Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 15

  
                                       4
    శోభనాద్రికి ఫోన్ చేసి వివరాలు చెప్పాను. అతను చాలా గాబరాలో ఉన్నాడు- భార్య రాసిన ఉత్తరం చదువుకుని. నేను చెప్పింది విన్నాక ఆమె బ్రతికే ఉన్నదని తెలిసి చాలా సంతోషించాడు. నేనతనికి చెప్పిన వివరాలలో అన్నీ నిజం కాదు. ఆమె అతన్ని అసహ్యించు కుంటోదన్న విషయం అతనికి చెప్పలేదు. ఆమెకు కొంతకాలం పాటు పాత జీవితాన్ని మరచి పోయి కొత్త జీవితం గడపాలని ఉన్నదనీ -- ప్రస్తుతం ఆమె నా ఇంట్లో ఉన్నదనీ --అతనికి చెప్పాను. ఆత్మహత్య ప్రయత్నాల నుంచి ఆమె దృష్టి మళ్ళించడం కోసం ఆమెకు కొంత సైకోట్రీట్ మెంట్ లాంటిది ఇప్పించవలసి ఉంటుందని ఆపని నావల్ల కాగలదన్న దృడ నమ్మకంతో నేనున్నాననీ అతనికి చెప్పాను.
    శోభనాద్రి జవాబు నేను జన్మలో మరచి పోలేను.
    "రాజుగారూ! మీమీద నాకు పూర్తి విశ్వాసముంది. నా భార్య మామూలు మనిషి మళ్ళీ మునుపటిలా నాతొ గడపదలగడం కంటే నాకింకేమీ అక్కరలేదు. ఒక వేళ ఆమె మళ్ళీ నా దగ్గరకు రాకున్నా నేను బాధపడను. ఆమె కలకాలం జీవించాలి. ఆమె జీవితంలో దిగులన్నది ఉండకూడదు."
    శోభనాద్రి నా బ్యాంకు అకౌంటు నంబరు కూడా తీసుకున్నాడు.
    ఒక వారం రోజులో నేను శాంతను చాలా వరకూ అర్ధం చేసుకున్నాను. అమెకలిగిన కుటుంబంలోనే పుట్టింది. వివాహం గురించి తన భర్త గురించీ ఆమె ఎన్నో రకాల రంగుల కలలు కంది. ఆమె తలిదండ్రులు ఆమె ఇష్టా యిష్టాలను విచారించకుండా శోభనాద్రి సంబంధం కుదిర్చారు. ఆ వయసుకు తగ్గ ముగ్ధత్వంతో ఆమె అవుననీ, కాదనీ అనలేకపోయింది. మరి వివాహానికి  ముందు ఆమె ఎవరినైనా ప్రేమించిందేమో నాకు తెలియదు. కానీ శోభనాద్రి అంటే మాత్రం విపరీతమైన ఏవగింపు ఉందని గ్రహించాను.
    మానసికంగా ఈ వారం రోజుల్లోనూ ఆమె నాకు చాలా దగ్గరయింది. ప్రసాద్ ఆమెను "అమ్మగారూ" అని పిలవడం కూడా మొదలు పెట్టాడు. వాడికి శాంత బాగా నచ్చింది.
    శోభనాద్రి నా అకౌంటులో రెండు వేల రూపాయలు జమ కట్టాడు. ఆ డబ్బు నాకు బాగానే ఉపయోగపడింది. శాంత నాచేయి పట్టుకుని షాపింగు కు వెళ్ళడానికి కుతూహల పడేది. తెలిసిన వాళ్ళకు నేను ఆమె నాకు దూరపు బంధువు అని వరసకు మరదలు అవుతుందనే చెబుతూ ఉండేవాడిని. షాపులో శాంతాకు నచ్చే చీరలు కాస్త ఖరీడైనవిగానే ఉండేవి. ఎంత ఖరీదైన చీర కొన్నప్పటికీ ఆమె కట్టుకున్నాక మనసుకు డబ్బు ఖర్చయిందన్న బాధ బాధించేది కాదు.
    మూడు వారాలలో ఆమెకు నేను   అరడజను చీరలు కొన్నాను. అరవచీర కొన్న రోజు అనుభవం ఇప్పటికీ మరఛి పోలేను.
    షాపులో ఆమెకు నాలుగు చీరలు నచ్చాయి. నీలం, గులాబీ, పసుపు ఆకుపచ్చ వాటి రంగులు. ఇందులో ఏది తీసుకోనని ఆమె నన్ను మురిపెంగా అడిగింది. "అన్నీ నచ్చినపుడు పోనీ ఆ నాలుగూ తీసుకోరాదూ?" అన్నాను నేను మనసులో కాస్త బాధపడుతూ. ఆమె అంగీకరించలేదు. "ఇందులో ఒక్కటే తీసుకుంటాను. మీకు నచ్చినది " అందామె. నేను తడబడి ఒక్క నిముషం అలోచించి -" గులాబీ!' అన్నాను.
    షాపువాడు ముసిముసిగా నవ్వి - " అమ్మగారికి నచ్చేరంగు కరెక్టుగా చెప్పారు. భార్యకు ఇలా చీర ఎన్నిక చేయగల భర్తలను ఇన్నేళ్ళ సర్వీసులోనూ నేను చాలా అరుదుగా చూశాను -" అన్నాడు.
    కొంతకోద్దిగా  సిగ్గుపడింది. ఆమె బుగ్గలు ఏరు పెక్కగా నేను ఇప్పుడే కొన చీర ఆమె అప్పుడే కట్టేసుకుని, ముఖం మీదికి మేలి ముసుగు వేసుకుందా అనిపించింది.
    శాంత చాలా అందంగా ఉంటుంది. పరిపూర్ణ యౌవనం లో ఉంది. నేను బ్రహ్మచారిని వయసులో ఉన్నవాడిని. ఆమె ప్రస్తుతం మరదలు అన్న పేరుతొ నా ఇంట్లో ఉంటోంది. ఇవన్నీ మా ఇద్దరి అనుబంధాన్ని బాగా పెంచడమే కాక నా నిగ్రహానికి, సచ్చీలతకూ ఒక విషమ పరీక్షగా కూడా ఉన్నాయి.
    శాంత కోసం నేను ఒక లాకెట్ గొలుసుకొన్నాను.అది మనస్పూర్తిగా నా డబ్బుతో నేను శాంత కోసం కొన్నది. శాంత చాలా సంబరపడింది. స్వయంగా నేనే ఆ గొలుసు ఆమె మెడలో అలంకరించాలని కోరింది. అలా చేస్తూ ఏదో థ్రిల్లింగ్ అనుభవం ఫీలయ్యాను.
    మరో సారి జోళ్ళ షాపులో ఒక రకం జోళ్ళు. బాగా ఆకర్షించాయి. శాంత కాళ్ళకు అవి అందాన్నిస్తాయని నాకు తోచింది. శాంత వాటిని ప్రయత్నించి చూసింది. సైజు బాగానే సరిపోయింది కానీ బొటన వ్రేలు సరిగా ఎక్కడం లేదు. "మోడల్ నాకూ నచ్చింది కానీ కాలికి సూట్ కావటం లేదు" "మరి"- అందామె విచారంగా. నాకు మనసొప్పలేదు. కింద కూర్చుని జోడును ఆమె కాలికి ఎక్కించడానికి ప్రయత్నించాను. మెత్తని ఆమె పాదాలను అలా స్పృశించడం ఓకే అపూర్వనుభవం నాకు. ఆమెకు జోళ్ళు ఎక్కాయి.
    "అసాధ్యులు మీరు, అనుకున్నది సాధించారు -" అందామె చిరునవ్వు నవ్వుతూ.
    'ఈ జోళ్ళు మీ కాళ్ళకు అందాన్నిస్తాయనే అభిప్రాయంతో ఎన్నిక చేశాను. కానీ నా అంచనా తప్పు. అందం కాళ్ళకు కాక జోళ్ళకు వచ్చింది -" అన్నాను. నేను మాటలన్నప్పుడు ఆమె గులాబీ చీర మేలి ముసుగులో ఉండడం వల్ల బుగ్గలు ఎరుపెక్కినది లేనిదీ తెలుసుకోలేక పోయాను.
    రోజులు గడుస్తున్న కొద్దీ శాంత నాకు కావలసిన్ మనిషి అనీ ఆమె లేకుండా నేను బ్రతక లేనేమోనని అనుపించసాగింది. ఒక నెలరోజుల పాటు మేము చాలా ఉత్సాహంగా గడిపాము. షాపులకు వెళ్లాం పార్కుల్లో తిరిగాం. కలిసి సినిమాలు చూశాం. ప్రతి అనుభవము కూడా అపూర్వమే.

                                     5
    మా పరిచయానికి నెలరోజుల వయసు వచ్చాక ఒక రోజున నేను స్నానాల గది లోంచి బయటకు వచ్చేసరికి ప్రసాద్ ఆదుర్దాగా నిలబడి ఉన్నాడు. నన్ను చూస్తూనే వాడు "సార్! అమ్మగారు ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను పిలిచినా, పలకరించినా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆమె ముఖం చూస్తుంటే నాకు కొంచెం భయం కూడా వేసింది" అన్నాడు.
    నేను కంగారు పడి ఆమె ఎటు వైపు వెళ్లిందో చెప్పగలవా' అన్నాను. వాడు వీదిలోనికి వచ్చి నాకు దారి చూపించాడు "ఎంత సేపు అయివుంటుంది ఆమె వెళ్ళి?" అనడిగాను మళ్ళీ.
    మీరలా స్నానాల గదిలోకి వెళ్లడమేమిటి -- ఆమె ఇలా బయటకు వెళ్ళాడు"- అన్నాడు వాడు.
    ఎన్నడు లేనిది ఈరోజు పదిహేను నిముషాల సేపు స్నానాల గదిలో ఉండి పోయినందుకు నన్ను నేనే నిందించుకుని ఒకసారి ఆమె గదిలోకి వెళ్ళచూశాను. కంగారుగా తలగడాల క్రిందా అక్కడా వెతికాను ఏమీ ఉత్తరాల్లేవు . గదిలో నుంచి తనచేతి సంచీ తప్ప మరేమీ ఆమె బయటకు తీసుకు వెళ్ళినట్లు లేదు. నేను ప్రసాద్ తో - "తలుపులు జాగ్రత్త " అని చెప్పి వీధిలో పడ్డాడు.
    ఆమె కోసం ఎక్కడని వెతకను ? ఒకపావు గంట సేపు వీధిలో నడిచాక నాకు ఏదో స్పురించింది. అదృష్టం బాగుంటే నా అంచనా తప్పకూడదు. అందుకే అక్కడికే వెళ్ళాను. ఆమె ఆంజనేయ స్వామి కోవెల మంటపంలో ఒకప్పుడు నేను చూసిన స్థానంలోనే అదే పనిచేస్తూ కనపడింది. రోజూ చూసే ఆమె ముఖానికి ఈనాటి ఆమె ముఖానికీ చాలా తేడా ఉంది. ఏదో పోగొట్టు కున్నాదిలా దిగులుగా ఉన్నాదామే ముఖం. ఆమె కళ్ళను చూస్తుంటే గతస్మృతి పోగొట్టుకుందా అనిపించింది. నన్ను చూసినా గుర్తు పడతుందన్న నమ్మకం కలగలేదు. నాకు అందుకు కాకపోయినా నేనామెను వెళ్ళి పలకరించదలుచుకోలేదు. ఆమె ఏం చేయబోయేది గమనించదలుచుకున్నాను.
    శాంత పెద్దమాల అల్లింది. లేని నిలబడి ముందుకు కదిలింది. ఇదివరకటి లాగే కొన్ని తుంపులు పిల్లలకు పంచి పెట్టింది. మిగిలిన మాలను తన చేతి సంచిలో వేసుకుంది. పార్కుకు వెళ్ళింది . మూల బెంచిలో కూర్చుంది. మాల వాసనా చూసింది. ఏడ్చింది. రుమాలుతో కళ్ళు తుడుచుకుంది. ఆతర్వాత సిటీ బస్సు ఎక్కి చరిత్ర ప్రసిద్ది కెక్కిన కొండ ప్రాంతంలో దిగి శివాలయం వైపు మెట్లు ఎక్కగా ఉన్న చెట్ల మధ్య దారిలో నడిచి పూర్వపు చెట్లు నానుకునే కూర్చుంది. ఈ పర్యాయం నేను దూరంగా ఉండలేదు ఆమెను సమీపించాను. ఆమె నన్ను గమనించలేదు. కొద్ది సేపు అలా నిలబడి హటాత్తుగా చెట్టుకు కొట్టబడి ఉన్న కొయ్య పలక మీద హంస బొమ్మను ముద్దు పెట్టుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS