అజ్ఞాత నరహంతకుల కారిడార్స్ లో జోహ్రా ఓటమి పెద్ద సంచలనాన్నే రేపింది. అతని ఓటమి అందర్నీ దిగ్భ్రమకు గురిచేసింది.
జోహ్రా, ఖలీల్ కంట్రీక్లబ్ కి వచ్చేసరికి కిరాయిహంతకులు ఎన్నో కోణాల నుంచి జోహ్రా ఓటమిని సమీక్షించుకున్నారు.
జోహ్రా మాస్టర్ ని అసాసినేట్ చేసాడనుకొని ఆ సందర్భంగా అతని కివ్వాలనుకున్న పార్టీ ఏర్పాట్లు మూలన పడిపోయాయి.
తొలిసారిగా వాళ్ళు మాస్టర్ గురించి, మిల్లర్ గురించి ఆలోచించారు.
సిగ్నల్ మెన్ శవం విక్టరీకోర్టు అపార్టుమెంట్స్ వద్ద నుంచి కంట్రీ క్లబ్ కి చేర్చబడింది.
కంట్రీక్లబ్ ప్రాంతంలో విచిత్రమైన నిశ్శబ్దం పరుచుకుంది. అజ్ఞాత నరహంతకుల శిబిరానికి సవాలుగా నిలిచిన మిల్లర్ పై ప్రతి ఒక్కరూ పగ, ప్రతీకారాన్ని పెంచుకున్నారు.
జోహ్రాకి జరిగిన అవమానాన్ని తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారంతా.
తమ వృత్తిని, తమ ధైర్యసాహసాల్ని విదేశం నుంచి ఒక వ్యక్తి రక్షణ కోసం వచ్చిన మిల్లరే ప్రశ్నించటం వాళ్ళకు కన్నెర్రగా వుంది. కసిగా వుంది. కలిసి కట్టుగానైనా మిల్లర్ ని మట్టుపెట్టాలని వుంది.
ఇది తమ సర్కిల్ దాటి బయటకు వెళితే...? తమను హైర్ చేసుకునేవాళ్ళు తమ శక్తి సామర్ధ్యాలను తక్కువగా అంచనావేస్తే...? భవిష్యత్ లో వాళ్ళు ఎయిమ్ చేసుకున్న వ్యక్తిని పంపవలసి వస్తే- అపుడు టరమ్స్ వాళ్ళు డిక్టేట్ చేసేందుకు ప్రయత్నిస్తే...? ఏమిటి కిరాయి హంతకుల భవిష్యత్తు...?
ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు, ఆలోచనలు అందరిలోనూ చోటు చేసుకున్నాయి.
ఆ సందర్భంలో వారి మధ్య చర్చలు మొదలయ్యాయి.
అంతలో వచ్చాడు జోహ్రా.
అతని వెనుకనే ఖలీల్ కూడా వచ్చాడు.
"ఏం జోహ్రా భాయ్.... ఏమిటి పరిస్థితి? ఆ సిల్వర్ ఫాక్స్ ని ఏం చేద్దాం...?" ఒక సీనియర్ ట్రిగ్గర్ మెన్ జోహ్రా నుద్దేశించి ప్రశ్నించాడు.
జోహ్రా మౌనంగా ఆ హల్లో వున్న సెంటర్ టేబుల్ ముందు కూర్చుని స్టీవార్డుకేసి చూశాడు.
అతను రాగానే విస్కీ, కారా ఆర్డర్ ఇచ్చి సిగరెట్ వెలిగించుకున్నాడు.
ఖలీల్ జోహ్రా హైర్ కి తీసుకున్న సబ్ మెషిన్ గన్ వగైరాలను తిరిగి తత్ సంబంధమైన వ్యక్తికి హేండోవర్ చేసేందుకు ఆ బిల్డింగ్ వెనక్కి వెళ్ళిపోయాడు.
"మాట్లాడు భాయ్.... మేం అందరం నీకు జరిగిన అవమానాన్ని మాకు జరిగిన అవమానంగానే భావిస్తున్నాం. ఆ సిల్వర్ ఫాక్స్ ని మట్టుబెట్టందే మేం వూరుకోం" అన్నాడా వ్యక్తి జోహ్రాకి ఎదురుగా కూర్చుంటూ.
"సిల్వర్ ఫాక్సా...? ఎవరతను...?" అప్పుడే వచ్చిన ఖలీల్ అడిగాడు.
"ఇంకెవరు? ఆ మిల్లర్..."
"సరిగ్గా అతనికి సరిపోయే పేరు. బట్ నీ ప్రపోజలే బావోలేదు. మిల్లర్ ని చంపటం నాకు జరిగిన అవమానానికి సరయిన సమాధానం కాదు అది అసమర్ధులు చేసేపని. మిల్లర్ లాంటి సాహసి, మేధావి తన చావుకి వెరవడు. తన వృత్తి ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించ లేకపోతేనే హమిలిఏట్ అవుతాడు. అవమానానికి, పరాజయానికి గురవుతాడు. అది చేయాలి..." జోహ్రా బేస్ వాయిస్ లో అన్నాడు.
"అంటే...?" నలుగురయిదుగురు ఒకేసారి అడిగారు.
"అంటే ఏముంది... మాస్టర్ నే ఎయిమ్ చేయాలి. చేస్తాను"
కూల్ ఫర్మ్ గా తను తీసుకున్న ప్రమాదకరమైన నిర్ణయాన్ని చెప్పగానే చుట్టూ మూగిన అందరూ తమ అహాన్ని తిరిగి ప్రోది చేసుకున్నారు జోహ్రా కేసి అభినందనా పూర్వకంగా చూశారు.
దెబ్బతిన్న బెబ్బులి జోహ్రా...
అంత తేలిగ్గా తగిలిన దెబ్బను విస్మరించలేడు.
జోహ్రా తీసుకున్న నిర్ణయం క్షణాల్లో కంట్రీక్లబ్ లోని అజ్ఞాత నరహంతకులందరికీ తెలిసిపోయింది.
అప్పటివరకూ స్తబ్దుగా వున్న అక్కడి వాతావరణం తిరిగి చైతన్యాన్ని పుంజుకుంది.
మాస్టర్ ని మరో ప్లాన్ ద్వారా హత్యచేసే జోహ్రా ప్రయత్నానికి అందరూ తమ మద్దతు తెలిపారు. ఖలీల్ అడగగానే అందరూ ఆ విషయములో సహకరించేందుకు సిద్దపడ్డారు.
జోహ్రా మృదువుగానే వారి ప్రపోజల్ ని తిరస్కరించి ఖలీల్ ద్వారా సీనియర్ మార్క్స్ మెన్ కి కబురుపెట్టాడు. తిరిగి మాస్టర్ ని అసాసినేట్ చేసే పథకమొకటి పకడ్బందీగా జోహ్రా మెదడులో రూపుదిద్దుకోసాగింది. అది ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బెసకకూడదనే కృతనిశ్చయానికొచ్చాడు జోహ్రా.
* * * * *
"దెబ్బతిన్న పులిలాంటివాడు ఆ ట్రిగ్గర్ మెన్. అంత తేలిగ్గా తన పరాజయాన్ని జీర్ణం చేసుకుంటాడని నాకనిపించటం లేదు." మిల్లర్ సెక్రటరీ ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ ముందు కూర్చుని ఏదో టైప్ చేస్తున్నాడు.
కొలాబా పార్సీ బంగ్లా మెయిన్ హాల్లో పచార్లు చేస్తున్న మిల్లర్ తన కళ్ళను మృదువుగా రబ్ చేసుకుంటూ అన్నాడు. "ఎస్. యూ ఆర్ రైట్.....అతను హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్ కిల్లర్. పాకిస్థాన్ టెర్రరిస్టు ట్రైనింగ్ కేంప్స్ లో బాగా శిక్షణ పొందాడు. ఇంటర్నేషనల్ రేంజ్ ట్రిగ్గర్ మెన్ అతను. అతని గురి చాలా పర్ ఫెక్ట్ గా ఉంటుంది. అతను గురి తప్పటం అంటే సూర్యుడు పడమటి దిక్కున పొడవటమే అవుతుంది. ఖచ్చితంగా పగబడతాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనే తీరతాడు."
అతని గురించి బాగా తెలిసినట్లు మాట్లాడిన మిల్లర్ ని చూసి సెక్రటరీ ఆశ్చర్యపోయాడు.
