Next Page 
ఆకాశ దీపాలు పేజి 1

                   ఆకాశ దీపాలు

                                                                  పాలకొడేటి సత్యనారాయణ రావు.

                          


           
    పదిమంది పకపక నవ్వుతూ లోపలికి వచ్చారు.
    'అయితే ఇదన్న మాట మీ యిల్లు?'
    'ఆ-- స్వాగతం , సుస్వాగతం---------'
    'అందరికీనా? ఒక్కరికేనా!
    'అంటే---'
    'అంటే -- ఈ స్వాగత వచనాలు మాక్కూడానా? లేకపోతె కేవలం మురళీ మొహానుడికెనా అని?'
    'షటప్--'
    'చూడు శారదా --- ఇంటికి రమ్మని ఆహ్వానించి , ఇలా అవమానించడం చాలా చాలా ఘోరం--'
    'అందుకని, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా --'
    'అందరికీ ఈ పూట ఫలహార తదితరోచిత సత్కారాలు---'
    'కాఫీ ఫలహారాలు మాత్రం సాంక్షన్ చేయబడ్డాయి--' శారద నవ్వుతూ అంది.
    'అయితే, తదితరోచిత్రాలు అన్నీ మళ్ళీ మోహన్ కెనా?-' జానకి ప్రశ్నించింది.
    'జానకీ దేవి గారూ! అన్యాయం. నన్నాడి పోసుకుంటున్నారెందుకో మధ్యలో? శారద ఇస్తానంటే నేను వద్దంటానా చెప్పండి!' మోహన్ అన్నాడు నవ్వుతూ.
    'మిమ్మల్ని తీసుకోవద్దని అనటం లేదు గదండి-- మాకూ ఇమ్మనే మేమూ, కోరుకొనేది అంతే!-' స్వర్ణలత మోహన్ ను అడ్డుకుంటూ అంది.
    'ప్లీజ్-- సైలెన్స్ -- ఇది పవిత్ర గృహం గణం. ఇందు సందర్భోచిత భాషణములు దక్క ఇతరత్రా విషయములు చర్చ నిషిద్దము -- ' శారద అందరికీ గుర్తు చేస్తూ అంది.
    'పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్లీజ్ -- సందర్భోచితము కాదనే వ్యక్తీ ఎవరని?'
    'ఒసే జానకీ, మాట!-' శారద ఆప్యాయంగా అంది.
    'ఏమిటి?'
    'చెవిలోనే చెప్పాలి--' అంటూ శారద జానకి చెవిలో ఏదో గొణిగింది. జానకి ముఖం క్షణం లో నల్లబడింది.
    'ఏమిటండీ మరీ అంత రహస్యం?' వెంకటేశ్వరరావు అడిగాడు జానకిని.
    'చెప్పమంటారా?'
    'చెప్పమనే గదండి....'
    'నువ్వు నోరు మూసుకుంటావా లేదా?'
    'ఏమండోయ్....'
    'అలా అనే అందండీ. శారద మరి నా చెవిలో. మీరు చెప్పమన్నారని చెప్పా కానీ, లేకపోతేనా....' జానకి నవ్వింది.
    'సారీ వెంకటేశ్వరరావు గారూ-- ఆ మాట కేవలం జానకికి మాత్రమే గనుక, చెవిలో చెప్పాను--'
    'దట్సాల్ రైట్--'
    'అంటే, ఇంతకూ కాఫీ గట్రా ఏర్పాట్లు....'
    'ఓ అయిపోయాయి -- క్షణం సేపు ఓపిక పడితే అంతా రెడీ-- శారద అలా అంటూనే ఇంట్లోకి దూరింది 'అమ్మా' అంటూ.
    'శారద ఉత్త రోగ్ కదండీ -- ' జానకి అంది నవ్వుతూ.
    'ఐ ఆబ్జక్ట్ --షి ఈజ్ ఏ గుడ్....'
    మోహనరావు గారూ -- మీరున్నారన్న సంగతే మర్చి పోయానండీ....'
    'అది కదండీ ...'
    'ఏదైనా ఫర్వాలేదు గానీ శారద మంచిదంటే నే మీరూరుకుంటారన్నమాట.'
    'ఛ-- నిజం చెప్పాలంటే ....'శారద రావటం చూచి మోహనరావు మాట్లాడటం ఆపేసాడు.
    'నిజం చెప్పాలంటే ....అపెశారేం?' అంది శారద.
    'మాట్లాడాలంటే ' మోహనరావు మళ్ళీ ఆగి పోయాడు.
    'నేను చెబుతూనే -- నిన్ను చూశారే, తర్వాత మామూలుగా మాటలు ఆగిపోయాయి అంతే!' జానకి అంది నవ్వుతూ.
    'ఒసే జానకీ-- కాసేపు ఊరుకో తల్లీ! ఇది మా ఇల్లు. సైలెన్స్ జోన్ -- అండ్ నో జోక్ కటింగ్ --'
    మర్చేపోయాను సుమా--'
    'పర్వాలేదు గానీ లోపలికి రావే కాస్త --'
    'ఏం సెల్ఫ్ సర్వీసా?'-
    శారద నవ్వింది -- 'హెల్ప్ కావాలంటే మోహనరావు గారి నడగాలే అని నీకెన్ని సార్లు చెప్పానే?' జానకే అంది మళ్లీ.
    శారద జానకి నోరు మూసింది.
    ఇద్దరూ లోపలికి కదిలారు.
    ఆ గదిలో ఉండేది కచ్చితంగ పదిమంది -- శారద, జానకి, స్వర్ణలత, కౌముదీ, శర్మ, మోహనరావు, వెంకటేశ్వరరావు , ఆంజనేయులు, ప్రసాద మూర్తి . పదిమంది నేటి యువతరానికి ప్రతినిధులు. ఒక్క శారద మాత్రం కాలేజీ యునియన్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తోంది. మిగతా అందరూ ఆమెను బలపరుస్తున్నారు-- బలపర్చాలనుకుంటున్నారు. బలపర్చాలనే ఆ వూహను బలపర్చటానికే ఆమె ఈ కాఫీ ఫలహారాలను ఏర్పాటు చేసింది ఈ వేళ, మోహనరావు బలవంతం మీద.
    మోహనరావు శారదల ప్రేమాయణం కాలేజీ లో ఏ విద్యార్ధి నడిగినా మిమ్మల్ని అరగంట సేపూ అటూ ఇటూ కదలకుండా చేసి, తానో అరగంట సేపు ఊపిరి తీసుకోకుండా, అనర్గళంగా ఉపన్యసిస్తారు. అది అందరకూ తెలుసు  ఆ కాలేజీ లో-- కానీ ఎవరూ శారద ముందు మాత్రం అనే యత్నం చేయలేదు ఆనాటి వరకూ.
    కానీ --
    ఈవేళ
    జానకి కొంచెం నోరు జారింది. అందరి ముందూ అనేసింది. అందుకే -- రేపు కాలేజీ ఎలక్షన్లో తనకు ప్రచారం చేసేవాళ్ళ లో ఒకరైనా జానకి ని ఏదైనా అని, ఏదో జరిపించుకోవడం ఇష్టం లేక -- మౌనం వహించింది శారద.
    రెండు ట్రేలలో ప్లేట్లు, ప్లేట్ల లో టిఫేన్ల తో ఇద్దరతివలు ఇంట్లోంచి వచ్చారు. టీపాయ్ మీద పెట్టారు ట్రేలను.
    'ప్లీజ్ హెవిట్ -- ' శారద అంది.
    'థాంక్స్ -- ' అంటూ ముందు జానకి అందుకొంది.
    అందరూ తలొక ప్లేటు అందుకొన్నారు.
    'ఊ-- నేను స్వీట్, హాట్ అన్నీ ఉంటాయనుకున్నానండీ--' ప్రసాదం నవ్వుతూ అన్నాడు.
    'అవన్నీ ఎన్నికలయ్యాక--'
    'ప్రామిస్ చేసినట్లేనా?'
    'ఓ, గెలిస్తే మీ ఇష్టం వచ్చినవి -- చాలా.'
    'ఏదయినా సరేనా ?' జానకి అడిగింది.
    'ఆ, ఏదయినా సరే --' మోహనరావు అన్నాడు జానకి కేసి చూస్తూ.
    'చూడండి మోహనరావు గారు-- మేమడిగేది అభ్యర్ధిని -- ఏజంటు వాగ్దానాలు నమ్మము--' అంది స్వర్ణలత.
    'సరే-- నేనే అంటున్నానుగా -- మీరేది అడిగితె అదే-- ఓ.కే?'
    'నిజంగానే ?--'
    'ఆ--'
    'అయితే, ఫ్రెండ్స్ -- నోట్ చేసుకోండి శారద గెలిస్తే , మీరేది అడిగితె అది ఇవ్వడానికి సిద్దం -- గుర్తుంచుకోండి--'
    'జానకి -- అన్నీ ఇలా అయితే ఎలాగే ?'
    'ఔనండీ, మీరు మరీ కాలికి వేస్తె మెడకు , మెడకు వేస్రే, కాలికి వేస్తున్నారు --'
    'మోహనరావు గారూ -- మీరు సమర్ధించాల్సిన కాలం చాల ముందుంది. ఇప్పటి కైనా మమ్మల్ని కాస్త మాట్లడుకో నివ్వండి--'
    'జానకి, ఇది చాల ఎక్కువయిందే -- ఇక చాలు' అంది శారద జానకి తో కొంచెం సీరియస్ గా.
    క్షణకాలం నిశ్శబ్దం తర్వాత --
    'ఇంతకీ ఎలక్షన్ గురించి ఏమీ అనుకోలేదు మనం --' అంది కౌముది.
    'అనుకోవడాని కేముందండీ?- శారద గారు నామినేషన్ వేశారుగా -- ఇంక గెలిచి నట్లే!'
    'నామినేషన్ వెయ్యగనే గెలిచినట్లేనా? ఎదురు నిలబడేది ఎవరో తెలుసా?' అంది కౌముది.
    'ఎవరండీ?-'
    'మధ్నాహ్నం వరకూ ఎవరూ నామినేషన్ చెయ్యలేదు --' ప్రసాదం అన్నారు.
    'ఆ, ఆ సంగతి నాకూ తెలుసు --' అన్నాడు మూర్తి.
    'మధ్యాహ్నం వరకూ నామినేషన్ ఎవరూ వేయలేదు. నిజమే కానీ ఇపుడు -- శారదకు ఎదురుగా సుభాషిణి నిలబడింది.'
    'ఆవిడా?-' మోహన్ ఆశ్చర్యపోయాడు.
    'యస్ . సుభాషిణే!-- ఆవిడ నామినేషన్ ఆనందరావు గారు దాఖల్ చేస్తోంటే నేను చూశాను-' అన్నాడు వెంకటేశ్వరరావు.
    'అయితే ఇదంతా ఆ బెనర్జీ పని -- ' మోహనరావు అన్నాడు.
    'అదేం? ఆయనెందుకు మళ్లీ మధ్యలో?' స్వర్ణలత అడిగింది ఆత్రుతతో.
    'మధ్యాహ్నం వచ్చారండీ బెలర్జీ నా దగ్గరికి! నేను నిలబదాలను కుంటున్నాను, కొంచెం సాయం చేస్తారా అంటూ -- ఎమిటన్నాను-- శారద గారి చేత విత్ డ్రా చేయించండి అన్నాడతను. అది వీలుపడదు అయినా ఆవిడను నేనే నిలబెట్టిన తర్వాత, కుదరదన్నాను. బెనర్జీ వెళ్లిపోయాడు మరి -- ఆ తర్వాత జరిగిన కధ ఇదన్నమాట అయితే !-- ' ,మోహన్ ఆగిపోయాడు.
    'పోనీలెండి -- అనుభాషిణి పేరుకే గానీ, రేపు కాలేజీ లో ప్రీ -- ఎలక్షన్ డిబేట్ లో మాట్లాడాలిగా -- 'కౌముది అంది నవ్వుతూ.
    'అలా కాదండీ -- నిజం చెప్పినా నేను -- ?' మూర్తి ఆగిపోయాడు-- 'మరేమీ అనుకోనంటే మాట -- ఆవిడే వచ్చి ఓటు అడిగితె , వెయ్యమనే వాళ్ళు చాల తక్కువ--'
    'ఆ, నేననుకోను --' ప్రసాదం కొట్టి పారేశాడు.
    'అలా అనకండి మరి -- అందం చేయించని పనిలేదు.--'
    'చూడండి , ఒక మాట చెబుతున్నాను నేను-- ఎలక్షన్ లో ఓడిపోవడమనేది అసలు ఉండకూడదు. మీరందరూ భరోసా గా వెనకాల నిలబడ్డారనే నేను నిలబడ్డాను -- నన్నడిగితే . ఓడిపోవటం కన్నా విత్ డ్రా చేసుకోవటం నా కిష్టం , అది గౌరవ ప్రదం కూడాను --'
    'ఛ -- మళ్ళీ మీరలా అంటే --' వెంకటేశ్వరరావు అన్నాడు.
    'శారదా-- ఓడిపోవటమనేదే లేదు, నేను భరోసా ఇస్తున్నా , చాలా?' -- మోహనరావు ధైర్యం చెప్పాడు.
    'అలా కాదండీ -- ఆ మూర్తి గారనేది రైటే -- సుభాషిణి అంటే కాలేజీ లో పడి చచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు --'
    'శారదంటే పడిపోయేవాళ్ళు మీరొక్కరే ఉండి ఏం లాభం అని శారద ప్రశ్న అంది జానకి మళ్లీ.
    'జానకి -- ప్లీజ్--'
    'శారదా -- ఫర్వాలేదు, విత్ డ్రా అనే ప్రశ్నే లేదు-- కావాల్సి వస్తే మరికొంత ఖర్చు పెడతాం, కొంత తీవ్రంగా చేస్తే సరి....'
    'అలా అంటే మీ ఇష్టం -- ' శారద అంది తన అంగీకారాన్ని ఫైనల్ గా తెలియజేస్తూ.
    'కానీ ఒకేమాట - ఎవరికీ ఓటు కోసం మాత్రం డబ్బులివ్వడం తగదు --' అంది కౌముది.


Next Page 

WRITERS
PUBLICATIONS