"ఏవండి! ఆ బిందె మాదేనండి? తీసుకుపోవచ్చాండీ!" అన్నాడు మొదటివాడు.
"మరే, మా అమ్మ ఆ కూజా కూడా పట్టుకురమ్మంది!" అన్నాడు రెండోవాడు.
"ఈ చాప నాది!" అన్నాడు మూడోవాడు.
వాళ్ళు ఆ వస్తువులు తీసుకున్నారు. తీసుకుని వెళ్లబోతుండగా కృష్ణమూర్తి కిటికీ దిగాడు. ఆ పిల్లలకు అడ్డంగా నించుని అడిగాడు-
"మరి- ఈ మిగతా వస్తువులో?"
పిల్లలు ఆ సామాను చూశారు. ఆ వాటాలో యింకా రెండు కుర్చీలున్నాయి. ఒక మంచముంది. బట్టల స్టాండుంది.
అవన్నీ చూశాక పెద్దపిల్లాడు పెద్ద ఆరిందలా అన్నాడు-
"అవి మేం మోయలేంగదండి! మా సుమతి అత్తయ్య మాకంటే కొంచెం పెద్దదిగదా! అత్తయ్యొచ్చి తీసుకెడుతుంది!"
అప్పటికి సుమతీ, సుబ్బారావూ అతని భార్యా వాటాలోకి వచ్చేశారు. సుబ్బారావు నొచ్చుకుంటూ కృష్ణమూర్తితో అన్నాడు.
"క్షమించాలి! ఖాళీగావుంది గదాని ఈ వాటాని ఇన్నాళ్ళూ మేమే వాడుకుంటూ వచ్చాం! ఒక్క పదినిమిషాలు టైమివ్వండి. తీసేస్తాం!"
అతని మాటతో కృష్ణమూర్తి మనస్సు కలుక్కుమంది. అంచేత వెంటనే అన్నాడు-
"మీరేమీ అనుకోపోతే-ఇకముందు కూడా ఈ వాటా మీదే!"
సుబ్బారావు నసుగుతూ అన్నాడు-
"అంటే మీరు వెళ్ళిపోతారా?"
"ఉహు! మీతోపాటే వుంటాను!"
సుబ్బారావుకి అర్ధంకాలేదు.
కృష్ణమూర్తి వివరించి చెప్పాడు.
"చూడండీ! నేనా ఒంటరివాడ్ని. చెంబూ తపేళా లేనివాడ్ని. వంటా వార్పు తెలీనివాడ్ని! మీతోపాటు ఈ ఇంట్లో నాక్కూడా కొంచెం చోటివ్వండి. మీరు తినేది నాకు పెట్టండి. నేను తిన్నందుకు-ఆ ఖర్చు నేనే పెట్టుకొంటాను. కాదనకండి మేస్టారూ!"
సుబ్బారావుకి ఏం చెప్పాలో తోచలేదు. తన భార్యవేపు చూశాడు. కృష్ణమూర్తి సుబ్బారావుతో అన్నాడు.
"అమ్మా! మీరయినా వారితో చెప్పండి."
అని ముగ్గురి పిల్లల్లో చిన్నవాడ్ని ఎత్తుకొని, వాడి బుగ్గమీద ముద్దు పెట్టుకొని మళ్ళా అన్నాడు.
"చూడమ్మా! చూడు! నాకు వీడిష్టం. ఈ పిల్లలిష్టం. వీళ్ళని ముద్దాడటం యిష్టం. మీరిష్టం. మీరిష్టం ఈ పాప యిష్టం. అమ్మా-మా నాన్న పెంపకంలో ఇన్నేళ్ళూ ఒంటరిగానే బతికేనమ్మా! ఇన్నేళ్ళ తర్వాత యిప్పుడు నా అదృష్టం పండింది. అందుకే మీ మధ్యకు వచ్చాను. ,మళ్ళీ నన్ను ఒంటరివాడిని చేయకండి"
ఇంత చెప్పాక అకస్మాత్తుగా కృష్ణమూర్తి కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి. అతని కన్నీళ్ళలో నిజాయితీ పసిగట్టిన సుబ్బారావు భార్య కదిలిపోయింది. అయినా భర్త మనసేమిటో తెలీకుండా వరమివ్వడం మంచిది కాదనే ఉద్దేశంతో నవ్వుతూ అన్నది.
"నిన్ను మాలో కలుపుకోడానికి మాకేం అభ్యంతరం లేదు నాయనా! మాది అంతంతమాత్రపు సంసారం! మా తిండి తిప్పలు నీకు నచ్చుతాయో లేదోనని మావారి భయం!"
ఎత్తుకొన్న పిల్లాడ్ని దింపి నిబ్బరంగా అన్నాడు కృష్ణమూర్తి.
"అమ్మయ్య! భయం తప్ప అభ్యంతరం లేదుగదా? ఆల్ రైట్. ఇప్పుడే చెబుతున్నా వినండి. భగవంతుడి సాక్షిగా మిమ్మల్ని ఎప్పుడూ ఏ విషయంలోనూ భయపెట్టను. ఓ.కే."
"సరే అను అన్నయ్యా!" అన్నది సుమతి.
కృష్ణమూర్తి సుమతిని ఉద్దేశించి అన్నాడు.
"నా తల్లే? అన్నయ్యా! అని ఎంత తియ్యగా పిలిచేవమ్మా! ఆ పిలుపు నాకెంత యిష్టమో చెప్పలేనమ్మా! నీలాగా నేను కూడా ఎవర్నో ఒకరిని అన్నయ్యా అని పిలవాలి. ఏ తల్లినో వదినా అని పిలవాలి. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలి. ఆడించాలి. బుజ్జగించాలి. ఏమ్మా-ఈ కోరికలుండటం తప్పా? చెప్పమ్మా! ఈ చిన్నన్నయ్యను దూరం చేయవద్దని ఆ పెద్దన్నయ్యకు చెప్పు. ఒరే పిల్లలూ... పోనీ మీరయినా చెప్పండ్రా... నేను మీకు కావాలా? అక్కర్లేదా?" అని పిల్లల్ని అడిగాడు.
వాళ్ళు ముగ్గురూ ముక్తకంఠంతో 'కావాలి కావాలి' అన్నారు. కృష్ణమూర్తి ముగ్గురు పిల్లల్ని దగ్గిరకు తీసుకొన్నాడు. కళ్ళు తుడుచుకున్నాడు. మెల్లిగా సుబ్బారావువేపు నడిచి అతనితో అన్నాడు.
"చూశారుగా! మెజారిటీ నా పక్షాన వుంది. అంచేత మీరు కాదంటే కేసు నిలవదు. మీకు మీరేం చెప్పదలుచుకున్నారో-అందుకు ఒక గంట టైమిస్తున్నాను. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి!"
అనేసి కృష్ణమూర్తి వీధిలోకి నడిచాడు.
అప్పటివరకు తమ గుండెల్లో ఒక తియ్యటి అనుభూతి నింపిన విన్యాసానికి ఆ కుటుంబ సభ్యులు తన్మయులై ఉన్నారు గనక వెంటనే కోలుకోలేక పోయేరు. కోలుకొన్న తర్వాత అందరూ-బొమ్మలా నిలబడి చోద్యం చూస్తున్న శాస్త్రివేపు చూశాడు.
శాస్త్రికి ఏం చెప్పాలో తోచిందికాదు. గుండె గొంతుతో అతనన్నాడు.
"ఆయనెవరో ఏమిటో మీలాగే నాకూ తెలీదు. అద్దెకు దించానంటే. ఆత్మీయతకోసం ఆరాటపడే జీవిని మీతోపాటు నేనుకూడా ఇప్పుడే చూశాను."
తాను చెప్పదలుచుకున్నదేదో చెప్పేసి-కృష్ణమూర్తిని వెంబడించే నిమిత్తం అక్కడ్నించి పరుగెత్తాడు.
* * *
సరిగ్గా గంటలోనే తిరిగొచ్చాడు కృష్ణమూర్తి.
ఐతే అతను ఉత్త చేతుల్తో మాత్రం రాలేదు. అతనివెంట మూడురిక్షాలున్నాయి. ఒక రిక్షాలో బియ్యం వెచ్చాలున్నాయి. రెండోదాంట్లో పిల్లల వస్తువులున్నాయి. మూడో రిక్షాలో ఇంటిల్లిపాదికీ అవసరమయ్యే కొత్త బట్టలున్నాయి.
ఆ వరస గమనించిన సుబ్బారావు తట్టుకోలేక పొడిపొడి మాటలు ప్రయోగిస్తూ-
"చూడు బాబూ-"
"పేరు కృష్ణమూర్తి. పేరుతో పిలవకండి. తమ్ముడూ అంటే సంతోషిస్తాను!" అన్నాడు కృష్ణమూర్తి.
సుబ్బారావు నసుగుతూ అన్నాడు---
"ననీ ఆరాటానికి అర్ధమయిందేమో గాని-మాకు మాత్రం ఏమిటోగా- నిజం చెప్పాలంటే-కొంచెం సిగ్గుగా వుంది!"
కృష్ణమూర్తి సుబ్బారావు చేతుల్ని తీసుకుంటూ అన్నాడు-
"తొందరపాటైతే క్షమించండి! అంతేగాని మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. బిలీవ్ మీ!"
20
లక్ష్మీపతి ఇంట్లో...
సత్యంగారి చేతుల్ని కళ్ళకద్దుకుంటున్నాడు లక్ష్మీపతి. అద్దుకుంటూనే చెబుతున్నాడు-
"మీరు మా ఇంటికి రావడమే మహద్భాగ్యం నాకు! అల్లాంటిది- మీరు కొత్తగా ప్రారంభించే వ్యాపారంలో నన్ను పార్టనర్ గా తీసుకుంటానని మాటకూడా యిచ్చేరంటే మీకు నా కృతజ్ఞతలు ఏ విధంగా తెలీజేసుకోవాలో తెలీకుండా వుంది?"
"నా చేతులు మీ కళ్ళను తాకినప్పుడే మీ కృతజ్ఞతలు నాకు చేరిపోయేయి" అంటూ సత్యం తనచేతుల్ని వెనక్కి తీసుకున్నాడు.
లక్ష్మీపతి ఒదిగొదిగి కూచుంటూ సత్యంతో ఎంతో వినయంగా అన్నాడు.
