నేను ఈ బరువుని యింకా యెంత కాలం మోయను? నాన్న నన్ను రంపపు కోత కోసి కాకులకి, గ్రద్దల కి వేస్తారనేది నూటికి నూరు పాళ్ళు నిజం. మనకి నీతిగా రివాజుగా పెళ్లి కాకపోవడం వల్లే ...యెంత అనర్ధం వచ్చింది నాకు. ప్రపంచం లో యెంతో మంది పిల్లల కోసం తపించి పోతుంటే వాళ్లకి కావలసింది, నాకు అక్కరలేనిది .....
'లేదు జానకీ యీ విధంగా నైనా యిక నా బంధాన్ని త్రెంచు కోలేవు. మీ నాన్న కాదు, ఆయన్ని పుట్టించిన జేజెమ్మ వచ్చినా నా నుంచి దూరం కాలేవు.'
జానకి కళ్ళు మిలమిల లాడాయి. 'భలే వారే ఏవిటో ఆ నమ్మకం?
'గోపాలం జానకిలో ప్రవేశించాడు. ఆ గోపాలాన్ని ''కాదనగలిగే శక్తి నీకు లేదోయ్!'
అతని గుండెల్లో యిమిడి పోతూ అక్కడే కలలు గన్న జానకి ని గోపాలం కంటికి రెప్పలా ప్రాణాతీతంగా చూసుకున్నాడు. విధి వెక్కిరించి అతన్ని సవాల్ చేస్తుంటే తను యెదిరించలేక దారిద్ర్య బాధని మరిచిపోయే ప్రయత్నం లో వొకఅడుగు పాతాళం లోకి వేసి మరో మెట్టు దిగజారి పోయాడు పుష్టిగా, అందంగా ఆరోగ్యంగా వున్న గోపాలానికి బియ్యే చదువు సుఖాన్ని యివ్వ లేకపోయింది. అందుకే అతను హైదరాబాదు వెడుతూ అక్కడే కొన్నాళ్ళు గడుపుతూ ఆ రోడ్లని పావనం చేసాడు. అంతటితో వూరుకోలేదు భూమిలోకి కూరుకు పోతుందా? అనిపించేటట్లు వుండే ఆ యింటిని, అల్లంత దూరాన్నుంచే భయపెడుతూ యినుప గజ్జెల తల్లి చప్పుడు వినిపిస్తుంటే అక్కడికి వెళ్లేందుకే గజగజ లాదిపోయేవాడు. అప్పుడు...యింక తప్పనిసరి అయి మైకం లో వచ్చేవాడు.
జానకిని అతను అన్యాయం చేశాడంటే అది అతనికే అంతు చిక్కని ప్రశ్న అయిపొయింది. ఎన్నో సార్లు వొకే సైకిలు మీద కాలేజీ కి కొంతదూరం వరకూ తీసుకు వెళ్ళిన తను యిప్పుడు వొంటరిగా దిగబడి పోయినందుకు విచారించడం కాదు, హృదయం చితికి పోయేటట్లు విలపిస్తున్నాడు. శ్రీనివాస్ అర్ధం చేసుకోలేని వయసులో మిధ్యా వస్థలో ఉండి పోయాడు.
జానకిని యెవరూ దహనం చేసే యేర్పాట్లు చేయలేదు. మానవుడి కనీస ధర్మం కూడా మరచిపోయారు ఆ వాడలో వుండేవాళ్ళు. బండిని తెప్పించి కూతురూ కొడుకూ చేత సుమంగళి గా ముస్తాబు చేయించి అంతులేని సముద్రం లాంటి దుఃఖాన్ని హృదయంలో పదిల పరుచుకుని స్మశానం వైపు మళ్లాడు గోపాలం.
నిలువెత్తు మంటల మధ్య జానకి అహర్నిశలు ఆలోచించిన ఆదర్శాలూ, అనురాగాలూ, బంధాలూ యివన్నీ నలిగిపోయి జానకి తో పాటు మసిగా మారి మసి అయి పోయి భూదేవి లో కలిసి పోయాయి.
* * * *
చాలామంది బంధువర్గం జానకి బౌతిక దేహం పూర్తిగా ఆ యింట్లోంచి నిష్క్రమించాక గోపాలం చుట్టూ చేరారు.
-- మీరు యెన్నైనా చెప్పండి. పద్దెనిమిదేళ్ళ కొడుకు, అంటే నాకు రేపో మాపో కోడలు వచ్చే వయసు వస్తుందనే నమ్మకం పోలేదు. మా పిల్ల సరస్వతి పద్నాలుగు దాటలేదు. యించుమించు నా కొడుకుతో సమానంగా వున్న ఆ పిల్లను చేసుకుందుకి .....ఛీ! నా మనసు వోప్పుకొదు. అసలు నేను యే మాత్రం జ్ఞానం వున్నా అలాంటి పనులు చేయను. క్షమించండి శాస్త్రులు గారూ! మా అబ్బాయిని చదివించాలి లేకపోతె నేను ఆ పిల్లనే కోడలుగా తెచ్చుకునే వాడిని.'
"మరోలా అనుకోవద్దు. మీకు పుణ్యం వుంటుంది నన్ను ఆ విషయం లో ప్రోత్సాహం చేయకండి.' గోపాలం రెండు చేతులూ జోడించాడు నమస్కారం చేస్తూ.
మధ్యవర్తి శాస్త్రులు గారు నవ్వారు: 'అదేవిటోయ్ ? నీకు తెలియదూ? మీ పిన్ని మా పెద్దమ్మాయి కన్న పదినెల్లు చిన్నది'
'ఆరోజులు వేరు ఆ తీరే వేరు. కాలం మారిపోయింది. అనవసరంగా ఆడపిల్లల గొంతు కోయడం నాకు యే మాత్రం యిష్టం లేదు. ఆ పిల్లకీ మనసు వుంది. నాలాంటి వయసు మళ్ళిన వాడితో తనేం సుఖపడుతుంది?'
"జీవితం అంటే బొమ్మలాట కాదు. బొమ్మల పెళ్లి అవగానే పందిరి పీకేసిందుకు. ఆ పిల్లని నేను చేసుకోలేను.'
'వాళ్ళు నీమీద ఆశలు పెంచుకున్నారు గోపాలం. చక్కని చుక్క లాంటి పిల్ల దారిద్ర్యం బాదన తీర్చుకోలేని ఆ పిల్ల తల్లి తండ్రులు సంఘం పొడుస్తుంటే నిన్ను బ్రతిమాలాడుకుంటున్నారు. ఆ పిల్ల కన్నె చేర విడిపించి యీ తాకిడి నించి వాళ్ళని రక్షించు. మొన్న జానకి సంగతి చూశావు కదా. మళ్ళీ మాలో కలిసిపో; 'భీమ శంకరం జోక్యం చేసుకున్నాడు.
గోపాలం ఆలోచనలు ఆరోజు మీదికి మళ్ళాయి. అక్కడే టక్కున ఆగిపోతూ, మడీ, ఆచారం , సంప్రదాయం, యేమరు పాటున కూడా పొల్లు పోనీయని జానకిని మోసేవాళ్ళు లేక బండిలో వేయించి తోలించాడు స్మశానం వైపు.
'పిల్ల అందం చూస్తె .'
భీమశంకరం మాటలకి నవ్వుకున్నాడు మనసులోనే. పైకి, 'చూడు భీమ శంకరం! నీకు నన్ను మన కులం లో కలపాలని వుంటుంది కాదనను. కానీ అందం వుంది కదా అని యింత దారుణం.... యేమో నేను చేయలేనోయ్' అన్నాడు.
భీమశంకరం తాపీగా అన్నాడు : 'అది కాదు బ్రదర్. ఆ పిల్లని యెవరూ చేసుకోరు అదంతే.'
అందం మీదా, పెళ్లి మీదా , నాకు యింటరెస్టు లేదు. నా దగ్గర యింక యీ గొడవ ఎత్తొద్దు."
అతను వదిలి పెట్టలేదు, సుభద్ర తండ్రి భీమశంకరానికి రెండు వందలు ముట్టజెప్పాడు. 'దూరం ఆలోచించు గోపాలం. ఆడదిక్కు లేని నువ్వు సంసారం తో పడే బాధలు. సుభద్ర తండ్రి ప్రాధేయ పడుతున్నాడు. నీ పిల్లకీ చేయాలి పెళ్లి. ఆడపిల్ల తండ్రిగా ఆలోచించు. ప్రపంచం అంతా స్వార్ధం తోనే వుంది. నా మటుకు నేనూ అంతే. ఇంట చాకిరీ కోసం, పరువు ప్రతిష్ట ల కోసం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం లో తప్పేం వుంది?'
గోపాలం తల పంకించాడు. ఐదు నిమిషాల తరువాత నెమ్మదిగా తల పైకి లేవనెత్తి, 'సుభద్ర ను నేను చేసుకుంటాను. సరస్వతి ని నీ కోడలుగా చేసుకుంటా నని మాట యిస్తావా?' అన్నాడు గోపాలం ఆశగా భీమశంకరం వైపు చూస్తూ.
చాలా జాగ్రత్తగా సమాధానం యిచ్చాడు భీమశంకరం. 'చూడు గోపాలం మనం యిరుగుపోరుగూ వాళ్ళం. స్నేహితులం అంతకు మించి నీకు నేను సలహా యివ్వ గలను. మాట పడగలను. ఆజ్ఞాపించ గలను.'
'మనకాలం మారిపోయింది. మరో తరం వస్తోంది ముందుకి. నా మాటకి నువ్వు యిచ్చే పాటి విలువా, గౌరవం నా కొడుకూ యిస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. జానకికీ నీకూ పుట్టిన పిల్లను నా కోడలుగా చేసుకోవడం లో నేనేమీ వెనక్కి అడుగు వేయను.'
గోపాలానికి అర్ధం కాలేదు భీమశంకరం అతి తెలివి! 'చూడండి శాస్త్రులు గారూ నన్ను కొంచెం ఆలోచించు కొనివ్వండి' అన్నాడు లోపలికి వెడుతూ.
వచ్చిన యిద్దరూ వెళ్ళిపోయారు. శ్రీనివాస్ పూర్తిగా విని నవ్వుకున్నాడు మనసులోనే. తండ్రి యీ వేడిలో యిలా అన్నాడే గానీ తప్పకుండా సుభద్ర ని చేసుకునేది నిజం. కానీ భీమశంకరం యెంత జాగ్రత్తగా మాట్లాడాడు? శ్రీనివాస్ ఆలోచనలు పరిపరివిధాల సాగిపోయారు.
* * * *
రెండు వారాలు శ్రీనివాస్ యింటికే రాలేక పోయాడు. అతను కష్టపడి రాత్రిళ్ళు చదువుతాడు. అంతేకాదు పాత యజమాని రిక్షా అమ్మేయడం లో మరో మనిషిని పట్టుకుని రిక్షా యిప్పించుకుని యీ రెండు వారాలు కూడబెట్టిన డబ్బుతో సరస్వతి కి రెండు చీరలు పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చి స్తంభించి పోయాడు. శ్రీనివాస్ కి తెలిసిందే అయినా ఆ జరగడం యింత త్వరగా అనుకోలేదు. వాకిట్లో పందిరి యింకా వూడదీయలేదు. గడపకు వుంచిన తోరణాలు గాలికి గలగల లాడుతున్నాయి. 'సరస్వతి వీదిలోంచే కేక పెట్టాడు శ్రీనివాస్. అతనికి చాలా సిగ్గుగా , కొత్తగా వుంది యింట్లో అడుగు పెట్టేందుకు . అందంగా అలంకరించు కుని వున్న అందాన్ని రెట్టింపు చేసుకుని కళకళ లాడుతూ పచ్చని గాజులు శబ్దం చేస్తుంటే వీధిలోకి వచ్చింది. 'మీరు' సుభద్ర చూపులు శ్రీనివాస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.
శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడు. ఆవిడ వైపు చూసేందుకే సిగ్గుగా వుంది. స్వరాన్ని తగ్గించేసి నెమ్మదిగా అన్నాడు: 'మా నాన్న గోపాలం గారు'
సుభద్ర లోపలికి వెళ్ళిపోయింది. ముందు గదిలోకి వెళ్లి అక్కడే వున్న తల్లి ఫోటో వైపు చూస్తుంటే అతని గుండెల్లో పేరుకున్న కఠిన శిలలాంటి బాధ తాలూకు లావా ఏదో వెన్నలా కరిగి కళ్ళ గుండా ప్రవహించి చెంపల మీద పడుతున్నాయి. బొట్లు బొట్లుగా రాలి : 'నిజమే అమ్మా నువ్వు బ్రతికి సాధించలేని సుఖాన్ని చచ్చి సాధించావేమో' అతను మనసులోనే గోణుకున్నాడు. తండ్రి గొంతు పక్క గదిలో ఖంగు మంటోంది. గాజుల చప్పుడు చెవులకి వినిపిస్తూనే వుంది; 'సరస్వతీ ' శ్రీనివాస్ మరో కేక వేశాడు. తిరిగి తిరిగి వస్తే కాఫీతో యేదురయ్యే సరస్వతి కనిపించకపోగానే దొడ్డి గుమ్మం వేపు తొంగి చూశాడు. బావి లోంచి నీరు తోడి మేటేడు అంట్లు ముందుకు వేసుకుని తోముతున్న చెల్లెల్నీ చూస్తుంటే గట్టిగా కౌగలించుకుని భోరున యేడ్చేయాలని పించింది. పదిహేడేళ్ళ అతనికి అంతర్గతంగా బయలుదేరిన మగవాడు అనే 'అహం' అడ్డు రాగానే పెదాలని పళ్ళతో ఆణిచేసి దుఃఖాన్ని గుటకలు వేస్తూ వచ్చిన దారినే కడుపు లోకి పంపించేశాడు. ఇది ప్రపంచం లో సర్వ సామాన్యంగా జరిగే నగ్న సత్యం బాధపడేందుకు కేమీ లేదు అద్భుతంగా యిందులో. సరస్వతి తల్లి మంచం మీద ఉన్నప్పుడే నడ్డి విరిగే చాకిరీ చేసేది. యిప్పుడు యిందులో కొత్తేమీ లేదు. తండ్రి నవ వధువు ని సంతోష పెట్టడం కోసం సరస్వతి ని అజ్ఞాపించినా అందులో అర్ధం యెంతైనా వుంది.
"ఇలారాసరస్వతి ' భాత్రుప్రేమ పొంగి పొర్లు కుంటూ వచ్చేసి అహాన్ని కొట్టి పారేసింది.
'అన్నయ్యా వచ్చావా!' సరస్వతి పరుగున వచ్చేసింది.
"ఇలారా నీకో మంచి బహుమతి తెచ్చాను. యేమిటో చెప్పుకోవాలి' శ్రీనివాస్ వూరిస్తున్నాడు.
