Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 2

 

    దీనంగా చూస్తూ , ప్రాధేయ పడుతూ , నేను మాట్లాడనందుకు ఎంతగానో బాధపడసాగాడు ప్రసాదు. అయినా ఏం జరుగుతుందో చూడాలనే ఆదుర్దాతో అలాగే చూపులు తప్పించుకోసాగాను.
    'అమ్మాయి గారూ! నిజంగా నేను చేయరాని నేరమే చేశాను. మీరు కోరిన చిన్న విషయాన్ని నెరవేర్చలేకపోయాను. మీకు కోపం తెప్పించాను. దానికి తగిన శిక్ష అనుభవిస్తాను......'    
    వేగంగా నడుస్తూ వెళ్ళిపోసాగాడు ప్రసాదు. ఆ క్షణం లో నా మనసు భయంతో వణికి పోయింది. ప్రసాదు తెగింపు తత్త్వం గల వ్యక్తీ. వెంటనే లేచి అతనిని వెంబడించాను. తన గదిలో ఉన్నట్లు గ్రహించి అటు వెళ్లాను. కాని ఆలస్యం జరిగింది. తలను ఉదృతంగా టేబులుకు వేసి బాదేస్తున్నాడు. చూడలేకపోయాను. నొసలు చిట్లి గాయమై రక్తం కళ్ళ మీదుగా కారి బుగ్గల పై చారలు కట్టింది. ఆ దృశ్యం చూసి కొయ్యబారి పోయాను. వెళ్ళి గట్టిగా పట్టుకున్నాను. నా మెదడు పనిచేయడం మానివేసింది. ప్రసాదు పై కోపం మంచు లా కరిగిపోయింది. దీనంగా , ప్రేమ నిండిన చూపులతో ప్రసాదు ను చూస్తూ ' నన్ను మన్నించు ప్రసాద్! నా మూర్కత్వానికి సిగ్గు పడుతున్నాను .'
    'అంత మాటనకండి. అసలు నాదే మూర్కత్వం. మీ కోరిక నిరాకరించడం. అటువంటి పొరపాటు యింకేప్పుడూ జరగనివ్వను. మీరు కోరినట్లే సినిమాకు వెడదాం ....ఎప్పుడు వెడదామంటారు?'
    "ముందు ఆ గాయం మాననివ్వు ....ఆ తర్వాత వెడదాం.'
    రెండు రోజులు గడిచి పోయాయి. ఆ రెండు రోజులూ ప్రసాద్ గాయానికి నేనే టిన్ క్చరు అయోడిన్ వేసి దూది అతికించాను. అడిగిన వారందరికీ జారిపదినట్లు గా చెప్పుకున్నాడు పాపం! ఒకరోజు ప్రసాదే సినిమా విషయం గుర్తుకు తెచ్చాడు -- నే నడ్డు చెప్పలేదు. కారులో యిద్దరమూ బయలుదేరాము.
    బాక్సు టిక్కట్లు తీసుకు వచ్చేంత వరకు కారులోనే కూర్చున్నాడు ప్రసాదు. ఇద్దరమూ మెట్లెక్కి పైభాగంలో ఉన్న బాక్సు చేరాము. సినిమా ప్రారంభమైంది. ప్రసాదు సినిమా చూడడం లో లీనమయ్యాడు. ఎంతో ఆసక్తి తో చూస్తున్నాడు . ఇంతకూ మించిన అవకాశం తనకు లభించదు. ప్రసాదు....అవును.... తెల్లని దేహచ్చాయ, చురుకైన కళ్ళు, కొనదేరిన ముక్కు, అన్నిటిని మించిన వినయం, అమాయకత్వం ....ప్రసాదు అందగాడు. అందరూ అనుకొనే విషయం. చురుకైనవాడు ...నలుగురూ ఆమోదించిన సత్యం . చదువులో ఫస్టు.... ఎవ్వరూ కాదనలేని నిజం. ప్రతివారూ అతని స్నేహాన్ని కాంక్షిస్తారు. అతను ఎవరి మనస్సూ నోప్పించడు. ఎవరితోనూ అతి సన్నిహితంగా ఉండడు. ఇక కాలేజీ లోని అమ్మాయిల సంగతి.... ప్రతి అమ్మాయి ప్రసాదు దృష్టి లో పడడానికి ప్రయత్నిస్తుంది. ఎవ్వరినీ దరికి చేరనివ్వడు. వారి దృష్టి లో ప్రసాద్ గర్విష్టి. తోటి స్నేహితుల దృష్టి లో స్నేహశీలుడు, ఉపకార బుద్ది గలవాడు , సహృదయుడు. లెక్చరర్ల దృష్టి లో చక్కని విద్యార్ధి. పెద్దల యందు గౌరవం, మన్నన గల వ్యక్తీ. పై విషయాలు ఆలోచిస్తున్న నేను సినిమా సరీగా చూడకుండా నన్ను నేను మరిచిపోసాగాను. అటువంటి ప్రసాదు కు సన్నిహితురాలై నందుకు ఎంతగానో గర్వపడ్డాను. అవును అది గర్వ కారణమే! అందుకే సహ పాథినులు నన్ను చూసి అసూయ పడతారు. నేను నిజంగా అదృష్టవంతు రాలను. ప్రసాద్ ప్రక్కగా కూర్చున్న నా మనసు చలించసాగింది. ఏవేవో కోరికలు నన్ను కలచి వేయసాగాయి. ఆవేశం పొంగి  పొరలసాగింది. అనుకోకుండా నా చేతిని ప్రసాదు చేతితో కలిపి మృదువుగా నొక్కాను. అంతే....నా శరీరంలో విద్యుత్తు ప్రవహించసాగింది. ఆ హాయిని ఎంతోకాలం అనుభవించ లేకపోయాను. తదేకంగా సినిమా చూస్తున్న ప్రసాదు ఒకటి రెండు నిమిషాలు ఈ విషయాన్ని గ్రహించ లేదు. ఆతర్వాత అకస్మాత్తుగా తన చేతిని నా చేతి నుండి మెల్లిగా విడతీసి నా ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు. ఆ కళ్ళల్లోని ఆకర్షణ, ఆ అందమైన ముఖ వర్చస్సు నన్ను లొంగ తీశాయి, ఆవేశంతో అనాలోచితంగా అతని పై వాలిపోయాను. ఆ క్షణంలో నాకు కలిగిన ఆ అనుభూతి . అబ్బ........! తలుచుకుంటే యిప్పటికీ శరీరం ఆనందంతో గగుర్పోడుస్తూ ఉంది. కాని ఆ అనుభూతి కొన్ని క్షణాలు మాత్రమే కలిగింది. తనపై వాలిన నన్ను గాబరా పడుతూ సరీగా కూర్చో బెట్టాడు ప్రసాదు. అతని స్పర్శ లో సర్వం మరిచిపోయాను నేను. ఆలోచనలతో , ఆ మధురానుభూతులతో అలసిపోయిన నేను కళ్ళు మూసుకొని సీటులో వెనకకు వ్రాలాను.
    'అమ్మాయి గారూ! ఏం జరిగింది? మీ పరిస్థితి నాకు భయం కలిగిస్తూ ఉంది. ఇంటికి వెడదామంటారా?' నన్ను అటు యిటు కదిలిస్తూ ఆందోళన పడుతూ అన్నాడు ప్రసాదు! అబ్బ....! అతని స్పర్శ మత్తులో నింపింది నన్ను. వేరే యింకేమీ ఆలోచించకుండా గాడంగా ప్రసాదు ను కౌగలించుకున్నాను. అనుకోని ఈసంఘటనకు తత్తర పడ్డాడు ప్రసాదు. మృదువుగా నన్ను కౌగిలి నుండి విడతీశాడు. అంతలో లైట్లు వెలిగాయి. ఇద్దరం తేర వైపు చూశాము 'విశ్రాంతి' అనే అక్షరాలూ కనుపించాయి. సిగ్గుతో వంచిన తల ఎత్తలేక పోయాను నేను. అలా నిశ్శబ్దంగా గడిచిపోయింది. సినిమా మళ్ళీ ఎప్పుడు ప్రారంభ మైందో ...పూర్తయింది. లైట్లు వెలిగాయి. ఆలోచనలతో సతమతమవుతున్న నేను అసలు సినిమా చూడనే లేదు. ప్రసాదు ముఖం చూశాను. తెల్లబోయింది. మనసులో ఏదో బాధపడుతున్న వాడిలా కనుపించాడు. నేను ఆవేశం లో త్వర పడ్డాను , సహజమే ...అతని ఆకర్షణ అటువంటిది.... నా నిగ్రహశక్తి ని మించిన ఆకర్షణ.
    పై సంఘటన గుర్తుకు వచ్చి ప్రసాదు వియోగ బాధ ఇనుమడించింది. ఇంటర్వెల్ కావడంతో సోడా, కాఫీ , అమ్మేవాళ్ళ గోల ఎక్కువైంది. ఇక భరించలేక పోయాను. స్నేహితులతో చెప్పి యింటికి వచ్చేశాను. భోజనం చేసి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఎప్పుడో చాలా రాత్రి గడిచిన తర్వాత నిద్ర పట్టింది.

                            *    *    *    *
    "రేఖా.........'
    ".................................'
    "ఒసేవ్ ! తెల్లవారి చాలా సేపైందే.......! కంటున్న కలలకు స్వస్తి చెబుతావా?'
    'ఊ....ఎవరు?'
    'నేను వాణిని'
    మత్తు ఒదిలి పూర్తిగా తెలివి వచ్చింది .
    వొహ్...వాణి .......నువ్వా? అదేమిటే నన్నలా వింతగా చూస్తున్నా వెందుకు?'
    "హమ్మయ్య! ఇప్పటికి పడ్డావు తల్లీ ఈ లోకంలో ! సరేగాని .....యిప్పుడు టైమెంతయిందో చూడు'' తన చేతిని ముందుకు చాపుతూ అడిగింది వాణి.
    టైము చూసి ఆశ్చర్యపోయాను ఎనిమిది దాటింది... ఈ మధ్య రాత్రిళ్ళు నిద్రపట్టక లేవడం ఆలస్యమౌతు ఉంది. కళ్ళు మండుతూ ఉన్నాయి.
    "నీవొచ్చి ఎంతసేపయిందే వాణి.....?
    "అరగంట దాటింది.'
    'మరి...! రాగానే ఎందుకు లేపలేదు నన్ను?'
    "నీవు కంటున్న కలలు చెదరగొట్టడం అంత మంచిది కాదని......!"
    'అలాగవుతే యిప్పుడేందుకు లేపావ్ ?"
    'కల పూర్తీ కావచ్చిందని తెలిసి.'
    "నీకెలా తెలిసిందే!'
    "పలవరింతల వల్ల!'
    "నేను పలవరించానటే ! అంతా ఉత్తదే! అన్నీ అబద్దాలు.'
    "అవునండమ్మాయి గారూ! మీరు పలవరించడం , నిద్రలోనే సంతోషంతో పొంగి పోతూ ఉండడం నాకళ్ళారా చూశాను.' కాఫీ కప్పులు టేబులు పై ఉంచుతూ పేస్టు బ్రష్ తీసుకు రావడానికి వెళ్ళింది సీతమ్మ సిగ్గుతో కుంచించుకు పోయాను నేను.
    సీతమ్మ పేస్టు బ్రష్ తీసుకు రాగానే 'వాణి ....! వన్ మినిట్' అని వాష్ బేసిన్ వైపు నడిచాను. ఆతర్వాత యిద్దరమూ కాఫీ ముగించాము.
    'ప్రొద్దుటే యిలా ఊడి పడ్డావ్ ? విశేషాలేమిటి !'
    'అవును....! పానకం లో పుడకలా నేరాకపొతే నీకలలు నీవూ పన్నెండు గంటల దాకా హాయిగా గడిపేసేదానివో ఏమో?'
    "అబ్బ! ఇక చాలించవె నీ ఎగతాళి ....'
    'సరే! నీ ఒక్కర్తి దగ్గరే యింత టైమైతే నాకిక పొద్దు చాలినట్లే! గండి పేటకు పిక్నిక్ ప్రోగ్రాం వేశాం, ఎల్లుండి ఉదయం బయలుదేరడం , సాయంత్రం అక్కడి నుండి వచ్చేయడం . అక్కడ పగలంతా హాయిగా గడపడం ...వస్తాను మరి! ఎల్లుండి ఉదయం ఎడయ్యే సరికి ప్రయాణానికి సిద్దంగా ఉండాలి."
    పై మాటలని లేచిపోబోతున్న వాణిని బలవంతంగా మంచం పై నా ప్రక్కన కూలేసాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS