ఆటో సికింద్రాబాద్ స్టేషన్ వేపు పరుగుతీసింది. అనామిక రాసిన ఉత్తరాల్ని సూట్ కేస్ లో పెట్టుకోవడం మరిచిపోలేదతను!
* * * * *
జగన్నాయకులు మర్డర్ జరిగిన రోజు - ఆయన బార్ లో ఉండగా కలిసిన ఈనాడు రిపోర్టర్ మానసికంగా బాగా కృంగి పోయాడు.
తను జగన్నాయకుల్ని హెచ్చరించి వెళ్ళిన గంటకే హత్య జరిగింది.
తను అప్పటికప్పుడే జగన్నాయకుల్ని తనతో తీసుకొని వచ్చినట్లయితే, ఇంత ఘోరం జరిగేది కాదు గదా?
హంతకులు నేరుగా ప్రెస్ క్లబ్ లోకే వచ్చి జగన్నాయకుల్ని హత్య చేస్తారని తనూహించలేక పోవటం వల్లే ఇంత అనర్ధం జరిగిపోయిందని ఆ రిపోర్టర్ బాధపడుతున్నాడేగాని, ఆ కేసుమీద పనిచేస్తున్న క్రైమ్ రిపోర్టర్ సూర్యవంశీగాని ఏ.సి.పి. నిరంజన్ రావునిగాని కలిసే ప్రయత్నం చేయలేదు - ఆ విషయమే అతనికి తట్టలేదు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసే సబ్ ఎడిటర్ కూడా, జగన్నాయకుల మరణం పట్ల వ్యధ చెందాడే తప్ప వేరే ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం చేసుంటే, మరికొన్ని గొలుసు హత్యలు జరగకుండా నిరోధించే అవకాశం ఉండేదేమో.... సూర్యవంశీ తన పరిశోధనలు మరింత వేగంగా, స్పష్టంగా ముందుకు వెళ్ళగలిగే వాడేమో.....
భువనేశ్వర్ చేరడానికి ఇంకా సరిగ్గా ముఫ్ఫై అయిదు నిమిషాల టైముంది.
అసలే అయిదు గంటలు లేటు.
రాత్రి తొమ్మిదిన్నర దాటింది. దాదాపు ఇరవై రెండు గంటల జర్నీ, కూపేలోంచి బయటికొచ్చి, బాత్ రూమ్ వేపు నడిచాడు.
మూడు నిమిషాల తర్వాత బాత్ రూమ్ లోంచి బయటి కొచ్చాడు-
బకెట్లో ఐస్ వాటర్ మధ్యన కూల్ డ్రింక్ పెట్టుకొని వెండర్ ఎదురుపడ్డాడు.
థమ్స్ అప్ బాటిల్ తీసుకుని డబ్బు చెల్లింది, ముందుకు నడుస్తూ ఎదురుగా వచ్చిన మనిషికి దారివ్వడానికి, పక్కకు జరుగుతూ తలెత్తాడు!
కుర్తా, పైజామా, కళ్ళకు గ్లాసెస్....
మళ్ళీ తల దించుకుని తన కూపెలోకి వెళ్ళిపోయాడు సూర్యవంశీ.
ఒకే ఒక్కక్షణం, థమ్స్ అప్ బాటిల్ వెండర్ దగ్గర సూర్యవంశీ ఆగితే, ఆ వ్యక్తి ఎవరో తెల్సి ఉండేది!
దిస్ ఈజ్ ఏ మేటర్ ఆఫ్ లక్!
ఆ లక్ ఆ వ్యక్తిది....
ఆ వ్యక్తి నేరుగా కూల్ డ్రింక్ వెండర్ దగ్గర ఆగి, లిమ్కా తీసుకుని తాగడం ప్రారంభించాడు.
కూల్ డ్రింక్ వెండర్ లిమ్కా తాగుతున్న ఆ వ్యక్తి ముఖం వేపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ఆ ఆశ్చర్యానికి కారణం-
అతని పై పళ్ళ మధ్య మెరుస్తూ 'స్టీల్ రాడ్' కనిపించడమే!
* * * * *
సరిగ్గా మరో అరగంట తర్వాత ఆ వ్యక్తి భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో అందరి కంటే ముందుగా దిగిపోయి టాక్సీ ఎక్కాడు...
మరో పదినిమిషాల తర్వాత మరో టాక్సీలో ఉన్నాడు క్రైమ్ రిపోర్టర్ సూర్యవంశీ.
* * * * *
జనపధ్ ఏరియాలోని హోటల్ ప్రాచీ, విద్యుద్దీపాల వెలుగులో వింతగా మెరుస్తోంది.
రాత్రి ఒంటిగంట దాటింది.
బార్ రూమ్ లోంచి బయటికొచ్చాడు సురేష్ చంద్ర - అతని వెనక సల్మా సల్మా కళ్ళు, మంచుతెర కప్పిన మాణిక్యాల్లా ఉన్నాయి - గులాబీ రంగు కుర్తా పైజామా, బహిర్గత మవుతున్న అందాలు...
"కమాన్ డియర్... లెటజ్ హేవ్ ఫన్.... ఫన్...." తడబడుతూ అడుగులేస్తున్నాడు సురేష్ చంద్ర అతని చేతిలో వైట్ హౌస్ ఇంపోర్టెడ్ విస్కీ సీసా ఉంది.
మరో అయిదు నిమిషాల్లో ఇద్దరూ కాటేజ్ లోకొచ్చి పడ్డారు.
"కమాన్ బేబీ.... రిమూవ్ ఎవ్వెరిథింగ్.... నాకు నువ్వెలా డ్రింక్ అందిస్తావో, అలా అందిస్తావు కదు...." సిగరెట్ వెలిగించుకుంటూ, మత్తుగా గమ్మత్తుగా కన్నుకొడుతూ అన్నాడు సురేష్.
"వైనాట్..." బదులిచ్చి కుర్తా బటన్స్ మీద చెయ్యి వేసింది సల్మా మరో అయిదు నిమిషాల్లో, నేకెడ్ గాడెస్ లా తయారైంది. తనివితీరా ఆమెను చూస్తున్నాడు సురేష్.
సల్మా బాటిల్ లోని డ్రింక్ ను, గ్లాసుల్లో పోసింది....అతని చేతికో గ్లాసిచ్చి, తనో గ్లాస్ అందుకుని సిప్ చేస్తూ-
"లైట్ తీసెయ్యనా..." అతని చెవిలో గొణిగింది.
"ఏం....లైట్ కి సిగ్గేస్తోందా..." జోక్ వేసాడతను.
"కాదు.... నువ్వు సిగ్గుపడతావని.....నీకంతా సిగ్గేకదా.....రేపు పెళ్ళయితే ఎలా ఉంటావో..." గలగలా నవ్వింది సల్మా.
బాటిల్ సగం పూర్తయింది - మరో అరగంట గడిచింది.
ఎనిమిది పెగ్గులు పైగా తాగడంవల్ల, బుర్ర గిర్రున తిరుగుతోంది సురేష్ కి.
"కమాన్... కమాన్.... బేబీ...." సల్మా చేతిని పట్టుకుని, ముందుకు లాగాడు. సల్మా తూలిపోయి, ముందుకు లాగాడు. సల్మా తూలిపోయి, ముందుకు పడబోయి, నిలదొక్కుకుని, బెడ్ లైట్ ని ఆర్పడానికి, చెయ్యిముందుకి సాచబోయి-
'కెవ్వు' మని అరిచింది.
డబుల్ కాట్ బెడ్ వెనక, విశాలమైన బీరువా పక్కన చీకట్లో ఎంత సేపట్నించి వెయిట్ చేస్తున్నాడో తెలీదు.
ఆ వ్యక్తి గబుక్కున సల్మామీద దూకి, ఆమె నోరు మూసి, చేతిలోని కత్తితో కస, కసా రబ్బరు బొమ్మని పొడిచినట్లుగా పొడిచాడు.
ఏం జరుగుతోందో అర్ధంకాని సురేష్ భయంతో కొయ్యబారిపోయి, తేరుకొని లేవబోయేటంతలో, ఎడం చేత్తో బెడ్ లాంప్ ని అందుకుని ఆ వ్యక్తి సురేష్ తలమీద మోదాడు.....పక్కకు తిరిగి-పిల్లోని అతని ముఖమ్మీద బలంగా అదిమిపట్టి కసిగా సురేష్ కడుపులో బలంగా పొడిచాడు.
అంతే!
మూడే మూడు నిమిషాలు రెండు మర్డర్లు.
సల్మా నగ్న శరీరం వేపొకసారి చూసి ముందుకు నడిచాడు ఆ వ్యక్తి!
సోఫామీద తీరుబడిగా కూర్చుని, బాటిల్లోని డ్రింక్ ను గ్లాసులో పోసుకొని త్రాగడం ప్రారంభించాడు - సిగరెట్ వెలిగించుకుంటూ తనచేతి వేపు చూసుకున్నాడు.
కత్తితో పొడుస్తున్నప్పుడు సల్మా చేతిగోళ్ళతో రక్కేసిన చోట ఎర్రగా కమిలిపోయింది.
"బిచ్" తిట్టుకుంటూ, గ్లాసులో విస్కీని ఎర్రగా అయిపోయిన చర్మంమీద పోశాడు.
ఒక్క క్షణం మంట....
పది నిమిషాల్లో బాటిల్ ఖాళీచేసేసి, సిగరెట్ పాకెట్ అందుకుని బీరువావేపు నడిచాడు.... బీరువాని ఓపెన్ చేసి సూట్ కేసు తెరిచాడు....సూట్ కేస్ నిండా కొత్త కరెన్సీ నోట్లు.... సూట్ కేస్ ని క్లోజ్ చేసి, కిటికి వేపు నడుస్తూ ఆఖరు సారిగా సల్మావేపు చూసి నవ్వాడు.....అతని పళ్ళ మధ్య 'స్టీల్ రాడ్' ట్యూబ్ లైట్ వెలుగులో వజ్రంలా మెరిసింది.
