"సీతమ్మ అందగత్తె కానీ ఒక్కటే లోపం!" అంది ఒక వానర స్త్రీ.
"ఏమిటి?" అన్నారు మిగతా వాళ్ళు.
"పాపం తనకి మనలాగా తోక లేదు గదా! తోక లేని అందం అదొక అందమా!" అంది ఆ వానర స్త్రీ పెదవి విరుస్తూ.
అచ్చం అట్లాంటివాడే ధీరేంద్ర.
బిజినెస్ మీద ఇంట్రెస్టు లేని మనిషిని అతను ఊహించుకోలేడు. బిజినెస్ మీద తప్ప అతనికి ఇంక దేనిమీదా ఇంట్రెస్టు లేదు.
ప్రతి మనిషికీ ఒక 'ధర' ఉంటుందని అతని ప్రగాఢ నమ్మకం. అన్నీ అమ్మకానికే అని కూడా అతని ఫిలాసఫీ. చివరికి ప్రేమాభిమానాలు కూడా!
"నీకోసం ఏం కొన్నానో తెలుసా?" అన్నాడు ధీరేంద్ర, పిల్లాడికి తాయిలం పేరు చెప్పకుండా ఊరిస్తున్నట్లుగా.
అసహనంగా చూశాడు ధీరజ్.
"మేబాక్ కారురా! మెర్సెడెస్. ఐదున్నర కోట్లకి కొన్నా!" అన్నాడు ధీరేంద్ర. నిర్లిప్తంగా చూశాడు సూరజ్.
ధీరేంద్ర మళ్ళీ అన్నాడు.
"ఐదున్నర కోట్లు రా! ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన లగ్జరీ కారు! మే బాక్! ఇప్పటిదాకా ఇండియాలో ఒకే ఒక్క మేబాక్ కారు వుంది. మాణిక్ చంద్- గుట్కా ఓనరు వున్నాడే - ఆయన తన కూతురు జాహ్నవీ ధరీవాల్ బర్త్ డేకి కొనిచ్చాడు. మళ్ళీ నేనేరా అంతటి ఖరీదైన కారు కొని నీకు ఇస్తోందీ! మరి నువ్వంటే మాకు ఎంత ప్రేమో చూడు!" అన్నాడు ధీరేంద్ర.
చటుక్కున ఒక ఆలోచన తోచింది సూరజ్ కి.
"అయితే ఆ కారు పూర్తిగా నా సొంతమేనా?" అన్నాడు.
చందన మొహం వికసించింది. "నువ్వు మా సొంతమయితే ఆ కారూ నీ సొంతమే!" అంది అనందంగా.
మేబాక్ కారులో ట్రయల్ డ్రైవ్ కి వెళ్ళినట్లు వెళ్ళి, అటునుంచి అటే హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకున్నాడు సూరజ్ అరుణ దగ్గరకి!
పక్కగదిలో పక్క దులిపే పని పూర్తిచేసిన సెల్వికి తక్షణం తోచింది.
బాంబు ఎక్కడ పెట్టాలో!
ఈ డబ్బున్నవాళ్ళ కండకావరానికి గుర్తు అయిన ఆ అయిదున్నర కోట్ల కారులోనే పెట్టాలి!
బ్లాస్ట్! అంతే!
* * * *
'ఈస్టిండియా' అనే ఆ షిప్పు సముద్రంలో తేలుతున్న ఒక పాప పంకిలమైన ద్వీపంలా ఉంది. దేదీప్యంగా వెలుగుతున్న దీపాలతో ధగధగ లాడిపోతోంది.
అభిరాం, దాస్ లు ఉన్న పడవ ఆ షిప్పుని సమీపించగానే, షిప్పులో నుంచి ఒక తాళ్ళ నిచ్చెన కిందకి జారింది.
అభిరాం సాయంతో పైకి ఎక్కాడు దాస్.
"ఇది నా రాజ్యం!" అన్నాడు అభిరాం నవ్వుతూ.
"రా! చూద్దువుగానీ!" అన్నాడు అతిశయంగా.
షిప్పంతా కలయదిరుగుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు దాస్.
ఆ షిప్పు నాలుగు అంతస్తులుగా వుంది. సముద్ర జలాల్లో మునిగి ఉన్న అట్టడుగు అంతస్తులో ఇంజిన్ రూం వుంది. రెండో అంతస్తు పెద్ద గోడవునులా వుంది.
"ఇక్కడ ఇదేమిటీ? ప్రింటింగ్ ప్రెస్సులాగా ఉందీ?" అన్నాడు దాస్ ఆరాగా.
"అవును ప్రింటింగ్ ప్రెస్సే! నాసిరకం అనుకోకు. నాసిక్ సెక్యూరిటీ ప్రెస్సుకి పోటీపడే సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ! స్టాంపులూ, స్టాంపు పేపర్లూ, కరెన్సీ నోట్లూ, నకిలీ సర్టిఫికెట్లు, ఏవి కావాలంటే అవి ఇక్కడ తయారవుతాయి. దీని ముందు స్టాంపు స్కాం తెలివిగా తయారుచేసిన దొంగ స్టాంపు పేపర్లు బలాదూర్! ఇంజినీరు అనిపించుకోవాలని వుందా?"
"డాక్టర్ అనిపించుకోవాలని చిన్నప్పట్నుంచీ చిరుకోరిక!" అన్నాడు దాస్.
"తథాస్తు!" అన్నాడు అభిరాం తమాషాగా.
అక్కడ ఒక మూల బస్తాలలో దొంగనోట్ల కట్టలు కూరి ఉండడం గమనించాడు దాస్. అట్లాగే నకిలీ స్టాంపు పేపర్ల కట్టలు, డూప్లికేట్ డాక్యుమెంట్లూ కూడా దొంతర్లుగా వున్నాయి.
మార్క్ చేసి ఉంచిన పెట్టెలలో వివిధ దేశాల కరెన్సీ కూడా వుంది.
"మనం షిప్పంతా తిరిగి చూసేలోగా నువ్వు డాక్టర్ వి అయిపోతావు" అన్నాడు అభిరాం అభయహస్తం చూపుతున్నట్లుగా.
మూడో అంతస్తు మొత్తం ఏదో మల్టీ నేషనల్ కంపెనీ తాలూకు కార్పొరేట్ ఆఫీసులాగా ఉంది. స్టీలు, అల్యూమినియం, గ్లాసు ఫినిషింగ్ తో తళతళలాడిపోతోంది.
నాలుగో అంతస్తు దగ్గరికి వచ్చేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అక్కడంతా అచ్చం ఒక నైట్ క్లబ్ లాగా వుంది. అందులోనే, కోట్లకొద్దీ రూపాయలు పందెం కాసే కాసినో వుంది.
అందమైన ఆడపిల్లలు అర్థనగ్నంగా డ్రింక్సూ, డిన్నర్లూ సర్వ చేసే 'టాప్ లెస్ బార్' వుంది.
డెక్ మీద స్విమ్మింగ్ పూల్, దానిపక్కనే రిక్లయినింగ చైర్స్ వేసి వున్నాయి.
దాస్ అనుమానంగా అన్నాడు.
"బార్ లో కూర్చుని ఉన్న కుర్రాడెవరూ? మినిష్టరుగారి కొడుకు కాడూ?"
తల వెనక్కి వంచి వికటంగా నవ్వాడు అభిరాం.
"ఓ రోజున ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇక్కడ ఎదురుపడే సిట్యుయేషన్ వచ్చిందిలే. నేనే తప్పించా! ఎవరెవరు వస్తున్నారని కాదు - రానిదెవరని అడుగు. పెద్దలనబడే వాళ్ళు గూడుపుఠాణీలు ఇక్కడే - గ్రూపులు కట్టడం ఇక్కడే.
దాస్! ఇవాళ నువ్వు ఈ షిప్పులోకి రాగలగడం అంటే అది నీ అదృష్టం! నీ లెవెలు పెరిగిందన్నమాట! నౌ యూ ఆర్ ఇన్ టూ బిగ్ లీగ్!" అన్నాడు అభిరాం.
ఈలోగా -
బంగారం రంగు జుట్టు వున్న ఒక బ్లాండీగర్ల్ వెండి పళ్ళెం ఒకటి పట్టుకువచ్చి వాళ్ళముందు నిలబడింది.
అందులో ఉన్న దళసరి కాగితాన్ని తీసుకుని దాస్ కి అందిస్తూ డ్రమెటిక్ గా అన్నాడు అభిరాం.
"తీసుకో డాక్టర్ దాస్!"
అది ఒక యూనివర్శిటీ ఇచ్చినట్లుగా నకిలీ గౌరవ డాక్టరేట్!
"డాక్టర్ దాస్!" అనుకున్నాడు చండీదాసు పరవశంగా.
తను ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టిక్కెట్లు బ్లాక్ లో అమ్మే స్మాల్ టైం క్రూక్ ఇవాళ ఒక గౌరవ డాక్టరేట్ గ్రహీత!
నకిలీ అయితే అవ్వవచ్చుగానీ, అడిగే దమ్ము ఎవడికుంటుందీ? డెక్ మీద, స్విమ్మింగ్ పూల్ పక్కనే కూర్చున్నారు ఇద్దరూ.
"నీ ఫ్యూచర్ సక్సెస్ కోసం షాంపేన్!" అన్నాడు అభిరాం.
చిటికెల మీద షాంపేన్ వచ్చింది. షాంపేన్ ని కొద్దిగా నోట్లోకి తీసుకుని, పుక్కిలిస్తున్నట్లుగా నెమ్మదిగా నోట్లో తిప్పాడు అభిరాం. షాంపేన్ రుచి చూసే విధానమే అది.
"నైస్ స్టఫ్!" అని మెచ్చుకుని, "ముందుగా రుచి చూస్తే తప్ప తాగను - తాకను కూడా - దేనిని అయినా సరే!" అన్నాడు అర్థవంతంగా.
నాజూకుతనం తెలియని బండోడిలాంటి దాస్ షాంపేన్ ని కల్లు తగినట్లు గడగడ తాగాడు. తాగేశాక చెయ్యి వెనక్కి తిప్పి మూతి తుడుచుకున్నాడు.
"చెప్పు!" అన్నాడు అభిరాం - బిజినెస్ లోకి వచ్చేస్తూ.
"భారీ బడ్జెట్ తో ఒక సినిమా తీయాలని ఉంది."
"సినిమా తీయాలని లేని దెవరికి? మీ ఇండియాలో ఎవడైనా తెగ డబ్బు సంపాదిస్తే ఇంక దానిని సినిమాల్లోనో, రాజకీయాల్లోనో తిప్పాలి కదా!"
"ఫలాని పెద్ద హీరో డేట్లు కొనాలి" అన్నాడు దాస్.
"కష్టం కదా! ఏళ్ళ తరబడి పడిగాపులు కాయాలి."
"కష్టం నాలాంటి వాళ్ళకి. మీకు కాదు సర్! తమరు తలుచుకుంటే క్షణాల మీద పని! అన్నాడు దాస్.
అభిరాం బుర్ర పాదరసంలా పనిచేసింది.
హోల్ మొత్తంగా అందర్నీ టెర్రరైజ్ చేయడానికీ, తద్వారా తన గ్లామర్ ని మరింత పెంచుకోవడానికీ ఇదే మంచి అవకాశం!
ఇదే అదను!
"ఓకే ఓకే! అతన్ని కిడ్నాప్ చేసి ఈ షిప్పులో నాల్రోజులుంచుకుంటే, ఆ తర్వాత ఇంక అతను మన గులాం!" అన్నాడు.
"ఏమిటీ! హీరోని కిడ్నాప్ చేస్తారా?" అన్నాడు దాస్ అపనమ్మకంగా.
"ఆఫ్టరాల్ అడవి దొంగ వీరప్పనే చేయగా లేనిది అభిరాం అనే ఈ సముద్రపు దొంగ చేయలేడా? ఏం దాస్?"
చటుక్కున అభిరాం రెండు చేతులూ పట్టేసుకున్నాడు దాస్.
"మీరు తలుచుకుంటే ఏమైనా చేసేయగలరని నాకు తెలుసు!" అన్నాడు సంభ్రమంగా.
"కానీ - నేను చేసిపెట్టింది నువ్వు నిలుపుకోగలవన్న నమ్మకం నాకు కలగొద్దూ? అపాత్రదానం చేయకూడదని కదా మీ పెద్దల మాట చద్ది మూట! నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితేనే నా సపోర్టు ఉంటుంది దాస్!" అన్నాడు అభిరాం.
"ఏం చేయమంటారు సర్" అన్నాడు దాస్ ఆతృతగా.
"చిన్నపనే"
"చెప్పండి!"
"హైదరాబాద్ లో ఉంటుంది ఓ పిల్ల."
"ఏం చేస్తూ వుంటుంది?"
