ఈ రేయి నీదోయి
రాజశ్రీ అపార్ట్ మెంట్స్- మనుషులు కాకుండా దేవతలు వుండడానికి కట్టినట్టు ఆ భవనం చాలా అందంగానూ, అంతకంటే ఖరీదుగానూ వుంది. దాని ముందున్న పూలతోట పచ్చటి పావడాను ఆరబెట్టినట్టుంది. నిరంతరం పైకి కిందకీ తిరగాడే లిఫ్ట్ జోరుగ చక్కర్లు కొట్టుతున్నట్టు కనపడుతోంది.
చెవులను తెలుగుకీ, నోటిని హిందీకి ఇచ్చేసిన నేపాల్ గూర్ఖా టైమ్ తొమ్మిదవుతుండడంతో గేట్లు మూస్తున్నాడు.
ఆ అపార్ట్ మెంట్స్ లోని ఓ పోర్షన్ లో వున్న ప్రసాద్ ఆతృతతో ఓ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఆ వ్యక్తి పేరు సతీష్.
వాళ్ళిద్దరూ మేనేజర్లే కంపెనీలే వేరు రహస్యాలు లేకపోవడమే మంచిస్నేహానికి లక్షణమైతే వాళ్ళిద్దర్నీ క్లోజ్ ఫ్రెండ్స్ కిందే జమ కట్టాలి.
మందు పార్టీకి కావాల్సిన సరంజామా అంత అప్పటికే అరేంజ్ చేశాడు ప్రసాద్. ముందు గదిలోని ఓ బల్ల మీద అన్నీ సర్ది, పక్క పోర్షన్ల వాళ్ళు చూడకుండా లైట్ కూడా ఆర్పేశాడు.
మరో అయిదు నిమిషాలకి హడావుడిగా వచ్చాడు సతీష్.
"లైటు ఆర్పేశాను. మెల్లగా ఇటొచ్చి కుర్చీలో కూర్చో" అని ఆహ్వానించాడు ప్రసాద్.
"మనల్ని మంచివాళ్ళుగా తయారుచేసే బాధ్యతను నెత్తినేసుకున్న ప్రభుత్వం తాగుబోతుతనంతో పాటు సవాలక్ష దొంగపనులను కూడా నేర్పిస్తోంది. అప్పుడు దర్జాగా తాగేవాళ్ళం. ఇప్పుడు దొంగ సరుకును కొని, దొంగతనంగా ఇళ్ళల్లో దూరాల్సి వస్తోంది" అని చిన్నగా నవ్వాడు సతీష్.
పార్టీ మొదలైంది.
మొదటి రౌండ్ లో ఆఫీసు విషయాలు, రెండో రౌండ్ లో సినిమాలు, రాజకీయాలు- మూడో రౌండ్ లో వచ్చేటప్పటికి సొంత విషయాలు చోటు చేసుకున్నాయి.
"జీవితంలో ఎలాంటి ఘోరం అయినా ఫర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ చెయ్యి- నో ప్రాబ్లెమ్ కానీ పెళ్ళి మాత్రం చేసుకోకు" సతీష్ మాటలకు ఎగిరిపడ్డాడు ప్రసాద్.
"అదేమిట్రా అలా మాట్లాడుతున్నావ్? పెళ్ళీ పిల్లలూ లేకుండా ఎలా బతకడం? జీవితంలో అంతకంటే సాధించాల్సింది మాత్రం ఏం చచ్చింది గనుక?"
"జీవితమంటేనే పెళ్ళీ పిల్లలు అనట. పెళ్ళంటే జీవితానికి పక్షవాతం రావడమన్న మాట"
"మరి అందరూ పెళ్లెందుకు చేసుకుంటున్నారు?"
"మగాడు సెక్స్ కోసం ఆడపిల్లను అంగీకరిస్తుంటే, సెక్యూరిటీ కోసం ఆడపిల్ల మగాడ్ని అంగీకరిస్తోంది. అంతకంటే పవిత్రమైన అర్ధమూ, ప్రత్యేకమైన అంతరార్ధం నాకైతే కనిపించడం లేదు"
"అంతేనంటావా?" ప్రసాద్ సందేహిస్తూనే అడిగాడు.
"నిస్సందేహంగా, పెళ్ళంటేనే సెక్స్ ఎక్స్ ప్లాయ్ టేషన్"
"చాలామంది జంటల మధ్య సెక్స్ సంబంధం తప్ప మానసికమైన సంబంధాన్ని చూశారా? లేదు సెక్స్ తో మాత్రమే ముడిపడి వుండటం వల్ల సెక్స్ ఇద్దరి మధ్యా ఎప్పుడు రొటీన్ గా మారిపోతుందో అప్పట్నుంఛీ ఇద్దరి మధ్యా ఏ ఆకర్షణా మిగిలి వుండదు.
దాంతో ఏదో సంఘం కోసం కలిసి వున్నట్లు బతుకుతుంటారు గానీ తమ స్వంతానికి జీవించినట్లుండదు"
"ఆలోచిస్తుంటే నువ్వు చెపుతున్నది నిజమేననిపిస్తోంది"
"అనిపించడమేమిటి-నిజమైతే ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని ఆకర్షించాలన్న తాపత్రయం వుంటేనే బతుకుతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. మన అస్థిత్వం మనకు తెలుస్తుంది. పెళ్ళయ్యాక ఇక ఎవర్ని ఆకర్షించాలి? తను ఎంత వికారంగా కన్పించినా భర్త ఎక్కడికీ పోలేడన్న నమ్మకం స్త్రీకి, తను ఎంత హీనంగా ప్రవర్తించినా తనను వదిలి పోదన్న నమ్మకం పురుషుడికీ వుంటుంది. దీంతో తమ మీద తమకే ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే దంపతులు లైఫ్ లెస్ గా వుంటారు తప్ప లవ్ లీ గా వుండరు"
"కారణం అదేనంటావా?"
"ఆ( పెళ్ళయిన కొత్తల్లో ప్రతివాళ్ళూ ఆనందం మనుషులై పోయినట్లు, త్రుళ్ళుతూ, నవ్వుతూ అద్భుతంగా వుంటారు. కొంతకాలం గడిచాకే సమస్యంతా ఇద్దరికీ ఇద్దరూ పాతబడి పోతారు. మొదట్లో పాలపుంతల్ని బోర్లించుకున్నట్టు కనపడ్డ పెళ్ళాం ఎద కొన్నిరోజులు గడిచాక పాతబుడ్డీల్ని పెట్టుకున్న మేజాబల్లలా అనిపించడం కంటే బాధాకరమైన విషయం మరొకటుందా? స్వర్గంలోకి తమ రెండు శరీరాల్ని గిరవాటేసే మంత్రాల మర్రి చెట్టులా అనిపించే బెడ్ రూమ్ వుక్కపోత పెట్టే చెక్కపెట్టెలా అనిపించడం కంటే దారుణమైన విషయం మరొకటుందా?"
"మరి ఇప్పుడేం చేయాలంటావ్?"
"ఆలోచించగా, ఆలోచించగా నాకో గొప్ప ఐడియా తట్టింది"
"ఏమిటది?" ప్రసాద్ క్యూరియాసిటితో అడిగాడు.
"పెళ్ళి రెండేళ్ళకి రద్దయిపోవాలి"
"రద్దయిపోవాలా? ఆ తరువాత....? అర్ధం కాలేదు గురువా"
"అర్ధమయ్యేటట్టు చెబుతాను గానీ ముందు గ్లాసులో కాస్తంత మందు పోయ్"
ప్రసాద్ గ్లాసు నింపాడు.
సతీష్ ఓ సిప్ చేశాక చెప్పుకు పోతున్నాడు. "ఓ అమ్మాయికీ, ఓ అబ్బాయికి పెళ్ళయిందనుకుందాం. రెండేళ్ళు వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తారు. అన్నీ కొత్త కొత్తగా, కాలానికి చక్రాలు మొలిచినట్లు జీవితం సాగిపోతుంది. రెండేళ్ళు అయిపోగానే వాళ్ళ పెళ్ళి రద్దయిపోతుంది. కోర్టులు, మధ్యవర్తుల మద్దిస్తాలు-అలాంటి నాన్సెన్సు లేకుండా దానంతట అదే రద్దయి పోతుందన్న మాట. మళ్ళీ ఇద్దరూ మరో పెళ్ళికి అర్హులైపోతారు. మళ్ళీ కొత్త వ్యక్తితో పెళ్ళి. ఆ వ్యక్తితో మరో రెండేళ్ళు కాపురం- మళ్ళీ రద్దు- మళ్ళీ పెళ్ళి ఇలా అయితే పాతబడి పోవడం, బోర్ కొట్టడం, రొటీన్ అయిపోవడం వుండదు. అలా కొత్త కొత్తగా బ్రహ్మాండంగా వుంటుంది."
