"డాల్ఫిన్ హోటల్ కెళ్దామా..." కార్ డోర్ తీస్తూ అంది రోష్ణి.
"అలాగే..."
డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ చేస్తూ-
"మనం ఎల్లుండి భీమిలి వెళ్దాం..." అన్నాడు అవినాష్.
"రోజంతా... అక్కడ..." మళ్ళీ అన్నాడు అవినాష్.
"నేను రాలేను... నేనన్నప్పుడు నువ్వురావు... నువ్వన్నప్పుడు నేనెందుకు రావాలి..."
"ప్లీజ్... రోష్ణి... నువ్వు రాకపోతే... ఈ టిఫిన్ ప్లేట్లో దూకి చచ్చిపోతాను... ఆ కూల్ డ్రింక్ సీసాలో దూకి చచ్చిపోతాను..."
అవినాష్ మాటలకు నవ్వింది రోష్ణి.
"ఈ గ్లాసులో కూడా దూకొచ్చు..." గ్లాసుని ముందుకు జరిపి అంది.
"అలాగే... వస్తాలే..." డాల్ఫిన్లోంచి బయటి కొస్తున్నపుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
"కారులో వద్దు... బస్సులో వెళ్దాం."
"ఏం..."
"సరదాగా అన్నీ చూసుకొని రావొచ్చు..."
"ఆ మాటకు రోష్ణి మాట్లాడలేదు..."
"భీమిలీ"లో రోష్ణితో ఎలాగైనా గడపాలి. నిర్ణయించుకున్నాడు అవినాష్.
13
ఉదయం ఎనిమిదిన్నర సమయంలో వైజాగ్ నుంచి భీమునిపట్నం వెళ్ళే బస్ లో కార్నర్ సీట్లో అవినాష్ కూర్చున్నాడు. అతని పక్కన రోష్ణి.
సంపెంగ రంగు చీర, జాకెట్టు, ఒక చేతికి బంగారుగాజు, ఇంకో చేతికి చిన్ని వాచీ. నుదుటమీద చిన్నిబొట్టు, తమలపాకు నమిలిన పెదాల్లా లేత ఎరుపు పెదవుల మెరుపు.
అప్పుడప్పుడు ఆమె వంటిమీంచి వస్తున్న "స్కిన్ కేర్ లోషన్" గమ్మత్తయిన సువాసన.
"ఎన్ని గంటలకెళ్తాం... మనం... భీమిలి..."
"తొమ్మిదిన్నరకు అక్కడుంటాం-"
కొండల్లోంచి మలుపు తిరుగుతూ వెళ్తున్న బస్సు-దూరంగా ఇసక దిబ్బల్ని ఆక్రమించుకోడానికి సముద్ర కెరటాలు చేస్తున్న విశ్వ ప్రయత్నం. ఆ పైన నీళ్ళల్లోంచి నిప్పులు కక్కుతూ లేస్తున్న వాడిలా ఎర్రని సూర్యుడు.
దారిపక్క పల్లెటూళ్ళలో గుంపులు గుంపులుగా నిలబడి చిరునవ్వుల్ని విసిరే అందమైన పల్లెటూరు అమ్మాయిలు-
చల్లగాలి, చక్కగా, చల్లగా మత్తుగా ఉంది.
బస్సు భీమిలి చేరడానికింకా పదిహేను నిమిషాలు మాత్రమే ఉంది-
"నువ్వు చాలా అందంగా ఉన్నావు-రోష్ణీ-ఎంతందంగా ఉన్నావో తెల్సా-" అన్నాడు అవినాష్.
"మళ్ళీ ఇంగ్లీషు సినిమా మొదలైందన్నమాట-" నవ్వుతూ కన్ను గొట్టింది రోష్ణీ.
"చెప్పమంటావా-వద్దంటావా-" విసుగ్గా అన్నాడు.
"చెప్పు-లేకపోతే-నసుగుతుంటావ్ కదా-"
చెప్పాడు అవినాష్. ఏం చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని ఆమె చెవిలో చెప్పాడు.
"ఛీ-అన్నీ అలాంటి ఆలోచన్లే" అంది రోష్ణి.
"ఏం తప్పా-" అన్నాడు.
రోష్ణి మాట్లాడలేదు- అవినాష్ తనని పొగిడిన పొగడ్త గురించి ఆలోచిస్తోంది.
ఆ ఆలోచన ఆమె మెదడులో తీవ్రంగా పనిచేస్తోంది. ఆమె మనసులో ఉద్వేగాన్ని పెంచుతోంది.
అదే కావాలి అవినాష్ కి.
ముందుగా, రంగం సిద్ధం చేయడానికీ అవినాష్ ఆ మాటన్నాడు.
సరిగ్గా-
తొమ్మిదిన్నరకు బస్సు భీమిలి బస్ స్టాండ్లో ఉంది.
మరో పదినిమిషాలకు-
అవినాష్, రోష్ణి-
భీమిలి సముద్రం ఒడ్డునున్న 'లైట్ హౌస్' దగ్గరున్నారు.
ఆ పక్కన వరసగా చిన్న చిన్న పడవలు.
దూరంగా వలల్ని అల్లుకుంటున్న జాలరులు, జాలరి అమ్మాయిల నవ్వులు సన్నసన్నగా కదిలే కడలి అలల్లా ఉన్నాయి.
లైట్ హౌస్ ముందున్న ఇసకదిబ్బల మీద కూర్చున్నారిద్దరూ.
"వెళ్ళిపోదామా-" అకస్మాత్తుగా అంది రోష్ణి.
"ఏం" కంగారుగా అన్నాడు అవినాష్.
"భీమిలి వచ్చాం-వెళ్ళిపోదాం-" బుగ్గల్లో నవ్వుని దాచుకుంటూ జోకేసింది.
అవినాష్ నవ్వేశాడు.
అవినాష్ చాలాసార్లు భీమునిపట్నం వచ్చాడు.
అక్కడ ఏ మారుమూల అతనికి సుఖంగా ఉంటుందో తెల్సు.
అందుకే-
"ఎర్రమట్టి దిబ్బల వేపు వెళ్దామా" అని అడిగాడు.
రోష్ణి మళ్ళీ జోకేసింది.
"ఇంగ్లీషు సిన్మాలోలా అక్కడెవరైనా అమ్మాయిలుంటారా?"
ఆ ప్రశ్నకు అవినాష్ మనసులో ఎక్కడో కలుక్కుమంది. కానీ బయటపడలేదు.
"అమ్మాయిలుండరు... అమ్మాయి ఉంటుంది-" తెలివైన అవినాష్ చెప్పాడు.
"నేనేనా-" అమాయకంగా అడిగింది రోష్ణీ.
"ఇక్కడ మరెవరైనా ఉన్నారా-" ప్రశ్నించాడు అవినాష్.
రోష్ణీ మాట్లాడలేదు.
అవినాష్ మళ్ళీ
"రోష్ణీ! నిన్ను నేను ప్రేమిస్తున్నానని నువ్వు నమ్ముతున్నావా? లేదా?"
"అదేం ప్రశ్న - పిచ్చి ప్రశ్న-"
తను రోష్ణీని ఏం చేయాలనుకున్నాడో, దానికి అవసరమైన నేపధ్యం కోసం అతను ప్రయత్నిస్తున్నాడు.
