Next Page 
కరుణా మయి అరుణ పేజి 1


                           కరుణా మయి అరుణ
                                                          వి.ఎస్. రంగ స్వామి

                        
    దొర;లు 'లేడీస్ పస్ట్ ' అన్నారు కాబట్టీ , మన కధను ఒక అమ్మాయి తాలుకూ జీవిత చరిత్ర లోని ఒక భాగాన్ని చెప్పడం తోనే అరంభిద్దాము. ఆ అమ్మాయికి ఊరూ, పేరూ లేదు. ఎక్కడ పుట్టిందో , ఎవరికీ పుట్టిందో కూడా తెలియదన్న మాట.
    అసలు సంగతే మిటంటే అదొక పెద్ద పట్టణం. ఆ ఊరిలో శంకర నారాయణ గారని ఒక పెద్ద న్యాయవాది ఉన్నారు. వృత్తి ద్వారా సంపాదించే వేలు కాక, పిత్రార్జితమైన స్థిరాస్తి వల్ల ఏటా పాతిక ముప్పై వేల అదాయమున్న ఆసామీ అయన. ఆయనగారి ధర్మపత్ని కనకదుర్గ. అందగత్తె; గుణవతి, దయగలది కానీ......పేద కుటుంబంలో నుంచి వచ్చి, శంకర నారాయణ గారి భార్య అవడం మూలాన్ని ఆమె అనుభవిస్తున్న నడమంతరసిరి మూలాన్ని కాస్త ఆహంకభావమన్నది ఉన్నది.
    కనకదుర్గ , శంకర నారాయణుల దాంపత్య జీవితం ఇప్పటికి దాదాపు పది పదిహేనేళ్ళు గా నడుస్తున్నా , వారికి సంతాన యోగమన్నది మాత్రం అబ్బలేదు. పూజాలూ, పునస్కారాలూ, చేయించారు. తీర్ధ యాత్రలు చేసి వచ్చారు. గోసాయి చిట్కాల ను కూడా ఎన్నింటినో ఆచరణ లో పెట్టారు. ఫలితమే, పాపం, లేకపోయింది.
    ఇక లాభం లేదనుకుని మద్రాసు వెళ్లి డాక్టర్ మొదలియార్ గారిని కూడా సంప్రతించారు. అరగంట సేపు పరీక్ష చేసి, అయన ఉన్న విషయాన్ని తేల్చి చెప్పారు. అదేమిటయ్యా అంటే, "కనకదుర్గ కు మాతృత్వం సంపాదించుకునే శక్తి లేదు " అని! కనకదుర్గ కలవర పడింది. కన్నీరు కార్చింది. లోలోన కటకట లాడిపోయింది.
    శంకర నారాయణ అపారమైన ప్రపంచ జ్ఞానం కలవాడు కాబట్టి, అతంటినీ చూచీ చూడనట్టు ఊరుకున్నారు. మహిళ మాతృ దేవత అవడానికి ఎంత ఆరాటపడుతుందో ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు అ ఆస్కారం లేదనే తేలిపోయిందిగా మరి? కుమిలిపోతూన్న కనకదుర్గ ను , ఏమని ఒదార్చగలరు? సముదాయిస్తే సన్నగిల్లి పోయేదా, పాపం , ఆ ఇల్లాలి ఈప్సితం?
    తొలుదొలుత కనకదుర్గ కే కలిగింది ఆ ఊహ. ఊహించే కొద్దీ ఆమె ఊహ సౌధం అంతస్తులు అలా అలా పైకెక్కి పోయెకొద్దీ ఆ ఊహ అభిప్రాయంగా, ఆశగా, ఆశయంగా ఆమెలో స్థిర పడిపోయింది. ఇక అంతటి నీ తనలోనే అణిచి ఉంచుకోలేక , కనకదుర్గ తన అశాపూరిత హృదయం లోని అంశాన్ని భర్తకు నివేదించు కుంది .
    "ఏమండీ........" ఎంతో అనుమానాస్పదంగా ధ్వనించింది ఆమె కంఠం. అర్ధరాత్రి అయినా, శంకర నారాయణ గారు లా పుస్తకాల్లో మునిగి తేలుతున్నారు. "ఊ" అని కానీ "ఆ" అని కానీ అయన ఏ ధ్వనీ చెయ్యలేదు.
    "మిమ్మల్నే."
    "ఆ?"
    "నాలుగయిదు రోజులుగా మీతో ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను."
    'అలాగా?' అంటూనే మళ్ళీ ఒక లా ప్రబంధాన్ని తెరిచాదాయన.
    'అసలు మీరు వినదలుచు కొనేప్పుడు మీతో నేనేం చెప్పేది నా మొహం!"
    "అల్ రైట్. అల్ రైట్! వింటూన్నాను. నాలుగయిదు రోజులుగా నాతొ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నావు. ఆ తరవాత?"
    "మీకంత వేళాకోళం గా ఉంటె.........."
    "ఆహాహా! నీకెలా ఉన్నా, వేళాకోళానికి నాకిది సమయం కాదు. ఓ మండూరు ఓబులేసు పలమనేరు పార్వతీశాన్ని చంపాడంటున్నారు. చంపలేదని నేను ఋజువు చెయ్యాలి! ఎందుకు చెయ్యాలీ అంటే, ఓబులేసు కేసు నేను ఒప్పుకున్నాను కనక! అబ్బ, అప్పుడే ఒకటి కావస్తుందే! సరే, ఓబులేసు కేసు అలా ఉంచు. నీ కేసేమిటి?"
    "ఊ.......పొండి."
    "అరే, నిజంగా వినదలుచుకున్నా, దుర్గా! చెప్పు."
    "ఆ, ఏమీ లేదు."
    "అది చెప్పడానికే ఈ నాలుగయిదు రోజులుగా తటపటా యించావా?"
    "మీరు నన్ను మొదలెట్టనివ్వందే?"
    "మీరేమీ అనుకోరు కదా?"
    "ఎందుకు, దుర్గా, అలా నంజుకుంటావు? చెప్పేసెయ్! ఏం కావాలి? చీరలా? నగలా? నీ మాటకు నేనేప్పుడయినా అడ్డు చెప్పానా? దర్జాగా ఖర్చు పెట్టేసేయ్! ఈ ఉన్నదంతా ఏంగానూ? పైగా అనుభవించే అర్హత గల వాడూ ఒక్కడూ లేకపోయే!"
    కనకదుర్గ కంట తడి బెట్టుకుంది.
    "అరెరే! నిజంగా నోరు జారిందే , దుర్గా! అయినా, ఆ విషయాన్ని గురించి నీ వింతగా సతమత మవడం నాకు బొత్తిగా నచ్చలేదు. నేనూ నాలుగయిదు రోజులుగా ఈ విషయం నీతో చెప్పాలను కుంటున్నాను. చెప్పేశా. ఆ..అన్నట్టు......నీవేం చెప్పాలను కున్నావు?"
    "అదే...."
    "ఏది?"
    "మీరేమీ అనుకోరు కదా?"
    "ఓరి భగవంతుడా! అనుకోను, బాబూ, అనుకోను! ఇకనైనా పలుకు!"
    "నేను ణా హృదయ పూర్వకంగా చెబుతున్నాను."
    "అలాగే!"
    "మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి."
    "ఆ! ఏమన్నావు?"
    "పెళ్లి...."
    "ఎవరికి?"
    "మీకు!"
    "నీకు పిచ్చి పట్టిందే దుర్గా! అంతే. మరేమీ లేదు. అబ్బ! రెండయింది. నిన్నటికి గాను గుడ్ నైట్! ఈవాళ్టి గాను గుడ్ మార్నింగ్! పాలవాడు రాగానే అయిదున్నర కల్లా కాఫీ చేసి, నిద్ర లేపు. పడకటింటి దాకా వెళ్ళే ఓపిక కూడా లేదు నాకు. ఇక్కడే ఈ సోఫా మీదే పడిపోతున్నా. ఫంఖా అలాగే ఉంచి. ఒక శాలువా తెచ్చి కప్పు. నిద్రబోతూన్నా , నిద్రపోయా!" అంటూ అయన కళ్ళు మూశారు.
    ఆ మగనితో ఆ మగువ ఇంకేం మాట్లాడుతుంది? ఏమని మొర పెట్టుకో గలుగుతుంది? మరింత బాధపదినట్టూ, ఆ బాధను భరించడానికి అసమర్ధు రాలాయినట్టూ ఆమె నిట్టూర్చింది.    
    మనం అనుకుంటాం గానీ ఆడవారు నిజంగా అబలలు కారు. ఒక్క కన్నీటి చుక్కతో పుట్టెడు మన పట్టుదల ను వారు ఇట్టే మార్పించి పారవేసేయ్య గలరు. కనకదుర్గ శంకరనారాయణ చెవిలో ఇల్లు కట్టుకుని పోరు పెట్టింది. ఆ బాధ పడలేక, అయన ఇక్కడి గొడవ లన్నింటి నీ పూస గుచ్చినట్టు ఆమె తల్లి దండ్రుల కు వ్రాశారు. వాళ్ళు కూడా పాపం, నిలుచున్న పళంగా బయలుదేరి వచ్చి ఇక్కడ వాలారు.
    'అయినా , నీకిదేం పిచ్చే కనకం? చేజేతులా ఏ ఆడదైనా తన సంసారం లో ఇలా నిప్పులు పోసుకోడానికి ప్రయత్నిస్తుందా?అసలు అంత అవసర మేమి వచ్చిందే? నీవేం ముసలి దానివా? పట్టుమని ముప్పై అయిదేళ్ళు నిండలేదు! మన వేలూరి వెంకటాచలం గారికి పిల్లలు కలిగిందేప్పుదంటావు? ఆయనగారి యాభయ్యో ఏట! నాంచారమ్మ గారి నలభై రెండో ఏట! అల్లుడు గారు అమాయికుడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకో అయ్య అయి ఉంటె నీనా మాట అనిందే తడవుగా ఒప్పేసుకుని, ఇరుగు పొరుగు కు కూడా తెలియ నివ్వకుండా ఆ ఇంత పెళ్ళీ అయిందని పించుకుని , ఈ పాటికి రెండో పెళ్ళాంతో సరససల్లాపాలు సాగిస్తుండేవాడు! అవ్వ! ఇదెక్కడి చాదస్తమే నీకు!" అంటూ కనకదుర్గ తల్లి తన కూతురి తెలివి తక్కువాను తలుచుకుని తలుచుకుని కన్నీళ్లు మున్నీరుగా ఏడ్చింది.
    తగిన కారణాల వల్ల తల్లీ, తన కారణాల వల్ల కూతురూ కుమిలి కుమిలీ ఒకరి కన్నీటితో ఒకరిని ఓడించుకోడానికి ప్రయత్నించడం తో, పాపం, మగరాయళ్ళకు కాస్త ఊపిరి సలుపు కునేంత సదవకాశం లభించింది.
    "అయినా, నాయనా, రెండో పెళ్లి చేసుకున్నావనుకో! బహుశా........మాట వరసకే! అప్పుడు మాత్రం నీ ఇంట సంతాన లక్ష్మీ తాండవిస్తుందన్న నమ్మక మేమిటీ?" అన్నాడు దుర్గ తండ్రి, ఓబులేసు కేసులో ఓబులేసు కు మరణ శిక్ష తప్పించి, దానితో తానేదో తొంబై ఆరు పర్యాయాలు భూమి చుట్టూ తిరిగి వచ్చిన కాస్మానాట్ లా కమ్మగా కూర్చున్న అల్లుడితో.
    'అంటే మీ అభిప్రాయం? ఆ ప్రశ్నకూ నాకూ సంబంధ మేమిటండీ? ఇవన్నీ మీ కూతురు తెచ్చి పెట్టిన తిప్పలు! 'వద్దు కుయ్యో, మొర్రో ' అంటే  వింటుందా? ఉహూ, ఏడ్పు ; కన్నీరు! మీరేమైనా అనండి, మామగారూ! ఒక్క మీ కూతుర్ని గురించే నేనడం లేదు . సామాన్యంగా ఈ ఆడవాళ్ళ తలల్లో మానససరోవరాల్లాటివి ఉంటాయి! తలుచుకున్నదే తడవుగా దడదడ చెక్కిళ్ళ వెంట కన్నీరు దూకనిస్తారు . ఆ పరిస్థితుల్లో మనలాటి మగవారు చెయ్యగలిగిందేముంటుంది? వాళ్ళు పలికిన ప్రతి అక్షరం ముక్క మనం పాటించాలి. లేదా అసలు మానస సరోవరం దగ్గిరికి వెళ్లి , అక్కడే సన్యాసం పుచ్చుకుని, ఈ కోర్టులూ, కేసులూ , జడ్జిమెంట్ లూ-- ఇవన్నీ మరిచిపోవాలి !"
    "అంతేనంటావా , అయ్యా?"
    "అయ్య!"
    "అయితే సరే! అమ్మాయికి మేము నచ్చ జేబుతాం లే! నీవు నిశ్చింతగా ఉండు."
    ఆ సంభాషణ అంటే అలా ఆగిపోయింది కానీ, అసలు సమస్య అలాగే ఉండిపోయింది మరి! కొన్నాళ్ళ పాటు ఎన్నో తర్జన భర్జనలు జరిగిన తరువాత , అదృష్టవ శాత్తూ అందరూ కలిసి ఒక నిశ్చయానికి వచ్చారు. ఒక పేద ఇంటి పిల్లనో, పిల్లా వాడ్నో దత్తు తీసుకుందామను కున్నారు.
    "ఆడపిల్లనే తెచ్చేకోండి. దేవుడి దయ చల్లగా ఉండి అమ్మాయి కడుపు పండి, కొడకు పుట్టాడు అనుకోండి, ఆ పిల్లని పెంచి, ఏ అయ్యచేతి లోనే పెడితే అప్పుడు రభస అంటూ లేకుండా పోతుంది. అదే అబ్బాయిని తెచ్చి పెట్టుకుంటే , ఆస్తిపాస్తుల విషయంలో ఎన్నయినా తగాదాలు రావచ్చు. మీరేమంటారు?" అంది కనకదుర్గ తల్లి తన భర్తను ఉద్దేశించి.
    "నేనేమంటానే? అల్లాడి క్రుష్ణస్వామయ్యరు లాటి అరవై ఆరుమంది న్యాయశాస్త్ర నిపుణుల్ని కూడా నానాతిప్పలు పెట్టించే సలహా ఇచ్చావు! నీ అడ ఆలోచనకు తిరుగేక్కడిది? అల్లుడి గారికీ, అమ్మాయికీ ఇష్టమయితే ఆడపిల్లనే పెంచుకోనీ!"
    "ఇక 'ఇష్టమయితే' ఎందుకూ? ఆడబిడ్డను పెంచుకోడమే అన్ని విధాలా శ్రేయస్కరం! ఏమమ్మా, దుర్గా?"
    "నీవు చెప్పిందే మంచి పద్దతి అనిపిస్తుందమ్మా."
    "గుడ్! అలాగే నండి, అత్తగారూ! అడబిడ్డనే పెంచు కుంటాము. అయినా, దొరకాలి కదా? దొరకగానే ఆ పిల్లకు "సీతామహాలక్ష్మీ త్రిపుర సుందరీ జ్ఞానాంబికా' ఆని మీరే పెట్టుకుంటాం."
    "అదేమిటయ్యా! నామకరణానికి మమ్మల్ని పిలవదలుచు కోలేదా?"
    "స్వార్జితం కాని పొత్తుకు అన్నీ శాస్త్రోక్తంగా జరిపించాలని ఎక్కడుందేం? మేము వచ్చినా, రాకపోయినా, శంకర నారాయణ గారూ, యా పిల్లకు మాత్రం మా ఆవిడ పేరే పెట్టండి. ముద్దుగా నోరారా పిలుచుకోడానికి ముచ్చటగా ఉంటుంది."
    "అంటే, మా అమ్మా నాన్నా నాకు పెట్టిన పేరు బాగోలేదనా మీరనేది?"
    "రామ, రామ! బాగోలేక పోవడ మేమిటి? నా ప్రాణం తియ్యడానికి తెగ అలోచించి నీకా పేరు పెట్టారే నీ తల్లి దండ్రులు!"
    'అబ్బ! ఊరుకోండి , నాన్నగారూ!"
    "అలాగే నమ్మా. అయ్యా, అల్లుడు గారూ!"
    "అయ్య?"
    "మాకు ఆ నిద్ర కంపార్టు మెంటు లో రెండు  సీట్లు సంపాదించారంటే.........."
    "అలాగేనండి! అయినా......"
    "అలాగే నండీ అంటారేం? "అంత తొందర ఏమొచ్చిందండీ" అనడానికి నోరు రాలేదు కాబోలు!" కనకదుర్గ మనసు నొచ్చుకుంది.
    "నీ హడావిడి నాకు లేదే! అనబోతుండగానే నీవందు కుంటివాయే! ఇక నేనమననూ?"
    "మా అమ్మాయి ఇంట్లో మేము ఉండడానికి నీవూ, వారూ, వీరూ చెప్పాలా, నాయనా? అయినా ఇప్పుడు మేము వెళ్ళిపోవడమే మంచిది. నేనూ ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ విచారిస్తా. తొమ్మిది పది నెలల పిల్ల, అందంగా ఉండి........"
    "అందమన్నది ఆ వయసులో ఏం తెలుస్తుందే జ్ఞానం? చిన్నతనం లో గాడిద పిల్ల కూడా గుర్రం పిల్లలా చూడ్డానికి ముద్దుగానే ఉంటుంది!"
    "అబ్బ, నాన్నగారూ!"
    "అదీ, అమ్మాయీ, వారి ధోరణీ! వేగలేక సతమత మవుతున్నాననుకో!"
    మమగారేదో మాటవరస కన్నారు లెండి! మీ కేండుకూ? ముందు మీ రటు వంటి పిల్లను చూడండి. ఆ తరవాత  సంగతి నేను చూసుకుంటా.
    "అలాగే, నాయనా" అంది సీతామహాలక్ష్మీ త్రిపురసుందరీ జ్ఞానాంబిక ప్రశాంతంగా. అంతటితో అందరి గుండెల మీది బరువూ ఒక్కసారిగా తీసి, అల్లంత దూరాన పడవేసినట్టయింది. అందరూ అంతులేని ఆనందాన్ని అనుభవించారు. ఆ తరవాత చాలా కొద్ది రోజులకే జరిగిందన్న మాట, ఈ చెప్పబోయే సంఘటన.


Next Page 

WRITERS
PUBLICATIONS