దేవదాసుకి దార్లో అతని రూమ్ మేటు భగవాన్ కనిపించి, కాలేజీలో అతని పేరు కొట్టేశారని చెప్పాడు. ఊరినించి పార్వతి తెచ్చిన డబ్బులు దాదాపుగా అయిపోయినట్టే. దేవదాసు చాలా మధనపడ్డాడు. తనకోసం ఏదో ఒక ఉద్యోగం వెతకమని చెప్పాడు భగవాన్ తో.
మరి కొన్నాళ్ళు గడిచాయి.
ఉంటున్న అద్దెఇల్లు కొంచెం ఇరుగ్గానే వుంది. రెండు చిన్న గదులు, చిన్న కిచెన్, కామన్ బాత్ రూమ్. పార్వతి తెచ్చిన సామానుతో రెండు గదులూ నిండి పోయాయి.
రోజూ ఉద్యోగంకోసం తిరిగి తిరిగి అలసిపోయి మంచంమీద అడ్డంగా పడుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు దేవదాసు.
పార్వతి వంటిల్లు సర్ది వచ్చి చూస్తే కనీసం కూర్చోటానికి కూడా బాగా ఉండటంలేదు. "నీ పాదాల దగ్గర కొస్తే చోటివ్వు దేవదా" అని అతని కాళ్ళ దగ్గరే ఎలాగో ఒకలా సర్దుకుని ముడుచుకు పడుకుంటోంది పార్వతి రోజూ.
* * *
దేవదాసుకి మనశ్శాంతి పూర్తిగా పోయింది. భగవాన్ ఇప్పించిన చిన్న ఉద్యోగం కూడా తుమ్మితే వూడే ముక్కులా తయారైంది. కిరాణా స్టోర్సు వాడు ఇక అప్పు ఇవ్వనన్నాడు. పోనీ నాన్న దగ్గరకెళ్ళి ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే? .... ఉహుఁ.... తన వల్ల కాదు. ఆయన రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. రాత్రి పార్వతితో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది.
"అన్నట్టు మామగారు ఏం తింటూవుంటారు? అరవై ఐదేళ్ళుండవూ? ఇంకా ఉక్కుముక్కలాగున్నారు?" అంది పార్వతి.
దేవదాసు కొంచెం గర్వంగా "మా ఇళ్ళల్లో చేసే వంటకాలే వేరు. ఇప్పటికీ మా నాన్న వారం వారం వేటకెళ్ళి కనీసం రెండు జింకలనైనా తెచ్చి పడేస్తారు. అంత స్టామినా వుంది ఆయనకి" అన్నాడు.
"గొప్పేలే....నాకు తెలీక అడుగుతానూ.....ఇంకో పాతికేళ్ళైనా గ్యారంటీ కదా!" అంది.
"ఆయనకేం!" అనబోయి అనుమానంగా "అంటే నీ ఉద్దేశం?" అన్నాడు దేవదాసు.
"ఆఁ .... ఏం లేదు. మీ తాతముత్తాతల ఆస్తి కదా! తొందరగా విల్లురాసే వుద్దేశం లేదని విన్నాను. మరి మనం ఇంకా ఎంతకాలమని ఇలా బతకటం? ఉన్న ఆస్తుల్ని మీకు, మీ అన్నయ్యకూ రాసేస్తే అందరం హాయిగా వుంటాం గదా! కావాలంటే మామగారినీ అత్తగారినీ మనతోనే అట్టే పెట్టుకుందాం" అంది.
దేవదాసుకి చాలా కోపమొచ్చింది. "ఆయనకి ఇప్పట్లో విల్లురాసే ఆలోచన లేదని ఎవరూ చెప్పారు నీకు?" అన్నాడు కోపం నిగ్రహించుకుంటూ.
"మా నాన్న" అంది.
దేవదాసు సహనం కోల్పోయాడు. ఇంత బతుకూ బతికీ, చివరకి ఇలా జరిగిందేమిటి? చివరికి తండ్రి దగ్గర విల్లు ప్రస్తావన తెచ్చారా!
పార్వతిని చాచిపెట్టి లెంపకాయకొట్టాడు.
పార్వతి నిర్ఘాంతపోయి, వెంటనే ఏడవటం మొదలుపెట్టింది.
"మీరు సంపాదించె ముష్టి సంపాదనకి ఇంటి అద్దె, పాలు, కరెంటు బిల్లు, ఇవన్నీ ఎక్కడ్నించి వస్తాయి? అసలు తప్పంతా నాదేలే. అక్కడికీ మా నాన్న మీకంటే పెద్ద జమీందారీ సంబంధమే తెచ్చాడు. రెండో పెళ్ళి అయితేనేం? బతుకు దర్జాగా వుండేది. తాంబూలాలు పుచ్చుకుందామనే లోపల నువ్వు మీ నాన్నతో పోట్లాడి బయటకొచ్చేయటం, మా అమ్మానాన్నా ఇంతకంటే గొప్ప సంబంధం దొరకదన్నట్లు వెంటనే నీతో పెళ్ళి చేయటం....అంతా నా ఖర్మ" అని తలకొట్టుకోసాగింది. దేవదాసుకి పిచ్చికోపం వచ్చింది. కిటికీలకి, అద్దాలకు బూజు దులిపే కర్ర తీసుకుని పార్వతి తలమీద కొట్టాడు.
దెబ్బ నుదిటి మీద తగిలింది. "ఎంతపని చేశావు దేవాదా" అని తలపట్టుకుంది. దేవదాసు రక్తం చూసి భయపడిపోయాడు. వెంటనే పార్వతి చీర కొంగు సర్రున చింపి కట్టుకట్టాడు. అది చూసి
"మళ్ళీ ఎంత పని చేశావు దేవదా" అంది పార్వతి.
దేవదాసు ".... ఛీ ఛీ ఈ కొంపలో వుండటం కంటే శాపం ఇంకేదీ లేదు" అని ఆ కర్రని చేతిలోకి తీసుకున్నాడు.
మళ్ళీ కొడతాడేమోనని పార్వతి దూరంగా జరిగింది. దేవదాసు ఇదేమీ గమనించలా. ఆ కర్రను రెండుగా విరిచి అవతల పడేసి, చకచకా బయటకెళ్ళి పోయాడు.
* * *
"ఇక్కడ ఇంటర్ వెల్ ఇద్దాం" అన్నాడు రైటరు ఆవులిస్తూ.
"సరే బాగా పొద్దు పోయింది. ఇవ్వాల్టికి చాలు. మీ రూంకెళ్ళి పడుకోండి. మళ్ళీ రేపు" అన్నాడు ఆసామీ. రైటరు తన రూంకి వెళ్ళిపోయాడు.
మర్నాడు పొద్దున్న కాఫీటిఫిన్లు కానిచ్చి రైటరు మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు.
* * *
దేవదాసు సరాసరి భగవాన్ రూమ్ కి వెళ్ళాడు. దేవదాసుని చూసి భగవాన్ ఆశ్చర్యపోయాడు. "ఏమిటి భాయ్! ఈ టైమ్ లో వచ్చావు? ఒదిన కులాసానా?" అడిగాడు. దేవదాసు సమాధానం చెప్పకుండా మంచం మీద కూర్చుని కణతలు నొక్కుకోసాగాడు. దేవదాసు మూడ్ బాగాలేదని గ్రహించి "కాసేపు విశ్రాంతి తీసుకో. నేనలా బయటకెళ్ళొస్తాను" అన్నాడు భగవాన్.
