Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 5


    "అమ్మా! ఊరుకుంటావా? అది వాడి భవిష్యత్తు. వెళ్లనీ" కొడుకు కసిరి గట్టిగా చెప్పేవరకు ఊరుకోలేదు. చరణ్ అమెరికా వెళ్లిన రోజున అన్నం తినకుండా కళ్లు ఒత్తుకుంటూనే ఉంది.
    తనని ప్రాణంగా ప్రేమించే నాయనమ్మ అంటే చరణ్ కి కూడా ఎంతో అభిమానం. చిన్నప్పుడు ఆవిడ చెప్పిన కథలు, మంచిమాటలు, నీతికథలు తనకు ఎంతో ఉపయోగించాయని నమ్ముతాడు. ముఖ్యంగా తెలుగు పద్యాలు, భారతం, రామాయణం, వేమనపద్యాలు, సుమతీ శతకాలు తెలుగుపట్ల తనకు ఎంతో అభిరుచుని పెంచాయి. అమెరికా వెళ్లిన తర్వాత కూడా దొరికినప్పుడల్లా తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగు పాటలు, తెలుగు సినిమాలు చూడటం ద్వారా వదలకుండా అనుబంధం పెంచుకున్నాడు.
    ఈ పెళ్లిసంబంధం చెప్పగానే "ఒరేయ్, ఆ అమ్మాయికి తెలుగు వచ్చా లేదా? ముందది చెప్పు." మొదటి ప్రశ్న అడిగింది మామ్మగారు.
    అసలు అమెరికా వెళ్లేముందు మనవడికి గట్టిగా నూరిపోసింది. "ఇదిగో ఒరేయ్! అమెరికా వెళ్లేది చదువుకి. చదువుకోసం మాత్రమే సుమా! ఏ తెల్లదాన్నో, ఇంకోర్తినో వెంటేసుకుని వచ్చావంటే కాళ్లు విరగ్గొడ్తాను. ఎవరైనా అందమైన పిల్ల కనిపించి, నీకు నచ్చితే తెలుగు పిల్లా, మనవాళ్లా అని తెల్సుకుని ముందుకెళ్లాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్లని ప్రేమ గీమ అని తీసుకువచ్చావంటే ఉరేసుకుంటాను తెలుసా." అని బెదిరించింది.
    "పో మామ్మా, నేను చదువుకి వెళుతున్నాను. అమ్మాయిల్ని ఎంచుకోడానికి కాదు."
    "సర్లే అంతా ఇలాగే చెప్తారు. ఓ తెల్లతొక్క అమ్మాయి కనపడగానే వెంటబడి, వెంటేసుకు వస్తారు. ఒరేయ్ వాళ్లతో మనకి సరిపడదు. వాళ్ల పద్ధతులు, పెంపకాలు వేరు. ఏదో మన తెలుగుపిల్ల కాకపోయినా అరవమో, కన్నడ అమ్మాయో అయినా ఫరవాలేదు. మరాఠీ పిల్ల కూడా మనవాళ్లల్లో కలిసిపోతుంది. నేను చెప్తున్నది గుర్తించుకో." చరణ్ బయలుదేరేముందు నూరిపోసింది. మనవడు మరీ బరితెగించే రకం కాదని, కాని పనులు చేయడనీ ఆవిడ గట్టినమ్మకం.
    ఆ నమ్మకం వమ్ము చేయకుండా రెండేళ్లు బుద్ధిగా ఎమ్మెస్ చదివి, ఆరు నెలలు ఏదో మామూలు ఉద్యోగం చేశాక 'క్వాల్ కం'లో ఉద్యోగం రాగానే, స్థిరపడిపోయినట్లే అని నిబ్బరంగా అనేసుకుని, అప్పుడు కాస్త చుట్టూ చూడ్డం అలవాటు చేసుకున్నాడు. ఆ చూడ్డంలో మొదటిచూపుకే అప్పుడే పదిరోజుల క్రితమే అక్కడ జాయిన్ అయిన చరిత్ర చిక్కింది. పడిన చూపు తప్పించుకోలేక పోవడం, ఇద్దరూ ఒకే జాతి పక్షులు కావడంతో దగ్గరైపోయారు. స్నేహం, సినిమాలు, వీకెండ్ లు, కాఫీ హౌస్ ల మధ్య పరిచయం ప్రేమగా మారి పోయింది. సెలవొస్తే ఇంటికి పిలిచి లంచ్ లు, డిన్నర్లు, పిక్నిక్ లు, పండగలు... చరిత్రే కాక వాళ్లింట్లోవాళ్లు కూడా చరణ్ కి దగ్గరైపోయారు.
    ఆర్నెల్ల తరువాత పనిగట్టుకుని ఇండియా వచ్చి, సంప్రదాయబద్ధంగా పెళ్లిచూపులు ఏర్పాటుచేసి అమ్మాయిని చూపించారు. 'ఫరవాలేదు, మంచీ మర్యాద తెల్సినవారే, సంప్రదాయం తెలిసినవాళ్లు, మనవాళ్లు' అని సంబరపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మగపెళ్లివారు. మూడు నెలల్లో ముహూర్తం కుదిరిపోయింది.
    "మనవాడి ముందు అమ్మాయి రంగు తక్కువరా" అని కాస్త గునిసింది మామ్మ.
    "అమ్మా! ఈ రోజుల్లో చదువు, ఉద్యోగాలకి తప్ప అందాలకి ప్రాముఖ్యత ఇవ్వడం లేదమ్మా! అయినింటి సంబంధం, మనవాళ్ల పిల్ల అని సంతోషించా. పిల్ల కాస్త రంగు తక్కువైనా స్మార్ట్ గా ఉందిలే!"
    "అవునులే, వాళ్లెవర్నో కట్టుకువచ్చేదానికన్నా సంప్రదాయ కుటుంబం పిల్లే దొరికిందిలే" అని సరిపుచ్చుకుందావిడ.
    పెళ్లిచూపుల్లో చరణ్ నానమ్మ అడిగిన మొదటి ప్రశ్న "అమ్మాయీ! తెలుగు వచ్చా నీకు?" అనే.
    "నాకు చక్కగా తెలుగు వస్తుంది. మా అమ్మగారు నాతో తెలుగే మాట్లాడుతారు" కాస్త పట్టి పట్టి మాట్లాడినా, ఫరవాలేదు బాగానే వచ్చు అని సంబరపడిందావిడ.
    "మా అమ్మకి మాతృభాషమీద మమకారం ఎక్కువలెండి. తెలుగులో మాట్లాడు అని అందరినీ సతాయిస్తూ ఉంటుంది" కొడుకు నవ్వుతూ అన్నాడు.
    "మంచిదేగా, అమెరికాలో ఉన్నా కూడా ఇంట్లో తెలుగే మాట్లాడాలి అని షరతు పెట్టింది మా ఆవిడ. అందుకే పిల్లలిద్దరికీ తెలుగు మాట్లాడడం వచ్చు" అన్నాడు వియ్యంకుడు.
    "అవునండీ, మన భాషని మనమే గౌరవించకపోతే ఎలా? కనీసం మాట్లాడకపోతే భాష కనుమరుగైపోదూ?" ఆవిడ అంది.
    "ఇదిగో మామ్మా, నీకోసం చరిత్రతో ఏమని చెప్పానంటే, మా మామ్మని ఇంప్రెస్ చెయ్యాలంటే నువ్వు తెలుగు బాగా మాట్లాడాలి అని. 'అయితే సరే' అని ఒప్పుకుంది. 'నువ్వు నాతో తెలుగులోనే మాట్లాడు' అంది తెలుసా? మామ్మా, నీకో జోక్ చెప్పాలి" అంటూనే పడిపడి నవ్వడం మొదలుపెట్టాడు చరణ్. చరిత్ర కోపంగా చూసింది.
    "ఏమిట్రా అంత నవ్వు వచ్చేదా? చెప్పు చెప్పు" అందావిడ.
    "మామ్మా! రోజూ తెలుగు మాట్లాడుతుంటే ఓ రోజు కాఫీ హౌస్ లో వెయిటర్ ఆర్డర్ తీసుకోడానికి ఎంతసేపటికీ రాలేదని కోపంగా తెలుగులో తిట్టడం మొదలుపెట్టింది. 'అంత పరుషవాక్యాలు మాట్లాడకే బాలా!' అన్నాను అచ్చ తెలుగులో. 'ఏమిటీ? పురుషవాక్యాలా? అంటే తెలుగులో స్త్రీల వాక్యాలు, పురుష వాక్యాలు ఉంటాయా?' అంది" నవ్వి నవ్వి చెబుతూ, "పురుష కాదే చిన్నారి 'పరుష' అంటే హార్డ్ వర్డ్స్' అని చెప్పాను" అన్నాడు. అందరూ ఘొల్లున నవ్వారు.  
    "బానే ఉంది మీ తెలుగు. మా అమ్మకి తెలుగుమీద ప్రేమకంటే, తనకి ఇంగ్లీషు రాదన్నది ఒప్పుకోదు" అన్నాడు చరణ్ తండ్రి.
    "ఒరేయ్ రాముడూ, కన్నతల్లినే అవమానిస్తావురా? మీపాటి బోడి ఇంగ్లీషు నాకూ వచ్చు. ఆ రోజుల్లో మెట్రిక్ చదివారా. మావన్నీ అల్లాటప్పా చదువులు కావు. పునాది ఉన్న చదువులు" అతిశయంగా అంది మామ్మ.
    "తమాషాకీ అన్నాలే అమ్మా! నిజంగానే మా అమ్మ చదువుకునే రోజుల్లో చదివిందేదో క్షుణ్ణంగా ఉండేది" అన్నాడు. మళ్లీ అంతా నవ్వారు. అది పాత కథ.
    అమ్మాయివాళ్లు వెళ్లాక చరణ్ మామ్మకి సందేహం వచ్చింది. "ఒరేయ్, చీరలు కట్టుకుంటుందా ఎప్పుడన్నా?" అడిగింది.
    "చీరలా? ఇంకా నయం ఏదో ఇండియా వచ్చింది కనుక ఈ మాత్రం డ్రస్సులు. అక్కడంతా షార్ట్, ప్యాంట్లు, మిడ్డీలు, ఫ్రాకులు." మామ్మ వినకుండా తల్లితో మాత్రమే అన్నాడు.
    "సర్లే, మీ నాయనమ్మ మాటలకేంలే వదిలేయ్, వెళ్లి ఫ్రెష్ అయిరా, భోంచేద్దాం" అంది తల్లి.
    భోజనాల బల్ల దగ్గర ఈసారి మామ్మకి మరో సందేహం వచ్చింది. "ఒరేయ్, మన వంటలేమన్నా వచ్చురా ఆ పిల్లకి?" అడిగింది.
    "వంటా, నాకేం తెలుసు?" అన్నాడు అమాయకంగా మనవడు.
    "సరేలే, తనకి రాకపోతే నాకొచ్చుగా!" అనేశాడు మళ్లీ అనాలోచితంగా. మామ్మ తెల్లబోయి "ఏమిటీ? వంట నువ్వు చేస్తావా?"
    "అక్కడంతే మామ్మా! ఆడ మగ ఎవరికేది తోస్తే అది చేస్తారు. తను వండకపోతే నేను చేస్తాలే, అదేం ప్రాబ్లమ్ కాదు."
    "నీ బొంద! అలా అలవాటు చేస్తే ఇంక అదెందుకు చేస్తుంది. నీ నెత్తిన వేస్తుంది ఆ పని. నీకేం రానట్టుండు గమ్మున. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏదో వంట తప్పక చేసుకున్నావు. ఇప్పుడూ చేస్తానంటావేమిటిరా వాజమ్మా!"
    "అమ్మా! వాళ్ల కాపురం వాళ్లేదో చేసుకుంటారు. నీకెందుకు బాధ? అక్కడ అన్ని పనులూ ఇద్దరూ చేసుకోడం అందరికీ అలవాటేలే" విసుగ్గా అన్నాడు కొడుకు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS