ఛిండూహాన్ తన సోదరుడికేసి కోపంగా చూసాడు. ఆ చూపుల్లో తీవ్రమయిన మందలింపు దాగివుంది.
"ఇంకెప్పుడూ వర్తమానంలోకి గాని, భవిష్యత్ లోకిగాని గతాన్ని, దాని తాలూకు సంఘటనల్ని తీసుకురాకు- ప్రస్తావించకు."
లిండాహాన్ తన తప్పును గ్రహించి చప్పున తలవంచుకున్నాడు.
"అది నాకు తెలుసు. మిల్లర్ ని ఏమార్చింది మాస్టర్ ని ఈ ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరని నాకు బాగా తెలుసు."
"మరి?"
"మాస్టర్ ని రెచ్చగొట్టాలి. సహజసిద్దంగా, స్వభావపరంగా అతనిలో దాగివుండే అగ్నిపర్వతంలాంటి ఆవేశాన్ని ఇలాంటి ప్రయత్నాల ద్వారా నిద్రలేపాలి."
"మరా పనిప్పుడు జరుగుతుందా?"
"జరుగుతుంది. ముందు ముందు మాస్టర్ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో నువ్వే చూస్తావు. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ గతాన్ని కెలికే ప్రయత్నం మాత్రం చేయకు" ఛిండూహాన్ హెచ్చరిక లిండాహాన్ మీద బాగా పనిచేసింది.
* * * * *
"డియర్ మాస్టర్..." మిల్లర్ కంఠం బేస్ వాయిస్ లో గంభీరంగా ఉంది.
"మృదుల తాను మాట్లాడుతున్న లైన్ ని డిస్కనెక్టు చేసి మిల్లర్ లైన్ లోకి వచ్చినట్లు గుర్తించి ఉలిక్కిపడ్డాడు మాస్టర్.
"ఎస్- కాకా-"
మిల్లర్ పట్ల తనకున్న భయభక్తుల్ని వ్యక్తం చేస్తూ అన్నాడు మాస్టర్.
"బయట వ్యక్తులెంత కావల్సిన వాళ్ళయినా, ఇష్టులయినా నీ ప్రోటోకాల్ కి సంబంధించిన వివరాల్ని తెలియపర్చకూడదు. అవునా?" అతని కంఠంలో కఠినత్వం తొంగిచూసింది.
మాస్టర్ ఉలిక్కిపడ్డాడో క్షణం.
"ఒక్కసారి నీ భద్రతా ఏర్పాట్లను చేపట్టాక నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలని ఆనాడే చెప్పాను. మర్చిపోయావా? అది మరపు మూలంగానే అయితే నీ ఏమరుపాటే నిన్ను హతమారుస్తుంది. నిర్లక్ష్యమా? అహంభావమా? ఏదయినా ఒక్కటి మాత్రం నిజం. నిన్ను ఎవరు హత్య చేసినా, వాళ్ళెవరయినా వాళ్ళకు యాభై లక్షలు ఓపెన్ గా ఆఫర్ చేయబడింది. నిన్ను నలుగురు హత్య చేసినా ఆ నలుగురికి తలకి ఒక్కింటికి యాభై లక్షలు ఇవ్వబడతాయి. నువ్వు మృత్యువు అంచుల్లోనే జీవన పోరాటాన్ని సాగిస్తున్నావని మర్చిపోకు. అది చాలా ప్రమాదం. నీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ నీ ఇష్టమయిన వ్యక్తులకు చెప్పకూడని విషయాలు చెప్పటం భవిష్యత్ లో కూడా జరిగితే నా నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసి వస్తుంది. ఇలా నీకు చెప్పవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. నేను మరోసారి విచారపడటం ఎవరికీ క్షేమం కాదు" మిల్లర్ చెప్పటం ఆపాడు.
మాస్టర్ వెంటనే మాట్లాడలేకపోయాడు. అందుకు చాలా కారణాలున్నాయి.
మిల్లర్ తనకు సెక్యూరిటీ చీఫ్ కావటం తన అదృష్టం. ఆ అదృష్టం తనకు దక్కింది. తనకు వేల కోటలున్నాయి అని కాదు. తనో గొప్ప వ్యక్తి అని కాదు. కేవలం ఒకే ఒక్క సంఘటన అతి చిన్న సంఘటనలు చలించిన మిల్లర్ తన రక్షణ బాధ్యతల్ని చేపట్టాడు. కర్కోటకుడయిన మిల్లర్ మనస్సు పొరలు ఇనుప అరలు అని ఎవరయినా భావిస్తే అది తప్పే అవుతుంది. మిల్లర్ హృదయాంతరాళంలో ఓ మారుమూల మనుషుల్ని మనసుల్ని ద్రవింపజేసే సాప్ కార్నర్ ఉంది. ఇదంతా తేలిగ్గా ఎవరికీ కనిపించదు. కనిపించేలా అతను ప్రవర్తించడు.
తానీనాడు ప్రాణభయం లేకుండా నిశ్చింతగా నిద్రపోగలిగే అవకాశం, అదృష్టం కేవలం మిల్లర్ మూలంగానే తనకు దక్కుతోంది.
మృదుల మీద తనకున్న ఆకర్షణ అంతకంతకు పెరిగి, తన హద్దుల్ని, పరిధుల్ని చెరిపివేసే స్థాయికి వెళ్ళింది.
ఫలితంగా మిల్లర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం జరిగింది.
చాలా ఇబ్బందికరమైన పరిణామం.
"నీవు అజాగ్రత్తగా వ్యవహరిస్తే....నీ భద్రత కోసం నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పెంచవలసి వస్తుంది. కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. దీనిమూలంగా నా స్ట్రెయిన్ పెరుగుతుంది. ఐ డోంట్ లైకిట్... నాకు నిన్ననే అందిన రహస్య సమాచారం ప్రకారం కనీసం యాభైమంది ప్రొఫెషనల్ ఆమెచ్యూర్ కిల్లర్సు నిన్ను మట్టుపెట్టేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. క్రిమినల్ వరల్డ్ లో నిన్నో జాక్ పాట్ లా, బంగారపు బాతుగుడ్డులా భావిస్తున్నారు. సో....వీటన్నిటిని మదింపు చేసుకొని అప్రమట్టంగా ఉంటానని ఆశిస్తున్నాను. బయటవారితో నీవు నీ వ్యాపారం గురించి, లాభనష్టాల గురించి చెప్పుకోవచ్చు. నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి, హాబీ గురించి చెప్పుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. బట్... నీ ప్రోగ్రామ్స్ గురించి, కార్యక్రమాల గురించి, ప్రయాణాల గురించి, కదలికల గురించి, ప్రోటోకోల్, సెక్యూరిటీ మేజర్స్ గురించి, మన కమెండోస్ విధుల గురించి, నా స్ట్రీటజీ ఎలా ఉంటుందనేది, బంగ్లా ధ్రనుపానుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నాకు తెలీకుండా ఒక్క అడుగు కూడా బంగ్లా నుంచి బయటకు వేయకూడదు. నీకు ఎవరినన్నా కలుసుకోవాలని అనిపిస్తే, ఆ విషయాన్ని నాకు నెల ముందుగా తెలియపరిస్తే, ఆ ఏర్పాట్లు ప్రమాదం లేని విధంగా నేను ఏర్పాటు చేస్తాను. సారీ ఫర్ ఇంటరప్షన్.... బై..." మిల్లర్ లైన్ కట్ చేసేసాడు నిర్దాక్షిణ్యంగా.
మాస్టర్ కి తల తిరిగినట్లనిపించింది.
కొద్దిక్షణాల వరకు తేరుకోలేకపోయాడు.
* * * * *
ఇంతకీ మాస్టర్ ఎలా సేవ్ అయ్యాడన్నది, జోహ్రా షూట్ చేసింది ఎవరిననేది, మాస్టర్ ని అనుసరించింది ఎవరనేది, యశోధర, సోహ్ని ఎలా ఇస్కాన్ టెంపుల్ కి చేరుకున్నది. మాస్టర్ తిరిగి ఇస్కాన్ నుంచి ఎలా బయలుదేరింది, ఎలా విక్రోలి బంగ్లాకి చేరుకున్నది ముగ్గురు వ్యక్తులకే తెలుసు.
ఒకరు మిల్లర్, రెండు మాస్టర్, మూడు మిల్లర్ సెక్రెటరీ.
