Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 29


    
    మొత్తానికి మాస్టర్ సేఫ్ గా బంగ్లాకి చేరుకున్నందుకు ఎల్, ఆర్, ఎఫ్, బిలు గుండెలనిండా ఊపిరి తీసుకున్నారు.
    
                                                   *    *    *    *    *
    
    మాస్టర్ తన బెడ్ రూంలోకి అడుగిడుతూండగానే అక్కడున్న ఫోన్ మోగింది.
    
    ఆ శబ్దం వింటూనే అతని పెదవులపై చిరునవ్వు కదలాడిందో క్షణం.
    
    రెండంగల్లో ఫోన్ ని సమీపించి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
    
    "ఈజిట్ మాస్టర్?" ఆ వేపు నుంచి మృదుల.
    
    "ఎస్" అన్నాడు మాస్టర్.
    
    "ఈరోజు సాయంత్రం మీరు బయటకు వెళ్ళారా?" మృదుల ప్రశ్నించిందా వేపు నుంచి ఆతృతగా.
    
    చెప్పటానికో క్షణం సందేహించాడు మాస్టర్.
    
    అతనికి కలిగిన ఆ సందేహం వెనుక మిల్లర్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నట్లు మృదులకు తెలీదు ఆమె తిరిగి అదే ప్రశ్న వేసింది.
    
    ఆమెకి చెప్పినంత మాత్రాన ముంచుకొచ్చే ప్రమాదమేది లేదని భావించాడు మాస్టర్.
    
    "వెళ్ళాను... ఏం..."
    
    "ఎక్కడికి?"
    
    "ఇస్కాన్ టెంపుల్ కి"
    
    "మీరు ఆస్తికులా? మీకు దైవభక్తి ఉందా?" ఆమె కంఠంలో ఆశ్చర్యం తొంగిచూసింది.
    
    "నాకు కాదు... మా మమ్మీకి."
    
    ఆమె నిట్టూర్చింది.
    
    "నేనో దృశ్యాన్ని చూసాను యూనో... దేశ్ ముఖ్ మార్గ్?"
    
    "తెలీదు ఎందుకలా అడుగుతున్నారు?"
    
    "రోల్స్ రాయిస్ కార్లు రెండూ అచ్చం ఒకేలా ఉన్న కార్లు తారుమారయ్యాయి అవి మీ కార్లే అని మా డ్రయివర్ చెప్పాడు. మీకేమీ ప్రమాదం జరగలేదు కదా?" ఆమె కంఠంలో తన క్షేమం పట్ల తొంగి చూసిన ఆందోళనను అతను పసిగట్టాడు.
    
    "లేదు... ప్రమాదమే మా కాకాని చూసి భయపడుతుంది."
    
    "కాకా ఎవరు?"
    
    "నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డువేసే ది గ్రేట్ జాన్ మిల్లర్."
    
    "మిల్లర్... స్ట్రేంజ... అసలేం జరిగింది? ఎందుకలా అవి మారిపోయాయి?"
    
    "తెలీదు."
    
    "తెలీదా? మోస్ట్ ఇన్ స్క్రూటబుల్ పర్సనాలిటీ అందుకే మీరంటే నాకిష్టమేమో ఎందుకలా జరిగింది?" తిరిగి అదే ప్రశ్న వేసింది మృదుల.
    
    "ఎందుకు జరిగినా, ఏం జరిగినా నేను క్షేమంగా ఇస్కాన్ కి వెళ్ళి తిరిగి రావటం కోసమే."
    
    "ఇంతకీ మీరు ఏ రోల్స్ రాయిస్ లో ఉన్నారు? మిమ్మల్ని చూడాలనిపించింది. బాగా అనిపించింది."
    
    "ఏ రోల్స్ రాయిస్ లోనూ నేను లేను."
    
    "మరెలా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళారు?"
    
    "కొంతవరకు రోల్స్ రాయిస్ లో."
    
    "ఆ తరువాత?"
    
    "ఎవరికారో? ఒక కారుని ఆపి దానిలో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాను."
    
    మృదుల ఓ క్షణం ఉలిక్కిపడింది.
    
    అనుమానంతో ఆమె విశాలమయిన నుదురు ముడిపడింది.
    
    "ఎవరికారది?"
    
    "తెలీదు."
    
    "ఆ కారులో ఎవరున్నారు?" తనలో రేగుతున్న ఉత్కంఠను భరించలేక అడగటంలో అత్యంత ఆతృతను కనబర్చింది.
    
    "ఎవరో... ఒక స్త్రీ."
    
    "మీరామెను చూసారా?"
    
    "లేదు."
    
    "పోనీ ఎకారో అది చెప్పగలరా?"
    
    "లేటెస్ట్ హోండా అకురా ఆమె ఎటు వెళ్ళవలసి వుందో? మేం ఆమె డ్రయివర్ ని బెదిరించి జుహుకి తీసుకువెళ్ళి ఇస్కాన్ కి వందగజాల దూరంలో ఉన్న జైన్ టెంపుల్ పక్కన వదిలేసాం."
    
    ఆమె అప్పటికే శిలాప్రతిమయి పోయింది.        
    
    తను ఎవరినయితే అమితంగా ప్రేమిస్తుందో? ఎవరంటే మనసు పడిందో? ఎవరిని ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడుతుందో? ఎవరితో గంటలకు గంటలు ఫోన్ లో మాట్లాడేందుకు ఉత్సాహపడుతుందో అతను....అతను.... తన కారాపి, ఎక్కి తనకు కావల్సిన మార్గంలో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరాన్ని తన డ్రయివర్ ని భయపెట్టి అధిగమించినప్పుడు తనకు స్పృహ లేకపోయింది. అతనే తనకు కావల్సిన వ్యక్తి అని పసిగట్టలేకపోయింది.
    
    ఉద్విగ్నపు అంచులకు వెళ్ళిన ఆమె "వ్వాట్?" అంటూ అరిచింది ఫోన్ లో.
    
    కాని అంతకుముందే ఆ టెలీఫోన్ లైన్ కట్ అయి అదే లైన్ లోకి మిల్లర్ వచ్చాడు.
    
                                                   *    *    *    *    *
    
    బ్యాంకాక్ నుంచి సింగపూర్ ఛాంగీ ఎయిర్ పోర్టు దిశకేసి గగనతలంలో ప్రయాణిస్తున్న సింగపూర్ సివిల్ ఏవియేషన్ అధారిటీ ఫ్లయిట్ లో హాన్ సోదరులిద్దరూ ఉన్నారు.
    
    "నేనప్పుడే చెప్పాను. మాస్టర్ ని హత్యా చేయించటమంటే మాస్టర్ అన్నల్ని, అక్కల్ని, తండ్రిని చంపినంత తేలికకాదని. హీ ఈజ్ ఏ డేంజరస్ గై. ఆ వెనుక కాలాంతకుడు మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ బ్రతికుండగా మాస్టర్ ని అసాసినేట్ చేయటం అంత తేలికయిన పనికాదు...." లిండాహాన్ బల్లాన్ టైన్స్ సెవెన్ టీన్ ఇయర్ ఓల్డ్ స్కాచ్ ని సిప్ చేస్తూ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS