింది. కమిటీ సూటింగులో ఈయన ఫలానా వారి అల్లుడన్న సంగతి తెలిసిన తరవాతేట ఈ ఉద్యోగం ఇచ్చారు! రేప్పొద్దున్న ఏవో విరాళాలంటూ వెయ్యో, రెండు వేలో గుంజుతారు! అంతా తెలిసిందేగా!" అని అందుకొంది.
రామనాథానికి నిజంగా ఒళ్ళు మండింది. ఆ కోపంలో విచక్షణ జ్ఞానం నశించి అన్నాడు: "పోతే పోయిందిలే! ఆస్తి ఉండి ఎవరి నుద్దరించాలి? పిల్లా జెల్లా మనకు? ఏమైనా పుణ్యకార్యాలకిస్తే, ఫలమన్నా దక్కుతుంది."
తోకతొక్కిన తాచులాగా లేచింది వెంకమ్మ. "మనం సంపాదించిన మూటలన్నీ అట్లాగే దానాలు చేద్దాము లెండి! మన ప్రయోజకత్వం అంతలో ఉంది మరి! దరిద్రపు పాదం ఎక్కడున్నా అంతే! సంతానయోగం నాకులేదు. పోనీ, నన్ను వదిలేసి ఇంకొకత్తెను కట్టుకోండి! ఆహఁ! మళ్ళీ అది పనికిరాదు! ఆస్తి అంటే పైకి హేళన! లోపల కాపీర్ణం!" అంటూ గట్టిగా అరిచింది.
తినే తినే అన్నాన్ని వదిలి వెళ్ళిపోయాడు రామనాథం. డబ్బుకు అమ్ముడుపోయిన తనకు, డబ్బు పుష్కలంగా చేతిలో మెదిలేదాకా ఆత్మాభిమానం ఉండటానికి వీలులేదు. అంతదాకా అత్తగారి ఇంటి చెర తప్పదు!
రాత్రి గదిలోకి మామూలుగా వచ్చింది వెంకమ్మ. "ఏం, అలక పెండ్లి కొడుకుగారూ! అలక తీరిందా?" అంటూ నవ్వింది.
రామనాథం జవాబు చెప్పలేదు.
మళ్ళీ వెంకమ్మే అంది: "చూడండీ! నేను చదువు కోని దాన్ని. మీరు బాగా చదువుకొన్నవారు! ఇంత చదివినా ఆడదాన్ని అర్ధం చేసుకోలేని చదువులు! 'గొడ్రాలు' అనేమాట ఆడది సహించలేదు. స్వయంగా భర్తే అంటే ఆడది పడే బాధ మీ కేమి తెలుస్తుంది? ఎత్తిపొడుపుల వలన, మన మధ్య పోరుపులే కాని లాభం ఏమీ లేదు!"
రామనాథం ఉలకలేదు, పలకలేదు.
కాస్సేపాగి వెంకమ్మ- "ఏమండీ! మీ సవతి చెల్లెలూ, నాన్నగారూ బాగున్నారా? మీ చెల్లెలి నో మాటు పిలుచుకు రాలేకపోయారా?" అంది.
"నేనే మీ ఇంట్లో పడి తింటూ మీ ఆస్తికి కన్నం వేస్తూంటే, మా చెల్లెలు కూడా ఎందుకులే? ఖర్చులో ఇంకో ఖర్చు!"వెటకారంగా అన్నాడు రామనాథం.
ఇంతదాకా నోరులేని ఈ పిట్ట ఈవేళ బాగా కూత పట్టిందన్న సంగతి గ్రహించిన వెంకమ్మ ఇక మాట్లాడలేదు.
కాలేజీలో చేరిన రెండు నెలలకు రామనాథం ఐ. ఎ. ఎస్ పరీక్ష వ్రాయడం, సెలక్ట్ కావడం, డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం రావడం-అంతా సినిమా రీళ్లలాగా జరిగింది. వీటన్నిటిలో మామగారి పేరు సూదిలోకి కూడా రాలేదు.
రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయె ముందర, భార్యతో "వస్తావా నాతో? లేక ఇక్కడే ఉంటావా?" అని అడిగాడు.
డిప్యూటీ కలెక్టర్ గారి భార్య పోకుండా ఉండగలడా? అసలు ఆ ప్రశ్న ఏమిటి?
డిప్యూటీ కలెక్టర్ గారి భార్య పేరు వెంకమ్మా? రామ రామ! తల్లిదండ్రులు పిల్లలకు నాజూకు పేర్లు ఎందుకు పెట్టరో! తెలిసీ తెలియని వయస్సులో ఏమోకాని, పెద్దయిన తరవాత పేరు చెప్పేందుకు సిగ్గుపడేవా రెందరు?
వెంకమ్మ పేరు మారి 'లలిత'గా రూపొందింది. లావుగా ఉన్న అమ్మగారంటే నౌకర్లందరికీ హడల్!
ప్రస్తుతం రామనాథం హాస్పిటల్లో ఉంటున్నాడు. సంపాదనపరు డయ్యేటప్పటికి, బాధ్యతలు ఎక్కువయ్యాయి. బాధ్యతతో పాటు తండ్రీ, చెల్లెలూ మరుపున పడ్డారు. తన భార్య తప్ప వేరే సంతానం లేని మామగారి ఆస్తిమీద కన్ను పడింది. భార్యతోకాని, అత్తమామలతోకాని కలహించి లాభం లేదని గ్రహించి, ప్రేమ నటించడం నేర్చుకొన్నాడు. తనతోపాటు క్లబ్బులకు, పార్టీలకు లలితను తీసుకుపోవడం మొదలు పెట్టాడు. లలితకూడా పక్కా సొసైటీ లేడీ లాగా మారింది.
ఇదీ సత్యవతి అన్నా వదినెల పూర్వచరిత్ర. ఈవేళ బ్రహ్మయ్యగారి కీ కొడుకు జ్ఞాపక మొచ్చాడు. కొడుకు దగ్గరుంటే నౌకర్లూ, చాకర్లూ అంతా బాగానే ఉంటుంది కాని, కోడలుపిల్ల నిర్లక్ష్యం సహించరానిది. చిన్ననాడే ఇతరుల కప్పజెప్పిన కొడుకుతో కోడలిమీద ఫిర్యాదు చేయడం అవివేకం! తన కా హక్కు లేదు. అందుకే సత్య మెడకు గుదిబండలాగా వేళ్ళాడుతున్నాడు తాను.
* * *
