నాగమ్మ ఓ క్షణం ఉలిక్కిపడింది.
తిరిగి అంతలోనే సర్దుకుంది.
ఒకింతసేపు ఆలోచిస్తూండిపోయింది.
"పోనీ ఇన్నాళ్లు అని మీరు నిర్దుష్టంగా చెప్పగలిగితే, అన్నాళ్ళు తప్పించుకునేందుకు ఏదో ఉపాయం ఆలోచిస్తాను..." ఆమె మీద మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసాడు అర్జునరావు.
ఆమెలో ఆందోళన అధికమయిపోయింది.
ఆలోచనలు మందగించిపోసాగాయి.
"మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం- మన ప్రయత్నాలు నాయకిలో అనుమానాల్ని రేకెత్తిస్తే...? మన ఇన్ టెక్షన్ తప్పక ఆ పనిచేస్తుందేమోనని భయంగా వుంది. నాకు ఏం చేయాలో పాలు పోవడం లేదు..."
నాగమ్మ మెదడు పనిచేయడం ఆగిపోయింది. "మన ప్రవర్తన అసంగతమయితే... ఆమె అనుమానాలకి బలంగా చేకూర్చితే... మన ప్రయత్నమంతా వృధా కాదా? నేనన్నానని కాదు. మీరు ఆలోచించండి. ఆపైన మీరేం చేయమంటే అదే చేస్తాను..." మిగిలిన ఆమె కొద్దిపాటి ఆలోచనలకి చెద పట్టించాడు అర్జునరావు.
అప్పుడు ప్రారంభమయ్యాయి ఆమెలో తొందరపాటు, ఆందోళన, అశాంతి.
"ఏ విషయంలోనైనా నిర్ణయాలు త్వరగా తీసుకోవడం చాలా మంచిది. మీకు చెప్పేంతవాడ్ని కాదు. అలా అని చూస్తూ వూరుకోలేను..."
ఆమెలోని జడ్జిమెంట్ నశించడం ప్రారంభమైంది. "మరి నే వస్తాను. ఇక్కడి నుండి త్వరగా బయటపడి మీ మాటను దక్కించాలి..." అంటూనే వేగంగా బయటకు నడిచాడు అర్జునరావు.
అతనికిప్పుడు ఆనందంగా వుంది.
తన పథకం సానుకూలపడుతుందనే పూర్తి నమ్మకం కుదిరింది.
తన కోసమే ఎదురుచూస్తున్న పీటర్, సెక్రటరీలను చేరుకుని ధైర్యంగా వారికేసి చూశాడు.
ఆ వెంటనే సెక్రటరీ సామంత్ ఫైల్ తీసుకొని నాగమ్మ గదికేసి నడిచాడు.
* * * *
సాయంత్రం ఆరుగంటలకు నరసింహం పోలీస్ స్టేషన్ బయటికొచ్చి మోటార్ బైక్ ఎక్కాడు.
ఆ వెంటనే అది నేరుగా స్టీఫెన్స్ స్ట్రీట్ కేసి దూసుకుపోసాగింది.
* * * *
"అయ్యా... తమరి రంగ ప్రవేశం దగ్గరపడింది. రెండు మూడు రోజుల్లోనే తమర్ని నాగమ్మగారి ముందుంచబోతున్నాం. అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా నా పని పీటర్ సాబ్ పడతాడు. పీటర్ సాబ్ పని అర్జునరావు సాబ్ పడతాడు. అర్జునరావు సాబ్ పని నాగమ్మగారు పడతారు. అలా అని లింక్ అయిపోలేదు. నీ పని కూడా..." కనకారావు షేవింగ్ చేసుకుంటున్న సామంత్ కేసి చూస్తూ అన్నాడు.
సామంత్ చేస్తున్న పనిని ఓ క్షణం ఆపి కనకారావు కేసి చూస్తూ "నీలా నేను వెర్రివాడ్ని కాదు- వెంగళప్పను అంతకంటే కాదు. నా వ్యవహారం వదిలేసి ముందుగా నీ వ్యవహారం చూసుకో..." అన్నాడు తిరిగి పనిలోకి వెళ్తూ.
* * * *
నరసింహం బులెట్ మోటార్ బైక్ స్టీఫెన్స్ స్ట్రీట్ మలుపు తిరిగింది.
అతను హుషారుగా వున్నాడు.
తనకు లభించబోయే స్వర్గాన్ని తలుచుకొని మురిసిపోతున్నాడు.
అతని కళ్ళకిప్పుడు మధుమతి తప్ప మరెవరూ కనిపించడం లేదు.
మధుమతి ఉంటున్న బిల్డింగ్ తప్ప మరేది కనిపించడం లేదు.
పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సత్యం మాత్రం ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నాడు.
నరసింహం మోటార్ బైక్ ఆరవ నెంబర్ ఇంటి ముందు ఆగింది.
అతను బైక్ దిగి దానికి స్టాండ్ వేసి గేటు వేపు నడిచాడు.
సరిగ్గా అప్పుడే పక్కింటి తలుపులు ఎందుకో తెరుచుకున్నాయి.
తెరుచుకున్న ఆ తలుపుల వెనుక నుంచి ఓ నడి వయస్కుడు బయటకు వచ్చి ద్వారబంధానికి ప్రక్కనే వున్న పోస్ట్ బాక్స్ ని తెరిచి, తనకు వచ్చిన ఉత్తరాల్ని తీసుకొని లోపలకు వెళ్ళబోతూ అలవోకగా ప్రక్కింటివైపు చూసాడు.
అప్పుడే మోటార్ బైక్ ని లోపలకు తీసుకువెళుతున్న నరసింహం ఆయన దృష్టిలో పడ్డాడు. అతను ఒకింత ఆశ్చర్యపోయాడు.
ఆ తరువాత తలను ఆడిస్తూ లోపలకు వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాడు.
నరసింహం ఇంజన్ ఆఫ్ చేసి, స్టాండ్ వేసి ఓసారి రెండువేపులకు చూసాడు ఓరగా, ఎవరూ కనిపించలేదు. తిన్నగా ప్రధాన ద్వారం కేసి నడిచాడు.
అప్పుడే ఆరోనెంబరు ఇంటికి ఎదురుగా వున్న ఇంట్లో ఫోన్ మ్రోగింది.
ఆ ఇంట్లో వుంటున్న యువతి ఫోన్ ఎత్తి ఏదో విని ఆశ్చర్యపోయి వెంటనే ఫోన్ పెట్టేసి హడావిడిగా బయటకు వచ్చి నలువేపులకు చూసింది.
అప్పుడే నరసింహం ఆమె దృష్టిలో పడ్డాడు.
నిజానికి ఆమె మరేదో పనిమీద ఇంట్లోంచి బయటకు వచ్చింది. సరిగ్గా అప్పుడే నరసింహం ఆమె దృష్టిలో పడ్డాడు.
నరసింహం తనకు క్రితం రోజు మధుమతి ఇచ్చిన కీస్ తో డోర్ లాక్ ని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఆమె మరోసారి అటూ ఇటూ చూసి లోపలకు వెళ్ళిపోయింది.
లోపల వున్న మధుమతి ఫోన్ పెట్టేసి, చిన్నగా నవ్వుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
ఆమెకు బద్ధకంగా వుంది.
అందుకే క్రింద తలుపులు తీసే ప్రయత్నం చేయలేదు.
ఆమెకు తెలుసు. నరసింహం తన దగ్గరున్న కీతో తలుపులు బయట నుంచి తెరుచుకుని లోపలకు వస్తాడని.
* * * *
"కుర్రాడు చాలా మంచివాడు. ఏ దురలవాట్లు లేవు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్. ఏ వెహికల్ నైనా క్షణాల్లో బాగు చేయగల ప్రాక్టికాలిటీ కూడా వుంది. తాను సొంతంగా ఎక్కువ మైలేజీ యిచ్చే పెట్రోల్ ఇంజన్ కనిపెట్టే ప్రయత్నంలో వున్నాడు. వీటన్నింటిని మించి బహు అందగాడు. కాని..." సెక్రటరీ చెప్పటం ఆపి సందేహంగా నాగమ్మకేసి చూసాడు.
"చెప్పు..." అందామె అన్యమనస్కురాలై.
"అతని వెనుక చిల్లిగవ్వ ఆస్థి లేదు. నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. అమ్మ లేదు- నాన్న లేడు- తోడబుట్టినవాళ్ళు అసలే లేరు. ఒంటరివాడు. అందుకే అతను జనంతో అంతగా కలవడు. ఎప్పుడూ యంత్రాల మధ్యే వుంటాడు. అతని జీవితంలో ఎక్కువ భాగం ప్రాణంలేని యంత్రాలకు ప్రాణం పోసేందుకు, వాటిని ఆధునీకరించేందుకే ప్రయత్నిస్తుంటాడు..."
