శేషు కళ్ళు మూసుకున్నాడు. చిరు చెమట్లుకూడ పట్టేయి.
అంతలో కెవ్వున అరిచింది నీలవేణి! శేషు కంగారుగా కళ్ళు విప్పేసి అడిగేడు.
"ఏవైంది?"
గారంగా సమాధానం చెబుతోంది.
"అంత దూరంగా వుంటే ఏమి చెప్పను? ఎట్లా చెప్పను? పురుగు డార్లింగ్ పురుగు కుట్టేస్తోంది!
శేషు తడబడుతూ దగ్గరికి వస్తూ "ఎక్కడా" అని అడుగుతున్నాడు.
నీలవేణి అకస్మాత్తుగా అతని చెయ్యిపట్టేసుకుని, అతన్ని మీదికి లాక్కుని లైట్ ఆఫ్ చేసింది.
ఉదయం-
నీలవేణి వాంతులు చేసుకుంటోంది. శేషు ఆందోళనగా అడిగేడు.
"వంట్లో బాగోలేదా?"
నీలవేణి అతని బుగ్గ చిదిమి అన్నది.
"దొరగారు తండ్రి కాబోతున్నారు!"
శేషు భయపడ్డాడు. ఆందోళనపడ్డాడు. బెంగపడ్డాడు. అంచేత గట్టిగా అరిచేసేడు.
"నీలూ-నేను-నో-వీల్లేదు!"
నీలవేణి అతని కాళ్ళమీదపడిపోయింది. ప్రాధేయపడుతూ డ్రమెటిగ్గా అన్నది.
"అంత మాటనకండి! అరిటాకులాటి ఆడపిల్లని. నన్ను అన్యాయం చేయకండి"
శేషు బెదురుగా అనేస్తున్నాడు.
"ఇది దగా! కుట్ర! మోసం! రాత్రివరకు నువ్వెవరో నాకు తెలీదు. నీ బిడ్డకు తండ్రినెట్లా అవుతాను!"
నీలవేణి సరైన సమాధానమే చెప్పింది.
"సీజను మారిపోయిందండీ! రోజు గడిస్తే చాలు నెల తప్పుతోంది! నన్ను నమ్మండి!"
అతనేదో చెప్పబోతుండగా ఆ దృశ్యం మొత్తం మాయమై పోయింది.
25
పై దృశ్యాన్ని కలగన్న వామనరావు గట్టిగా అరుస్తున్నాడు 'నీలూ' అని.
సింహాచలం ఆ పేరువిని అటూ ఇటూ చూసి గుమ్మం దగ్గిరకెళ్ళి పిలుస్తున్నాడు.
"ఇక్కడ నీలూగారెవరండీ? అయ్యగారు పిలుస్తున్నారు."
అయోమయం నుంచి తేరుకుని అన్నాడు వామనరావు.
"నీలూ గురించి నువ్వుకాదూ చెప్పింది?"
సింహాచలం సీరియస్ గా అన్నాడు.
"ఒట్టుసార్! నీళ్ళూ పాలూ గురించి నాకేం తెలీదు సార్! తమరే నీలూ అని గావుకేక పెట్టేరు?"
వామనరావు ఒక నిర్ణయానికి వచ్చి అన్నాడు.
"సింహాచలం! ఇంక ఆలస్యం చేయకూడదు. శేషుకి వెంటనే పెళ్ళిచేసేయాలి. వాడు ఎవర్ని ప్రేమించినా, ఎవరువాడ్ని ప్రేమించినా, నా జీవితలక్ష్యం సర్వనాశనమై పోతుంది."
అంటూ అతను ఫోనెత్తి యస్.టి.డి. కొట్టేడు. శేషు చాటుగా వింటున్నాడు.
"హల్లో బావగారా? నమస్కారం అవున్నెనే మాటాడుతున్నాను. మీ అమ్మాయికి బి.ఇ.డి.లో సీటు వచ్చింది. వెంటనే పంపించండి. ఎంచక్కా మా ఇంట్లోనే వుండి చదూకుంటుంది. అయ్ టెల్యూ హాస్టలూ గీస్టలూ తీసేయండి. అమ్మాయిని అర్జంటుగా పంపండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. దట్సాల్!" అని ఫోన్ పెట్టేసి కళ్ళజోడు తీసి ఆలోచనల్లో పడ్డాడు.
శేషు సింహాచలం చెయ్యి పుచ్చుకుని తనగదిలోకి లాక్కుపోయేడు.
సింహాచలాన్ని గదిలోకి లాక్కురావడం పూర్తయిం తర్వాత అతన్ని మంచమ్మీదకి తోసేసి, తలుపు మూసేడు.
ఒక్కో అడుగువేస్తూ గంభీరంగా అడుగుతున్నాడు శేషు.
"నేను నిన్ను అడిగిందేమిటి?"
మెల్లిగా లేచి కూచుని అన్నాడు సింహాచలం.
"మిస్ జయతో మీ పెళ్ళి జరిపించమన్నారు"
"ఇప్పుడు నువ్వుచేసిన నిర్వాకమేమిటి?"
"మీ నాన్నగారికి మీ వయస్సుమీద భయం కలిగించేను. మీకు వెంటనే పెళ్ళి చేయడం తక్షణ కర్తవ్యమని హెచ్చరించేను."
"నీ బోడి హెచ్చరిక ఎంత పనిచేసిందో తెలుసా? బందర్లో మా మావకి ఫోన్ చేసేడు."
"విన్నాను సార్!"
"మావకో ఆడపిల్ల వుంది!"
"మావలుంటే వాళ్ళకి ఆడపిల్లలుండటం మోస్ట్ కామనండి?"
"చదువు వంకతో ఆ పిల్లని వెంటనే పంపించమని ఆర్డరువేసేడు. విన్నావా? దట్ మీన్స్. మావకూతుర్రాగానే ముహూర్తాలు పెట్టించి పెళ్ళి జరిపించేస్తాడు. అండర్ స్టాండ్?"
సింహాచలం హీరోలా నిలబడి హీరోలాగానే సమాధానం చెప్పేడు.
"ఈ ఇంటికెవరొస్తున్నారో ఆ పాయింటు వదిలేయండి సార౧ మీ పెళ్ళి మీ మావ కూతుర్తో కాకుండా మిస్ జయ గార్తోనే జరుగుతుంది!"
శేషు ఆశ్చర్యంగా అన్నాడు.
"సింహాచలం!"
సింహాచలం సీరియస్ గా అన్నాడు.
"ది సీజ్ ఫార్ములా నెంబర్ సెవెన్!"
"ఫార్ములా నెంబర్?"
"సెవెన్!"
"నీగోల నా కర్థం కావడంలేదు!"
సింహాచలం తన జేబులోంచి పాకెట్ బుక్ ఒకటి తీసి శేషుకిస్తూ చెబుతున్నాడు.
"చదువుకోండి సార్! ఎల్లాంటి ఇబ్బందిని ఏ నెంబరు ఫార్ములా వాడి పరిష్కరించుకోవచ్చో ఆ వివరాలన్నీ విపులంగా వున్నాయి. రాసింది నేనే. వెల ఉచితం. గుడ్ బై!"
శేషు కన్నార్పకుండా చూస్తుంటే సింహాచలం పెద్దపెద్ద అంగల్తో ఆ గది విడిచి వెళ్ళిపోతున్నాడు.
26
రైల్వే స్టేషను.
ప్లాట్ ఫారమ్మీదికి రైలువచ్చి ఆగింది. జనాన్ని తోసుకుంటో వామనరావు అన్ని కంపార్టుమెంట్లూ వెతుకుతూ తిరుగుతున్నాడు.
ఒక కంపార్టుమెంట్ తలుపు దగ్గిర సులోచన నిలబడి వుంది. వామనరావుని చూడంగానే పిలిచింది.
"మామయ్యా! ఇక్కడున్నాను!"
వామనరావు ఆదరాబాదరాగా ఆ కంపార్టుమెంటు దగ్గిరికి వెళ్ళేడు. సామానుగట్రా కూలీ కెత్తించి సులోచనను వెంటబెట్టుకుని నడుస్తున్నాడు.
వామనరావుని అనుసరిస్తూ నడుస్తోంది సులోచన. మధ్యలో సులోచనకు తుమ్ములాంటిదిరాగా కసుక్కున తుమ్మింది.
ఆ దెబ్బతో ఆమె కళ్ళజోడు కిందపడి పోయింది. సులోచన బిత్తరపోయింది. కాణీ సంబాళించుకుంది. ఒక్కర్తే తడుంకుంటో నడుస్తోంది.
తన పక్కనెవరు లేకపోయినా, వుండే వుంటారనే ధీమాతో తనకు తోచిన మాటలేవో అంటోంది.
