"కానీ యిప్పుడు మార్కెట్ లో అలాంటి పెన్ ఎక్కడుందో వెతికి తేవాలంటే కష్టం కదా_ ముందా రాణీకి ఏమని చెప్తాం?" చిరాగ్గా అన్నాడు గోపాల్రావ్.
భవానీశంకర్ ఆలోచనలో పడ్డాడు.
"ప్రస్తుతానికి ఆ పెన్ ని దొంగిలించటం ఒక్కటే మార్గం. మన భజన్ రావ్ ఇలాంటి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఎక్స్ పర్ట్ ని నాకనుమానంగా వుంది."
అతని మాటలకు భజన్ రావ్ బెదిరిపోయాడు.
"కల్నల్ గారి దగ్గర్నుంచీ దొంగతనం చేయటమా? నావల్ల కాదు సార్! ఇప్పటికి ఇంట్లో దొంగిలించడానికి వచ్చిన ఆరుగురు దొంగల్ని కాళ్ళమీద కాల్చి తనే గవర్నమెంటు హాస్పిటల్లో చేర్పించి తర్వాత పోలీసుకి ఇన్ఫర్మేషన్ యిచ్చాడని అన్ని న్యూస్ పేపర్లలోనూ రాశారు. ఆ రోజు నుంచీ ఇంతవరకూ ఏ దొంగయినా ఆయనింటివైపు చూస్తే ఒట్టు_ ఆయన ఇల్లు తాళం వేసి రెండు నెలలు టూర్ వెళ్ళినా వచ్చేవరకూ ఎవడూ ఇంటివైపు కన్నెత్తి చూడడు"
"ఓకే బ్రదర్! ఒకవేళ భజన్ రావ్ కేమైనా ప్రాబ్లెమ్ వుంటే నువ్వే ఆ కార్యక్రమం నిర్వహించు."
"నో! నావల్లకాదు_ అబాసుపాలయిపోతాను."
"లేకపోతే ఓ పని చెయ్యి_ ఆ అమ్మాయికి ఆ పెన్ పోయిందని చెప్పి ఆ పెన్ కి డబుల్ రేట్ యిచ్చేసెయ్యి."
"సరే ట్రై చేస్తాను"
రాత్రి భోజనాలయ్యాక భవానీశంకర్ టెర్రేస్ మీద పూజతో పాటు వెన్నెల్లో కబుర్లు చెపుతూ రొమాంటిక్ నవల గురించి డిస్కషన్ చేస్తూండగా కల్నల్ కనకారావ్ టెర్రేస్ మీదకొచ్చి ఆ దృశ్యం చూసి మండిపడ్డాడు. పూజ భవానీశంకర్ తో అంత చనువుగా వుండటం అతనికి నచ్చలేదు.
"రేపు నన్ను హిప్నటైజ్ చేసే కార్యక్రమానికి బాగా ప్రిపేరు అయ్యావా మిస్టర్ చంద్రకాంత్?"
"ఎస్ కామ్రేడ్! సెంట్ పర్సెంట్"
"దట్స్ గుడ్! లేకపోతే నేను చాలా చెడ్డవాడినయిపోతాను_ తెలుసా నీకా సంగతి?"
"చాలామంది చెప్పారు కల్నల్."
"ఏమని?"
"మీకు కోపం వస్తే మనిషి కాదని, మృగం కంటే అన్యాయమనీ."
"ఎస్! అది దృష్టిలో వుంచుకో. ఆ హాకస్ ఫోకస్ నవల రాసింది నువ్వేనన్నావు కదూ?"
"ఎస్ బ్రదర్! ఎనీ ప్రాబ్లెమ్?"
"దాని రచయితని ఎప్పటికయినా పట్టుకుని మళ్ళీ రాయకుండా చేతిమీద కాల్చేయాలనుకున్నాను. కానీ వెతకటానికి టైమ్ దొరకలేదు. టేకిట్ గ్రాంటెడ్ చంద్రకాంత్! నీ చేతివేళ్ళు కాల్చిపారేసేది ఖాయం."
"డోంట్ గెట్ ఎగ్జయిటెడ్ ఫ్రెండ్! లీగల్ గా అలాంటి చర్యను చట్టం వప్పుకోదు. ఇది డెమోక్రసీ! మిలటరీ రూల్ కాదు."
"టు హెల్ విత్ డెమొక్రసీ? డెమొక్రసీలో కూడా కాల్చిపారేయడానికి అధికారముంది. లేకపోతే రోజూ అన్నిచోట్లా కాల్పులు, మర్డర్లు ఎలా జరుగుతాయి? ఎనీవే_ గెట్ రడీ. పూజా! పద" అన్నాడు.
"నేను నవలలు రాసే టెక్నిక్ నేర్చుకొస్తాను డాడీ."
"నో! ఇలాంటి చెత్త రచయితల దగ్గర నేర్చుకుంటే నువ్వు చివరకు కాపీ రైట్ యాక్ట్ కింద జైలుకెళ్తావ్_ డూ యూ నో! ఈ చంద్రకాంత్ పరమ కాపీ రచయిత అని ఇందాకే మా ఫ్రెండొకడు ఫోన్ లో చెప్పాడు. హిందీ టీవీ సీరియల్సన్నీ యధాతథంగా కాపీ కొట్టేస్తున్నాడంట. ఈ రోజున పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న రచయితల గ్యాంగ్ అంతా కేవలం ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్ లేటర్స్ అని, వీళ్ళకేమాత్రం ఒరిజినాలిటీ లేదని అతను చెప్పాడు. అంచేత డోంట్ ఓవర్ ఎస్టిమేట్ దెమ్_ఓ.కే?"
"నో! ఐ కాన్ట్ బిలీవ్! మా డాడీ చెప్పే మాట నిజమేనా మిస్టర్ చంద్రకాంత్?"
"ఎక్కడో ఒకరిద్దరు అలా చేస్తున్నమాట నిజమేగాని మనదంతా ప్యూర్ ఒరిజినాలిటీ మిస్ పూజా! మియర్ అబ్జర్వేషన్ ఆఫ్ లైఫ్."
"ఆల్ రైట్ పూజా! కమాన్" కోపంగా అన్నాడు కల్నల్.
"గుడ్ నైట్ మిస్టర్ చంద్రకాంత్.
"గుడ్ నైట్."
ఇద్దరూ వెళ్ళిపోయారు.
* * * *
మర్నాడు ఉదయం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరుండగా డోర్ బెల్ మోగిన చప్పుడయింది.
భజన్ రావ్ వెళ్ళి తలుపు తెరిచాడు.
రచయిత చంద్రకాంత్ అతనిని చూసి చిరునవ్వు నవ్వాడు.
"హలో!"
"హలో" అన్నాడు భజన్ రావ్.
"నా పేరు చంద్రకాంత్... రచయిత చంద్రకాంత్.. గుర్తుపట్టేశారు కదూ?"
భజన్ రావ్ స్టన్ అయిపోయాడు.
"రచయిత చంద్రకాంతా?"
"అవును. ఫేమస్ రైటర్ చంద్రకాంత్ ని నేనే."
భజన్ రావ్ బుర్రగోక్కున్నాడు. నమ్మలేనట్లు అతనివంక మరోసారి చూశాడు.
"రచయిత చంద్రకాంత్ గారు మీరా?"
"అవును. సీతాదేవిగారున్నారా?"
భజన్ రావ్ ఆశ్చర్యపోయాడు.
"సీతా మేడమ్ గారా?"
"అవును! ఆమె నన్ను అర్జంటుగా రమ్మని మెయిలిచ్చారు."
"ఓ_మీరా! ఓకే! ఓకే! ఒక్క నిమిషం ఇక్కడే కూర్చోండి. నేను లోపలికెళ్ళి ఏర్పాట్లు చేసి వస్తాను."
చంద్రకాంత్ ఆనందంగా సోఫాలో కూలబడ్డాడు.
సీతాదేవి ఎలా వుంటుందో? అందంగా ఉంటుందా? ఏజ్ గ్రూప్ ఏమిటో? పాతికలోపా, పైనా? తనకి కొంచెం ఏజ్ విషయంలో సరదాలున్నాయిగానీ ఎడిటర్ నీలకంఠంకి ఆ పట్టింపేం లేదు. ఎదురుగా వున్న కాండిడేట్ ఆడదన్న చిన్న ఇండికేషన్ కనిపించినా చాలు! రూమ్ కి తీసుకెళ్ళిపోతాడు.
భజన్ రావ్ లోపలికొచ్చి బిగ్గరగా గోపాల్రావ్ తో అన్నాడు_
"మీకోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారండీ. అర్జంటుగా ఏదో ఫైల్ గురించి మాట్లాడాలట. చాలా అర్జంటంట"
గోపాల్రావ్ గుండె వేగంగా కొట్టుకుంది.
బహుశా ఆ రాణి పెన్ కోసం వచ్చి వుంటుంది.
భజన్ రావ్ గోపాల్రావ్ కి కన్ను గీటాడు.
అతనికి చెమటలు పట్టటం కల్నల్ గమనిస్తూనే వున్నాడు. గోపాల్రావ్ త్వరత్వరగా ఫలహారం ముగించేశాడు.
వాష్ బేసిన్ దగ్గరకు నడిచి చేతులు కడుక్కుంటుంటే భజన్ రావ్ అతనికి సమీపంగా వచ్చాడు.
