'నన్నిలా బ్రతకనివ్వాలని లేదా?'
"రొంప తో బ్రతకానివ్వాలని లేదు'
'హా'
'శుభంగా రొంప లేని ముక్కుతో బ్రతకండి. అప్పుడు ముక్కుతో ప్రాణ వాయువు పీలుస్తారు. ప్రాణ వాయువుతో రక్తం శుభ్రపడి ఒళ్ళంతా ప్రాకుతుంది. ఉత్సాహంగా ఉరకలు వేస్తారు. పూలవాసనలు చూస్తారు, ప్రకృతి అందాన్ని కన్నీరు లేని కళ్ళతో తిలకిస్తారు.'
'మీరో కవిగా పుట్టవలసింది మహానుభావా!'
'నేను కవినే!'
'కసి కాదు కదా?'
'అంత అదృష్టమా? కోతుల కున్న అభిమానం మనుషుల కేక్కడుంది? మీరో జామకాయ విసరండి. కోతి అందుకొని చూసిన చూపు చూడండి. మనిషి అందుకుని చూసిన చూపు చూడండి. మనిషి మరిచి పోతాడు. కోతి మరిచిపోదు.'
'మీతో మాట్లాడుక్కూర్చుంటే నాకెలా అవుతుంది?' అంటూ కదల బోతుంటే
'మందు అక్కర్లేదా?'
"చూడనియ్యండి!'
శ్రీనివాస్ పొడుం డబ్బీ విప్పి చూపిస్తూ 'ఒక్క పట్టు పీల్చండి' అన్నాడు. నర్సు ఒక్క పట్టు పీల్చింది. అదేతడవుగా తుమ్ములు ప్రవాహం లా రాజోచ్చినాయ్. ఆమె తుమ్ములతో వెర్రెత్తి పోతుంటే వార్డు లో ముగ్గురు పేషెంటు లే కాక చాటుగా తోటీలు, వార్డు బాయ్ అంతా కడుపు చెక్కలయ్యే టట్లు నవ్వసాగారు. ఆమె రుమాలంతా తడిచి పోయింది. కళ్ళు యెర్రనయ్యాయ్. బుగ్గలు కంది పోయాయ్. ముఖం, మచ్చలతో సొట్టలు దేరిన యేపిలు పండులా పెట్టి అక్కడ నించి వెళ్ళిపోయింది.
'అంత పనెందుకు చేశారు?' అన్నాడు సూర్యం.
'ఆమెకు గర్వం ఒక్క విషయం లో వుంటే బాగుండేది. అన్ని విషయాల్లోనూ వుంది. ఆమె తెలివితేటలూ పరీక్షిద్దామని యింత పని చేశాను' గొణిగాడు శ్రీనివాస్.
'ఆడవాళ్ళ తో అడుకోగలరు అదృష్టవంతులు ' అన్న సూర్యం మాటలకు శ్రీనివాస్ ఒకసారి అతని ముఖం వేపు చూసాడు. ఆ ముఖం చిరునగవు తో వెలుగుతోంది. అదే శ్రీనివాస్ ముఖం లో కరువు కాగానే సూర్యం ఆలోచనలో పడ్డాడు. ముఖంలో మార్పులు తెర మీద బొమ్మల్లా కదలసాగాయ్. ఒక వ్యక్తిని చూడగానే ఆకారం మనసులో హత్తుకుంటుంది. మాటాడగానే ఆకారం మనసులో కదులుతుంది. ఇంకా అతని మనసును అర్ధం చేసుకుంటే ఆ ఆకారం ఎదుటి వానిలో ఐక్యమౌతుంది. ఐక్యం కాగలిగే సన్నిహితత్వం యింకా వాళ్ళిద్దరి లో పాతుకోక పోయినా , అలా కావాలనే కోర్కె యిద్దరి లోనూ కలగసాగింది.
శ్రీనివాస్ కస్సేపయ్యాక మూగ బాసల నుండి బయటపడి 'శెట్టి గారి సంగతి మీకు తెలీదు కామోసు గొప్ప పిరికి ఆయనకు. ఈవేళ కళ్ళు మూస్తే రేపటికి రెండో రోజు. ఈ గుడ్డ చిరిగి పొతే యింకో కొత్త గుడ్డ వస్తుందన్న ఆత్మవిశ్వాసం లేకపోతె యెలా చెప్పండి? చేతకాని వాళ్ళలా మనం చావు గురించి యేడుస్తూ కూర్చుంటామా?'
'శెట్టి గారు కాస్త, కాళ్ళ వేపు వచ్చి బొంగురు గొంతుతో 'అయ్యా-- మీ పేరు సూర్యం గారు కదూ -- సూర్యం గారూ -- పిల్లా, పాపాకని పెంచి పెద్ద చేసి, ఇల్లూ వాకిలీ, సంసారం -- డబ్బు ఘనతా , కీర్తీ అంతా నాది అనుకున్నాక -- బాధపడకుండా చచ్చి పోమంటారు శ్రీనివాస్ గారూ. అయ్యబాబోయ్ -- భయ పడకుండా నేను ఏదీ సంపాదించ లేదు- సుఖపడలేదు. భయపడకుండా సచ్చీపోను.'
సూర్యం చిన్న నవ్వు నవ్వాడు. ఆసుపత్రి లో చావు బ్రతుకుల మధ్య కొట్లాటలు నిత్యం జరుగుతుంది. ఈ నిత్య సంగ్రామంలో కారే రక్తం, రాలే కన్నీరు తో కలసి వరదలై పారుతుంటుంది. వరదలు మనుషులు పండించుకునే పంట పొలాల మీద పారి, ముంచి భీభత్సం చేస్తాయ్. ఆశతో యెదురు చూస్తున్న హృదయాలు ఆ పారే శబ్దం వలన వచ్చిన హోరుతో అల్లకల్లోలమై పోతాయి. ఈ ఆసుపత్రి యెంత విచిత్ర మైనది. ఇది ఒక తెల్లని కిరణం. తెల్లని కిరణం లో దాగున్న అన్ని రంగుల్లా మనిషి నుండే అన్ని అనుభూతులనూ యేవో వొక పాలు లో అందిస్తుంది. సుఖంతో పాటు దుఃఖం, దుఃఖం వెంట వైరాగ్యం, వైరాగ్యం వెంట ఆశ, ఆశ కడుపులో నిరాశ, నిరాశ హృదయం లో కోరిక౧ కోరికతో కృంగు పోతున్న జీవం పెనుగు లాడి పెదవి పై చిరునగవు వెలగ బోస్తుంది. ఆసుపత్రే కాదు. మనిషికి సంబంధించిన వన్నీ విచిత్రామైనవి. మనిషే విచిత్రమైన వాడు!
ఈ చిత్ర విచిత్ర మైన మనిషి, చిత్ర విచిత్రమైనవి అల్లుకున్నాడు. జీవిత విధానం లో , వూహల్లో, మనసులో మాటల్లో, మెదడు లోని విజ్ఞానం లో చివరకు అగడపని ఆత్మ లో కూడా చిత్ర విచిత్రమైన జీవితాన్ని సృష్టించుకున్నాడు.
ప్రక్కనున్న ఖాళీ మంచం , యీ మంచం పై నున్న తను, ఎదురుగా శెట్టి గారూ, శ్రీనివాస్ యీ చిత్ర విచిత్రమైన జీవితంలో అంతర్భాగాలుగా యే అర్ధాలను సృష్టిస్తారో? సృష్టి వలన మనిషి ఉద్భవిస్తాడు. ఏదో సృష్టించనిది మనిషి చావడు.మళ్లీ సృష్టించటానికే చచ్చిపోతాడు. సూర్యం ఆవేళ సూర్యోదయం తరవాత చేసిన పనులు, ఆలోచనలు, పొందిన అనుభవాలూ పైకెగసి యెగసి పడమట కు దిగజారుతున్న సూర్యుని లానే కృంగ సాగినాయ్. శక్తి వుడిగి ప్రాకుతూ పోతున్న దినకరుని పై మబ్బులు దాడి చేసినట్లు సూర్యం కు నిద్ర మబ్బులు ముంచు కొచ్చాయ్.
అతను సాయంత్రం కాఫీ త్రాగాడు. రోడ్డు వేపు కటకటాల తలుపు గుండా చూసాడు. రోడ్డు వెనక యింకో వార్డు అవరణ లో పెరిగిన బూజు చెట్లు . ఆ చెట్ల పై వ్రాలె పక్షులు, వ్రేలాడే కాయలు, రాలే ఆకులు, మొలిచే చిగుళ్ళూ చూసాడు. ఎండకు మెరిసే పచ్చదనం వానకు తడిసి, చలిగాలికి వణికే చెట్లను వూహించు కున్నాడు. కాస్త లేచి నిల్చొని పరీక్షగా చూస్తె దూరాన ప్రకృతి పచ్చదనపు పొట్టని చీల్చుకుని పైకెగసిన నీలి కొండలు, కొండల పై తబ్బిబ్బయిన మబ్బులు, మబ్బుల మధ్య చిక్కుకున్న దినకరుని దైన్యంతో యెరుపు దేరిన బింబం! ఇంత అందం కొన్ని నిముషాల తరువాత నోరు తెరచుకుని దాగున్న చీకటి కడుపు లోనికి పోసాగింది. ఇది ఒకసారి జరగదు. రోజూ సూర్యుడు ఉదయిస్తాడు. మళ్ళీ కృంగి పోతాడు. ఈ మధ్యలో ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం -- తరవాత చీకటి అలుము కుంటుంది. చీకటి చావు. మళ్లీ ఆత్మ ఉదయిస్తుంది.- మనిషిగా ప్రకాశిస్తుంది-- మళ్లీ సాయంత్రం -- తరవాత చీకటి!
* * * *
చీకటి పడ్డాక సూర్యం పదే పదే ప్రక్క మంచం వేపు చూడసాగాడు. కబుర్లు చెప్పడానికి శ్రీనివాస్ జ్వరంతో పడి వున్నాడు. సాయంత్రమైతే జ్వరం యీ మధ్య అతనికి ముంచు కోస్తోందట. అతని దగ్గర చాలాసేపు కూర్చున్నా ఖాలీ మంచం ఏదో ఒకసారి కనిపిస్తోంది. ప్రక్కన శెట్టి గారి సంగతి చెప్పక్కర్లేదు. సాయంత్రమే అతని విషయం బాగా తెలిసిపోయింది. భార్య, పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు అంతా మందగా వచ్చి పడ్డారు. చూడటాన్కి వచ్చే వాళ్ళ లెక్క లేదు. స్వజనం ముందు శెట్టి గారు కన్నీరు తెచ్చుకున్నారు. మనిషోలా ధైర్యం చెప్తున్నారు. వేలైనా, ఖర్చు పెడ్తామని కొడుకులు హామీ యిస్తున్నారు. చెప్తున్నంత సేపు శెట్టి గారి దృష్టి ఎదురుగా వున్న ఖాలీ మంచం పై ఉంది. బలవంతంగా అపుకుందామన్న ఆ దృష్టి అటువేపే వుంది. వాళ్ళు వెళ్ళిపోతూ ఒక కుర్రవాడ్ని శెట్టి గారి దగ్గర విడిచి పెట్టేసారు. వాడికి పన్నెండేళ్ళు ఉంటాయి. పెద్ద డాక్టరు పర్మిషన్ తీసుకుని ఉంచారు. శెట్టి గారికి రాత్రుళ్ళు కాళ్ళు ఒత్తడానికి , అవసరమైనవి అందివ్వడానికి -- 'వెధవా- నిద్ర పోకుండా -- ఏం చెప్తే అది చెయ్యరా?' అని వార్నింగ్ యిచ్చి మరీ వెళ్ళారు. ఒకరు కాదు అందరూ వాడికి విధులను చెప్పి వెళ్ళారు.
ఒంటిగా శ్రీనివాస్ దగ్గర కూర్చుంటే రాత్రి డ్యూటీ నర్స్ మాటి మాటికి వచ్చి చూస్తోంది. తల మీద ఐస్ బేగ్ పెట్టింది. అలా కొంతసేపయ్యాక శ్రీనివాస్ పలవరిస్తున్నాడు. వినగానే సూర్యం ఓ క్షణం నిర్విన్నుడయ్యాడు. అతని ఊహలలో సతమతమవుతుండగా శెట్టి గారి టోకుర్లు వినిపించినాయ్. కొంత సేపయ్యాక దగ్గుతూ లేచి 'రామం' అని మూలిగాడు. అప్పటికే కుర్రవాడు పక్కన పెద్ద కిటికీ వరండా లో పడుకున్నాడు.మళ్లీ మూలిగ్గానే సూర్యం అతని దగ్గరగా వెళ్లి 'ఏం కావాలండి శెట్టి గారూ?' అని అడిగాడు.
'ఎవరు ? మీరా? చిన్న బాబు పడుకున్నాడా?'
శెట్టి గారికి బాగా తెలివి వచ్చింది కామోసు 'కుర్రాడు....కుర్రాడండి.'
'పని కుర్రాడా?'
శెట్టి తల వూపాడు.
'పడుకున్నాడు. ఏమి కావాలి చెప్పండి? నేను చేస్తాను.'
'మీరా? వద్దు --'
'ఫరవాలేదు-- సంశయించ కండి.'
'మీరు పెద్ద ఆఫీసరు వారు-- ,మీచేత సేవ.'
'సేవకు హోదాలతో ముడి పెట్టాకండి. హర్లిక్సు కలపాలా?'
'హా' అని తల వూపాడు. సూర్యం హార్లిక్స్ కలిపి అతని నోట పోసాడు. త్రాగాక 'శ్రమ పెట్టాను' అన్నాడు.
సూర్యం చిన్న నవ్వు నవ్వి అతని పై దుప్పటి కప్పుతూ 'పడుకోండి -- చాల రాత్రయిందని' తన మంచం వేపు వెళ్ళాడు. ఒకసారి బాత్ రూమ్ కు వెళ్ళాడు. కారిడార్ ను దాటి వెళ్లేసరికి జనరల్ వార్డు ఎదురైంది. మంచాలే కాకుండా వరండాల మీద రోగులున్నారు. ఒకడు బాధతో మూలుగుతున్నాడు. ఆ ప్రక్కవాడు జీవస్చావం లా పడున్నాడు. క్రింద నున్నవాడు కుండంత పొట్టతో నిలువున పడుకున్నాడు. ఇంకొకడు నల్లులను తిడ్తూ పరుపు మీద దొర్లుతున్నాడు. రాజకీయాలిద్దరూ చర్చించు కుంటున్నారు. ఒకచేయి చావు, యింకో చెయ్యి బ్రతుకు పట్టుకుని లాగుతున్న ఒక వ్యక్తీ ప్రాణ వాయివు గొట్టాలు ముక్కులో పెట్టుకుని పెనుగు లాడుతున్నాడు. ఇలా రకరాకాల వ్యక్తులు, రకరకాల బాధలు, రకరకాలుగా అనుభవిస్తున్నారు.
సూర్యం దిగి 'సి' వార్డు లోనికి వచ్చేసరికి వరండా లోని దీపం కాంతే వార్డులో పడుతోంది. ఆ వెలుగులో దెయ్యం లా ఒక వ్యక్తీ తన పరుపు దగ్గర నిల్చున్నాడు.
'ఎవరు నువ్వు?'
'తోటీని'
'రాత్రి డ్యూటీ వాడవా?'
'అవును బాబూ!'
'ఇక్కడేం నిల్చున్నావ్?'
'మీకు తెలీదా బాబూ?'
"ఇంకా వుంటాను కదోయ్'
'ఏమో బాబూ> మాము అరుగురం'
'నాది పెద్ద జబ్బు కాదోయ్- టెస్టులకి వచ్చాను.'
'అది కాదు బాబు-- మీరిచ్చినప్పుడికి మేం వుంటామో లేదో?'
'వెళిపోతే యిస్తాను.'
'మా రివాజు యిది'
'ఏది?'
'ముందుగానే పుచ్చుకోడం'
'ఇవ్వకపోతే'
'తమరిక్కడ వుండలేరు'
'ఏం?'
