Previous Page Next Page 
వైరం పేజి 30


    "ఎక్కడైనా తీరిగ్గా కూర్చుని, జరిగిపోయినదంతా ఒక్కసారి 'పోస్టుమార్టమ్' చేసుకుందామా?" అంది భావన.
    అనుకోకుండానే భావన అరుణని నెక్లెస్ రోడ్డుకి తీసుకువచ్చి పచ్చగా గడ్డి పెరిగివున్న ఆ పాత స్పాట్ లోనే కూర్చోబెట్టింది.
    అరుణ ఆ రోజున సూరజ్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా మాట్లాడి, తగిలేసిన స్పాట్ లో.
    అది గమనించకపోలేదు అరుణ. అయినా గమనించనట్లే చెప్పింది.
    "ఒకరోజున ఇక్కడే ఆండాళమ్మగారి అమ్మాయి సునీత ఆత్మహత్యాప్రయత్నం చేసింది. పిరికి బాయ్ ఫ్రెండ్ పరారీ అయిపోయాడు. ఆ పిల్లకి వెంకయ్య అంకుల్ ట్రీట్ మెంట్ ఇవ్వడం, మర్నాడు పొద్దున్న ఆయన హాస్పిటల్ కి వెళ్ళగానే ఒక పోస్టుమార్టం కేసు. గ్యాంగ్ రేప్ లో చనిపోయిన అమ్మాయి. అది అట్లా ఉండగానే వెంకయ్య అంకుల్ కొడుకు వివేక్, కూతురు శాంతీ మర్డరైపోవడం, ఆ మూడు చావులకీ కారణం నాగూ అనేవాడు కావడం, హాస్పిటల్లోనే డాక్టర్ వెంకయ్య అంకుల్ కి హార్ట్ ఎటాక్ వచ్చి పోవడం" అంటున్న అరుణ మాటలకి అడ్డం వచ్చి,
    "హార్ట్ అటాకా పాడా! అదే టైంలో ఆ మినిష్టరు వచ్చాడు చూడలేదూ?" అంది భావన.
    "చెప్పబోతున్నది అదే! పరామర్శకి వచ్చాడని పేరు. లోపలకి వెళ్ళి అంకుల్ మీద ప్రెజర్ తెచ్చి ఉంటాడు. అతను ఆ నాగూ అనే నాగేష్ వాళ్ళ నాయనకి సపోర్టు అని అందరూ అనుకుంటున్నదేగా!"
    "అంకుల్ సైనైడ్ మింగేసి వుంటారని శారదా ఆంటీ చెబుతూనే ఉంది గదా!"
    "పిచ్చిదాని వాగుడు అంటారు. చెప్పు భావనా! న్యాయదేవతకి నడుం విరక్కొట్టేస్తూ ఉంటే మనం నోరు మూసుకుని, కళ్ళు మూసుకుని ఉండిపోవలసిందేనా?"
    "ఊరికే ఉండలేకపోతే ఉరెట్టుకొమ్మంటారు. లేదా అంకుల్ లాగా సైనైడ్ మింగేయమంటారు" అంది భావన కసిగా.
    ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు.
    ఆదర్శ కుటుంబాలకే ఆదర్శం లాంటి డాక్టర్ వెంకయ్య కుటుంబం, అలా ఒక్కరోజులో ఎరేజర్ తో తుడిచేసినట్లుగా తుడిచిపెట్టుకుపోవడం వాళ్ళ రక్తం సలసలా మరిగిపోయేటట్లుగా చేస్తోంది. వాష్ అవుట్!
    చాలాసేపటి తర్వాత అరుణ అంది చాలా ధృడంగా.
    "వెంకయ్య అంకుల్ తప్పు చేశారు. చచ్చి సాధించేది ఏం వుంటుందీ! బతికి వీళ్ళ బతుకులు బయటపెట్టాలి! అందుకు నేను రెడీ!"
    "నువ్వు ఏం చేసినా నీకు తోడుగా నేను ఉంటాను అరుణా! కానీ మొగ తోడు కూడా ఉండకపోతే నీకు కష్టం! నా మాట విని..."
    "మిస్ భావనా ఫెర్నాండెజ్! ఆ సూరజ్ ప్రేమ సంగతి జన్మలో ఇంకెప్పుడూ నా దగ్గర తేకుండా ఉంటానని ప్రామిస్ చేస్తావా?" అంది అరుణ విసురుగా.

                        *    *    *    *

    "చెప్పరా! చెప్పు! ప్రేమంటే ఏమిటీ? నా అన్న వాళ్ళందరినీ వదిలేసి నీదారి నువ్వు చూసుకోవడమేనా?" అంది చందన ఆగ్రహంగా.
    ఆమె సూరజ్ కి తల్లి.
    పాన్ నములుతూ పక్కనే నిలబడి వున్నాడు సూరజ్ తండ్రి.
    నడిచే నగల పెట్టెలా వుంది చందన. ఒంటినిండా ఆభరణాలే.
    కవరులో కుక్కిన కోవా ముద్దలా వున్నాడు ధీరేంద్ర. నున్నటి ఒళ్ళు. నున్నగా దువ్విన జుట్టు. నలగని బట్టలు.
    చందన ఆవేశంతో పోలిస్తే అతను చాలా కూల్ గానే ఉన్నాడు.
    "చెప్పరా చెప్పూ! నాకంటే అదే ముఖ్యమా?" అంది చందన.
    సూరజ్ మనసులోనే అనుకున్నాడు. తల్లీ పెళ్ళామూ ఇద్దరూ ఒక్కటే ఎలా అవుతారూ? ఎవరికి వాళ్ళే! అని.
    అంతే తప్ప, అతను పైకి ఏమీ అనలేదు.
    చందన ఇంకా అరుస్తూనే వుంది.
    "ఇంకా నయం! ఆ ఎద్దుగాడు అమెరికా ఫ్లయిట్ ఎక్కేముందు లక్కీగా మాకు ఫోన్ చేసి చెప్పబట్టి సరిపోయింది కానీ - అమ్మో - కాకపోతే నువ్వు అట్నుంచి అటే హైదరాబాద్ కి వెళ్ళిపోయేవాడివి కదూ! ఎద్దుగాడి ధర్మమా అని నిన్ను ఎయిర్ పోర్టునుంచి ఇటు తీసుకురాగలిగాం. అయినా, విమానం తిరిగి చెన్నయ్ వచ్చేస్తే ఇంటికి రావఖ్ఖర్లేదా? మేము నీమీద సి.ఐ.డి. పనిచేసి,  డాక్టర్ తో మత్తు మందు ఇంజక్షను ఇప్పించి ఇంటికి తీసుకురావాలా! ఏళ్ళొచ్చాయిగానీ...."
    "సో, నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వే అన్నమాట!" అనుకున్నాడు సూరజ్ మనసులోనే.
    "నువ్వు ఆ పిల్లకి దగ్గరయినకొద్దీ నాకు దూరమైపోతావని భయంరా! నిన్ను కంప్యూటర్ ఇంజనీరుగా చూడాలని ఎన్నెన్ని కలలు కన్నానూ! ఉద్యోగం ధ్యాస లేకుండా ఆ వులిపి కట్టెలాంటి దానివెంట పడతావా? దానిది మన లెవెలు కాదు. మన కులం కాదు. మన భాష కాదు. మనవాళ్ళలోనే మంచి అమ్మాయిని చూస్తా! నీకు పెళ్ళి చేస్తా! ఇద్దరూ కలిసి అమెరికా వెళ్ళిపోదురుగానీ...." అంటోంది చందన.
    "అమ్మా!" అని అభ్యంతర పెట్టబోయాడు సూరజ్.
    "అమ్మ చెప్పినట్లు వింటేనే నేను నీకు అమ్మ! వినకుండా ఇష్టం వచ్చినట్లు వూరేగుతానంటే నీకూ, ఆ గూడెంలో వాళ్ళకీ తేడా ఏమిటీ?"
    పక్కగదిలో పక్కలు దులిపివేస్తున్న పనిమనిషి సెల్వి పనులు చూసుకుంటూనే చెవులప్పగించి ఆ మాటలు వింటోంది.
    గూడెంలో తన గుడిసె తగలబడిపోయిన సీను గుర్తొచ్చి గుండె మండిపోయినట్లయింది సెల్వికి.
    "డబ్బుతో బలిసి వున్నారు వీళ్ళు" అనుకుంది. "కాదు కాదు. డబ్బుతో పులిసి వున్నారు. కూటికి లేక తాము కాయికష్టం చేస్తుంటే, కోటికి ఇంకొకటి చొప్పున జమ చేస్తూ పోవడానికి వీళ్ళ యావ!"
    అప్పుడు అనిపించింది సెల్వికి.
    తమలాంటి దీనుల పాలిటి దేవుడు ఆ అభిరాం దొర!
    అతనూ డబ్బున్నవాడే! కానీ వీళ్ళలాగా కాదు. బీదలకోసం డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతాడు.
    తమ గూడెం తగలబడిపోతే అందరికంటే బాధపడింది ఆ దొరే!
    ఆ రాత్రి తనని దగ్గరకు తీసుకుంటూ అభిరాం దొర ఏమన్నాడు?
    "దెబ్బకి దెబ్బ! కన్నుకి కన్ను! రక్తానికి రక్తం! వాళ్ళు మీ గూడేన్ని తగులపెడితే, మనం వాళ్ళ కాలనీని బ్లాస్ట్ చేసేయాలి. ఇదిగో బాంబు! అక్కడ ఉన్న అందరిలోకీ మరీ బలిసి వున్నాడు ధీరేంద్ర షా. వాడి ఇంట్లోనే కదా నువ్వు పనిచేసేది. వాళ్ళ ఇంట్లో పెట్టు!" అన్నాడు అభిరాం.
    "ఏ పాపం ఎరగని మనుషులు కూడా చచ్చిపోతారు" అంది తను భయంగా.
    "డబ్బున్నవాళ్ళంతా పాపాత్ములే! పైగా అగ్రవర్ణాలవాళ్ళు. వాళ్ళు మనుషులు కారు. పశువులు. లేకపోతే వాళ్ళు మీ గూడేన్ని..."
    తన చేతిమీద ఉన్న పచ్చబొట్టుని చూసుకుంది ఆ అమ్మాయి. 'సెల్వి' అని రాసి ఉంది. అభిరాం దొర ఏమన్నాడు?
    'సెల్వి' అనే పేరు నీ చేతిమీద పచ్చబొట్టు పొడిపించుకున్నావు. కానీ నీ చూపులతోనే నా గుండెలో నీ పేరుని పర్మినెంటుగా చెక్కేశావు సెల్వి! నేను నీ వాడిని సెల్వీ! అందుకే ఈ బాంబు! అందుకో!"
    బాంబు అయితే తెచ్చిందిగానీ, బ్లాస్ట్ చేయడానికి భయపడింది సెల్వి.
    పక్క గదిలో చందన ఇంకా వదరుతూనే ఉంది.
    "ఆ గూడెం వాళ్ళ కుక్క మన షీలాతో సరసాలాడితే గూడెం గూడేన్నే తగలబెట్టేశాం! మాటల మనుషులం కాదు. చేతల మనుషులం తెలుసా?"
    రక్తం సల సల మరిగినట్లయ్యింది వింటున్న సెల్వికి. మళ్ళీ అభిరాం మాటలు గుర్తువచ్చాయి. "ఆ డబ్బున్నవాళ్ళ కాళ్ళు నాకుతూనే జీవితాలు గడిపేస్తామంటే నాకు అభ్యంతరం లేదు. కానీ, మీ కాళ్ళమీద మీరు నిలబడతానంటే మీ వెనుక నేను నిలబడతా! బంగళాలను బ్లాస్ట్ చేసేస్తే తప్ప బుద్ధి రాదు వాళ్ళకి!"
    బాంబు పెట్టేయాలనుకుంది.
    కానీ-
    ఎక్కడా?
    అదే సమయంలో -
    పక్క గదిలో -
    సూరజ్ అంటున్నాడు.
    "నేను హైదరాబాద్ వెళ్ళాలి."
    "గేటు దాటడానికి వీల్లేదు" అంది చందన ఖండితంగా.
    దవడలు ఆడిస్తూ, జరుగుతున్నదంతా బోర్ గా చూస్తున్నాడు సూరజ్ తండ్రి ధీరేంద్ర.
    ఇదంతా అతనికి చాలా చిత్రంగా అనిపిస్తోంది. అసలు ప్రేమంటే ఏమిటీ? అదేమిటో తను ఎరగడు!
    ఈ ప్రేమపిచ్చి ఏమిటి?
    అదీ తను అనుభవించలేదు.
    నిజానికి చందనని ప్రేమించడం నరమానవుడికి సాధ్యంకాదు కదా!
    ఆ! తనూ ప్రేమించకపోలేదు. బిజినెస్ తనకి ఫస్ట్ లవ్! బిజినెస్సే తనకి లాస్ట్ లవ్ కూడా!
    బిజినెస్ మీద ఇంట్రెస్టు లేనివాళ్ళు అసలు మనుషులలాగే కనబడరు ధీరేంద్రకి.
    అందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చును.
    పురాణకాలంలో రామరావణ యుద్ధం ముగిసింది.
    సీతారాములు లంక నుంచి తిరిగి వచ్చేటప్పుడు వానర రాజధాని కిష్కింధకు వెళ్ళారు.
    రామ రావయయుద్ధానికి కారణమైన సీత. ఎంతటి అందగత్తె అయి ఉంటుందో చూద్దాం అని ఆత్రంగా వెళ్ళారు వానర వీరుల భార్యలు.
    తీరా సీతని చూశాక వాళ్ళ కామెంటు ఏమిటీ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS