Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 7


    "ఎక్కడికి?" అన్నాడు దేవదాసు.
    భగవాన్ నవ్వి "సుఖం దగ్గరకు" అన్నాడు.
    "సుఖమా! ఈ ప్రపంచంలో సుఖమనేది వుందా?" అన్నాడు దేవదాసు నిర్లిప్తంగా.
    "బోలెడుంది. అయితే కొనుక్కోవాలి" అన్నాడు భగవాన్.
    దేవదాసు నిట్టూర్చి "ప్రస్తుతం నా దగ్గర డబ్బులులేవు" అన్నాడు.
    భగవాన్ నవ్వి "నువ్వు నా బెస్ట్ ఫ్రెండువికదా! నేను ఖర్చుపెడతాను పద" అన్నాడు.
    "నాకు మొహమాటం. నా కోసం వేరేవాళ్ళు ఖర్చు పెడితే నాకు బాగోదు" అన్నాడు దేవదాసు.
    భగవాన్ నవ్వి "సరే. నీకు పెట్టే ప్రతి దమ్మిడీ లెక్క రాస్తాను. సరేనా? ఉన్నప్పుడు ఇద్దూగాని.... అయినా జమీందారు బిడ్డవు. నీ దగ్గరెక్కడికి పోతాయ్ డబ్బులు..." అన్నాడు.
    దేవదాసుకి ఇది సమ్మతమైంది.
    అక్కడి వాతావరణమే ఏంటో విచిత్రంగా, ఇబ్బందిగా వుంది దేవదాసుకి. తామిద్దరే కాకుండా ఇంకా ఓ పది, పన్నెండు మంది దివాన్ లకు ఆనుకుని మందుకొడుతూ కూర్చున్నారు.
    ఇంతలో ఓ సౌందర్యవతి వచ్చి, పాట పడుతూ నృత్యం చెయ్యటం మొదలుపెట్టింది.
    నృత్యం తారా స్థాయికి చేరుతున్నకొద్దీ అక్కడున్నవాళ్ళ కేకలు, కోలాహలం ఎక్కువైంది. ఆ అమ్మాయి మీద కట్టలు కట్టలు డబ్బు విరజిమ్ముతున్నారు.
    నృత్యం అయిపోయింది. అందరూ తూలుకుంటూ వెళ్ళిపోయారు. దేవదాసు తలవంచుకుని అలాగే కూర్చున్నాడు.
    ఎప్పుడొచ్చిందో ఆ అమ్మాయి -దగ్గరగా వచ్చి "నమస్తే... నా పేరు చంద్రముఖి" అన్నది. దేవదాసు ఆమెవైపు చూడకుండా అంతకుముందు భగవాన్ ఇచ్చిన డబ్బుకట్ట ఆమె ఒళ్ళో పడేసి, లేచి నిల్చోగానే భగవాన్ ఆపి, "మా వాడు.....దేవదాసు.... పెద్ద జమీందారీ బిడ్డ ఎందుకో మనసు బాగా లేదంటే ఇక్కడికి తీసుకొచ్చా" అన్నాడు.
    దేవదాసు కోపంగా చూస్తూ "ఏదో సుఖం అన్నావ్? ఇదా సుఖమంటే? నాకు ఇలాంటివి చాలా అసహ్యం" అన్నాడు. చంద్రముఖి మనసు కష్టపెట్టుకున్నా చిరునవ్వునవ్వుతూ - "జమీందారీ బిడ్డలు మీరు. సుఖం అంటే నిజంగా తెలీదా దేవ్ బాబూ?" అంది.
    "ఛీ.... ఇదీ ఒక సుఖమేనా?" అని భగవాన్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు దేవదాసు.
    అతను వెళ్ళినవైపే చూస్తూ అభావంగా చంద్రముఖి "ఆయన్ని మళ్ళీ ఒక్కసారి తీసుకురా భగవాన్" అంది.
    
                                       * * *
    
    పార్వతి తలుపుతీసి వెళ్ళి అటుతిరిగి పడుకుంది. ఆమె తలకు కట్టు అలాగే వుంది. చాలా ఫీలయ్యాడు దేవదాసు తన అనుచిత ప్రవర్తనకి.
    "అన్నం కిచెన్ లో గట్టుమీద వుంది" అంది పార్వతి. దేవదాసుకి ఆకలేయట్లేదు. పార్వతి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వెళ్ళి ఆమె పక్కనే సర్ధుకుని పడుకున్నాడు.
    తెల్లారాక "రాత్రి ఎక్కడికెళ్ళావు?" అంది మామూలుగా. ఈ మధ్య ఏకవచన సంబోధన చేస్తోంది పార్వతి. అదేమీ పట్టించుకోకుండా "భగవాన్ దగ్గరకు వెళ్ళాను" అన్నాడు.
    "ఓ! భగవాన్ భార్యతో కబుర్లు చెప్పి వచ్చావా!"
    "భగవాన్ కు ఇంకా పెళ్ళి కాలేదు"
    "ఆ విషయం నాకూ తెలుసు. మరి ఆ మల్లెపూల వాసనలు, చొక్కాకి అత్తరు సువాసనలు....."
    దేవదాసు మాట్లాడలేదు.
    "చెప్పండి ఎవత్తె అది? చివరికి ఈ తిరుగుళ్ళు కూడా తిరుగుతున్నారా? ఛీ...." అంది.
    మళ్ళీ, దేవదాసుకి పిచ్చి కోపం వచ్చింది" అసలు ఇంటికి రావడం నాదే తప్పు" అని లేచి చెప్పులేసుకుని చకచకా బయట కెళ్ళిపోయాడు.
    నెల గడిచింది.
    "అబ్బ ఎప్పుడూ అదే మూడా! కాస్త నవ్వు భాయీ! అన్నట్టు చెప్పటం ,మరిచిపోయాను. చంద్రముఖి నిన్నొక సారి చూడాలట" అన్నాడు భగవాన్.
    "బహుశా డబ్బు కావాలేమో -నా పేరు చెప్పి ఆమెకు కావల్సినంత డబ్బు ఇవ్వు" అన్నాడు దేవదాసు.
    "ఆమెకు డబ్బుకి ఏమీ కొదవలేదు. సరేకానీ..... నువ్వు విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళొస్తాను" అన్నాడు భగవాన్.
    "ఎక్కడికి? అక్కడికేనా?"
    "అవును భాయ్! ఆమె ఆటా, పాటా, ఆ అందం, మదిరాపానం .... ఇవన్నీ ఒదులుకుని ఈ రూమ్ లో కూర్చుని భజన చెయ్యమంటావా? సరే నేనొస్తా" అని గుమ్మం దాటుతుంటే "ఆగు. నేను మాత్రం ఈ రూమ్ లో ఒక్కన్నీ కూర్చుని ఏం చెయ్యాలి? ఇంటికెళ్ళ బుద్ధి కావటం లేదు. పద నేనూ వస్తాను" అన్నాడు దేవదాసు.
    లోపలికి అడుగుపెట్టి, చుట్టూ చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. ఇల్లంతా బోసిగా ఉంది. గానాబజానాలు లేవు. అలంకరణలు లేవు. వాద్యకారులు లేరు.... చంద్రముఖి వుందిగానీ అతి సాధారణ చీరలో వుంది. దేవదాసుని చూడగానే  పరుగులాంటి నడకతో వచ్చి "దేవ్ బాబూ! వచ్చారా? నాకు తెలుసు. మీరు నా మాట మన్నిస్తారని" అని అతన్ని దివాన్ మీద కూర్చోపెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS