ఏది! ఏది! నాదు హృదయమ్ము పులకింప
నాన్న! ఒక్కమాటు నవ్వవోయి!
కన్నులార్పకుండఁ గాంచుచుందును నేను
కదలకుండ నీవు నిదురపొమ్ము!
చిట్టితండ్రి రేపు శ్రీ మహావిష్ణువై
ముద్దులొలుకు పసిడి గద్దె నెక్కు;
బాబు మౌళి మీఁద బంగారు మకుటంబు
కోటిసూర్యకాంతి గ్రుమ్మరించు.
పెద్ద పెద్ద దొరలు భృత్యానుభృత్యులై
చిట్టిబాబు కాళ్ళుపట్టఁగలరు;
చిగురు మోవిమీఁది చిరునవ్వు వెన్నెలల్
భరతఖండ మెల్లఁ బ్రాకఁగలవు.
బాల భాను కిరణ జాలమ్ము ప్రసరింప
కరిగిపోయె నంధకార మెల్ల!
ఆడుకొనఁగవచ్చి రబ్బాయి లందరు
బాబు! నిద్ర చాలు ప్రక్క దిగుము.
'కరుణ' తెచ్చెనోయి! కనకాంబరమ్ములు;
'సరళ' తెచ్చెనోయి! జాజిపూలు;
పారిజాతములను పంపించె 'ననసూయ'
కొండిచుట్ట వేసికొందు లెమ్ము;
ఆరగింపవయ్య! ఆనందవర్ధన!
పాలు పంచదార పనసతొనలు;
పనసతొనలు తినిన బంగారుతండ్రికి
మనసు మాట కూడ మధుర మగును."
అర్ధమైనయట్లు అరమోడ్పు కనులతో
ఆలకించు శిశువు జోలపాట;
పాటలో ధ్వనించు పరమార్ద భావమ్ము
చిట్టి పెదవి విప్పి చెప్పలేఁడు.
"మా యయ్య క్షీరాభ్దిశాయియే! గాకున్న
నోటిలో ఈ పాలనురుగులేమి?
మా సామి కైలాసవాసుఁడే గాకున్న
గంగతో ఈ చెలగాట మేమి?
మా తండ్రి భునవవిధాతయే! గాకున్న
రాయంచ కొరకు మారాములేమి?
మా బుజ్జి అలచందమామయే! గాకున్న
చిరునవ్వు వెన్నెల చిందులేమి?"
అని అనుఁగుతల్లి చిబుకంబు పుణికి, ఎదకు
హత్తుకొని, యెత్తుకొని ముద్దులాడు వేళ
కన్నులల్లార్చి నవ్వునేగాని - తన ర
హస్యమును చెప్పలేఁడు సిద్దార్ధశిశువు.
.jpg)
గడప లన్ని గడచి బుడిబుడి నడకలతో
పడుచు పడుచు తప్పటడుగు లిడుచు
పొగడచెట్టునీడ పగడాలతిన్నెపై
కొలువుదీర్చు బాలకులను గూడి.
గజ్జె గట్టు బుల్లి బుజ్జాయి మెడలోన
'గల్లు గల్లు' మంచు గంతులిడఁగ;
రామచిలుక పంజరమ్ములో పలికిన
మారుపలుకు చిట్టినోరు విప్పి.
అన్ని పండ్లకంటె ఆసక్తి యధికంబు
బాలునకు రసాల ఫలము లనిన;
ఆమ్రపాలి గొంతు అల్లంత విన్నంత
పాలగిన్నె విడిచి పరువులెత్తు.
దినము దినము వృద్ధిఁగను సుధాంశుని గాంచి
ప్రమదమందు శుక్లపక్షమందు;
దినదినమ్ము కృశతఁగను హిమాంశుని జూచి
బాధ చెందు కృష్ణపక్షమందు.
బాలగౌతముండు పరుగెత్తునప్పుడు
'గల్లు' మనెడు కాళ్ళ గజ్జెలందు
విశ్వమోహనముగ వేదాంతవీథుల
మధుర నాదమేదొ మారుమ్రోగు.
శ్రీకరమ్ములైన ఆ కరమ్ముల సుధా
శీకరమ్ము లింత చిందినంత,
ఇంతలేసి మొక్క లెల్ల నింతింతలై
అంతలేసి యగుచు నతిశయిల్లు.
తల్లి పెట్టు తియ్య తాయమ్ము లన్నియు
పంచిపెట్టు తోడిబాలకులకు;
కన్నె కల్పలతల విన్నాణములు దిద్దు
చిన్నిచిన్ని చిగురు చేతులెత్తి.
వృద్ధినందె బాలసిద్దార్ధచంద్రుండు
రోజురోజు శాక్యరాజు నింట;
కపిలవస్తునగర కల్యాణ కలశాబ్ది
పొంగిపొరలె రసతరఁగమగుచు.
మంగళమందహాససుకుమారకపోలము లుల్లసిల్ల సౌ
ధాంగణ భూమి స్వామి నడయాడుచు నాడుచునుండ, నంగనల్
చెంగున వచ్చి యెత్తుకొని చెక్కిలి చక్కిలిగింత పెట్టుచున్
బంగరుతండ్రి లేఁబెదవిపై విరియింతురు పండువెన్నెలల్.
"ఇంట నిమేషమున్ నిలువ! వెప్పుడు దేహళి దాటివచ్చినా!
వంటిన కందిపోవు భవదంఘ్రితలమ్ములఁ జూడు మెంత దు
మ్మంటినదో!" యటంచు ప్రణయాంకమునం దుపవిష్ణుఁ జేసి ప
య్యంటచెరంగుతోఁ దుడుచు నంబ కుమారు పదాంబుజాతముల్.
'దు'మ్మనుచున్ బటాంచలముతోఁ! దుడువం దలపెట్టెగాక-ఆ
యమ్మ యెరుంగ దాత్మతనయాంఘ్రిసరోజరజోమహాప్రభా
వమ్ము రవంత! తల్లవలవమ్ములకోసము దేవతా కిరీ
టమ్ములు, సార్వభౌమమకుటమ్ము లవెన్ని తపించుచుండెనో!
పువ్వులతోట కాడుకొనఁబోవ, నొయారముగా బుజాలపై
'రివ్వున' వచ్చివ్రాలు తెలిరెక్కల చిక్కని పావురమ్ములన్
నవ్వుచు చేరఁదీసి కరుణానిధి మేతలు పెట్టి చేతితో
దువ్వుచు వింత కౌతుకముతో విసరున్ వినువీథిలోనికిన్.
చూచుటలో మరింత సొగసుల్ వెదజల్లు విశాల విస్ఫుర
ల్లోచనముల్ కుతూహల విలోల వినీల కనీనికమ్ములై;
చాటుటలో ప్రభాత జలజాతములట్లు మరింత లోచనా
సేచనకమ్ములౌ మిసిమిచేతులు శాక్యకిశోరమూర్తికిన్.
.jpg)
అపరిమిత ప్రహర్షమయమై యలరెన్ బ్రజ లుల్లసిల్లఁగా
నుపనయనోత్సవమ్మది ముహుర్ముహురారచిత ప్రజావతీ
నృప నయనోత్సవ; మ్మెనిమిదేడుల పచ్చని బ్రహ్మచారి సి
గ్గుపడియె జందెముం బసుపుగోచియుఁ బంచశిఖల్ ధరించుచున్.
'భిక్షాందేహి' యటంచు పుత్త్రుఁడు సమీపింపన్ ప్రమోదాశ్రువుల్
వక్షోజమ్ములఁబార తల్లి కరుణావాత్సల్యసంపూర్ణయై
భిక్షంబెట్టె; నేరుమ్గా 'దీతఁడు జగత్ప్రేమైన దీక్షా మహా
భిక్షూత్తంస' మటంచు; భావిగతి భావింపగరా దేరికిన్.
ఎప్పుడు కల్గెనో యెరుఁగ మింతటి వింత యుపజ్ఞ; గ్రంథముల్
విప్పియు విప్పకే పరిఢవిల్లె వినూతనభావముల్; పుటల్
త్రిప్పియుఁ ద్రిప్పకే పరిమళించెను బుద్దిలతల్; గురూత్తముల్
చెప్పియుఁ జెప్పకే ప్రతిఫలించెను సర్వకళా స్వరూపముల్.
