Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 33


    ఆమె లేచి అందుకుందామనుకునే లోపే నరసింహం ఫోనందుకుని చెవి కానించుకున్నాడు.

 

    అది తను కావాలని చేయలేదు.

 

    అసలతనికి ఆ అవసరం కూడా లేదు. కేవలం అసంకల్పితంగా అందుకున్నాడు.

 

    మధుమతి తనలో పెల్లుబుకుతున్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, టెన్షన్ కి గురవుతూ నరసింహం కేసే చూడసాగింది.

 

    నరసింహం ఫోన్ లో ఏదో విని, ఒకింత అనుమానంగా (పోలీసు మనిషి గదా) మధుమతివేపు చూస్తూ "డి.ఐ.జి. లక్ష్మీనారాయణగారిల్లేనా అంటాడేమిటి?" అన్నాడు.

 

    "ఇలా ఇవ్వండి - నేను సమాధానం చెబుతాను" అంటూ నరసింహానికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతని ఒడిలోకి వంగుతూ ఫోన్ లాక్కుని "హలో... మీకెన్నిసార్లు చెప్పాలి ఇది ఆయన ఇల్లు కాదని! రోజుకి పదిసార్లు ఫోన్ చేసి ఇలా అడిగి నన్ను వేధించినా నేను నిన్ను ఇష్టపడను - ప్రేమించను. మరోసారి ఇలాగే చేసి డి.ఐ.జి., గి.ఐ.జి. అన్నా, లక్ష్మీనారాయణ అన్నా పోలీస్ కంప్లయిట్ ఇవ్వవలసి వస్తుంది జాగ్రత్త" పెద్దగా, కోపంగా అరుస్తూ విసురుగా ఫోన్ పెట్టేసింది మధుమతి.

 

    మధుమతి తన ఒడిలో పడుకుని ఆవేపు వున్న ఫోనందుకుని మాట్లాడడంతో నరసింహం ఉద్రేకానికి గురయి వర్తమానాన్ని ఒకింత నిర్లక్ష్యం చేశాడు.

 

    ఆమె ఆ వెంటనే అతని ఒడిలోంచి లేచి పక్కనే సర్దుక్కూర్చుంది.

 

    ఆమె అలాగే ఇంకొంచెంసేపు తన ఒడిలో వాలి ఫోన్ లో మాట్లాడితే బావుండనుకున్నాడు.

 

    "ఇడియట్స్... రోడ్ సైడ్ రోమియోలు, ఇలా పరువుగల అమ్మాయిల్ని వేధిస్తుంటే పోలీస్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తోందో?" అంటూ చిన్నగా స్వగతంలో అనుకొని, అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు "అఫ్ కోర్స్... ఇంకా మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వుండబట్టే కాస్తన్నా..." అంటూ కొద్దిగా నొచ్చుకొని, ఆ తర్వాత ప్రశంసగా చూసింది.

 

    మరేమనుకున్నావ్? అనే భావాన్ని కళ్ళలో పలికిస్తూ గర్వంగా భుజాల్ని కదిలించాడు. తను అప్పటివరకు అనుభవించిన టెన్షన్ ఆమె నుంచి దూరమైంది.


                                                        *    *    *    *


    పీటర్ ఇండోర్ వెళ్ళిన మరుసటి రోజుకే సామంత్ ఎమ్ టెక్ గోల్డ్ మెడలిస్ట్ అని రుజువు చేసే ఇండోర్ విశ్వవిద్యాలయం సర్టిఫికెట్స్ సంపాదించాడు.

 

    అందుకు తను యాభైవేల రూపాయల్ని నీళ్ళప్రాయంగా ఖర్చుపెట్టాడు.

 

    ఆ వెంటనే ఎయిర్ పోర్టుకి బయలుదేరాడు.


                                *    *    *    *


    "ఈ రోజెన్ని ఫైల్స్ చూపించబోతున్నావ్?"

 

    అప్పుడే అటుగా వెళుతున్న సెక్రటరీని ఉద్దేశించి ప్రశ్నించాడు అర్జున్ రావు.

 

    సెక్రటరీ ఉలిక్కిపడి ఆగిపోయి తల ప్రక్కకు తిప్పి ద్వారబంధానికి ఆనుకొని తనకేసి చూస్తున్న అర్జున్ రావుని, అతని కళ్ళలోని క్రౌర్యాన్ని చూసి ఒకింత భయపడ్డాడు.

 

    కొద్ది క్షణాలపాటు అతని నోటివెంట మాట రాలేదు.

 

    "నా మీద నాగమ్మగారి కంత మంచి అభిప్రాయం లేదు. నువ్వు నా పథకాన్ని సానుకూలపర్చడానికి ఈ క్లూ చాలనుకుంటాను. రేపు మన అభ్యర్థి ఫైల్ రంగ ప్రవేశం చేస్తుంది. ఇక నువ్వు వెళ్ళవచ్చు" అన్నాడు అర్జున్ రావు.

 

    పులి సమక్షం నుంచి విముక్తి లభించిన లేడిలా వడివడిగా నాగమ్మ గదికేసి వెళ్ళిపోయాడు సెక్రటరీ.


                                                       *    *    *    *


    పీటర్ నగర ప్రవేశం చేయగానే అర్జున్ రావుకి ఫోన్ చేసి తాను వెళ్ళిన పని పూర్తయిందని తెలియపర్చాడు.

 

    ఆరోజంతా అర్జున్ రావు, పీటర్, సెక్రటరీ చాలా బిజీగా వుండి తాము సిద్ధం చేసిన పథకానికి తుది మెరుగులు దిద్దారు.

 

    మరుసటి రోజే సామంత్ ఫైల్ ని అతి జాగ్రత్తగా నాగమ్మ వద్దకు చేర్చే పథకం కూడా సిద్ధమైంది. ఆ పైన దర్గాకి చేసి కనకారావుకి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు పీటర్.

 

    "ఇప్పటికి పాతిక ఫైల్స్ ని తిప్పికొట్టిన నాగమ్మగారు మనం సిద్ధం చేసిన ఈ ఫైల్ ని మాత్రం తిప్పి కొట్టరనే గ్యారంటీ ఏముంది?" పీటర్ అనుమానంగా అన్నాడు.

 

    అర్జున్ రావు చిన్నగా నవ్వాడు.

 

    "ఉంది ఎలానంటే ఆమె వయస్సు అందుకు సహకరిస్తుంది. చూసి, చూసి విసుగు చెందిన ఆమె అసహనాన్ని ప్రోది చేసుకుని వుంటుంది. అసహనం అశాంతికి దారి తీస్తుంది. ఆ అశాంతిలోంచే రాజీధోరణి పుట్టుకొస్తుంది. ఆ స్థితికి ఆమెను తీసుకువెళ్ళాకే సామంత్ ఫైల్ ఆమె ముందుంచబోతున్నాం. అపజయం, సడలిన ఆత్మ స్థయిర్యం, ఎదురుదెబ్బలు మనిషి జడ్జిమెంట్ ని దెబ్బతీస్తాయి. ఆమె జడ్జిమెంట్ దెబ్బ తినడమే మన విజయానికి రాజమార్గం. ఇంకే సందేహాలు వద్దు. ఫైల్ లోపలకు పంపించు" అంటూ సీట్లోంచి లేచిన అర్జునరావు కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తుండిపోయాడు.

 

    సెక్రటరీ ఫైల్ తీసుకొని బయలుదేరబోతుండగా....

 

    "నువ్వు ఒక నిమిషం ఆగు. మన పని మరింత తేలిగ్గా అయ్యేలా వ్యవహారాన్ని సానుకూలపర్చుకొని వస్తాను..." అంటూ అర్జున్ రావు సడన్ గా నాగమ్మ గదికేసి వెళ్ళిపోయాడు.

 

    ఉన్నట్టుండి నిర్ణయాల్ని మార్చుకోవడం అర్జున్ రావుకి సర్వ సాధారణమే. అలా అని పీటర్ కి తెలుసు... సెక్రటరీకి తెలీదు. అందుకే అతను విస్తుపోయి అర్జున్ రావు వెళ్ళిన దిక్కుకే చూస్తుండిపోయాడు.

 

    "అసాధ్యుడు అర్జున్ రావు. మరేదో కొత్త ఎత్తు ఆలోచించే అలా వెళ్ళిపోయాడు. నువ్వేం ఆశ్చర్యపోకు" అన్నాడు సెక్రటరీ కేసి చూస్తూ.

 

    అర్జున్ రావు తన గదిలోకి రావడాన్ని నాగమ్మ చూసి "ఏం అర్జున్ రావ్... ఏమిటి విశేషాలు? నీ మొఖంలో ఆందోళన కనిపిస్తుందేమిటి...?" అంది.

 

    అతను చెప్పడానికి కొద్ది క్షణాలు సందేహిస్తున్నట్లు నటించాడు.

 

    "ఫర్వాలేదు చెప్పు..." అంది నాగమ్మ తిరిగి.

 

    "మీ మాట దక్కించలేనేమోనని భయంగా వుంది నాకు" అర్థమయి, అర్థంకానట్లుగా అన్నాడు కావాలనే.

 

    "ఏవిషయం?"

 

    "పాప విషయం"

 

    "పాప విషయమా! అర్థం కాలేదు"

 

    "పాప నన్ను ఈ మధ్య తరచి తరచి అడుగుతోంది. ఏం జరిగింది? నాయనమ్మ మొఖంలో విచారం కనిపిస్తోంది. పూర్వంలా ఆమెలో హుషారు కనిపించడం లేదు. ఎందుకని? అంటూ ప్రశ్నమీద ప్రశ్న నన్ను శోధించేందుకు ప్రయత్నిస్తోంది. అప్పటికీ తప్పించుకు తిరుగుతున్నాను. కాని ఎన్నాళ్ళిలా ఆమెలోని విచక్షణా జ్ఞానాన్ని దెబ్బకొట్టేలా అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS