Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 44


    "మీరు కొన్ని కోట్లు కాజేయాలని ఎత్తేసే ఇలాంటి పని చేస్తున్నారు, మరి నాకు కనీసం లక్షలన్నా గిట్టుబాటు కావాలి గదా?" చాలా కేజువల్ గా అన్నాడు సామంత్.

 

    బిత్తరపోయాడు కనకారావు.

 

    "నాకిప్పుడు పదిలక్షలిస్తే తప్ప నేనీ పెళ్ళి చేసుకోను. అదీ రేపు మధ్యాహ్నం లోపు ఇవ్వాలి. తేడా పాడాలొచ్చాయంటే మీ పథకాన్ని తల్లక్రిందులు చేయడానికి పెద్దగా వెనుకాడను..."

 

    ఆ మాటలంటున్నప్పుడు అతని కంఠంలో జంకుగాని, తత్తరపాటు గాని లేవు.

 

    కనకారావైతే విద్యుద్ఘాతం తగిలిన వాడిలా ఎగిరిపడ్డాడు సీట్లో.

 

    అతనికి కొద్ది క్షణాలు నవనాడులు స్తంభించిపోయాయి.

 

    ఆ అచేతన స్థితి నుంచి తేరుకోవడానికి అతనికి దాదాపు నిమిషం పట్టింది.

 

    "ముందూ వెనుకలు ఆలోచించే అంత డబ్బడుగుతున్నావా?" ధైర్యాన్ని కూడదీసుకుంటూ అన్నాడు కనకారావు.

 

    "ఆహా... ముందు వెనుకలే కాదు. కుడి, ఎడమలు కూడా ఆలోచించే జాగ్రత్తపడుతున్నాను. నా అవసరం తీరిపోతే నన్ను మీరు పురుగును చూసినట్టు చూస్తారు. నేనెవరో, నా బ్యాగ్రౌండేమిటో తెలిసిన మరుక్షణం ఆ నాగమ్మగారు నన్ను పోలీసుల కప్పగిస్తుంది. అప్పుడు నాకు కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్ష పడడం ఖాయం. ఆ రెండు సంవత్సరాలు నేను బయటే వుంటే నా వృత్తిలో నాకు అనుభవం పెరిగి నాలుగు లక్షలు పైగా సంపాదించగలను. పైగా బాహ్య ప్రపంచపు సుఖాలకు దూరంగా దుర్భర జీవితాన్ని గడపాలి జైల్లో. కనుక అవన్నీ లెక్కేసే పది చెప్పాను పది చాలా తక్కువ నిజానికి. కాని వ్యాపారమన్నాక డిస్కౌంట్, ముదరాలాంటివి ఇవ్వాలిగదా? అందుకే పదిహేను చెప్పకుండా పదే చెప్పాను. అందుకు నువ్వు నన్ను అభినందించాలి. అయితే ఒకటి గుర్తు పెట్టుకో. నాకిచ్చే పదిలక్షలు అంతా కరెన్సీ రూపంలోనే ఇవ్వాలి. దొంగ వ్యాపారాలలో చెక్కులకు, డ్రాఫ్ట్ లకు విలువుండదు. అలా అని అప్పుడే బ్యాంక్ నుండి డ్రా చేసిన కొత్తనోట్ల కట్టలు ఇస్తే తీసుకోను. అన్నీ పాత వంద నోట్లలో ఇవ్వాలి. ఐదొందల నోట్లు ఇస్తే మరీ సుఖం. అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకోవు"

 

    దొంగ వ్యాపార విషయాల్లో పండిపోయిన వాడిలా, ఎలాంటి భయం, సంకోచం లేకుండా గడగడా చెప్పుకుపోతున్న సామంత్ ని చూసిన కనకారావుకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.

 

    "దీని పర్యవసానం ఆలోచించే అంటున్నావా?" ఒకింత కోపంగా అన్నాడు కనకారావు.

 

    "పర్యవసానాలు ఆలోచించి భయపడే పిరికివాడ్ని కాదు అని చెప్పడం నాకు రొటీన్ అయిపోయింది ఎప్పుడో. మీరు ఇప్పుడు నన్నేం చేయలేరు. చేస్తే మీ నిజస్వరూపాలు నాగమ్మగారి సమక్షానికి చేర్చే రిమోట్ అరేంజ్ మెంట్స్ ఎప్పుడో చేసేసాను. మీరు నన్ను చంపలేరు. కనీసంగా గాయపర్చలేరు. పెళ్ళయ్యాక, మూడురాత్రులు అయిపోవాలి. అప్పుడు నేనెంత అనర్హుడ్నో చెప్పే కార్యక్రమం చేపడతారు. దానికి కొన్ని రోజులు పడుతుంది. ఆ పై నన్ను లేపేందుకు మరో పథకం సిద్ధం చేస్తారు అప్పటికి దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. కనుక కనకారావు నాగురించి నువ్వేం వర్రీ అవ్వద్దు నన్ను భయపట్టే ప్రయత్నం మానుకుని టెన్ లాక్స్ కాష్ అరేంజ్ చేయించు..." ఇక తన నిర్ణయానికి తిరుగులేదన్న భావాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు.

 

    ఇంకెంత చెప్పినా, ఎంత భయపెట్టినా సామంత్ వినడాని కనకారావుకి అర్థమయిపోయి కొద్దిక్షనాలు ఒణికిపోయాడు. భయంతో అతనికి ఒళ్లంతా చెమటలుపట్టేసాయి.

 

    సామంత్ కోరిన కోర్కె తీరడం - తీరకపోవడం అన్న మీమాంస అటుంచి, తను ఆ కోర్కెను వాళ్ళ ముందు బయటపెట్టిన మరుక్షణం తన భవిష్యత్ ఏమిటన్న దడ పట్టుకుంది కనకారావుకి. కొద్ది క్షణాలు ఆలోచించి అప్పుడన్నాడు-

 

    "నీకోర్కెను తీర్చకపోతే...?" అని

 

    సామంత్ నవ్వాడు. ఆపైన అన్నాడు.

 

    "రేపు సాయంత్రానికి నేను ఈ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో వున్న ఏదో ఒక పల్లెటూర్లో వుండవచ్చు లేదా రేపు అర్థరాత్రికి ఏ గోవాలోనో , ఏ పాండిచ్చేరిలోనో హఠాత్తుగా ప్రత్యక్షం కావచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలన్న నిర్ణయాలు రేపు మధ్యాహ్నం తరువాత తీసుకుంటాను..."

 

    కనకారావు కళ్ళు తేలేసి సామంత్ కేసి చూస్తుండగానే-

 

    "నేను వెళ్ళదల్చుకుంటే మీరెవరూ నన్నాపలేరు. కనుక నువ్వెలా వెళ్లగలవని, వెళ్తే ఏమవుతుందో తెలుసా అనే పిచ్చి ప్రశ్నలతో నన్ను వేధించకు- హింసించకు. ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది ఒకటే. నేను నువ్విప్పుడు వుంచబోయే కృష్ణా ఓబెరాయ్ సూట్ లో వుంటాను. నన్ను హోటల్ దగ్గర దించి ఇదే కారులో వాళ్ళ దగ్గరకు వెళ్ళి పదిలక్షలున్న డిప్లొమాట్ సూట్ కేస్ తో రావడం!" తెగేసి చెప్పినట్లు అన్నాడు సామంత్ ఇక మాట్లాడవలసిందేమీ లేదన్నట్టు.

 

    మరికొద్ది నిమిషాల వరకు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

 

    కారు కృష్ణ ఓబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్ సింహద్వారం ముందాగింది.

 

    ఎయిర్ ఇండియా మహరాజు తరహా యూనిఫామ్ లో వున్న గేట్ మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి సామంత్ కి సెల్యూట్ చేసి కారుడోర్ తీసి వినయంగా తలవంచాడు కారు దిగి లోపలకు వేంచేయమన్న భావాన్ని వ్యక్తం చేస్తూ.

 

    "నువ్వో పెద్దమనిషివనుకొని భ్రమపడి అలా అతి మర్యాదలన్నీ చూపిస్తున్నాడు పిచ్చి వెధవ..." కసిగా అన్నాడు కనకారావు సామంత్ కి మాత్రమే వినిపించేలా.

 

    సామంత్ కారు దిగబోతూ కనకారావు కేసి చూస్తూ "అది నా అదృష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కో పనికి పుడుతుంటారు. ఇదిగో ఈ లెవెల్ అనుభవించడానికి నేను పుట్టాను. నాలాంటి వాళ్ళకు సేవ చేయడానికి నీలాంటి వాళ్ళు పుడుతుంటారు. వచ్చే జన్మలో సయితం కత్తిలాగో, కత్తెర్ల కనకారావులాగో పుడతావు తప్ప కత్తిలా బ్రతికేందుకు మాత్రం పుట్టవ్. బైదిబై... నేను చెప్పిన పనిని మర్చిపోయావనుకో... అర్జునరావు, పీటర్ నన్నేం చేయాలన్నది రెండవ పని అయిపోయి నిన్ను ఏదో ఒకటి చేయడమే మొదటిపనిగా పెట్టుకుంటారు జాగ్రత్త" అంటూ కారు దిగి స్టయిల్ గా తలూపుతూ బూట్లు టకటక లాడించుకుంటూ లోపలకు నడిచాడు సామంత్.

 

    "ఓరి వీడిసోకు మండిపోను... అప్పుడే ఎంత ఫోజు కొడుతున్నాడు...? కాలం, కర్మం వాడికిలా కలిసివస్తున్నాయి. ఏం చేయలేం మరి" అని తనలో తానే అనుకుంటూ కారుని పోనివ్వమని డ్రైవర్ కి చెప్పాడు.  


                               *    *    *    *


    "ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పాను. ఒక్క వెధవారాలేదు. ఇప్పుడీ లగేజి అంతా ఎలా లోపలకు చేరవేయాలి?" లక్ష్మీనారాయణ గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS