Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 39


    "ఇప్పుడు వెళ్ళిపోదాం-" రోష్ణి -

 

    "పిచ్చిపిల్లా - నిన్నూ - నన్నూ ఎవరూ వేరు చెయ్యలేరు..."

 

    చెట్ల గుబురులోంచి రెండు కళ్ళు వారిద్దరివేపు సూటిగా, కళ్ళార్పకుండా చూస్తున్నాయి.

 

    పావుగంట గడిచింది.

 

    రోష్ణి సొమ్మసిల్లి పక్కకు తిరిగి పడుకుండిపోయింది. పక్కకు తిరిగి పడుకున్న రోష్ణిమీద చీరకప్పి, అవినాష్ తను బట్టలు వేసుకుని సిగరెట్ కాలుస్తూ, ఆనందంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు.

 

    అదే సమయంలో చెట్ల గుబురులోంచి చప్పుడు చెయ్యకుండా బైటకొచ్చిన ఆ రెండు కళ్ళు కొండమీంచి నెమ్మదిగా దిగి, ఎర్రమట్టి దిబ్బల మీంచి ముందుకి సముద్రం వేపు వెళ్ళిపోయాయి.


                            *    *    *    *


    అలసటగా ఓ గుట్టకు ఆనుకుని కూర్చుంది రోష్ణి.

 

    జుత్తునిండా అంటిన మట్టిని చేతుల్తో దులుపుకుంటోంది.

 

    అవినాష్ ని చూడడానికి సిగ్గుపడింది రోష్ణి.

 

    జీవితంలో మొట్టమొదటి అనుభవం ఆమెకు, అందరి అమ్మాయిల్లాగే సంతృప్తిగా ఉంది. అలా కళ్ళు మూసుకుని చాలాసేపు కూర్చుండిపోయింది.

 

    అప్పటికి సమయం-

 

    మధ్యాహ్నం మూడు గంటలైంది.

 

    అవినాష్ అక్కడనుంచి కదిలి, కొంచెం దూరంలో ఉన్న కొబ్బరి తోటలో కెళ్ళి, అక్కడ నుంచి ఓ నాలుగు కొబ్బరి బొండాలు కొనుక్కొచ్చాడు.

 

    ఇద్దరూ చెరో, రెండు కొబ్బరి బొండాలు తాగారు.

 

    ఇద్దరూ లేచారు.

 

    "నాకే గనక డబ్బుంటే... ఇక్కడ ఈ ప్రదేశంలో... మనిద్దర్నీ కలిపిన ఈ నేలలో... చిన్న తాజ్ మహల్ని కట్టేవాడిని" ఆ దిబ్బల మధ్య నడుస్తూ అన్నాడు అవినాష్.

 

    రోష్ణి ఒక్కక్షణం ఆగింది. తల తిప్పి వెనక్కి ఒక్కసారి చూసింది. తన చేత హేండ్ బాగ్ తెరిచి అందులోంచి ఓ వందరూపాయల నోటును తీసి, వెనక్కెళ్ళి, తను పడుకున్న ప్రదేశంలో రెండు చేతుల్తో మట్టిని తీసి, ఆ గుంటలో ఆ వందరూపాయల నోటును పెట్టి, మట్టితో కప్పేసి, ఆ మట్టిని పెదవులతో ముద్దాడి వచ్చేసింది.

 

    "ఏమిటది..." అడిగాడు అవినాష్.

 

    "నా పిచ్చి... ఆ మట్టికి నా కానుక..." నెమ్మదిగా అంది. తను అవినాష్ తో గడిపిన ఆ క్షణాల్ని, గుండెలో ఎంత పదిలంగా పదిల పరచుకుందో తెలీదు. తను చనిపోయే వరకూ ప్రతిఏటా ఇక్కడకు రావాలి అనుకుంది రోష్ణి.

 

    ఆ మాటే అవినాష్ తో అంది.

 

    ఆ మాటకు అవినాష్ చిన్నగా నవ్వాడు.

 

    "ఇంకా ఇక్కడ ప్రేమజాతర జరుపుతాననలేదు-"

 

    వేళాకోళంగా అన్నాడు.

 

    ఆ వేళాకోళాన్ని పట్టించుకోలేదు రోష్ణి.

 

    ఆ అమ్మాయి గుండెవేగం ఇంకా తగ్గలేదు.

 

    ఎర్రమట్టి దిబ్బల్ని దాటుకుని ఇద్దరూ కొండ పక్కనున్న సరుగుడు తోట దగ్గరికి వచ్చారు.

 

    "ఇందాక నేనేవన్నాను..." అవినాష్ భుజాలమీద తల పెట్టుకుని నడుస్తూ అంది రోష్ణి.

 

    "చాలా అన్నావు... ఎన్నని చెప్పను-" చిటికెన వేలితో ఆమె బుగ్గమీద కొట్టి అన్నాడు.

 

    "అవినాష్-" అని ప్రేమగా పిలిచి, అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ-

 

    "ఎన్ని అడ్డంకులెదురైనా - మనం పెళ్ళి చేసుకుందాం - నన్నెపుడూ వదిలి వెళ్ళిపోవుకదూ -" మధ్య తరగతి ఆడపిల్లలా అడిగింది.

 

    ఆ మాటకు అవినాష్ గుండె గతుక్కుమంది.

 

    క్షణకాలం బిత్తరపోయాడు.

 

    "రోష్ణీ - నా మీద నీకేమైనా అనుమానం ఉందా - చెప్పు -"

 

    తల అడ్డంగా ఊపింది లేదన్నట్లుగా.

 

    "మీ డాడి ఒప్పుకోకపోయినా - మా వాళ్ళు ఒప్పుకోకపోయినా - మనం తిరుపతి వెళ్ళిపోయి, పెళ్ళి చేసుకొని వచ్చేద్దాం-" అన్నాడు అవినాష్.

 

    ఇద్దరూ రోడ్డుదాటి సముద్రం ఒడ్డుకొస్తున్నారు.

 

    సముద్రం ఒడ్డున ఒక వారగా జాలరుల పడవలున్నాయి. ఆ పడవల పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఓ వీడియో కెమెరా. ఆ వీడియో కెమెరాతో అతను - దూరంగా ఎగిసి వస్తున్న అంతెత్తు సముద్రం కెరటాల్ని పిక్చరైజ్ చేస్తున్నాడు.

 

    అతను ఫోటోగ్రాఫర్ మధు.    

 

    తనకి కొంచెం దూరంలో తడి ఇసకలో నడుచుకుంటూ ఉల్లాసంగా వెళ్తున్న అవినాష్ వేపు, రోష్ణీవేపు ఫోటోగ్రాఫర్ మధు చూశాడు.

 

    అవినాష్ ని చూడగానే వారం రోజులక్రితం తను తిరుపతిలో ఒకమ్మాయితో చూసిన వ్యక్తి చటుక్కున గుర్తుకొచ్చాడు.

 

    అవును. ఆ వ్యక్తే ఈ వ్యక్తి. కానీ అమ్మాయి వేరు.

 

    అరగంట క్రితం-

 

    ఎర్రమట్టి దిబ్బలెక్కి సూర్యుడ్ని ఫోటో తీద్దామని వెళ్ళిన మధుకి-

 

    అక్కడ గుట్టల మధ్యనున్న రోష్ణీ, అనుకోని విధంగా కన్పించడంతో-

 

    అందులోనూ అందమైన అమ్మాయి అర్ధ నగ్నంగా కన్పించడంతో తన కెమెరాలో ఆ దృశ్యాన్ని బంధించాడు.

 

    కానీ-

 

    అప్పుడు-

 

    అవినాష్ ని గమనించలేదు.    


    ఇప్పుడు స్పష్టంగా చూశాడు.

 

    ఒకే వ్యక్తి తిరుపతి కొండమీద, భీమిలిల్లోనూ, కానీ అమ్మాయిలు మారారు.

 

    ఆ అమ్మాయెవరు? ఈ అమ్మాయెవరు?

 

    మధు మెదడులో ఎన్నో ఆలోచనలు చోటు చేసుకున్నాయి.

 

    అవినాష్, రోష్ణీల్ని ఫాలో కావాలని స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.


                               *    *    *    *


    సాయంత్రం అయిదున్నర వరకూ నృశింహస్వామి దేవాలయం మెట్లమీద కూర్చుని, ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ, గంట స్తంభం దాటి బస్టాండుకి వచ్చారిద్దరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS