Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 18

 

    "మా ఇల్లు అద్దె కివ్వబడదు!' కొంత హాస్యం ధ్వనించినా సీరియస్ గానే చెప్పిందామె ఈ మాట.
    "కానీ మా స్నేహితుడిస్తారని చెప్పాడండీ -" అన్నాను.
    "ఎవరో మీ స్నేహితుడు -- చాలా పోరాబడ్డారని చెప్పాలి--'అందామె.
    శర్మ పోరాబడ్డాడని నేనూ అనుమాన పడుతున్నాను. నేను లేచి నిలబడి - "శ్రమ ఇచ్చినందుకు మరోలా అనుకోకండి -- మరోచోట ప్రయత్నిస్తాను-" అని వెళ్ళబోతున్న వాడినల్లా అగినట్లుగా నటించి -- "అనుకోకుండా మీ వంటి అందమైన అమ్మాయిని చూశాను. మీపేరు తెలుసుకోవచ్చా?' అనడిగాను.
    "నాపేరు శాంతి -- మీ పేరు ?" అందామె అమాయకంగా నా వైపు చూస్తూ.
    నిజమే చెప్పాను. నా ఉద్యోగం కూడా చెప్పాను. నాకు పెళ్ళైన విషయం మాత్రం చెప్పలేదు.

                                     3
    పేరు, వివరాలు, ఇంటి చిరునామా చెప్పాను.
    అతను అన్నీ వివరంగా పుస్తకంలో నోట్ చేసుకున్నాడు.
    "ఈవేళ తారీఖు పదకొండు. మీరు పదమూడవ తేదీన వస్తే మీరు కోరుకున్న అమ్మాయి ఫోటో చూపిస్తాను. అవునో కాదో కన్ఫర్మ్ చేసుకుందూరు గాని, ఈ ఫైనల్ వెరిఫికేషన్ అయిపోతే సరిగ్గా మరో రెండ్రోజులు చాలు. అంటే పదిహేనవ తేదీన మీ ఈప్పితం నేరవేరుతుందన్నమాట!" అన్నాడతను.
    బయటకు వచ్చేక -- "నమ్మకం కుదిరిందా?" అనడిగాడు శర్మ.
    "కానీ వ్యవహరమింత రహస్యంగా నడుస్తోందేమిటి? అసలు విషయం తెలుసుకునేందుకు చాలా సమయం పట్టింది -" అనడిగాను.
    'అవును మరి -- ఇది భారతదేశం. ఎందరో అమ్మాయిలిక్కడ శీలం కోల్పోతున్నారు. అయినా ఆ విషయం రహస్యంగా ఉంచబడాలి. అటు అమ్మాయికీ, యిటు అబ్బాయికీ మధ్య వ్యాపారికి నష్టం లేకుండా వ్యవహారం జరగాలి. ప్రభుత్వానికి తెలియకూడదు. ఇందులో ఎన్ని సమస్యలు? అందుకే పాత కస్టమర్స్ ఒకడు పరిచయం చేయనిదే కొత్త కస్టమర్ ని నమ్మరు వీళ్ళు --" అన్నాడు శర్మ.
    "మరి పాత కస్టమర్స్ నెలా గుర్తు పడతారు?"
    "ఇందాకా చూదాలేదూ-- నేనొక రెండు మడతల గ్రీన్ పేపరిచ్చాను. అది అయిడింటిఫికేషన్ కార్డు. ఒకసారి కస్టమర్ కాగానే ఈ హోటల్ వాళ్ళది ఇష్యూ చేస్తారు. దాంతో నన్ను నేను పరిచయం చేసుకుని-- వాళ్లకు నిన్ను కూడా పరిచయం చేశాను."
    "చాలా పకడ్బందీగా ఉందే వ్యవహారం --" అన్నాను.
    "అప్పుడే ఏం చూశావ్? స్వానుభవంతో చాలా తెలుసుకుంటావ్ !" అన్నాడు శర్మ.
    శర్మ మాటలు నిజమే ననిపించింది -- పదమూడవ తేదీ మధ్యాహ్నం అక్కడికి ఫోటో చూసుకోడానికి వెళ్ళినప్పుడు బయట కంటే అందంగా మెరిసిపోతున్న శాంతిని ఆ ఫోటోలో చూస్తూ పిచ్చెక్కి పోయాను.
    "ఫోటో గురించి పాతిక రూపాయలు కట్టవలసి ఉంది." అన్నాడతను.
    "ఫోటో నాకిచ్చేస్తారా?"
    "నోనో - పడతినే స్వయంగా అందించే సంస్థ . కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోటోలను మాత్రం ఇవ్వలేము. ఈ ఫోటో తీయడానికి మేము చాలా శ్రమ తీసుకోవలసి వచ్చింది. మా శ్రమతో పోలిస్తే పాతిక రూపాయలు కం ఫర్మ్ మేషన్ చార్జి బహు స్వల్పం!" అన్నాడతను.
    "అవునవును -- " అంటూ పాతిక రూపాయలు కట్టాను.
    "మీ దగ్గర్నుంచీ అడ్వాన్సుగా ఏమీ తీసుకోడం లేదు. కానీ మీ బిల్లు నాలుగు ఐదు వందలకు మధ్యలో ఉంటుందని చెప్పడం నా ధర్మమనుకుంటున్నాను--" అన్నాడు.

                                                              4
    చిరునవ్వుతో గుమ్మంలో ఎదురైంది శ్రీమతి. నేను మాత్రం ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక తల వంచుకుని ఇంట్లోకి అడుగు పెట్టాను. శ్రీమతి తలుపులు వేసింది.
    నేను కుర్చీలో కూర్చోగానే నా బూటు లేసులు విప్పింది. సాక్సు లాగి బూట్ల లో పడేసింది.
    "ఇదిగో లుంగీ -- ఇది కట్టుకుని ఇంట్లో షర్టు వేసుకుని వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కుని రండి-" అంది శ్రీమతి.
    మౌనంగానే వెళ్ళి ఆమె చెప్పిన పనులు చేసివచ్చాను. నేను తిరిగి వచ్చేసరికి టేబిల్ మీద ఒక ప్లేట్లో పులిహోర , ఒక చిన్న కప్పులో పాయసం ఉన్నాయి.
    "ఏమిటిది సీమా!" అన్నాను. శ్రీమతి పేరు శ్రీ మహాలక్ష్మీ. నేనామెను ముద్దుగా సీమా అని పిలుస్తాను.
    "ఈరోజు మనమీ ఊళ్ళో కాపురం ప్రారంభించిన రోజు --"అంది శ్రీమతి.
    'అందులో పెద్ద విశేషమేముంది?" అన్నాను.
    'అలాగంటారేమిటండీ-- మీతోటి నా జీవితంలోని- ప్రతి సంఘటనా నాకు ప్రత్యేకమైనదిగా తోస్తుంది. ఆ ప్రత్యెక దినాలే నా జీవితంలోని పండుగ రోజులు. నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి!"
    అవును- తల్లీ తండ్రీ పోయిననా  శ్రీమతి మేనమామాల ఇంట్లో పెరిగింది. వాళ్ళే ఆమెను పెంచి పెద్ద చేసి ఓ ఇంటి దాన్ని చేశారు. వాళ్ళామెనూ ప్రేమగానే చూసినప్పటికీ కన్న వారి సాటి రాలేరు గదా!
    "ఈరోజు ప్రత్యేకంగా గడవాలి -- మీకూ నాకూ గుర్తుండి పోయే విధంగా!" అంది శ్రీమతి.
    ఆప్రయత్నంగా లేచి నిలబడ్డాను -- శ్రీమతిని దగ్గరగా తీసుకున్నాను. అనుకోకుండానే ముద్దు పెట్టుకుని ఆమె కళ్ళలోకి చూశాను. ఆమె కళ్ళలో వెలుగులు నన్ను ఇబ్బంది పెట్టాయి.
    భార్య భార్యల అనుబంధం చాలా గొప్పది. వాళ్ళ మధ్య సంబంధం పవిత్రమైనది. వాళ్ళ ఆకర్షణ తిరుగులేనిది. ప్రస్తుతం నా మనసు నీరై పోతోంది.
    "ముందు అవి తినండి -- " అంది శ్రీమతి.
    "ఈ లేత పదాలు రుచి చూసిన మీదట అవి నాకు రుచిస్తాయా?" అన్నాను. శ్రీమతి సిగ్గుపడింది. ఆమెకు మాటకు మాట చెప్పడం, చిలిపిగా మాట్లాడడం చేతకాదు. చాలా అమాయకురాలు. నేను కాస్త శృంగార పరంగా మాట్లాడితే సిగ్గుపడి పోతుంది.
    "ఈరోజు పులిహోర మీకిష్టమైన రీతిలో కుదిరింది. తీసుకోండి --"అంది శ్రీమతి.
    'అలాగే -- కానీ కలిసి తిందాం --' అన్నాను.
    ఇద్దరం పక్కపక్కగా కూర్చుని కలిసి పులిహోర తిన్నాం కలిసి పాయసం తాగాం.
    "ఈరోజంతా ఇలాగే గడవాలండీ -- ' అంది శ్రీమతి.
    ఉలిక్కిపడ్డాను. "సీమా! నువ్వేమీ అనుకోనంటే చిన్న విషయం చెప్పాలి -- విన్నాక నువ్వెలా చెబితే అలా చేస్తాను--"
    శ్రీమతి ముఖంలో ఏ విధమైన అనుమానమూ ద్యోతకం కాలేదు. చాలా మాములుగా-- "చెప్పండి " అంది.
    "ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు నేనొక చిన్న పార్టీకి వెళ్ళవలసి ఉంది. తిరిగి వచ్చేసరికి ఒంటిగంట దాటవచ్చు. మా కంపెనీలో ఆఫీసర్ల కు ఒక ప్రయివేటు ఇండస్ట్రీ వాళ్ళు ప్రత్యేకంగా ఇస్తున్న పార్టీ ఇది. కేవలం పార్టీ అంటే పార్టీ కాదు. కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య వ్యవహారాలు కూడా కొన్ని చర్చించాలి. ఈ పార్టీకి నేను వెళ్ళకపోతే కంపెనీలో చాలా విమర్శలకు గురి కావలసి ఉంటుంది. కానీ ఏపనీ నిన్ను కాదని చేయలేను నేను. నువ్వు వెళ్ళ వద్దంటే ఒంట్లో బాగోలేదని చెప్పి మానేస్తాను "
    శ్రీమతి నావంక చాలా ప్రేమగా చూసింది --" ఇలాంటి విషయా లాడవాళ్ళకేం తెలుస్తాయండీ. నాకైతే మిమ్మల్నొక్క క్షణమైనా వదల కూడదనుంటుంది. కానీ మగవాళ్ళు మీరు. లక్ష పనులుంటాయి. మీరు మాత్రం ఏం చేసినా నా గురించే కదా! ఆలశ్యంగా రావడమే ఈ రాత్రికి ప్రత్యేకత అనుకుంటాను -" అంది. తన అనుమతి మీదనే నేను బయటకు వెడుతున్నానన్నగర్వం ఆమె కళ్ళలో కనబడింది.
    ఒక అమాయకురాలిని మోసం చేస్తున్నానన్న గుర్తింపు నాకు బాధ కలిగిస్తోంది. కానీ భారతదేశం లోని స్త్రీజాతి శీలాన్నే సవాలు చేసిన శర్మ సంగతి తేల్చకుండా ఎలా?
    
                                    5
    ఆ భవంతులు, ఆ ఆవరణ, ఆ వాతారవణం -- హోటల్ మేనకా నిజంగానే అపూర్వమైంది.
    రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళిచ్చిన రసీదిచ్చాను. దాని మీద ఈరోజు రాత్రి 7-45 కు నాకు అపాయింట్ మెంటున్నట్లుగా రాసి ఉంది. రిసెప్షనిస్ట్ నావంక చూసి "--------మీరు కౌంటర్ నంబరు తొమ్మిదికి వెళ్ళండి--" అని చెప్పింది.
    అక్కడ మొత్తం ఇరవై రెండి కౌంటర్లున్నాయి . నేను తొమ్మిదో నంబరు కౌంటర్ కు వెళ్ళాను. రసీదు ఇచ్చాను.
    కౌంటర్లో అతను టైము చూసుకున్నాడు -- "వంద రూపాయలివ్వండి --" అన్నాడు.
    ఇచ్చాను. నా చేతికో టికెట్ ఇచ్చాడు. అందులో విశేషాలెం రాసి లేవు. హోటల్ మేనకా పేరు, టికెట్ విలువ రాసి ఉన్నాయి.
    "మీరు వెయిటింగ్ రూమ్ నెంబరు 27 లోకి వెళ్ళండి-" అన్నాడతను.
    ఆ హల్లో అన్నీ వివరంగా రాసి ఉన్నాయి. ఏయే వెయిటింగ్ రూమ్స్ కేలా వెళ్ళాలో డైరక్షన్స్ కూడా ఉన్నాయి. నేను సులభంగానే 27 వ నంబరు గది పట్టుకోగలిగాను.
    గది బయట ఒకతను ఎదురు చూస్తున్నాడు. అతనికి నా టికెట్ చూపించాను. "లోపలకు వెళ్ళండి --" అన్నాడతను. నేను లోపలకు వెళ్ళగానే తలుపులు మూసుకున్నాయి. చిన్న కుర్చీ ఉంటే కూర్చున్నాను.
    హటాత్తుగా నా కెదురుగా ఉన్న గోడ మీద సినిమా ప్రదర్శన ఆరంభమైంది. స్త్రీ పురుషులను నేను చూసి ఉండని భంగిమలలో చూపించే పోర్న్ చిత్రమది. అటువంటి చిత్రాలుంటాయని విన్నాను కానీ పడకగది రహస్యాలనింత పచ్చిగా చిత్రీకరించడాని కంగీకరించే స్త్రీ పురుషులుంటారని ఊహించలేక పోయాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS