Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 11

 

    దొంగ కాస్త ధైర్యంగా ఊపిరి పీల్చుకుని పరుగు ఆపి నడవడం ప్రారంభించాడు.
    వెంకన్న తన నడక వేగాన్ని హెచ్చించి దొంగను సమీపించి కలుసుకున్నాడు. అయితే వెంకన్న దొంగను పట్టుకోలేదు. అసలు వాడెవడో ఎక్కడికి వెడతాడో వాడి ఆచూకీ తెలుసుకోవాలనుకున్నాడు. ఎలాగూ ఆ ముసలాయనకొడుక్కీ రోజు ప్రయాణం తప్పిపోయినట్లే! వీడి పూర్తీ  ఆచూకీ తెలుసుకుంటే లోకానికీ కొంత ఉపకారం చెసినట్ల అవుతుంది.
    దొంగ మెయిన్ రోడ్డు మీంచి తన దారినో ఇరుకు సందులోకి మళ్ళించాడు. తను వాడి దృష్టిలో పడకుండా జాగ్రత్తపడుతూ వాడి ననుసరిస్తున్న వెంకన్న కు ఆ ఇరుకు సందులో మాత్రం అలా చేయడం సాధ్యం కాలేదు.
    వెనక్కు తిరిగి చూసిన దొంగకు వెంకన్న కనిపించాడు. వాడికేదో అనుమానమొచ్చింది. తన అనుమాన నివృత్తి కోసమని వాడు రెండు మూడు సందులు మళ్లాడు. వాడి ఊహ అర్ధం చేసుకున్న వెంకన్న వాడిని మరింత త్వరగా అనుసరించి సమీపించి-- "ఏయ్ మిస్టర్!" చిన్న మాట !" అన్నాడు.
    దొంగ ఆగి "ఎవర్నువ్వు?" అన్నాడు.
    "నీ చేతిలోని తలగడా నాకు నచ్చింది. ఎక్కడ కొన్నావో చెబుతావా?"
    "లక్ష్మీ క్లాత్ స్టోర్స్ లో కొన్నాను -- నేను కొన్నది కాక యింకొక్కటే వున్నట్లుంది. త్వరగా వెళ్ళి  కొనుక్కో!" అన్నాడు దొంగ.
    "ఇప్పుడు వెతుక్కుంటూ ఆ స్టోర్స్ ను వెళ్ళలేను. ఎంతక్కోన్నానో చెప్పు. నీ దగ్గరే కొనేసుకుంటాను" అన్నాడు వెంకన్న.
    "నా దగ్గర కొనలేవు. చాలా అవుతుంది" అన్నాడు దొంగ.
    "ఎంతోతుందేమిటి - ఏడు వేలా?" అన్నాడు వెంకన్న.
    అతడలా అనగానే దొంగ పరుగెత్త బోయాడు. వెంకన్న అతన్ని చేత్తో పట్టుకుని ఆపి - "నాతొ వేళాకోళం అడవద్దు. ఇష్టమైన వస్తువుని తన్ని అయినా తీసుకుంటాను" అన్నాడు.
    దొంగ పెనుగులాడాడు. కానీ వదిలించుకోలేకపోయాడు.
    "భల్లూకం పట్టులా వుందే!" అన్నాడు దొంగ.
    "ఆ దిండు నా కిచ్చేసేయ్ "
    "నువ్వూ నాలాంటి దొంగవేనా?" అన్నాడు దొంగ ఆశ్చర్యంగా.
    "నీకులాంటి వాడినే అయితే ఫిప్టీ, ఫిప్టీ అని వుండేవాడిని. నీకంటే కనీసం ఆరు రెట్లు గొప్పవాణ్ణి" అన్నాడు వెంకన్న. తనూ దొంగనని తెలియగానే దొంగలో కాస్త ధైర్యం పెరిగిందని వెంకన్న గ్రహించాడు -- దొంగ ముఖాన్ని చూసి!
    అయితే వెంకన్న అంచనా తప్పయింది.
    దొంగ పెనుగులడుతుండగానే ఎదురింటి తలుపు తెరచుకుంది. గుమ్మం దగ్గర ఓ మనిషి నిలబడి చేతులు జాచాడు. తన చేతిలోని దిండుని దొంగ అలా విసిరాడు. ఆ వ్యక్తీ దాన్నందుకున్నాడు. వెంటనే తలుపులు మూసుకున్నాయి.
    జరిగిందేమిటో తెలుసుకునే లోగా దొంగ వెంకన్న చేతులు విడిపించుకుని "నువ్వు నన్ను తరిమినా సరే - ఆ యింట్లోకి వెళ్ళినా సరే " అన్నాడు. వెంకన్న ఈ లోకంలోకి వచ్చేసరికి దొంగ పరుగెడుతున్నాడు.
    డబ్బు నిజంగా దిండులోనే వుందా? లేక దొంగ దాన్ని చేజిక్కించుకుని ఉత్త దిండు నలావిసిరి తన్ను తప్పుదారి పట్టించి పరుగెత్తి పారిపోతున్నాడా?
    వెంకన్న మనసు అర్జెస్సీ ని సూచించింది. అతను ఒక్క ఉదుటున పరుగెత్తి దొంగను అందుకుని పట్టుకుని ఎడాపెడా వాయించి "ఎరా! వేళాకోళం గా వుందా!"అన్నాడు.
    దొంగ మాట్లాడలేదు.
    వెంకన్న వాడి జేబులన్నీ వెతికాడు. వళ్ళంతా తడిమాడు. బట్టలు తప్ప వాడి శరీరం మీద యింకేమీ లేదు. డబ్బు మొదలే లేదు.
    వెంకన్న వెతకడం అయ్యేక వాడో వెకిలి నవ్వు నవ్వి 'ఈ పాటికి ఆ దిండు కాళీ అయుంటుంది" అన్నాడు.

                                      3
    వెంకన్న దొంగను వదిలి పెట్టి ఆ ఇంట్లోకి పరుగెత్తాడు. తను చాలా తెలివి తక్కువగా వ్యవహరించాననీ ఒకరకమైన ఆవేశం కలిగింది. అతను తీవ్రంగా తలుపులు బాదసాగాడు.
    "ఎవరు వారు? తలుపులలా బాదకండి" అంటూ ఓ అడ కంఠం వినిపించింది.
    తలుపులు తెరుచుకునేసరికి వెంకన్న ఆశ్చర్యపోయే టంతటి సౌందర్యవతి ఎదురుగా నిలబడి వుంది.
    ఇద్దరూ ఒక్క క్షణం ఒకర్నొకరు ఆశ్చర్యంగా చూసుకున్నాడు.
    "సినిమా హీరోలా వున్నాడు"అందామె అప్రయత్నంగా.
    క్షణకాలం వెంకన్న తనువూ పులకరించింది. అంతలోనే అతనికి దొంగలు చాలా తెలివైన వారని తనను తప్పుదారి పట్టిస్తున్నారనీ-- తమకు కావలసిన వ్యవధి కలిగించుకుంటున్నారనీ అర్ధమైంది.
    "ఇంట్లో ఇంకెవరున్నారు?" అన్నాడు వెంకన్న.
    "ఎవరూ లేరు - నేను తప్ప !" అందామె కొంటెగా.
    "అబద్దం !" అన్నాడు వెంకన్న.
    "నీకేం కావాలో చెప్పు -- నేనిస్తాను" అందామె ద్వంద్వార్దాలను స్పురింపజేస్తూ.
    "నేను వచ్చింది తలగడ కోసం !' అన్నాడు వెంకన్న.
    "తలగడా మంచం మీద వుంది. దాని మీద ఇద్దరి తలలు పడతాయి" అందామె.
    "నువ్వెవరివి తల్లీ -- బొత్తిగా కొత్తా పాతా వున్నట్లు లేదు" అన్నాడు వెంకన్న చిరాగ్గా.
    "నా ఇంటి కొచ్చి నన్నేవరని అడిగినా క్షమించగలను కానీ నీలాంటి మగాడు నన్ను తల్లీ అంటే క్షమించలేను"అందామె కోపంగా.
    "క్షమించోద్దులే కానీ నేను నీ ఇంట్లోకి చొరబడబోతున్నాను. అందుకు క్షమించాలో అక్కర్లేదో ఆలోచించుకుంటూ వుండు" అంటూ వెంకన్న లోపలకు ప్రవేశించాడు.
    ఆమె తడబడకుండా తలుపులు మూసింది.
    వెంకన్న గబగబా ఇల్లంతా శోధించాడు. ఇల్లు మరీ పెద్దదేమీ కాదు. ఉన్నంతలో నీటుగా సర్ధబడి ఉంది. బెడ్రూం చూస్తేనూ, ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తేనూ అక్కడేదో చీకటి వ్యాపారం జరుగుతున్నదని స్పురించక మానదు.
    గొళ్ళెం పెట్టి వున్న ఓ గదిలో వెంకన్న కు ఇద్దరు మనుషులు కనిపించారు. ఒకడు ఇందాకా తలగడాను అందుకున్నవాడు. ఇంకొకామె అయిదేళ్ళ పాప.
    అ పాపను చూస్తూనే ఎవరో గుర్తు పట్టాడు వెంకన్న.
    ప్రముఖ వ్యాపారస్తుడు రామచంద్రరావు మనుమరాలు ఆ పాప. అయిదు రోజుల క్రితం తప్పిపోయింది.  ఆచూకీ తెలియబర్చినవారికి మంచి బహుమానమిస్తామని ప్రకటించారు కూడా. ఆ పాప ఫోటో ను అన్ని పత్రికల్లోనూ ప్రకటించారు.
    "పులి బోన్లో కి అడుగుపెడుతున్నా నన్న మాట!" అన్నాడు. లోపలి వ్యక్తీ చిరాగ్గా వెంకన్నను చూసి.
    "ఇదే పులి బోను అయితే నేను పులినైతే నువ్వు ఎరగా కట్టిన మేకవన్న మాట. అయినా భయపడకు. నిన్నేమీ చేయను లే. నేను వచ్చింది ఒక్క తలగడా కోసం" అన్నాడు వెంకన్న.
    "తలగడా కోసం ఇంతదూరం రావాలా?" అన్నాడు ఆ వ్యక్తీ వెటకారంగా.
    'అది మామూలు తలగడా కాదు. దాని ధర ఏడువేలు అన్నాడు వెంకన్న.
    "అయ్యో పాపం -- అలాంటి తలగడా ఇక్కడ లేదు. అంతకంటే ఖరీదైన తలగడా అవతల గదిలో వుంది. రత్నావతి తలమోసిన కారణంగా ఆ తలగడాకు విలువ కట్టడం అసాధ్యమవుతున్నదని రసికజనమంతా ఏక కంఠం తో అంటున్నారు. వెళ్ళి ఆ తలగడాను చూసుకో" అన్నాడా వ్యక్తీ.
    "అదేం కుదరదు. నాకు ఏడువేల తలగడాయే కావాలి" అన్నాడు వెంకన్న.
    "దాని గురించి నాకు తెలియదు, వెళ్ళి వెతుక్కో" అన్నాడా వ్యక్తీ .
    వెంకన్న కళ్ళు మంచం మీద వున్నాయి. గదిలోని మంచం మీద ఓ దిండు వున్నది. అది.... రైల్వే ప్లాట్ ఫారం మీది ముసలాయనది. తన చాదస్తపు జాగ్రత్తలతో తన ఇంటి చిరునామానీ, తన కూతురి పెళ్ళి వివరాలనీ, తలగడా గలీబు లో డబ్బున్నదన్న విషయాల్నీ - మొత్తం అన్నింటినీ బహిర్గతం చేసి - ఆ దిండు పోగొట్టుకునేలా చేసుకున్న వెర్రివాడి తలగడా అది.
    వెంకన్న వెళ్ళి చటుక్కున ఆ దిండు అందుకున్నాడు. దాన్ని పూర్తిగా తడిమాడు. గలీబు లోపల చేతులు పెట్టి వెతికాడు. అందులో ఒక్క రూపాయ నోటు కూడా లేదు!
    "ఏడు వేలూ ఏం చేశావ్!" అన్నాడు వెంకన్న తీవ్రంగా. ఆ డబ్బు ఒక మధ్యతరగతి వ్యక్తీ యెంత కష్టపడి కూడబెట్టుకున్నది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడాని కుద్దేశించబడినది. ఆ విషయం తలచుకుంటూటే వెంకన్న కు ఆవేశం పెరిగిపోతోంది.
    "మా శ్రమా నీ శ్రమా కూడా అనవసరమే అయింది. ఒకోసారి అవుతుంటుంది. అందులో డబ్బులేదు అన్నాడా వ్యక్తీ.
    "డబ్బు లేదంటే నమ్మను. నాకు ఈ తలగడాలో ఏడు వేలు పెట్టి ఇవ్వాల్సిందే- లేకపోతె ...."
    "లేకపోతె ?" అన్నాడు ఆ వ్యక్తీ నిరసనగా.
    "ఈ పాప ఇక్కడున్నట్లు రామచంద్రరావు గారికి తెలియబరుస్తాను" అన్నాడు వెంకన్న.
    ఆ వ్యక్తీ ఆశ్చర్యంగా వెంకన్న వంక చూసి -- "నీకు ఈ పాప గురించి కూడా తెలుసా?" అన్నాడు.
    'అన్నీ తెలుసు నాకు...." అన్నాడు వెంకన్న.
    "మీకు మా తాతగారు తెలుసా?" అంది పాపా ఆశగా. ఆమె మాటలు ఎంతో మధురంగా అమాయకంగా వున్నాయి.
    "అవునమ్మా నాకు తెలుసు. నిన్ను మీ తాతగారికి అప్పగిస్తాను" అన్నాడు వెంకన్న ఆ పాప వంక జాలిగా చూస్తూ.
    పాపా చటుక్కున ఒక్క వుదుటున వెంకన్న దగ్గరకు వచ్చి అతడి కాళ్ళు వాటేసుకుని "నన్ను వెంటనే నా తాతగారి దగ్గరకు తీసుకెళ్ళరూ?' అంది.
    వెంకన్న చటుక్కున ఆ పాపను యెత్తుకుని -- "తప్పకుండానమ్మా?" అన్నాడు.
    అతని ఎదురుగా వున్న వ్యక్తీ వెంకన్న వంక క్రూరంగా చూసి -- "మిస్టర్ -- నీ పేరేమిటో తెలియదు కానీ -- అంతా నీ ఇష్టమే ననుకుంటున్నావా? ఇది మా ఇల్లని మర్చిపోకు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS