ఒక అన్నా- చెల్లి ఏ రూపంలోంచి వచ్చినా వారు అన్నా - చెల్లెలే! ఆ విషయం వారికి హైటెక్ తెరల్లో అందకపోవచ్చు . కానీ వివరించినప్పుడు, తప్పక అర్ధమయి తీరుతుంది.
తమ ప్రేమ సోదర ప్రేమగా మారటం వారికి క్షణం పట్టదు.
మీ ఫైల్స్ లోని....ఈ హైటెక్ కథలకు ఇంతకంటే వేరుగా సమాధానాలు ఉండవని తలుస్తాను."
కళ్యాణరేఖ ప్రాబ్లెం కీ- మధు-గీతిక ప్రాబ్లెం కీ ఆమె అప్పట్లో ఫీడ్ చేసినా సమాధానాలు సాజిత్ కు ఎంతగానో నచ్చాయి.
ఒక విషయం...అప్పట్లో పావనికీ, ఇటు సాజిత్ కీ తెలీదు.
అలాంటి ఎతికల్ ప్రాబ్లెం ఒకటి పావని జీవితాన్ని నీడలా అలుముకోబోతుందని!
దానికి ఒక ఎండింగ్ రుక్మిణి చేతిలో మాత్రమే వుందని.
రుక్మిణి చిలుక పీకనొక్కినప్పుడు.....అది అంబరీషుడి భుజంలో అమర్చిన నానో పరికరాన్ని అతని గుండెలోకి పంపి, అక్కడ పేలిపోయేట్టు చేసింది.
ఒక అంబరీషుడు చనిపోయినా....ఒక నైతిక విలువ కాపాడబడింది.
ఒక అంబరీషుడు చనిపోయినా ఒక విద్యా వైజ్ఞానిక యజ్ఞ ఫలాలు పేదవారికి అందే గొప్ప అవకాశం క్రియేట్ చేయబడింది.
ఈ నేపధ్యంలో సాజిత్ మరింతగా ఆలోచించటం మొదలెట్టాడు. ఈ నానోటెక్ నాలెడ్జిని వుపయోగించి మరి కొన్ని మంచి పనులు చేయవచ్చని..."
* * * *
సాజిత్ అంబరీషుడు ఎలా మరణించిందీ పావనికి వివరంగా చెప్పాడు.
అంతా విన్న తరువాత పావని సాజిత్ ను అడిగింది.
"డియర్ సాజిత్! రుక్మిణి ఆ చిలుక పీకనొక్కి వుండకపోతే...నా బ్రతుకు మీద అంబరీషుడు అతని మురికి ముద్రను వుంచేవాడే కదా?"
అందుకు సాజిత్ చిన్న నవ్వి__
"డియర్...ఈ మాయల మరాఠీలాంటి నానోటెక్ చర్యలు నీకింకా పూర్తిగా అర్ధం కాలేదు. రుక్మిణి చేతిలో ఆమె భర్తకు సంబంధించి ఒక చిలుక మాత్రమే కంట్రోలింగ్ గా వుంది. అతని ఏక్టివిటీస్ నీ, మాటలనీ ప్రతీ క్షణమూ అందుకొనే 'సెన్సింగ్' మిషనరీ నా గదిలో వుంది.
రుక్మిణి ఏమాత్రం ఆలస్యం చేసినా ఇక్కడ ఒక బటన్ నేనుగా నొక్కటం జరిగేది.
ఆమె ప్రసాదించలేని ఒక చావును అతనికి నేను అందించేవాడిని.
అలాంటి దుర్మార్గులకు అదే సరయిన శిక్ష!
ఈ టెక్నాలజీ మంచిని చంపకూడదు. చెడును మాత్రమే చంపి ఇటు అయినవారికీ, అటూ దేశానికీ వుపయోగం చేయటం ఒక్కటే సరైన మార్గం. చట్టం దీన్ని అంగీకరించకపోవచ్చు. కానీ అది సుత్తి తీసుకుని ఆర్డర్ ఆర్డర్ అంటూ వచ్చే వరకూ అనర్ధకం ఆగదు.
ఈ టెక్నాలజీతో మరిన్ని ప్రయోగాలు చేయాలన్నదే నా తలంపు.
అయితే....చంపటం చివరి అస్త్రం మాత్రమే అవుతుంది.
ఇక నీ విషయానికొస్తే...
నీవు నా రిమోట్ హైటెక్ లవ్ అనుభూతుల్ని ఎలా పొందావో క్లుప్తంగా చెప్తాను."
అంటూ సాజిత్ ఆగిపోయాడు.
పావని ఆసక్తిగా వంక చూసింది. సాజిత్ ఆమె వంక చిలిపిగా చూశాడు.
ఇద్దరి హృదయాల్లో ఒక తీయటి పులకింత.
ఈ హైటెక్ ప్రేమావేశం విచిత్రమయింది.
తను ఒక రొమాంటిక్ వీణలా మారితే సాజిత్ వేయి చేతులై దాన్ని మీటాడు. తను అతని విషయంలో ఒక ఆరాటమైతే సాజిత్ వేయి పులకింతలై తనను ఆక్రమించాడు. అదీ మనిషి దూరంగా వుండి....
ప్రేమ కూడా ఒక హైటెక్ ప్రాసెస్ లు తీసుకుని, ఎలక్ట్రానిక్ మీడియాలో - తన శరీరంలో వేవ్స్ గా దూరి ఒక వినూత్న పోకడను పోయిందా?!
ఏది ఏమయినా ఇప్పుడు సాజిత్ దానికేం చెప్తాడో....
పావని అటెంటివ్ గా వితున్నప్పుడు సాజిత్ చెప్పాడు.
"పావనీ! మైడియర్ నవజీవన బృందావనీ!
నీ శరీరంలో కూడా నేను నానోచిప్స్ ను అమర్చాను. నాకు తెలీకుండా అదెలా జరిగిందని నీవు ఆశ్చర్యపడి, అదే ప్రశ్న నన్ను వేస్తానని నాకు తెలుసు.
అందుకు సమాధానం కూడా మన హైటెక్ ప్రేమ ఫైల్ లో వుంది.
ఒకరోజు ఈ గదిలోనే నిన్ను ఆరాటంగా పెనవేసుకుపోయాను. అప్పుడు నేను బెల్ట్ పెట్టుకుని షర్ట్ పాంటులో ఇన్ చేసుకున్నాను. బెల్ట్ కు కావాలనే దాని పిన్ పాయింట్ బయటకు వచ్చేట్టు తిప్పాను. నిన్ను గట్టిగా వాటేసుకున్నప్పుడు....ఆ పాయింటెడ్ పిన్ సరీగ్గా నీ నాభికి దగ్గరగా గుచ్చుకుంది. నీవు అబ్బా అంటూ అరిచావు.
అప్పుడు నిన్ను నేను ఏం తెలీనట్టు ఏమయిందని అడిగాను. నీ నాభి దగ్గర అయినా చిన్నగాయాన్ని చూపెట్టావు. అప్పుడు నీకు నేను సారీ చెప్పి మెల్లిగా నిన్ను నా టేబుల్ వరకూ నడిపించి.....గాయానికి బాండ్ ఎయిట్ అతికిస్తానని చెప్పి, అనుకున్న ప్లాన్ ప్రకారం, అక్కడే వున్న నానోటెక్ పరికరాన్ని గాయంలో అమర్చి....నీకు బాండ్ ఎయిడ్ అతికించాను.
తరువాత నీ చిన్న గాయం మానిపోయింది.
అక్కడ నేను అమర్చిన నానోటెక్ పరికరం, దొంగలా నీ సుకుమారమైన శరీరంలో వుండిపోయింది.
నేను కంప్యూటర్ ద్వారా పంపే లవ్ సింబల్స్ ని రిసీవ్ చేసుకుంటూ నీ శరీరంలోని ప్రొవేకేటివ్ సెంటర్స్ నన్నింటినీ స్టిమ్యులేట్ చేస్తూ.....వేయి సాజిత్ లు నిన్ను పెనవేసి వింత అనుభూతుల్ని కలగజేస్తూ__నా ప్రయోగాన్ని విజయవంతం చేసింది.
ఇప్పటికీ నీ నాబి ప్రక్క ఆ పరికరం అలాగే వుంది. అది చాలా సున్నితమైంది. సెంటీమీటర్ లో వెయ్యోవంతు ప్రమాణం మైక్రోటెక్ అయితే, మైక్రోటెక్ లో వెయ్యోవంతు నానోటెక్ పరికరం. అది నేకెడ్ ఐకి స్పష్టంగా కనిపించదు. కానీ అద్భుతమైన పనుల్ని చేస్తుంది.
రిసీవింగ్ అండ్ రివేయింగ్ సెంటర్ చేసే పనులన్నీ ఆ నానోటెక్ పరికరం చేస్తుంది.
పావనీ! ప్రపంచంలో మొదటిసారిగా హైటెక్ లవ్ నూ, ప్రణయాను భూతుల్ని రుచి చూసిన మొదటి స్త్రీవి నీవే..."
అంటూ సాజిత్ వివరిస్తుంటే....
"యూ హైటెక్ నాటీ! యూ టెక్నికల్ హీరో...ఎంత చేశావు! నేను అనుకుంటూనే వున్నా! ఏదో మాయల మరాఠీ గారడీ లాంటిది చేసి.....దూరంగా వుండి నన్ను తీయగా మీటుతున్నావని.
ఆ విషయం అలా వుంచితే....
మైడియర్ సాజిత్! ఈ హైటెక్ నెట్ వర్క్ రోకి ఇంకా ఎంతమంది దుర్మార్గుల్ని తెచ్చావు?
ఈ స్వాతంత్య్రం భారతావనిలోని నైతిక విలువలకు చీడపురుగుల్లా మారిన ఈ గూండా జాతిని మొత్తం నీ అనూహ్యమైన టెక్నికల్ పంజా క్రిందకు లాగి, ఈ దేశ జన జీవనానికి ఒక న్యాయం చేస్తావని ఆశపడతాను."
అంటూ అలాగే ముందుకు కదిలి__
చాలా ఆవేశంగా సాజిత్ ను ఆమె చుట్టుకుపోయింది.
వారి ప్రేమ అనన్యమైనది!
వారి లక్ష్యం అనితరమైనది!!
అది చాలా మందికి అసాధ్యమైంది!
___:శుభం :___
