Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 43


    "మీ బార్ కే చచ్చాడు..."

 

    "మా బార్ కా....?"

 

    "అవును. అతన్నెలా కనుక్కోవచ్చంటే ఖరీదైన ఫారెన్ బాటిల్స్ ఆర్డరిచ్చే వాడే మా ఎస్.ఐ. వాడికీ మధ్య అప్పనపు సొమ్ము వచ్చిందిలే" కానిస్టేబుల్ గొంతులో అసూయ తొంగిచూసింది.

 

    మేనేజర్ షాక్ తిన్నాడు.

 

    "ఫారెన్ బాటిల్స్ తెప్పించుకున్నవాడే, వాడి ఫ్రెండ్ తో గొడవ పడుతున్నాడయ్యా బాబు" దాదాపు ఏడుస్తూ చెప్పాడు మేనేజర్.

 

    "అయితే వాడే మా ఎస్.ఐ. వాడితో వచ్చినవాడు మరో స్టేషన్ ఎస్.ఐ." నవ్వుతూ అన్నాడు కానిస్టేబుల్.

 

    "వాట్...?!" మేనేజర్ కొట్టుకుంటున్న వాళ్ళవేపు పిచ్చెక్కిపోయి చూస్తూ అరుస్తున్నట్టుగా అన్నాడు.

 

    "పాపం అమాయకపు రాజ్యాంగ నిర్మాతలు సివిలియన్స్ కొట్లాడుకుంటే పోలీసులు కంట్రోల్ చేయాలని వ్రాసారే గాని, ఆ పోలీసులే కొట్టుకుంటే ఎవరు కంట్రోల్ చేయాల్సింది రాజ్యాంగంలో వ్రాయడం మర్చిపోయారు. వుంటాను మరి - ఈ దేశాన్ని బాగుచేయడం మా పోలీసుల వల్ల మాత్రం కాదు" అంటూ ఆవేపు కానిస్టేబుల్ సత్యం ఫోన్ పెట్టేశాడు.

 

    ఏం చేయాలో తెలీని బార్ మేనేజర్ ఇద్దరు ఎస్.ఐ.ల మధ్య నాశనం అవుతున్న ఫర్నిచర్ కేసి పిచ్చిచూపులు చూస్తూ బిగుసుకు పోయాడు.  


                                                        *    *    *    *


    ఎంతో అడ్వాన్స్ అమెరికన్ అరిస్టోక్రాటిక్ సొసైటీలో చదువుకున్న నాయకి సయితం ఆ హాల్లోకి ఎంటర్ అవుతూ ఒకింత నెర్వస్ గా ఫీలయింది.

 

    "రామ్మా..." నాగమ్మ ప్రేమగా నాయకివేపు చూస్తూ అంది.

 

    సామంత్ చటుక్కున తలతిప్పి నాయకి వేపు చూశాడు.

 

    సరీగ్గా అదే సమయానికి అనుకోకుండా తలెత్తి సామంత్ కేసి చూసిన నాయకి ఓ క్షణం కలవరపడింది.

 

    ఇద్దరి చూపులు కొద్దిక్షణాలు కలిసి ఆపైన విడిపోయాయి. నాయకి నెమ్మదిగా వచ్చి నాగమ్మ ప్రక్కనే కూర్చుంది.

 

    కొద్దిసేపు అవి, ఇవి మాట్లాడుకున్నాక నాగమ్మ లేచి అర్జునరావుకి సైగ చేస్తూ బయటకి నడిచింది. ఆమె వెనుకే అర్జునరావు బయటకెళ్ళి పోయాడు.

 

    ఇప్పుడా హాల్లో ఎయిర్ కండిషనర్ చేస్తున్న మెత్తని రొద తప్ప మరే శబ్దం లేదు.

 

    నాయకి ఏదేదో అడగాలని తెగ మధనపడిపోతోందే కాని, ఏమీ అడగలేక పోతోంది.

 

    సామంత్ నాయకి ఏదడిగినా ధైర్యంగా సమాధానం చెప్పేందుకు ఎదురు చూస్తున్నాడే తప్ప, తనకై తాను ఏదీ అడిగే ప్రయత్నం చేయడం లేదు.

 

    ఆ హాలు బయట నాగమ్మ, అర్జునరావు మధ్య సంభాషణ జరుగుతోంది.

 

    "ఆ పూజారేమో మరో రెండు రోజుల్లోనే మంచి ముహూర్తం వుందంటాడు. అతనిదెప్పుడూ హడావిడే, వేరే వ్యక్తిని పిలిపించమంటారా?" అర్జునరావు తన పథకంలోని రెండవ అంకానికి ఏ అడ్డూ రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 

    "ఎందుకలా...? అయినా అతనేం చేయగలడు ముహూర్తాలలా వున్నప్పుడు? అతను చెప్పిన ముహూర్తాన్నే ఖాయం చేసుకుందాం. ఏర్పాట్లేవో చూడడం మంచిది" అంది నాగమ్మ స్థిరంగా.

 

    అలా వాళ్ళు ఓ పావుగంట పాటు మాట్లాడుకుంటూనే లోపల కాబోయే వధూవరులు కూడా ఏదో మాట్లాడుకుంటూనే వుంటారని భావించారు. కాని అలాంటిదేమీ వాస్తవంలో జరగలేదు. మొత్తానికి మరో అరగంటకి ఫార్మాలిటీస్ పూర్తయి పూజారి పెట్టిన ముహూర్తాన్నే ఖాయం చేయడం జరిగింది.


                                 *    *    *    *


    టాక్సీ స్టీఫెన్స్ స్ట్రీట్ లోకి మలుపు తిరిగింది.

 

    "డ్రైవర్ ... ఆరవ నెంబర్ ఇంటివద్ద టాక్సీ ఆపు" అన్నాడు డి.ఐ.జి. లక్ష్మీనారాయణ.

 

    డ్రైవర్ టాక్సీ వేగం తగ్గించి కాంపౌండ్ వాల్స్ మీదున్న ఇళ్ళ నెంబర్స్ చూస్తూ నెమ్మదిగా నడపసాగాడు.

 

    "ఇంటి తలుపులు తీయక నెలరోజులు కావస్తోంది. ఇల్లంతా ఎంతో దుమ్ము పేరుకుపోతుంది...? రెండురోజులు పడుతుంది శుభ్రం చేయడానికి" మిసెస్ లక్ష్మీనారాయణ అంది నెమ్మదిగా.

 

    "ఇద్దరు పనివాళ్ళను పంపించమని నా పి.ఎ.కి ఫోన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే వచ్చి శుభ్రం చేసెళ్ళిపోతారు" భార్యకు సర్దిచెప్పాడు లక్ష్మీనారాయణ.

 

    టాక్సీ ఆరవ నెంబర్ ఇంటి ముందాగింది. ఆ వెంటనే అందరూ టాక్సీ దిగేసారు. డ్రైవర్ డిక్కీ తెరిచి లగేజీ అంతా దింపాడు.

 

    లక్ష్మీనారాయణ మీటర్ చూసి డ్రైవర్ కి ఫేర్ ఇచ్చేసాడు. అతను నమస్తే చెప్పి టాక్సీ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు.


                                                       *    *    *    *


    కనకారావు, సామంత్ ఎక్కిన కారు దర్గా వేపుకి కాకుండా మరో చోటుకి దూసుకుపోసాగింది.

 

    "మొత్తానికి మాట దక్కించావు"

 

    కనకారావు గుండెల మీద బరువును దించుకున్నంత రిలీఫ్ ఫీలవుతూ అన్నాడు.

 

    "అలా అని సంతోషపడిపోకు ఇప్పుడు మొదలవుతుంది నేను పెట్టబోయే అసలు హింస" కారులోంచి బయటకు చూస్తూ తాపీగా అన్నాడు సామంత్.

 

    సామంత్ అన్న మాటలకి అర్థం స్ఫురించలేదు కనకారావుకి.

 

    "అర్థం కాలేదా?"

 

    "లేదు. ఇప్పుడు నాకు హింస కొత్తకాదుగా..."

 

    "ఆ హింస కాదు. అయినా దాన్ని నీ ఒక్కడి మీదే కేంద్రీకరించాను. ఇప్పుడు ఆ పిల్లిగడ్డం పీటర్ మీద, అంతర్నాటకాలాడే అర్జునరావు మీద కేంద్రీకరించబోతున్నాను. దానికి నువ్వే రాయబారివి"

 

    "విషయమేమిటో అర్థమయ్యేలా చెప్పు బాబు..." కనకారావు ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు.

 

    "నేను ఆ నాగమ్మగారికి నచ్చాను. ఆ పిల్ల నాయకి నన్ను మెచ్చింది. పెళ్ళి నిశ్చయమైంది. ముహూర్తం కూడా ఖాయమైపోయింది కదా...?"

 

    "అవును. అందుకే కదా నేను, వాళ్ళిద్దరూ హేపీగా వున్నాం"

 

    "నేను మాత్రం హేపీగా లేను"

 

    "ఏం...? పిల్ల బావుంది. చచ్చినంత ఆస్తిపాస్తులున్నాయి. పైగా నువ్వు నెలరోజుల్లో ఎన్ని దొంగ పనుల్ని ఒప్పుకుంటే మాత్రం యాభైవేలు సంపాదించగలిగే వాడివి? ఇంకెందుకని హేపీగా లేవు...?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS