Next Page 
తిలక్ కథలు పేజి 1

                             తిలక్ కథలు

 

                     --దేవరకొండ గంగాధరరావు

 

             "లిబియో యెడారిలో"



                                       1

    లిబియో యెడారిలో ఓ పెద్ద యిసక తుఫాను వచ్చింది. మండే తెల్లని నల్లని యిసుక తరంగం మీద తరంగంలా పైకి లేచింది. ఒక మూల విరిగి పడివున్న విమానం చటుక్కుని పైకిలేచి గిర్రున తిరుగుతూ ఓ పెద్ద చెట్టుకి తగిలి తిరిగి కిందికి పెద్ద చప్పుడు చేస్తూ పడిపోయింది. అందులో ఇదివరకు చచ్చిపడివున్న పైలట్ తిరిగి చచ్చిపోయాడు.

    తర్వాత రోజున వీధులలో రక్తం కారే వార్తాపత్రికలు అమ్ముకున్నారు. అందులో ఇలా వుంది. "జర్మన్ పైలట్ అమోఘ వీరమరణం విజయం మనదే!"

    ఆ మరుసటి రోజున అక్షరాలులేని తెల్లని పత్రికలు అమ్మారు. అందులో ఇలా వుంది. "పైలట్ భార్య తన ఇద్దరు కొడుకులను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది జర్మన్ నారీమణుల ఆదర్శ దేశభక్తికి ఇదే తార్కాణం."

    ఈ వార్త విని అసూయతో బ్రిటీషు ద్వీపం ఎర్రబడింది. తీరాన్నే ఉన్న చెయ్యిన్నొక శతఘ్నులు ఉక్రోషంతో ఠక్కున పేలాయి.

    అమెరికాలో, ఇంగ్లండులో, ఇతర దేశాలలో కోటికోటి గోరీలు పగిలించుకుని, చచ్చిన సైనికులందరూ ఒక్కొక్క విమానంమీద, ఒక్కొక్క ఓడమీద, కాలినడక మీద లిబియా ఎడారి చేరారు.

    తిరిగి అనేకమైన పగిలి పడివున్న విమానాలు పైకిలేచి ఒకదాని నొకటి ఢీకొని తిరిగి అన్ని పగలి ముక్కలు ముక్కలుగా పడిపోయాయి. ఎడారిలో ప్రవహించిన యెర్రని నెత్తురు తాగలేక తాగలేక భూమి ఒక పక్కకి ఒత్తిగిలి ఉస్సురంది.

    ఓ గొప్ప శాంతి యెడారిలోని ఖర్జూరపు చెట్ల మొవ్వలల నవ్వుతూ కదిలింది. ఊపిరి సలపని, బతకనివ్వని ఓ పెద్ద శూన్యంయొక్క శాంతి. మృత్యువు యొక్క కాంతీ.

                                       2

    ఉత్తర ధృవం మీద మంచుతో కట్టబడిన ఒక పెద్ద మేడలో నాగరికత వినగ్నంగా, తెల్లటి పాలరాతి వొళ్ళు ముడుచుకుని పడుకుంది. సూర్యుని ఏడురంగుల కాంతిపడి ఆ భవనం విచిత్రంగా కరిగిపోతూ ఒక దివ్యమైన స్వప్నంగా వుంది. ఆమె జుట్టు మంటలా, మనిషిలో ఉండే కోర్కెలా నొక్కులుదీరి పిరుదుల వరకూ పరచుకొంది. గజనీ, నాదిర్ షా, అలెగ్జాండరు, నెపోలియన్ల అస్థిపంజరాలు గదిచుట్టూ అలంకరింపబడి ఉన్నాయి. పక్కనున్న పాత్రలోని ఎర్రని నెత్తురు రుచి చూసే ఆమె పెదవులు ఎర్రగా ఉన్నాయి. గుండ్రని ఆమె రొమ్ములు, పాపంలా ఆకర్షణీయంగా ఉన్నాయి. నలుగురు సైనికులు ఎలెట్రిక్ తీగ నములుతూ అక్కడికి వచ్చారు. "హీల్ - హిట్లర్! నేను నాలుగు వందలమందిని చంపాను. నేను ఒక్కణ్ణీ! నువ్వు నన్ను వరించాలి" అన్నాడొక సైనికుడు.

    "నాది ప్రజాస్వామ్యం డెమోక్రసీ, నేను చాలామందిని చంపాను. చచ్చిపోయాను కూడా. కావలిస్తే "క్రానికల్" లో మృత సైనికుల పేర్లలో నా పేరూ వుంది చూచుకో! చంపడంలో కూడా నాకు నాగరికత తెలుసు. నేను ఆరువందల డెబ్బైమందిని చంపాను" అన్నాడు మరొహ సైనికుడు.

    "డౌన్ విత్ ఇంపీరియలిజం........ నేను సౌమ్యవాద సైనికుణ్ణి. అందర్నీ సమానంగా చంపెయ్యగలను. వినాశనంలో నుంచికాని అభివృద్ధి పుట్టదు. నీకు డయాలెక్టిక్స్ తెలియవు కాబోలు. నేను ఎంతమందిని చంపానో నాకు లెక్కతేలటం లేదు!" అన్నాడు ఇంకో సైనికుడు.

    "నేను విమానాలు నడిపి బాంబులువేసి ఊళ్ళకి ఊళ్ళు పట్టణాలకి పట్టణాలు నాశనంచేశాను. ఇందువల్ల నాగరికత మరీ అభివృద్ధి అయ్యే  కారణాలు కనబడుతున్నాయి. దాన్నే 'Rehabilitation' అంటారు కొందరు. దీనివల్ల యంత్రపరిశ్రమ, సైన్సు బలేగా అభివృద్ధి అయిపోతాయి. నేనూ వీళ్ళలాగే ఒక యిజమ్ కోసమే చంపాను. నిజం చెప్పెయ్యనా నీతో ! చంపడమేనా 'యిజమ్' న్యాయానికి అదిగో అలెగ్జాండరు. నెపోలియన్ల ప్రక్క ఉండవలసినవాణ్ణి. తర్వాత నీ ఇష్టం" అన్నాడు మరొహ సైనికుడు. తుపాకి మందు ఓ చిటికెడు తీసుకొని నోట్లో వేసుకుని చప్పరిస్తూ.

    నాగరికత మంచంమీద నుంచి సిగ్గులేని నగ్నత్వంతో లేచి నుంచుని చేతులు చాచింది. నలుగురూ ఆమెను నాలుగువైపులా కౌగిలించుకున్నాడు. ఆ మంచు ఇల్లు ఓ పెద్దగడ్డలా దొర్లిదొర్లి పసిఫిక్ సముద్రంలో దభీమని పడిపోయింది.

    లిబియా యెడారిలో ఇసుక తుఫాను వచ్చింది. గద్దలూ, నక్కలూ అక్కడక్కడ విశ్రాంతిగా ఆహారం తీసుకుంటూ ఉన్నాయి. సగం విరిగిన విమానాలూ, ట్రక్కులూ, తుపాకులూ చిందరవందరగా పడివున్నాయి.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS