Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 33


    
    "అతనెవరో మీకు తెలుసన్నమాట మీరు నిజంగా జీనియస్. అతనెవరయింది నేను తెలుసుకోవచ్చా? జస్ట్ ఫర్ క్యూరీయాసిటీ."
    
    "ఒక్కో ఎసైన్ మెంట్ కి ఒక్కో పేరు పెట్టుకుంటారు. ఇప్పటికి సుమారు ఒక వంద పేర్లు పెట్టుకొని వుంటాడు. మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ అసలు పేరు అమానుల్లాఖాన్ ప్రస్తుతం మాస్టర్ని అసాసినేషన్ చేసే ఆపరేషన్ లో అతను పెట్టుకున్న పేరు జోహ్రా తమాషా పేరు నాకూ ఈ గేమ్ తమాషాగానే ఉంది. ఈ జోహ్రా చాలాసార్లు అటు అమెరికన్ సి.ఐ.ఏ.కి ఇటు రష్యన్ కె.జి.బి.కి హైలెవెల్ లో కొన్ని పొలిటికల్ ఎస్సైన్ మెంట్స్ ని పూర్తిచేసి పెట్టాడు. అతను తీసుకొనే మినిమమ్ ఫీజు యాభై లక్షలు. మేగ్జిమమ్ ఫైన్ క్రోర్స్ పెట్టీకేసెస్ అతను టేకప్ చేయడు. ప్రెస్టేజ్ ఫీలవుతాడు. గొప్ప అహంభావి ఆత్మవిశ్వాసి. వెరీ రేర్ ట్రిగ్గర్ మెన్ లిబియా-ట్రిపోలి, నైజీరియా బుసా, జింబాబ్వే- హరారే, అంగోలా మొజాంబిక్ దేశాలలో ప్రతిపక్ష నాయకుల్ని గుట్టు చప్పుడు కాకుండా అత్యంత సమర్ధవంతంగా మట్టుబెట్టిన సమర్ధుడు ఈ జోహ్రా. ఇతనికో విచిత్రమైన అలవాటుంది. తన గురి తప్పితే తనను తానే ఘోరంగా శిక్షించుకుంటాడు. టార్గెట్ మిస్ అయితే, అనుకున్న వ్యక్తిని చంపలేకపోతే డబ్బు తీసుకోడు. ఒకరకంగా ఎక్సెంట్రిక్ కూడా. ఇతని చేతుల్లోంచి మాస్టర్ ని రక్షించటం టఫెస్ట్ టాస్క్ అయినా నాకిది థ్రిల్లింగా ఉంది. ఇలాంటి ఆటలంటే నాకు చాలా యిష్టం. జోహ్రాకి నాకు మధ్య అసలు గేమ్ ఇప్పుడు మొదలుకాబోతుంది. నాకిప్పుడు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది" అన్నాడు మిల్లర్ చిన్నగా తన గడ్డాన్ని నిమురుకుంటూ.
    
    సెక్రటరీకి అమానుల్లాఖాన్ పేరు వింటూనే చెమటలు పట్టేశాయి. బవరీకోస్ట్ సముద్రతీరాన నూటయిరవైమంది ఆర్మీ కమెండోస్ మధ్య నున్న ఆ దేశపు అధ్యక్షుడ్ని నిర్దాక్షిణ్యంగా అసాసినేట్ చేసి తప్పించుకున్న వ్యక్తి ఈ జోహ్రా పటిష్టమైన భద్రతా వలయాన్ని కూడా ఏమార్చి తను చంపాలనుకున్న వ్యక్తిని చంపి, పాదరసంలా తప్పించుకు పోగల సమర్ధుడు జోహ్రా. అతని గురించి ఓసారి అమెరికన్ న్యూస్ వీక్ మేగజైన్ లో స్పెషల్ ఆర్టికల్ వచ్చింది. అతని వద్ద దాదాపు యాభై దేశాల పాస్ పోర్టులు, వీసాలు ఎప్పుడూ సిద్దంగా వుంటాయి. ఆ వ్యక్తి.... అలాంటి ప్రమాదకరమైన వ్యక్తి తమ మాస్టర్ ని చంపేందుకు బొంబాయి నగర ప్రవేశం చేశాడు? ఇవన్నీ ఒక్కసారి ఆ సెక్రటరీకి గుర్తురావటంతో భయంతో ఫ్రీజ్ అయిపోయాడు.
    
    మిల్లర్ మాత్రం తను ఆడుకున్న ఆటని మరింత రసవత్తరం చేసే ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.
    
                                                     *    *    *    *    *
    
    "ఆ హాన్ సోదరులు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికుండటానికి వీలులేదు. ఐ వాంట్ టూ కిల్ దెమ్. నా అన్నలు, అక్కలకు సంభవించిన మిస్టీరియస్ డెత్స్ వెనుక వారి హస్తముంది. అలా అని నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు. బట్.... వాళ్ళే చివరకు నా కన్నతండ్రిని కూడా మట్టుబెట్టింది. నా చిన్నారి మేనకోడలు సోహ్ని అవిటిది కావటానికి కూడా వాళ్ళే కారణం. నా బావలు, వదినెలు, వారి పిల్లలు అదృశ్యమై పోవటానికి కూడా వాళ్ళే కారణం. వాళ్ళు చాలా తెలివికల వాళ్ళు. అందుకే ప్రతి హత్యని అది హత్యా? లేక సహజ మరణమా? జస్ట్ యాక్సిడెంటా అన్నంత సందేహాల్ని రేకెత్తిస్తూ చంపించారు. మా నాన్నగారు వాళ్ళని నమ్మితే నమ్మవచ్చు. నమ్మి మరణాన్ని ఆహ్వానించవచ్చు. బట్ నేనలా కాదు. వాళ్ళ అంతు చూడందే నేను విశ్రమించను. ఈ నా ప్రయత్నానికి ఎవరు అడ్డువచ్చినా....చివరకు కాకా అడ్డు వచ్చినా క్షమించలేను. అర్ధమైందా?" మాస్టర్ ఫోన్ లో ఆవేశంగా అంటుంటే ఫోన్ కి ఆవలివేపున ఉన్న వ్యక్తి విస్తుపోయాడు.
    
    మాస్టర్ ఫోన్ ని విరీటాపింగ్ (బగ్గింగ్) చేస్తున్న మిల్లర్ కూడా మాస్టర్ ఆవేశాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు.
    
    తన బంగ్లాలో వున్న ఫోన్స్ కి బయటనుంచి కాల్ వచ్చినా, బంగ్లా నుంచి రింగ్ వెళ్ళినా, వాటికీ కొలాబా పార్సీ బంగ్లాలో కనెక్ట్ చేసి వుండే ఎలక్ట్రానిక్ రికార్డర్స్ ఏక్టివేట్ అయిపోతాయని మాస్టర్ కి బాగా తెలుసు.
    
    వాటి ద్వారానే ఒక్కోసారి, మాస్టర్ బంగ్లాలోకి వ్యక్తులు, బయట వ్యక్తులకు ఏదయినా చెప్పకూడని విషయం చెప్పే ప్రయత్నంలో ఉంటే, మిల్లర్ వెంటనే ఆ ప్రమాదాన్ని పసిగట్టి, ఆ లైన్ ని డిస్కనెక్ట్ చేసి తను లైన్ లోకి వచ్చి హెచ్చరిస్తాడు.
    
    అంతక్రితం మిల్లర్ అలాగే మృదుల లైన్ ని డిస్కనెక్ట్ చేసి తను లైన్ లోకి వచ్చాడు. మాస్టర్ ఆవేశాన్ని, ఆవేదనను మిల్లర్ సరిగ్గానే అర్ధం చేసుకున్నాడు.
    
    విక్రోలిలో వుండే మాస్టర్ ని- కొలంబో ప్రాంతంలో తన నివాసం కోసం కొనిపించిన పార్సీ బంగ్లాలో వుండే మిల్లర్ రక్షిస్తుంటాడు. అలా ఎందుకనేది ఎవరికీ అర్ధం కాలేదు.
    
    మాస్టర్ నివాసానికి, మిల్లర్ నివాసానికి మధ్య దూరం సుమారు పదహారు కిలోమీటర్లుంటుంది. అయినా మిల్లర్ కి తెలీకుండా కనీసం చీమ కూడా మాస్టర్ బంగ్లాలోకి ప్రవేశించలేదు. అలాగేమిల్లర్ అనుమతి లేకుండా ఏ ఒక్కరూ బంగ్లా ఆవరణ దాటి బయటకు వెళ్ళలేరు.
    
    మాస్టర్ బంగ్లా అనాటమీని మిల్లరు బంగ్లాలోని అత్యాధునిక ఎలక్ట్రానిక్ యంత్రాలు తమ గుప్పిట్లో పెట్టుకొని వుంటాయి. ఈ యంత్రాలు మిల్లరు అధీనంలో పనిచేస్తుంటాయి.
    
                                                    *    *    *    *    *
    
    జోహ్రా ఎక్కిన కారు, షుట్ కోపర్ వెస్ట్ ప్రాంతంలోకి ప్రవేశించింది. తన చేతిలో వున్న అడ్రస్ స్లిప్ ని పరిశీలనగా చూస్తూ, దానిలోని మేప్ ని ఖలీల్ కి వివరిస్తున్నాడు జోహ్రా.
    
    కారుగంటకు ముఫ్ఫై కిలోమీటర్ల వేగంకంటే మించటం లేదు.
    
    ఇరుకుగా వున్న సందుల్లోంచి పదినిముషాలు ప్రయాణించి ఓ రేకుల షెడ్ ముందాగింది కారు.
    
    ఖలీల్ ని కారులోనే వుండమని కళ్ళతోనే సంజ్ఞ చేసి జోహ్రా కారు దిగి బ్రీఫ్ కేసుతో వెళ్ళి ఆ షెడ్ తలుపుల్ని తట్టాడు.
    
    నిమిషం తరువాత ఓ వ్యక్తి వచ్చి తలుపుతీసి ఎవరు మీరన్నట్లు చూశాడు.
    
    "ఇంతకుముందే మీకు ఫోన్ చేశాను. నా పేరు జె...." అన్నాడు జోహ్రా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS